భక్తిశ్రద్ధలతో ధ్యానం చేస్తున్న ఈ వ్యక్తిని గుర్తుపట్టారా?

ABN , First Publish Date - 2020-10-03T02:37:43+05:30 IST

నీటి మధ్యలో కూర్చుని, జపమాల చేతపట్టి, ఒడిలో ట్రంప్ ఫొటో పెట్టుకుని అత్యంత భక్తిశ్రద్ధలతో ధ్యానం చేస్తున్న ఈ వ్యక్తిని గుర్తుపట్టారా? అవును మీరు అనుకుంటున్నది నిజమే. ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీరభక్తుడు.. జనగామ జిల్లా, బచ్చన్నపేటకు చెందిన బుస్స కృష్ణే. ఇప్పుడు ఇతడ్ని ఎందుకు గుర్తు చే

భక్తిశ్రద్ధలతో ధ్యానం చేస్తున్న ఈ వ్యక్తిని గుర్తుపట్టారా?

ఇంటర్నెట్ డెస్క్: నీటి మధ్యలో కూర్చుని, జపమాల చేతపట్టి, ఒడిలో ట్రంప్ ఫొటో పెట్టుకుని అత్యంత భక్తిశ్రద్ధలతో ధ్యానం చేస్తున్న ఈ వ్యక్తిని గుర్తుపట్టారా? అవును మీరు అనుకుంటున్నది నిజమే. ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీరభక్తుడు.. జనగామ జిల్లా, బచ్చన్నపేటకు చెందిన బుస్స కృష్ణే. ఇప్పుడు ఇతడ్ని ఎందుకు గుర్తు చేస్తున్నారు అని అనుకుంటున్నారా? దానికి ఓ పెద్ద కారణమే ఉంది. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఈ ట్రంప్ భక్తుడు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవేంటో తెలుసుకోవాలంటే ఈ వార్త చదవాల్సిందే. 


అమెరికాలో ఎన్నికల హడావిడి మొదలైంది. రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగమైన అత్యంత కీలక ఘట్టం కూడా మంగళవారం రోజు ఆవిష్కృతమైంది. తొలి ముఖాముఖిలో అభ్యర్థులు ఇద్దరూ మాటల తూటాలను పేల్చుకున్నారు. కాగా.. డొనాల్డ్ ట్రంప్ కంటే జో బైడెన్ ముందంజలో ఉన్నారని కొన్ని సర్వేలు కూడా తేల్చేశాయి. గత  40 ఏళ్లుగా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందో కచ్చితంగా చెప్తున్న ప్రొఫెసర్ అలన్ లిచ్ట్మాన్ కూడా ఈ సారి ఎన్నికల్లో జో బైబెన్ విజయం సాధిస్తారని కుండబద్ధలు కొట్టారు. 



ఈ క్రమంలో నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారని ఓ మీడియా సంస్థ బుస్స కృష్ణను ప్రశ్నించగా.. ‘ఇంకెవరు నా దేవుడే (ట్రంప్) గెలుస్తారు’ అంటూ ఆయన బదులిచ్చారు. అంతేకాకుండా డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్‌కు ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్నట్లు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఒకవేళ ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోతే.. ఆయనపై మీకున్న భక్తి తగ్గుతుందా అని ప్రశ్నిస్తే.. అదిరిపోయే సమాధానం ఇచ్చారు. ‘నేను సెహ్వాగ్‌ను అభిమానిని. చాలా మ్యాచ్‌లలో యువరాజ్.. సెహ్వాగ్ కంటే బాగా అడాడు. అయినా నేను నా ఆరాధ్య క్రికెటర్ స్థానాన్ని యువరాజ్‌కు ఇవ్వలేదు. సెహ్వాగ్ అభిమానిగానే కొనసాగాను’ అంటూ బదులిచ్చారు. తొలి డిబేట్‌లో ట్రంప్.. భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. కరోనా మరణాలపై ఇండియా కచ్చితమైన సమాచారం ఇవ్వడం లేదని.. భారత్ వల్లే వాతావరణం ఎక్కువగా కాలుష్యం అవుతుందంటూ ట్రంప్ ఆరోపించారు. దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు అని మీడియా బుస్స కృష్ణను ప్రశ్నించగా.. ‘ఈ విషయాన్ని ప్రధాని మోదీనే సీరియస్‌గా తీసుకోలేదు. దీనిపై వాదన అవసరమా’ అని అన్నారు. అంతేకాకుండా ట్రంప్ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి, ప్రధాని మోదీతో కలిసి.. చైనాను కట్టడి చేస్తారంటూ ఆయన అభిప్రాయపడ్డారు. చాలా సందర్భాల్లో ట్రంప్.. భారత్ పక్షాన నిలబడ్డట్టు గుర్తు చేశారు. 


ఇదిలా ఉంటే.. బుస్స కృష్ణను అతని ఊరిలో ‘ట్రంప్ కృష్ణ’గా గుర్తింపు పొందారు. ఆయన తన ఇంటి వద్ద ట్రంప్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆ విగ్రహానికి ఆయన ప్రతిరోజు పూజలు నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. గతంలో ఆయనకు ఊరిలో ఐదెకరాల స్థలం ఉండేది. తన తల్లికి ఆపరేషన్ చేయిండానికి పొలం అమ్మాడు. శస్త్ర చికిత్స చేయించగా మిగిలిన డబ్బుతో ఇల్లు కొని, దాన్ని అద్దెకిచ్చి.. అద్దె డబ్బులతో బుస్స కృష్ణ జీవిస్తున్నారు. అయితే ట్రంప్‌ను కలవాలనే ఆయన చిరకాల కోరిక మాత్రం ఫలించడం లేదు.


Updated Date - 2020-10-03T02:37:43+05:30 IST