జేమ్స్ బాండ్.. ఆమె పాట ఇప్పుడు బ్రాండ్
ABN , First Publish Date - 2020-09-09T14:01:18+05:30 IST
జేమ్స్‌బాండ్ సినిమా థీమ్ సాంగ్‌కు ఉన్న ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు.
జేమ్స్‌బాండ్ సినిమా థీమ్ సాంగ్‌కు ఉన్న ప్రాముఖ్యం అంతా ఇంతా కాదు. ఎడిలె, శ్యామ్ స్మిత్ లాంటి ప్రఖ్యాత గాయకులకే ఆ అవకాశం దక్కింది. అలాంటిది ‘నో టైమ్ టు డె’ౖ జేమ్స్‌బాండ్ సినిమాకు థీమ్ సాంగ్ పాడే అవకాశాన్ని 18 ఏళ్ల అమెరికా అమ్మాయి బిల్లీ ఐలిష్ దక్కించుకుంది. బిల్లీ పాడిన ఈ థీమ్ సాంగ్... కరోనా కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తున్న అసలు సినిమా కంటే ఎక్కువగా పాపులర్ అయిపోయింది. సింగర్, సాంగ్‌రైటర్ బిల్లీ ఐలిష్ గురించిన ఆసక్తికరమైన అంశాలు ఇంకా ఉన్నాయి!
2001, డిసెంబర్ 18న పుట్టిన బిల్లీ తల్లీతండ్రులు ఇద్దరికీ సంగీతం, నటనల్లో అనుభవం ఉంది. తల్లి మ్యాగీ బెయిర్డ్ టీచర్, నటి, స్ర్కీన్ రైటర్, కన్‌స్ట్రక్చర్ వర్కర్. తండ్రి, పార్ట్ టైమ్ యాక్టర్, ప్యాట్రిక్... ఐరన్ మ్యాన్ సినిమాలో అతిధి పాత్రలో నటించాడు. బిల్లీకి ఆమె కంటే నాలుగేళ్లు పెద్దవాడైన అన్న ఫిన్నీస్ ఉన్నాడు. వీళ్లిద్దరికీ తల్లి మ్యాగీ, ఇంట్లోనే విద్యాబుద్ధులతో పాటు పాటలు రాయడం కూడా నేర్పించింది. ఆర్ట్, డాన్స్, పాటలు... నచ్చిన ఏ రంగంలోనైనా రాణించే స్వేచ్ఛను తమ తల్లితండ్రులు ఇవ్వబట్టే ఇంత చిన్న వయసులోనే గాయనిగా పేరు తెచ్చుకోగలిగానని బిల్లీ చెబుతూ ఉంటుంది. తన 11వ ఏటనే తొలి పాటను రాసుకున్న బిల్లీ 2015లో అన్న ఫిన్నీస్‌తో కలిసి ఓషన్ ఐస్ అనే పాటను రికార్డు చేసి, సౌండ్ క్లౌడ్‌లో అప్‌లోడ్ చేయడంతో మొదటిసారి గాయనిగా గుర్తింపు తెచ్చుకుంది.
బెడ్‌రూమ్ స్టూడియో!
గతంలో విడుదలైన జేమ్స్‌బాండ్ సినిమా స్కైఫాల్ థీమ్ సాంగ్‌ల కోసం ఎడిలె, శామ్ స్మిత్‌లు సంప్రదాయ రికార్డింగ్ స్టూడియోలను ఎంచుకున్నారు. ఇంతటి ప్రముఖ గాయకులు పాటల రికార్డింగ్ కోసం పేరున్న స్టూడియోలను ఎంచుకుంటే బిల్లీ ఎలాంటి హంగామా లేకుండా, ఇంట్లోని బెడ్‌రూమ్ స్టూడియోనే రికార్డింగ్‌కు ఎంచుకుంది. తాజాగా సంచలనం సృష్టించిన జేమ్స్‌బాండ్ థీమ్ సాంగ్ నో టైమ్ టు డైను కూడా బిల్లీ ఇదే స్టూడియోలో రికార్డు చేయడం విశేషం. మోసపోవడం, గుండె పగిలిపోవడం అనే భావాలను పలికించే బిల్లీ థీమ్ సాంగ్‌ను బట్టి, నో టైమ్ టు డై సినిమాతో చిట్టచివరి బాండ్ 007గా నటించిన డేనియల్ క్రెయిగ్ పాత్రను అంచనా వేస్తున్నారు జేమ్స్‌బాండ్ సినిమా అభిమానులు.
అవార్డుల పంట!
2019లో వెన్ వియ్ ఆల్ ఫాల్ అస్లీప్, వేర్ డు వియ్ గో? అనే తొలి ఆల్బంతో అమెరికా, ఇంగ్లండ్‌ల్లో సింగర్‌గా వెలుగులోకి వచ్చిన బిల్లీ ఐలిష్ వరుసగా ఐదు గ్రామీ అవార్డులు, రెండు అమెరికన్ మ్యూజిక్ అవార్డులు, రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులు, మూడు ఎమ్‌టీవీ వీడియో మ్యూజిక్ అవార్డులు కూడా గెలుచుకుంది. 2019 ఏడాదికి గాను బెస్ట్ న్యూ ఆర్టిస్ట్, రికార్డ్ ఆఫ్ ది ఇయర్, సాంగ్ ఆఫ్ ది ఇయర్, ఆల్బం ఆఫ్ ది ఇయర్ గ్రామీ అవార్డులు ఒకేసారి గెలుచుకున్న మొట్టమొదటి అత్యంత పిన్న వయస్కురాలు కూడా బిల్లీనే!
ఏది ఏమైనప్పటికీ జేమ్స్‌బాండ్ సినిమాకు థీమ్ సాంగ్ పాడే అవకాశాన్ని 18 ఏళ్లకే దక్కించుకున్న బిల్లీ ఐలిష్ మున్ముందు సంగీత ప్రపంచంలో రారాణిగా వెలిగిపోవడం ఖాయం!