వ్యాధి విలయమూ వ్యాపార విజయమూ

ABN , First Publish Date - 2020-05-06T14:53:18+05:30 IST

అలీ బాబ తదితర చైనీయ వాణిజ్య సంస్థల కార్పొరేట్ నీతికి తోడుగా బీజింగ్ పాలకుల వ్యూహాత్మక

వ్యాధి విలయమూ వ్యాపార విజయమూ

అలీ బాబ తదితర చైనీయ వాణిజ్య సంస్థల కార్పొరేట్ నీతికి తోడుగా బీజింగ్ పాలకుల వ్యూహాత్మక దౌత్యనీతి వలన కరోనా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాలకు చైనా ఒక ఆశాదీపంగా కనిపిస్తోంది. ప్రపంచంలో ఎక్కడ ఏ రకమైన సంక్షోభం తలెత్తినా దాన్ని వ్యాపారపరంగా ఏ విధంగా వాడుకోవాలో చైనాకు బాగా తెలుసు. అందుకే యావత్ప్రపంచమూ కరోనా బీభత్సంలో అతలాకుతలమవు తుండగా చైనా మాత్రం వైద్య పరికరాల ఎగుమతిలో నిమగ్నమైంది.


అంతర్జాతీయ నౌకాయాన రంగంలో పని చేస్తున్న ఒక మిత్రునితో, మధ్యాహ్న భోజనం సందర్భంగా, మాటా మంతీ జరుపుతున్నాను. ఇంతలో అతనికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. చైనాకు చెందిన అగ్రగామి షిప్పింగ్ సంస్థ ప్రతినిధి ఒకరు ఆ ఫోన్ చేశారు. తమ సంస్థ కార్యకలాపాలు పునః ప్రారంభమయ్యాయని, బుకింగులు పంపించాలని ఆ వ్యక్తి నా స్నేహితునికి చెప్పాడు. కరోనా సంక్షోభం ఉధృతమైన తరువాతే చోటు చేసుకున్న ముచ్చట ఇది. అప్పటికే గల్ఫ్‌తో పాటు ప్రపంచంలోని అనేక దేశాలు స్వీయ నిర్బంధంలోకి వెళ్ళిపోగా సంక్షోభం నుంచి బయట పడ్డ చైనా విశ్వవ్యాప్తంగా తన ఎగుమతులను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నది. ఇప్పుడు చైనా మినహా యావత్తు ప్రపంచవ్యాప్తంగా అనేకానేక దేశాలు కరోనా కల్లోలంలో కొట్టుమిట్టాడుతుండగా చైనా మాత్రం వాణిజ్య అవకాశాలను అందిపుచ్చుకోవడంలో నిమగ్నమై ఉంది!


ఈ ఏడాది జనవరి తుదినాళ్ళలో చైనాలోని వూహాన్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేసింది. ఆ ఆపత్సమయాన జపాన్ పలు విధాల చైనాకు సహాయపడింది. నెలరోజుల అనంతరం జపాన్‌లో కరోనా వైరస్ ప్రబలిపోయింది. దాని విజృంభణను నిలువరించలేక నిస్సహాయ స్థితిలో పడిపోయిన జపాన్‌ను చైనా అన్ని విధాల ఆదుకున్నది. సమీపాన ఉన్న జపాన్‌ను మాత్రమే కాదు, సుదూరాన ఉన్న గల్ఫ్, అమెరికా, యూరోపియన్ దేశాలను సైతం కరోనా విపత్తులో ఆదుకోవడానికి చైనా వెనుకాడలేదు.


విస్మయకరమైన వాస్తవమేమిటంటే ప్రపంచ ఆన్‌లైన్ వ్యాపార దిగ్గజం అలీ బాబ (ఇది చైనీస్ సంస్థ సుమా) విశ్వవ్యాప్తంగా కరోనా బాధిత దేశాలకు మాస్కులు, పిపిఇ, వెంటిలెటర్లు, ఇంకా ఇతర అవసరమైన సామగ్రిని స్నేహపూర్వకంగా సరఫరా చేస్తోంది. వైద్య సంబంధిత సామగ్రిని అందజేయడంతో పాటు అలీ బాబ సంస్థ అధిపతి జాక్ మా ఆయా దేశాధినేతలకు వ్యక్తిగతంగా సుహృద్భావపూర్వక లేఖలు రాస్తున్నారు. కవితాత్మకమైన ఆయన వచో శైలి ఆ లేఖలను అందుకున్నవారిని విశేషంగా ఆకట్టుకొంటోంది. ఇప్పుడు భారతదేశంలో ఇళ్ళలో స్వీయ నిర్బంధంలో ఉన్న వారు ఆర్థిక లావాదేవీలకు వినియోగించే పేటియం కూడా అలీ బాబా గ్రూప్‌కు చెందిన సంస్థే. అదే విధంగా ఆన్‌లైన్ షాపింగ్ చేసే ఫ్లిప్‌కార్ట్ లేదా చివరకు తినుబండారాలు తెప్పించుకొనే జుమోటోల మూలాలు కూడా చైనాలోనే వున్నాయి. అలీ బాబ తదితర వాణిజ్య సంస్థల కార్పొరేట్ నీతికి తోడుగా బీజింగ్ పాలకుల వ్యూహాత్మక దౌత్యనీతి వలన కరోనా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాలకు చైనా ఒక ఆశాదీపంగా కనిపిస్తోంది. భారత్‌లో ఎక్కడ ఏ రకమైన పరిస్థితి ఉన్నా దాన్ని రాజకీయంగా ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బాగా తెలుసు. అదే విధంగా, ప్రపంచంలో ఎక్కడ ఏ రకమైన సంక్షోభం తలెత్తినా దాన్ని వ్యాపారపరంగా ఏ విధంగా వాడుకోవాలో చైనాకు బాగా తెలుసు. అందుకే యావత్ప్రపంచమూ కరోనా బీభత్సంలో అతలాకుతలమవుతుండగా చైనా మాత్రం వైద్య పరికరాల ఎగుమతిలో నిమగ్నమైంది.


చైనాలో కరోనా వైరస్ ప్రబలిన వూహాన్ రాష్ట్రం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు భారత్, అమెరికాతో సహా 60 దేశాలు చైనా నుంచి పర్యాటకుల రాకపోకలపై ఆంక్షలు విధించాయి. అప్పుడు ఈ దేశాలన్నిటికీ చైనా తన అసంతృప్తిని తెలియజేసింది. కరోనా రోగం ముదురుతుందని తెలిసినా చైనా దాని తీవ్రతను గుర్తించలేదు, ఒక వేళ గుర్తించినా బాహ్య ప్రపంచానికి, అంతర్జాతీయ సంస్థలకు తెలియజేయడంలో జాప్యం చేసింది. పరిస్థితి విషమంగా మారుతున్నా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్లక్ష్యం వహించింది. చైనా ఇచ్చిన సమాచారాన్ని పూర్తిగా విశ్వసించింది తప్ప తన సొంతంగా క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని తెలుసుకొనే ప్రయత్నాన్ని చేయలేదు. అలాగని ప్రపంచ ఆరోగ్య సంస్థకు గానీ, మరే ఇతర అంతర్జాతీయ సంస్థలకు గానీ తమ సొంతంగా ఏదైనా ఒక దేశంలో క్షేత్ర స్థాయి వాస్తవాలు తెలుసుకోవడం అంత సులభం కాదు. అందునా చైనా లాంటి దేశంలో ఏ మాత్రం వీలు కాని పని.


ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ (ఇథియోపియా పౌరుడు)ను 2017లో ఆ ప్రతిష్ఠాత్మక పదవికి ఎన్నుకోవడంలో చైనా కీలక పాత్ర వహించింది. ఆ పదవికి ప్రప్రథమంగా జరిగిన ఎన్నికలలో ఆఫ్రికా దేశాల ఓట్లన్నీ టెడ్రోస్‌కు రావడం వెనుక చైనా కృషి ఎంతైనా ఉన్నది. కీలకమైన ఆఫ్రికా ఖండంలో దౌత్యపరంగా చైనా, అమెరికా తదితర పాశ్చాత్య దేశాల కంటే అనేక రెట్లు ముందున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్‌గా మిత్ర దేశం పాకిస్థాన్ అభ్యర్థిని కాదని టెడ్రోస్ ఎన్నిక కావడానికి చైనా తోడ్పాటు అందించింది. ఇథియోపియా ఆరోగ్య శాఖ మంత్రిగా మలేరియా వ్యాధి నిర్మూలనలో గణనీయమైన ఫలితాలను సాధించడంతో పాటు, దేశ పౌరుల ఆరోగ్య పరిరక్షణలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిన శాస్త్రవేత్త, ప్రజాపాలకుడు టెడ్రోస్. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్- జనరల్ పదవికి ఒక తొలిసారి ఒక ఆఫ్రికన్‌కు లభించేలా చూడడం ద్వారా ఆఫ్రికా ఖండ వాసుల మనస్సును చైనా దోచుకున్నది. ఈ కృతజ్ఞతా భావం కారణాన, వూహాన్‌లో కరోనా వ్యాప్తిపై చైనా అందించిన సమాచారాన్ని టెడ్రోస్ గుడ్డిగా విశ్వసించారనే వాదన కూడ ఉన్నది. 


చైనాలో కరోనా మహమ్మారి తీవ్రతను గుర్తించడంలో అమెరికా మొదలైన పాశ్చాత్య దేశాలు పూర్తిగా విఫలమయ్యాయి, వచ్చే నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష పదవీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు చైనాపై దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే కరోనా విపత్తు తొలిదశలో ఆయన చాలా నిర్లక్ష్యం వహించారన్నది ఎవరూ కొట్టివేయలేని సత్యం. ఆ మాటకు వస్తే భారత ప్రభుత్వం సైతం నిద్రపోయింది. 


మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)


Updated Date - 2020-05-06T14:53:18+05:30 IST