గల్ఫ్ కార్మికుల కష్టాలకు అక్షర సాక్షి.. ఇప్పుడు సినిమాగా..
ABN , First Publish Date - 2020-12-15T19:32:10+05:30 IST
ఓ ఎడారి జీవితం... ఓ బానిస బతుకు... కేరళకు చెందిన నజీబ్ అనే ప్రవాస కూలీ కష్టాలు ‘ఆడు జీవితం’ అనే నవలగా సంచలనం సృష్టిస్తే... ప్రస్తుతం ఆ నవల ఆధారంగా సినిమా రూపుదిద్దుకుంటోంది. ఎడారి దేశంలో మూడేళ్లకు పైగా అతడు పడిన కష్టాలు... తెర మీద సరికొత్త కథను ప్రేక్షకులకు పరిచయం చేయనుంది..
అనామకుడు.. ‘కథా’నాయకుడు
ఓ ఎడారి జీవితం... ఓ బానిస బతుకు... కేరళకు చెందిన నజీబ్ అనే ప్రవాస కూలీ కష్టాలు ‘ఆడు జీవితం’ అనే నవలగా సంచలనం సృష్టిస్తే... ప్రస్తుతం ఆ నవల ఆధారంగా సినిమా రూపుదిద్దుకుంటోంది. ఎడారి దేశంలో మూడేళ్లకు పైగా అతడు పడిన కష్టాలు... తెర మీద సరికొత్త కథను ప్రేక్షకులకు పరిచయం చేయనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది ఎడారిదేశాలకు వెళ్లి... గొర్రెల కాపరులుగా నలిగి పోతున్నారు. అలాంటి విషాద జీవితాలకు అద్దంపట్టే కథ ఇది..
బతుకుదెరువు కోసమో, మంచి జీవితం కోసమో కేరళవాసులు గల్ఫ్ బాట పట్టడం సాధారణమే. పాతికేళ్ల యువకుడైన నజీబ్ మెహమ్మద్‌కు కూడా కుటుంబ కష్టాల నుంచి గట్టెక్కాలంటే గల్ఫ్ దేశాలే దిక్కనిపించింది. ఏజెంట్‌ను కలిస్తే సౌదీ అరేబియాలోని ఒక సూపర్ మార్కెట్‌లో సేల్స్‌మ్యాన్ ఉద్యోగాలున్నాయన్నాడు. వెంటనే వెళితే ఉద్యోగంలో చేరవచ్చన్నాడు. ఓవైపు భార్య గర్భవతి... సమయానికి చేతిలో డబ్బులు కూడా లేవు. మరోవైపు అవకాశం పోతే రాదని ఏజెంట్ తొందర. ఇక తప్పదనుకుని తన పేరు మీదున్న ఐదు సెంట్ల భూమిని అమ్మకానికి పెట్టాడు నజీబ్. భూమి అమ్మగా వచ్చిన 55 వేల రూపాయలను ఏజెంట్ చేతిలో పెట్టాడు. ఆ తర్వాత సౌదీ అరేబియా విమానమెక్కాడు.
రోదనే మిగిలింది...
సౌదీ రాజధాని రియాద్‌లో దిగగానే అక్కడ పని చూపించే మనిషి తన వెంట తీసుకెళ్లాడు. ఎడతెగని ప్రయాణం. రెండు రోజుల తర్వాత నలుదిక్కులా ఎడారి ఉన్న ప్రాంతంలో నజీబ్‌ను వదిలేసిపోయాడు. కొద్దిసేపటికి అరబ్బు యజమాని వచ్చి ఎడారిలోని ఓ గుడారం దగ్గరకు తీసుకెళ్లాడు. కొద్ది దూరంలో మేకల గుంపు కనబడుతోంది. కర్ర చేతికి ఇచ్చి, వాటిని కాయమని యజమాని ఆదేశించాడు. అదేమీ అర్థం కాని నజీబ్ ‘తాను సూపర్ మార్కెట్‌లో సేల్స్‌మ్యాన్‌గా పనిచేసేందుకు వచ్చాన’ని చెప్పగానే అరబ్బీ భాషలో తిడుతూ మేకలున్న వైపు నెట్టేశాడు. నజీబ్‌కు జరిగిన మోసం అర్థమై కన్నీళ్ల పర్యంతమయ్యాడు. కానీ చేసేదేం లేదు. అక్కడి నుంచి బయటపడటం చాలా కష్టమని అర్థమయ్యింది. చేసేదేం లేక మేకలను కాయడం మొదలెట్టాడు. పైన నిప్పుల వానలా ఎండ, కడుపులో నకనకలాడే ఆకలి. ఎడారిలో అక్కడక్కడ ఉన్న ఎండు, పచ్చిగడ్డి దగ్గర మేకల్ని మేపడమే అతడి పని. యజమాని గుడారంలో నుంచి ఒక చేతిలో తుపాకీ, మరో చేతిలో బైనాక్యులర్ పట్టుకుని నజీబ్ ఎక్కడికీ పారిపోకుండా ఓ కన్నేసి ఉంచాడు. ఆ అరబ్బు యజమాని పని మీద బయటకు వెళితే తన తమ్ముడికి డ్యూటీ అప్పగిస్తాడు. వాళ్లు తినగా మిగిలిన ఎండిపోయిన రొట్టెలే నజీబ్‌కు ఆహారంగా పడేసేవారు. గొంతు ఎండిపోతే మేకలు తాగే చోటే దాహం తీర్చుకోవాలి. స్నానం లేదు... క్షవరం లేదు. మార్చుకోవడానికి మరో బట్టల జత కూడా లేదు. మేకలతోనే బతుకు.
ఎడారిలో పరుగు...
రోజలు గడుస్తున్నాయి. ఎడారి నేలలో బానిసలా... మరో వ్యక్తి పలకరింపునకు కూడా నోచుకోలేదు. భార్య ప్రసవం గురించి ఏమయ్యిందో తెలియదు. తాను ఇల్లు వదిలిన తేదీ మాత్రం నజీబ్‌కు గుర్తుంది. అది 4 ఏప్రిల్ 1992. ఇక్కడికి వచ్చి ఎంతకాలం అయ్యిందో కూడా తెలియదు. భార్యా బిడ్డలు గుర్తుకొచ్చి భోరున విలపించేవాడు. అయితే కష్టాల్లోనే ఒక్కోసారి అవకాశం పలకరిస్తుంది. అరబ్బు యజమానుల చెల్లెలికి పెళ్లి కుదిరింది. ఈ బక్కప్రాణి ఇక ఎడారిలో తప్పించుకోలేడనే భరోసాతో ఇద్దరన్నదమ్ములు బయటకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన నజీబ్ ఎడారిలో పరుగు మొదలెట్టాడు. అలా... ఒకటిన్నర రోజులు పరుగెడుతూనే ఉన్నాడు. అతడి అదృష్టం కొద్దీ చివరికి రోడ్డు కనబడింది. దారిలో వెళుతున్న వాహనాలను భయం భయంగానే ఆపే ప్రయత్నం చేశాడు. చివరికి ఒకాయన తన వాహనంలో ఎక్కించుకున్నాడు. నజీబ్‌కు అరబ్బీ భాష తెలియదు. వాహనదారుడు ఎక్కడికి తీసుకెళ్తాడో తెలియదు. కొన్ని గంటల ప్రయాణం తర్వాత నజీబ్‌ను రియాద్ శివార్లలో దింపేశాడు. ఊపిరి పీల్చుకున్న నజీబ్ నడుచుకుంటూ ఒక మలయాళీ రెస్టారెంట్‌కు వెళ్లాడు. తన పరిస్థితిని వారికి వివరించడంతో, వారు కడుపునిండా తిండి పెట్టి, క్షవరం చేయించి, కట్టుకునేందుకు జత బట్టలు కూడా ఇచ్చారు. నజీబ్ అక్కడే ఉన్న క్యాలెండర్ వైపు చూశాడు. 13 ఆగస్టు 1995. అంటే మూడేళ్ల నాలుగు నెలల నరకాన్ని అనుభవించాడన్నమాట. అతడి దగ్గర పాస్‌పోర్టు, ఇతర డాక్యుమెంట్లేవీ లేవు. మళ్లీ అరబ్బుల చేతికి చిక్కకుండా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన గోడు వెళ్లబోసుకున్నాడు. కానీ నమ్మకం కుదరక నజీబ్‌ను అక్రమ చొరబాటు దారుడిగా పరిగణించి జైల్లో వేశారు. కటకటాల వెనుక తిండికి, నిద్రకు లోటు లేకపోవడంతో ఆ నరకం కన్నా ఇదే నూరుపాళ్లు మేలనుకున్నాడు. ఎట్టకేలకు తనలాంటి కొందరితో పాటు రియాద్‌లో ఉన్న బంధువుల సాయంతో మన దేశానికి అభ్యర్థన పెట్టుకోవడంతో అన్ని ప్రయత్నాలు ఫలించి సౌదీ ఇమ్మిగ్రెంట్ అధికారులు నజీబ్‌ను తిరుగు ప్రయాణానికి అనుమతించారు.
నవలగా... సినిమాగా...
కేరళలోని తన ఇంటికి చేరిన నజీబ్ మరో జన్మ పొందినట్టుగా ఫీలయ్యాడు. ఇన్నేళ్లుగా అతడి క్షేమసమాచారం తెలియక ఆందోళన చెందిన కుటుంబసభ్యుల ఆనందానికి హద్దుల్లేవు. మూడేళ్ల కొడుకు సఫీర్ తండ్రి ఒడిలోకి చేరాడు. కొన్నాళ్ల తర్వాత ఆర్థిక ఇబ్బందులు వెంటాడటంతో మరో దారి లేక మరోసారి ప్రవాస కూలీ అవతారం ఎత్తేందుకు సిద్ధమయ్యాడు. తన బావ సాయంతో ఈసారి ఉచిత వీసాపై బెహ్రెయిన్‌కు చేరుకున్నాడు. అక్కడ ఉద్యోగంలో చేరి, ఆర్థికంగా కొంత స్థిరపడిన తర్వాత కుటుంబాన్ని కూడా తీసుకెళ్లాడు. ప్రస్తుతం నజీర్ కొడుకు సఫీర్ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఇప్పుడు నజీబ్ మొహమ్మద్ వయసు అరవై ఏళ్లు.
బెహ్రెయిన్‌లో స్థిరపడ్డ మలయాళ ప్రసిద్ధ రచయిత బెంజుమన్ ఎప్పటి నుంచో కేరళ ప్రవాస కూలీల జీవితాలపై ఒక నవల రాయాలని సమాచార వేటలో ఉన్నాడు. ఆయనకు నజీర్ బావ తారసపడ్డాడు. సౌదీలో తన బావ పడ్డ కష్టాలను చెప్పాడు. దాంతో నజీబ్ జీవితానికి అక్షరరూపం ఇచ్చాడు బెంజుమన్. అదే ‘ఆడు జీవితం’ అనే నవల. 2008లో వచ్చిన ఈ నవల పాఠకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికీ ‘ఆడుజీవితం’ బెస్ట్ సెల్లర్‌గానే నిలిచింది. ఇంగ్లీష్ (గోట్ డేస్)తో పాటు అరబ్బీ, నేపాలీ, థాయ్‌లాంటి ఎన్నో భాషల్లోకి ఈ నవల అనువాదమైంది. అన్నీ కలిపి ఇప్పటికీ 130కి పైగా ముద్రణలు దాటాయి. కేరళ, కాలికట్, పాండిచ్చేరీ యూనివర్శిటీలతో పాటు కేరళలోని పదో తరగతి పాఠ్య పుస్తకంగా కూడా గౌరవాన్ని దక్కించుకుంది. 2012లో కేరళ సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు ఆ తర్వాత ఎన్నో పురస్కారాలను పొందిన ఈ నవల ప్రస్తుతం సినిమాగా రూపుదిద్దుకుంటోంది. బ్లేస్సి దర్శకత్వంలో ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ టైటిల్ పాత్రను పోషిస్తున్నాడు. - బి.నర్సన్, 94401 28169.