వలసజీవులూ ‘ప్రజా’ ప్రభువులూ
ABN , First Publish Date - 2020-04-22T15:53:31+05:30 IST
కరోనా గురించి మాట్లాడుతున్న భారతదేశ పాలకులు ప్రజల ఆకలి కేకల్ని ఆలకిస్తున్నారా? భారత ఆహార సంస్థ గిడ్డంగులలో 7.7 కోట్ల టన్నుల తిండి గింజల నిల్వలు ఉన్నా పంపిణీ చేయడానికి పాలకులకు మనస్సు లేకపోవడం బాధకరం. కార్పొరేటు కుబేరులకు లక్షల కోట్ల రూపాయల బాకీలు మాఫీ చేసే సర్కారు పేదలకు కేవలం కిలో పప్పు , ఐదు కిలోల బియ్యం..
గల్ఫ్ దేశాల రాచరిక ప్రభుత్వాలు కరోనా వైరస్ కట్టడికి ఎంత ప్రాధాన్యమిస్తున్నాయో భారత్ మొదలైన దేశాల నుండి వచ్చిన కార్మికుల ఆకలిదప్పులు తీర్చడానికి కూడా అంతే ప్రాధాన్యమివ్వాలన్న సత్యాన్ని గుర్తించాయి. కానీ, భారత ఆహార సంస్థ గిడ్డంగులలో 7.7 కోట్ల టన్నుల తిండి గింజల నిల్వలున్నా వలస కూలీలు మొదలైన పేదలకు, వారి అవసరానికి తగినట్లుగా పంపిణీ చేయడానికి ప్రజాస్వామ్య పాలకులకు మనస్సు లేకపోవడం బాధకరం. ప్రపంచం నిజంగా ఒక కుగ్రామమైపోయిందా? కరోనా వైరస్ బీభత్సం ఈ ప్రశ్నను అనివార్యం చేసింది.
భారత్‌లో ప్రజాస్వామ్యం వెలిగిపోతోంది. మరి ప్రజల, ముఖ్యంగా పేదల జీవితాలూ వెలిగిపోతున్నాయా? వెలుగుల వెనుక చీకట్లు ఎన్నో వున్నాయని కరోనా విపత్తు చూపించింది. ఇప్పటి వరకు కళ్ళకు కనిపించని వలస కార్మికుల ఉనికిని మానవత ఉలికిపడేట్టుగా చాటింది. కాయకష్టంపై బతికే శ్రామికుడి వివర్ణ జీవన చిత్రాన్ని ఆవిష్కరించింది. ‘చీకటి కోణం అట్టడుగున పడి కాన్పించని’ సత్యాన్ని ఘోషించింది. దాచేస్తే దాగని మరో కఠోర సత్యాన్నీ బయటపెట్టింది. ఇప్పుడు ‘ప్రపంచం ఒక కుగ్రామ’మని సరళీకృత ఆర్థిక విధానాల ప్రవక్తలు ప్రవచిస్తున్నారు కదా. అయితే కరోనా విలయంలో విలవిలలాడిపోయి సొంత గ్రామాలకు వెళ్ళుతోన్న బాటసారుల సమూహాలు ఆ భావన తప్పని స్పష్టం చేయలేదూ?!
కన్న ఊరు నుంచి పొట్టకూటి కొరకు సుదూర ప్రాంతాలు, దేశాలకు వెళ్ళిన సగటు వలస కార్మికుడు సాధారణ దినాల్లో కూడా ఎదుర్కొనే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఇక కరోనా వైరస్ విజృంభణతో నెలకొన్న అసాధారణ సంక్షోభం మూలంగా వలస కార్మికులు పరాయివారుగా పరిగణింపబడుతున్నారు. గల్ఫ్ దేశాలలో శరవేగంగా వ్యాపిస్తున్న కరోనా మహమ్మారి బారిన పడుతున్న వారిలో సింహభాగం ప్రవాస కార్మికులే. ప్రభుత్వ వైద్య బృందాలు జనసాంద్రత అధికంగా వున్న, ప్రవాస కార్మికులతో కిక్కిరిసి వుండే తావుల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ పలువురు ప్రవాసులకు కరోనా వైరస్ సోకినట్లుగా నిర్ధారిస్తున్నారు. స్వల్ప ఆదాయం కలిగిన వలస కార్మికులకు పౌష్టికాహార లోపం వలన రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందని భావించిన గల్ఫ్ ప్రభుత్వాలు వారికి పెద్ద ఎత్తున కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడానికి ప్రాధాన్యమిస్తున్నాయి. లేని పక్షంలో వారి ద్వారా ఇతరులకు కూడ కరోనా సంక్రమించగలదని గల్ఫ్ పాలకులు సహజంగానే భయ పడుతున్నారు. సైనిక బలగాలతో దిగ్బంధం చేసి మరీ పలు ప్రాంతాలలో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
గల్ఫ్ దేశాలు రాచరిక రాజ్యాలు. ప్రజా ఇబ్బందుల దృ ష్ట్యా భౌతికదూరంపై ఆంక్షల విషయంలో ఈ రాచరిక ప్ర భుత్వాలు ప్రదర్శిస్తున్న మాన వీయకోణం ప్రశంసనీయం. ఇవి కరోనా వైరస్ కట్టడికి ఎంత ప్రాధాన్యమిస్తున్నా యో భారత్ మొదలైన దేశాల నుండి వచ్చిన కార్మికుల ఆకలిదప్పులు తీర్చడానికి కూడా అంతే ప్రాధాన్యమివ్వాలన్న సత్యాన్ని గుర్తించాయి. అందుకే పూర్తిస్థాయి లాక్‌డౌన్ విషయంలో ఉదారంగా వ్యవహరిస్తున్నాయి. లాక్‌డౌన్ ఆంక్షలు విధించడానికి ముందు గల్ఫ్ రాజ్యాలు ప్రజలకు గడువు ఇచ్చాయి. ప్రజావసరాలను పూర్తిగా పరిగణనలోకి తీసుకున్నాయి. దీంతో ప్రతి ఒక్కరు రానున్న పరిస్థితిని అర్థం చేసుకుని, గృహ నిర్బంధంలో బతుకు సాఫీగా సాగడానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. పూర్తిగా దిగ్భంధం చేసిన ప్రాంతాలలో ప్రభుత్వమే ఆహారాన్ని ప్రజలకు అందజేస్తుంది. భౌతిక దూరం పాటించే నిబంధనలతో నిత్యావసర సరుకుల విక్రయానికి గాను వాణిజ్య సంస్థలకు అనుమతులు ఇచ్చారు. ప్రజలకు వెసులుబాటు కల్పించారు.
రాచరిక ప్రభుత్వాలు ఇలా మానవీయంగా వ్యవహరిస్తుండగా భారతదేశ ప్రజాస్వామ్య పాలకులు ఈ దిశగా అలోచించకపోవడం ఎంతైనా శోచనీయం. హైదరాబాద్, బెంగుళూరు, న్యూ ఢిల్లీ, గురుగావ్, ముంబై మొదలైన మహానగరాల నిర్మాణంలో కీలక పాత్ర వహించిన మన సొంత బిడ్డలను భారత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా గాలికి వదిలేశాయి. ప్రభుత్వాలపై ఏ కొద్ది విశ్వాసమున్నా, పౌర సమాజం తమను ఏ మాత్రమైనా తోటి మనుషులుగా గుర్తించినా ఈ వలస కూలీలు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్ళడానికి అంతగా ఆరాటపడివుండేవారు కాదేమో? దేశ ఆర్థికాభివృద్ధిలో తమకు తెలియకుండానే ఒక కీలక పాత్ర నిర్వహిస్తున్నవారు వలస కార్మికులు. కరోనా మహమ్మారితో, తాము పని చేస్తున్న నగరంలో తమ మనుగడకు ముప్పు ఏర్పడనున్నదని, తమను ఆదుకునే వారెవరూ లేరన్న నిశ్చిత అభిప్రాయానికి వచ్చిన వలస కూలీలు వేలాది కిలోమీటర్ల దూరంలో వున్న సొంత గ్రామాలకు కాలినడకన వెళ్ళడానికి సాహసిస్తున్నారు. అలా ఇప్పటికే లక్షలాది వలస జీవులు తిరుగుపయనంలో వున్నారు. దేశ విభజన సంద్భరంగా తమ స్వస్థలాలను వీడిన అమాయక ప్రజల హృదయవిదారక దృశ్యాలు ఇప్పుడు పునరావృతమవుతున్నాయి! ఏ పేదరికం కారణాన వారు తమ గ్రామాల నుండి సుదూర నగరాలకు వచ్చారో ఇప్పుడు అదే గ్రామాలకు తిరిగి వెళ్ళుతున్నారంటే అక్కడ ఉపాధి దొరుకుతందనా? కానే కాదు. ఉపాధి లేకపోయినా కనీసం తమ వారి మధ్యలో ఆప్యాయత లభిస్తుందని, బతుకుపోరును ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవచ్చనే ఆశాభావమే ఆ అభాగ్యులను మరల కన్న ఊళ్ళకు వెళ్ళడానికి పురిగొల్పిందని చెప్పవచ్చు.
కరోనా మహమ్మారి గురించి మాట్లాడుతున్న భారతదేశ పాలకులు తమ ప్రజల ఆకలి కేకలు ఆలకిస్తున్నారా? భారత ఆహార సంస్థ గిడ్డంగులలో రికార్డు స్థాయిలో 7.7 కోట్ల టన్నుల తిండి గింజల నిల్వలు ఉన్నాయి. అయినా ప్రస్తుత సంక్షోభంలో పేదలకు, అన్నార్తులకు వారి అవసరానికి తగినట్లుగా పంపిణీ చేయడానికి పాలకులకు మనస్సు లేకపోవడం బాధకరం. కార్పొరేటు కుబేరులకు లక్షల కోట్ల రూపాయల బాకీలు మాఫీ చేసే సర్కారు పేదలకు కేవలం ఒక కిలో పప్పు దినుసులు, ఐదు కిలోల బియ్యం ఇస్తానంటుంది- అది కూడా రేషన్ కార్డుపై! ఎక్కడ ఏయే బస్తీలలో ఎంత మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు? స్వదేశానికి తిరిగివెళ్ళాలనుకొంటున్న మీ జాతీయులను తీసుకు వెళ్ళండంటూ గల్ఫ్ దేశాలు పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నా భారత ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రజాస్వామ్య పాలకులకు ఇది తగునా?
కరోనా అనంతర నూతన భారతంలో వలస కార్మికుని పాత్ర విభిన్నంగా ఉండవచ్చు.
మొహమ్మద్ ఇర్ఫాన్
(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)