మా ఉద్యమాలను టీఆర్‌ఎస్ ఓట్లుగా మార్చుకుంది
ABN , First Publish Date - 2020-02-07T19:55:10+05:30 IST
తెలంగాణ ఉద్యమ ప్రతి మలుపులో భాగంగా ఉన్నా. డిసెంబర్ వస్తోంది. ఈ చారిత్రాత్మక దశలో ఉద్యమ శక్తులను ఏకం చేయాలని 85 సంఘాలు కలిసి ఫ్రంట్‌గా ఏర్పడ్డాం.
అందుకే మా అవసరం వచ్చింది
నవంబర్ 1.. విద్రోహ దినమే
విగ్రహాల ద్వంసానికీ వ్యతిరేకమే
1-11-2010న ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో గద్దర్
ఫ్రంట్ పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది?
తెలంగాణ ఉద్యమ ప్రతి మలుపులో భాగంగా ఉన్నా. డిసెంబర్ వస్తోంది. ఈ చారిత్రాత్మక దశలో ఉద్యమ శక్తులను ఏకం చేయాలని 85 సంఘాలు కలిసి ఫ్రంట్‌గా ఏర్పడ్డాం. పార్లమెంటులో బిల్లు పెట్టేలా ముందుకు తీసుకుపోవాలి.
దీంతో మీరు ఆంధ్రా, రాయలసీమల్లో ప్రజాభిమానాన్ని కోల్పోయే పరిస్థితి రాదా?
సమస్య ఒకటే. భూమి, నీరు, వనరులు.. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ అయిపోయాయి. ఈ మూడూ మాకు చెందాలన్న సమస్య ఉత్తరాంధ్రలో ఉంది. రాయలసీమలో ఉంది. ఆ సమస్యలపై పాడేవాడిని కనక రెండు పక్షాలూ నన్ను ఆహ్వానిస్తాయి. ముందుగా, తెలంగాణకు సంబంధించిన ప్రణాళిక రూపొందించుకుని, అక్కడికి వెళ్లి, దానిని వారికి వివరించాలన్నది మా ఆకాంక్ష.
ఇప్పుడు ఫ్రంట్ అవసరం ఉందా అన్న విమర్శపై?
ఉద్యమాలను ఓట్లుగా మలచుకున్నవాళ్లు తిరిగి ఉద్యమాలు చేయలేదు. కనక ఉద్యమాలు మళ్లీ వచ్చాయి. ఉద్యమం చేయకుండా రాజీపడ్డడు. కేసీఆర్ ఉపవాస దీక్ష చేశాడు. దానిని వదిలిపెట్టాడు. దానిని మనం ప్రశ్నించాం. మళ్లీ కంటిన్యూ చేశాడు. అది ఉద్యమమే కదా! తర్వాత విద్యార్థి ఉద్యమం వచ్చింది. ఉద్యమాలనన్నిటినీ సమన్వయంతో ముందుకు తీసుకుపోయి ఉండాల్సింది. అక్కడే రాజకీయ పార్టీల వైఫల్యం ఉంది.
తెలంగాణ వచ్చే దశలో వాతావరణాన్ని చెడగొట్టడానికి గద్దర్ రంగప్రవేశం చేశారని.. ఆంధ్రావాదులు పెట్టుబడి పెట్టారని..?
ప్రజా ఉద్యమాలను, రాజకీయ నేతలను కలిపే శక్తిగానే మేం ఏర్పడ్డాం. డిసెంబర్ తర్వాత ఏదో జరగబోతోందన్న భయాన్ని తీసేయగలిగినాం. తెలంగాణ తీసుకురావడానికి భూకంపాలు, అంతర్యుద్ధాలు చాలా పెద్ద విషయాలు. మా ఫ్రంట్ తీర్మానంలోనే.. దంచుడు, గుద్దుడు, బాగో, జాగో పదాలేవీ వాడొద్దని తీర్మానించాం. అంతర్యుద్ధం సమస్యను పరిష్కరించే సూత్రం కాదు.
రాజకీయ శక్తిగా.. ఎన్నికలకు వెళ్లకుండా ఎలా?
మాది పార్టీ కాదు. అనేక జేఏసీల సమాహారం. అందుకని, ఫ్రంట్ ఎన్నికలకు వ్యతిరేకం కాదు. ఫ్రంట్‌గా ఎన్నికలకు వెళ్లదు. కానీ, ఫ్రంట్‌లోని భాగస్వాములు వాళ్ల వాళ్ల బ్యానర్ల మీద ఎన్నికల్లో పాల్గొనడానికి పూర్తి స్వేచ్ఛ ఉంది. ఉప ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓటు వేశారనుకుంటున్నారా? అది ఉద్యమానికి వేసిన ఓటు. మేం చేసిన ఉద్యమాలను టీఆర్‌ఎస్ ఓటుగా మార్చుకుంది. శ్రీకృష్ణ కమిటీకి చట్టబద్ధత లేదు. ఉద్యమాల్లో హింసకు నేను ఎప్పటినుంచో వ్యతిరేకం. రాజకీయ పార్టీ ఏదైనా హింసకు యత్నిస్తే.. వ్యతిరేకిస్తాం. మా ఫ్రంట్‌కు స్పాన్సర్లు లేరు. ప్రజలే ఉన్నారు.
తెలంగాణను ఏర్పాటుచేస్తే మళ్లీ నక్సలిజం ప్రబలుతుందన్న విమర్శపై...?
అన్ని పార్టీలూ తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇచ్చినట్లే.. పీపుల్స్ వార్ కూడా మొట్టమొదట మద్దతు ఇచ్చిన నక్సల్ పార్టీ. మా ఫ్రంట్.. ఆ పార్టీ ఫ్రంట్ కాదు. చంపే ముందు దానిని పిచ్చికుక్క అని చెప్పాలి కనక నన్ను బూచిగా చూపిస్తున్నారు. మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారు. మాది ఏ రాజకీయ పార్టీ ఫ్రంట్ కాదు. మావోయిస్ట్ పార్టీ ఫ్రంట్ కూడా కాదు.
నవంబర్ 1.. మీ దృష్టిలో విద్రోహ దినమా?
విశాలాంధ్ర వచ్చినా.. ప్రజారాజ్యం రాలేదు. పాలకులు ద్రోహం చేశారు. అందుకని విద్రోహ దినమే.
కేసీఆర్‌తో ఎందుకు వైరుధ్యాలు వచ్చాయి?
ఆయన అనుకున్న తెలంగాణ రావాలంటే ఆయన ఎన్నుకున్న మార్గం వేరు. మేం అనుకున్న తెలంగాణ రావాలంటే ఉద్యమాలే మార్గం. ఇదే మా మధ్య తేడా!! విద్వేషాలు రెచ్చగొట్టడం వల్ల ఈ సమస్య పరిష్కారం కాదు. నాకు వేమన అంటే చాలా ఇష్టం. ట్యాంక్‌బండ్‌పై వేమన విగ్రహాన్ని తీసేస్తే ముందుగా నేను వెళ్లి అక్కడ కూర్చోవాలి. ట్యాంక్‌బండ్‌పై విగ్రహాలను తీసేస్తామనడం ఫ్రంట్ పాలసీ కాదు.
తెలంగాణ సాధన క్రమంలో ఇక్కడి ఇతర ప్రాంతాల ప్రజలకు భరోసా ఇస్తారా!?
తప్పకుండా. భరోసా ఉంటుంది.