శృంగారం లేదంటే ఆత్మ ద్రోహమే

ABN , First Publish Date - 2020-02-07T19:20:57+05:30 IST

మాయమైపోతున్న మంచితనాన్ని తట్టిలేపిన వాడు... అక్షర జ్ఞానం లేకపోయినా తన వాక్కునే వాఙ్మయంగా పలికించిన వాగ్గేయకారుడు అందెశ్రీ... శోకాన్ని శ్లోకం చేసిన వాల్మీకిలా... తన పాట కూడా కన్నీటి నుంచే పుట్టిందంటారాయన...

శృంగారం లేదంటే ఆత్మ ద్రోహమే

మాయమైపోతున్న మనిషికోసమే నా కవితాగమనం

ప్రకృతే నా అమ్మ.. సాంగత్యంతోనే భాష నేర్చుకున్నా

చాలా సార్లు చనిపోదామనుకున్నా... జీవితమే అన్నీ నేర్పుతుంది

ఐయాన్‌ ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో ప్రజాకవి అందెశ్రీ


మాయమైపోతున్న మంచితనాన్ని తట్టిలేపిన వాడు... అక్షర జ్ఞానం లేకపోయినా తన వాక్కునే వాఙ్మయంగా పలికించిన వాగ్గేయకారుడు అందెశ్రీ... శోకాన్ని శ్లోకం చేసిన వాల్మీకిలా... తన పాట కూడా కన్నీటి నుంచే పుట్టిందంటారాయన... ఒకప్పటి పశువుల కాపరి అందె ఎల్లయ్య... ఈరోజు తెలంగాణ జాతీయ గీతమై పల్లవిస్తున్నారు.. ఓరుగల్లు మట్టిలో పుట్టిన పాటల మాణిక్యం అందెశ్రీ.. తన అంతరంగాన్ని 7-6-10న జరిగిన ఐయాన్‌ ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే కార్యక్రమంలో పంచుకున్నారు. ఆ వివరాలు..


అక్షరజ్ఞానం లేకుండా ఇదంతా ఎలా సాధ్యమైంది?

ఇది అద్భుతం అనొచ్చు. కాకపోవచ్చు. జీవించాలన్న తలంపున్న వాడికి జీవితమే అన్నీ నేర్పుతుంది. ఈ భూమ్మీద ఉన్న ప్రతీ అద్భుతమూ తెలియకుండానే నన్ను తాకుతుంది.


మీ తల్లిదండ్రుల ఆలనాపాలనా కూడా మీకు ఉండేదికాదు?

ఆ రెండు పదాలు ప్రశ్నార్థకమైన జీవితం ఎంత అగాధమయంగా ఉంటుందో తెలుసు. అయినా ఈ అనాథను అందరివాడిని చేసింది నా సాహిత్యమే. ఈ అనామకుడిని ఆకాశానికి ఎత్తిందీ సాహిత్యమే. (ఆర్కే: అగాధం నుంచి ఆకాశానికి తన్నుకొచ్చారు) నా కళ్ల ముందున్న ప్రపంచమంతా నాకు పాఠశాలే. ఈ ప్రకృతి నాకు అమ్మ. నా కవిత్వపు ఆలోచన పరంపరంతా నాకు అయ్య. 1994లో విషం తాగి చనిపోవాలని భావించాను. అయితే, రామకృష్ణారెడ్డి గారు నన్ను ఆదుకొన్నారు. ఆయన వల్లే ఈరోజు నేనీ స్థాయిలో ఉన్నాను.


చదువు లేకపోయినా మీలో పద గాంభీర్యం, లోతైన సాహిత్యం ఉంది?

చదువుకుంటేనే భాష వస్తుందనుకుంటే పొరపాటు. అయితే, సాంగత్యం లేకుంటే ఈ భాష రాదు. మల్లారెడ్డి బాల్యంలో నా గురువు. రామాయణ, భారత ఇతిహాసాలన్నీ నాకు తెలియకుండానే నా మెదడులోకి పంపు చేశారాయన. తన పని చేయించుకునేందుకు ఆ కథలు చెప్పేవారు. కానీ, అవి నా జీవితానికి ఇంతగా పనికొస్తాయని నేనెప్పుడూ అనుకోలేదు.


అందె ఎల్లయ్య అందెశ్రీగా ఎప్పుడు మారారు?

నిజామాబాద్‌లో తాపీ పని నేర్చుకోవడానికి పోయినప్పుడు శంకర్‌ మహారాజ్‌ అని సాధుపుంగవుడు ఉండేవారు. ఆయన సాంగత్యం నన్ను గొప్పగా తీర్చిదిద్దింది. ఆయనే నా పేరును అందెశ్రీగా మార్చారు.


భక్తి, ముక్తి, రక్తి... ఇన్ని ఎలా పలికించగలుగుతున్నారు?

మూడు కోణాలే కాదు.. ముక్కోటి కోణాలందరికీ ఉంటాయి. శృంగారం బంగారాన్ని తలదన్నింది. ప్రపంచ యుద్ధాలు శృంగారం కోసమే జరిగాయి.


భక్తి, ముక్తి, రక్తి... ఇన్ని ఎలా పలికించగలుగుతున్నారు? 

మూడు కోణాలే కాదు.. ముక్కోటి కోణాలందరికీ ఉంటాయి. శృంగారం బంగారాన్ని తలదన్నింది. ప్రపంచ యుద్ధాలు శృంగారం కోసమే జరిగాయి. 14 నుంచి 70 ఏళ్ల వరకూ అందులోనే జీవించే మనిషి... అది వైరాగ్యమని చెబితే ఆత్మద్రోహం చేసుకోవడమే అవుతుంది.


సినిమా రంగానికి పరిచయం చేసిందెవరు?

1994లో నేను ఆత్మహత్య చేసుకుందామనుకున్నప్పుడు యలమంచి శేఖర్‌ నన్ను ముట్టుకోకపోతే... అసలు సినిమా నేపథ్యమే లేదు. నేను దళితుడినా అంటే స్పష్టంగా చెప్పలేను. ఇవన్నీ మనిషిని తెగనరికిన తర్వాత పుట్టిన వ్యవస్థలు. అందుకే మనిషితనం ఎక్కడ ఉంటుందో అక్కడ నేనుంటాను.


మిమ్మల్ని వాగ్గేయకారుడిగా తెలంగాణ ప్రజలే గుర్తించాలనుకుంటున్నారా?

నన్ను ఎవ్వరు గుర్తించకపోయినా అభ్యంతరం లేదు. నేను నా పాటకు ఎంత వరకు న్యాయం చేస్తా... ఆ పాటను ప్రజల్లోకి ఎంత వరకు తీసుకుపోతానన్నదే ముఖ్యం. నా కవిత్వం ప్రపంచాన్ని మారుస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. మీరన్న ఎల్లయ్యది తెలంగాణ, అందెశ్రీది విశ్వం.


తెలంగాణ గేయాన్ని ఎప్పుడు రాశారు?

కామారెడ్డిలో ధూంధాం జరిగినప్పుడు పుట్టిన పాట అది. ఉద్యమం ప్రారంభమయ్యాకే రాశాను.


మా తెలుగుతల్లికి పోటీగా ఈ పాటను...

ఆ పాటకు పోటీ కాదు. రెండూ ఉపయోగించుకోవచ్చు. వందేమాతరం పాడొద్దన్న ఈ దేశంలో నా పాట పాడకూదనరన్న గ్యారెంటీ లేదు. పాట రాయలేకపోతే బాధ పడతాను కానీ, జాతీయ గీతం కాకపోతే ఎందుకు బాధ పడతాను.


మాయమైపోతున్నదమ్మా.. పాట ఏ సందర్భంలో పుట్టింది?

సందర్భమేమీ లేదు. కవుల పరంపరలో నేను కొట్టుకుపోవద్దనుకుని, కొత్తగా ఉండాలనుకుని ఆ పాట రాశాను. మొదట ఎంతో భయపడ్డాను. మాయమైపోతున్న మనిషి కోసమే నా కవితాగమనం. ఆత్మగౌరవంతో కూడిన ధిక్కారం ఎంతున్నా ఫరవాలేదు.. అజ్ఞానంతో కూడుకున్న అహంకారం అరువంత ఉన్నా పతనం తప్పదు.


మీకు రావలసినంత గుర్తింపు రాలేదన్న అసంతృప్తి ఉందంటారు?

అలాంటిదేమీ లేదు. ఓసారి ప్రధానమంత్రినై ప్రపంచానికి మనుషులను ఉత్పత్తి చేయాలనుకుంటున్నాను. కానీ నాకు ఆ అవకాశం ఇస్తారా? కాలం గొప్పది.. నాకు ఎలాంటి అసంతృప్తి లేదు. బినామీ పేర్ల మీద పాటలు రాస్తున్నారు. నాకా గతి పట్టలేదు. నా కవిత్వాన్ని అమ్ముకోను.

Updated Date - 2020-02-07T19:20:57+05:30 IST