వాక్సిన్ రేసులో వెనకబడవద్దు..!

ABN , First Publish Date - 2020-09-02T18:28:04+05:30 IST

కరోనా తరహా మహమ్మారులను నిర్మూలించే వాక్సిన్ల అందుబాటు విషయంలో ఇప్పటివరకూ అభివృద్ధి చెందిన దేశాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు మధ్య పెద్ద వ్యత్యాసం ఉంది. వాక్సిన్‌ విషయంలో సంపన్న దేశాల దయాదాక్షిణ్యాలపై పేద దేశాలు ఆధారపడకుండా ఉండడానికి భారత్ చొరవ తీసుకుని నాయకత్వం వహించాలి.

వాక్సిన్ రేసులో వెనకబడవద్దు..!

ఆంధ్రజ్యోతి(02-09-2020): కరోనా తరహా మహమ్మారులను నిర్మూలించే వాక్సిన్ల అందుబాటు విషయంలో ఇప్పటివరకూ అభివృద్ధి చెందిన దేశాలకు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు మధ్య పెద్ద వ్యత్యాసం ఉంది. వాక్సిన్‌ విషయంలో సంపన్న దేశాల దయాదాక్షిణ్యాలపై పేద దేశాలు ఆధారపడకుండా ఉండడానికి భారత్ చొరవ తీసుకుని నాయకత్వం వహించాలి.


దుబాయిలో పని చేసే కేరళ వాసి 32 ఏళ్ళ మోహమ్మద్ రజ్లిం అన్వర్ తన చేతికి రోజంతా పెట్టుకునే ఒక పట్టాలో ఉండే సిమ్‌కార్డ్ అతడి ఆరోగ్య పరిస్థితిని, శరీరంలోని మార్పుల్ని 24 గంటలూ పసిగడుతూ రికార్డ్ చేస్తుంది. అతడు కూడ వారానికి ఒకసారి తన ఆరోగ్య పరి‍స్థితిపై ఒక ఫారం నింపి ఆసుపత్రిలో అందిస్తాడు.


విశ్వవ్యాప్తంగా తన మేధో, ఉత్పత్తి సామర్థ్యాలను ప్రదర్శించడానికి ఉవ్విళ్ళూరుతున్న చైనా తన కరోనా వాక్సిన్‌ను అరబ్ దేశాలలో ప్రయోగాత్మకంగా పరీక్షించడానికి ఎంచుకున్న వేలాది మందిలో అన్వర్ ఒకడు. ప్రపంచమంతటా కరోనా వ్యాప్తికి కారణమైందంటూ అప్రతిష్ఠ మూటకట్టుకున్న చైనా ఆ మహమ్మారిని నియంత్రించడం కోసం తాను రూపొందించిన వాక్సిన్‌కు సంబంధించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, బహ్రెయిన్‌లలో ప్రయోగాత్మకంగా పరీక్షలు నిర్వహిస్తోంది. విభిన్న జాతీయులు నివాసముండే గల్ఫ్ దేశాలలో ప్రయోగాలు చేయడానికి మన దేశం వ్యూహరచన చేసే లోపే చైనా దూరిపోయింది. చైనాతో పాటు భారత్, అమెరికా, రష్యా, బ్రిటన్,     ఇజ్రాయెల్, యూరోపియన్ యూనియన్ దేశాలు దాదాపు 24 రకాల వాక్సిన్లను ప్రయోగాత్మకంగా పరీక్షిస్తూ ఫలితాలను విశ్లేషిస్తున్నాయి. వాక్సిన్‌ ఫలితాలు పూర్తి స్థాయిలో ఆమోదయోగ్యంగా ఉంటే దాన్ని దౌత్యపరమైన విజయంగా మలచుకోవడానికి అన్ని దేశాలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేయగా అందులో చైనా అగ్రస్థానంలో ఉంది. 


మరో వైపు, కరోనా వాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన పేద, వర్ధమాన దేశాల జాబితాలో భారత్ కూడ ఒకటి. బంగ్లాదేశ్, పాకిస్థాన్, సుడాన్, నైజీరియా, శ్రీలంక కూడ ఈ జాబితాలో ఉన్నాయి. చైనా అందులో లేదు కానీ వాక్సిన్‌ను అందిస్తామని అనేక దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకుంటోంది. భారత్ మాత్రం ఇప్పటి వరకు ఇలాంటి ఒప్పందాల్ని ఏ దేశంతోనూ చేసుకోలేదు. తమ వాక్సిన్ ఎగుమతిలో మిత్ర దేశాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని భారతదేశం పేర్కొంది. అంతా సవ్యంగా సాగితే, పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌తో పాటు గల్ఫ్‌దేశాలకు వాక్సిన్‌ను ఎగుమతి చేయడాన్ని, వీలయితే సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పత్తి నైపుణ్య సామర్థ్యం బదిలీ చేయడాన్ని భారత్ పరిశీలిస్తోంది. అయితే అటు నేపాల్ నుంచి ఇటు గల్ఫ్‌దేశాల వరకు కరోనా వాక్సిన్ విషయమై చైనా నుంచి ఎదురయ్యే పోటీని భారత్ తట్టుకుని నెగ్గాల్సి ఉంటుంది. 


విచిత్రమేమిటంటే, ప్రపంచవ్యాప్తంగా ఔషధాల ఉత్పత్తిలో భారత్ మొదటి స్థానంలో ఉన్నప్పటికీ వాటిని స్వంతంగా కనిపెట్టే నైపుణ్యాల లోటు నిజంగా పెద్ద వెలితే. వాక్సిన్ల ఉత్పత్తిలో అగ్రగణ్యంగా ఉన్న పుణెలోని సీరం సంస్థ ఇప్పటికే ఆక్స్‌ఫర్ట్‌ విశ్వవిద్యాలయం, బ్రిటన్ -స్వీడన్ల ఔషధ దిగ్గజం అస్ట్రజెనెకా రూపొందించిన వ్యాక్సిన్లను, అమెరికాకు చెందిన అగ్రగామి ఔషధ సంస్థల వాక్సిన్లను ఉత్పత్తి చేయబోతోంది. అదే విధంగా మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌కు చెందిన బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ పక్షాన పేద దేశాలకు వాక్సిన్లను సరసమైన ధరలకు సరఫరా చేయడానికి కూడ ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌కు చెందిన బయొలాజికల్ ఇ(బి.ఇ.) అనే సంస్థ కూడ  అమెరికా సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ వారి వాక్సిన్‌ను ఉత్పత్తి చేయడానికి ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన మరో సంస్థ భారత్ బయోటెక్ కూడ స్వంతగా వాక్సిన్ ప్రయోగాలు చేస్తోంది. ఇప్పటి వరకు కరోనా తరహా మహమ్మారులను నిర్మూలించే వాక్సిన్ల అందుబాటు    విషయంలో అభివృద్ధి చెందిన దేశాలకు, వర్ధమాన, పేద దేశాలకు మధ్య పెద్ద వ్యత్యాసం ఉంది. కరోనా విషయంలో అభివృద్ధి చెందిన దేశాల దయాదాక్షిణ్యాలపై ప్రపంచం ఆధారపడకుండా ఉండడానికి భారత్ చొరవ తీసుకుని నాయకత్వం వహించాలి. దీంతో చైనాను కట్టడి చేయడంలో దౌత్య విజయంతో పాటు పేద మానవాళికి మేలు చేసిన ఘనత కూడ దక్కుతుంది.


మోహమ్మద్ ఇర్ఫాన్, అంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి

Updated Date - 2020-09-02T18:28:04+05:30 IST