‘ఆయన రాముడు- ఈయన ఏన్టీరాముడు. ఆయన ఏకపత్నీవ్రతుడు - ఈయన లోకపత్నీవ్రతుడు’

ABN , First Publish Date - 2020-02-07T19:50:50+05:30 IST

అవధానాలను అవలీలగా చేసే గరికపాటి నరసింహారావు ఆంధ్ర మహాభారతం మొదలు ఆంధ్రప్రదేశ్‌ విభజన వరకు ఏ అంశాన్నెత్తుకున్నా అవలీలగా వ్యాఖ్యానించగలరు.

‘ఆయన రాముడు- ఈయన ఏన్టీరాముడు. ఆయన ఏకపత్నీవ్రతుడు - ఈయన లోకపత్నీవ్రతుడు’

చిరంజీవి కోల్పోయిందేముంది శూన్యం తప్ప

పాపాలు చేసి దీపాలు పెడితే సరిపోదు

దానికి కవిసమయం అనే పేరు పెట్టుకున్నా

ఓపెన్ హార్ట్‌ విత్ ఆర్కేలో గరికపాటి నరసింహారావు


అవధానాలను అవలీలగా చేసే గరికపాటి నరసింహారావు ఆంధ్ర మహాభారతం మొదలు ఆంధ్రప్రదేశ్‌ విభజన వరకు ఏ అంశాన్నెత్తుకున్నా అవలీలగా వ్యాఖ్యానించగలరు. ఎంతో క్లిష్టమైన విషయాలను సైతం చమక్కులతో వివరించే ఆయన ఆంధ్రజ్యోతి - ఏబీఎన్‌ ఎమ్‌డీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమంలో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. 2-12-2013న ఏబీఎనలో ప్రసారమయిన ఈ కార్యక్రమ వివరాలు...


ఆర్కే : నమస్కారం గరికపాటిగారు. నిజజీవితంలో మీ అవధానం ఎలా ఉంది?

గరికపాటి : మంచి ప్రశ్న. అవధానం వేదిక మీద చెయ్యడం ఎంత ముఖ్యమో నిజ జీవితంలో చెయ్యడం అంతే ముఖ్యం. అవధానం అంటే ధారణ, జ్ఞాపకశక్తి. ఎన్ని ఆటంకాలున్నా పనిచెయ్యగలగడం. ఇది నిజజీవితంలోనే ఎక్కువ అవసరం. ఉదాహరణకు నేను స్వయంగా బజారుకెళ్లి సరుకులు, కూరగాయలు తెచ్చుకుంటాను. నా భార్య ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెబుతుంది. చెప్పినప్పుడు కాగితమ్మీద రాసుకుని తర్వాత ఒక్కటీ మర్చిపోకుండా తీసుకొస్తాను. బయట ఎంత పండితులైనా, ఇంట్లో బంధం ప్రకారమే నడుచుకోవాలి. అవతలివాళ్లను మెప్పించాలి. యోగవాసిష్ఠం లాంటి గ్రంథాలు ఒంటబట్టిన తర్వాత ఆడపని మగపని చిన్నపని పెద్దపని అనేమీ ఉండదు. ఎవరు ఫోన్‌ చేసినా నంబర్లు రాసుకుంటాను.


ఆర్కే : మీకు ధారణ ఎక్కువ కదా. రాసుకోవడం ఎందుకు?

గరికపాటి : కావలసిన యాభై నంబర్ల వరకూ నాకు గుర్తుంటాయి. ప్రయత్నిస్తే ఎవరికైనా గుర్తుంటాయి. అవధాన కళ ద్వారా మేథాశక్తిని బాగా వినియోగించుకోవాలన్నది యువతరానికి చెప్పొచ్చు. వేదిక మీద ఎనిమిది పద్యాలు చెబితే గంటన్నరలో అయిపోతుంది. కాని నేను వాటితో పాటు దైవభక్తి, దేశభక్తి, నైతిక విలువలు, సత్ప్రవర్తన - వంటివి జోడించి చెబుతాను. చాలామందికి తెలియదు - నేను పదో క్లాసు ఒకసారి తప్పాను. ఇంగ్లీషు ఒక మార్కు తక్కువ వచ్చింది. మా నాన్నగారు కేకలెయ్యకపోగా ‘ఒకసారి తప్పితే గట్టిపడుతుంది సబ్జెక్టు’ అన్నారు. మాది పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం.


ఆర్కే : అసలే అక్కడ వ్యంగ్యం ఎక్కువ...

గరికపాటి : అవును. అందుకే ‘సీనియర్‌ స్టూడెంట్‌’ అంటారని భయం. కాని పరీక్ష తప్పి మళ్లీ చదవడం నాకు మేలు చేసింది. రెట్టింపు మార్కులు సాధించాను. నిజానికి మొదటిసారి ఉత్తీర్ణుడై ఉంటే ఇంత ఉత్తేజం కలిగేది కాదేమో. అందుకని నేను అవధానాల్లో తరచూ చెబుతుంటాను - ‘మేం అవతార స్వరూపులం కాదు. మా కాళ్లకు మొక్కితే మీకేదో వస్తుందనుకోకండి. మా చేతికి నాలుగు పళ్లు ఇచ్చి పాండిత్యాన్ని కొట్టేయాలని చూడకండి. ఆశీర్వచనం ఇచ్చేంత పెద్దవాణ్ని కాదు’ అని. సెంటిమెంటు పెరిగే కొద్దీ శాస్త్రజ్ఞానం తగ్గిపోతుంది. అవధానంలోనే కాదు, ఆధ్యాత్మిక రంగంలో కూడా ఉన్నాం గనక పంచెలు, పళ్లు, పాదాభివందనాలు, పారితోషికాలు - అన్నీ సమర్పిస్తూ ఉంటారు.


ఆర్కే : కాని దాన్ని చాలామంది ఎంకరేజ్‌ చేస్తున్నారుగా..

గరికపాటి : పాదాభివందనాలు, గురుదక్షిణలను ప్రోత్సహిస్తున్నారంటే వాళ్లకు అహం ఉన్నట్టు. ఇక అప్పుడు పాండిత్యం ఉపయోగం ఏముంది? కేవలం మన మాటల ద్వారా అవతలవాళ్లకేమీ అందదు, మనసు ద్వారా అందుతుంది. మన భావతరంగాల్లో అహంకారం ధ్వనించకూడదు. నా అవధానాలకు కాలేజీ కుర్రాళ్లు వస్తుంటారు. వ్యస్తాక్షరి వంటి క్లిష్టమైన అంశాలకు నేనెలాగ వేలి కణుపుల మీద సాధన చేస్తానో వివరించి వాళ్లనూ అలా చెయ్యమని చెబుతుంటాను. పాండిత్య ప్రకర్ష కారణంగానో, అహం వల్లనో అవధానాన్ని కొందరికే పరిమితం చేసి అందరికీ అందనిదానిగా తయారుచేస్తున్నారు. కాని అవధానం నేటి తరానికి ఎంతో ఉపయోగం. మీకు ఇవాళ ఇరవై పనులున్నాయనుకోండి. ధారణ సాధన చేస్తే వాటన్నిటినీ గుర్తు పెట్టుకోవడం సులువు.


ఆర్కే : పూర్వం కూడా మీరు చెబుతున్న పద్ధతిలోనే అన్నీ గుర్తు పెట్టుకునేవారు కదా...

గరికపాటి : మనకు అపూర్వమైన వారసత్వం ఉంది. కులాలతో సంబంధం లేకుండా రైతులకు సైతం ఎంతో విజ్ఞానం ఉండేది. అలాంటిది ధారణను కేవలం పండిత కళ చేసేస్తే అది బూజు పట్టిపోతుంది.


ఆర్కే : చేశారనేదే కదా ఆవేదన?

గరికపాటి : ఆవేదన అదే. కాని మన వరకూ మనం అర్థరాత్రి గాలి వీచినంత సహజంగా మన ధర్మాన్ని నిష్కల్మషంగా అహంకార రహితంగా చేస్తూ వెళితే అది వ్యాపిస్తుంది. నేను ఇరవయ్యేళ్లుగా దాన్ని గమనిస్తున్నాను.


ఆర్కే : ప్రశ్నలు పూరించలేక ఇబ్బంది పడిన సందర్భాలున్నాయా?

గరికపాటి : ఉన్నాయి. అవధానులు బైటికి చెప్పరుగాని, ప్రతి అవధానంలోనూ మా సంతృప్తి మేరకు మేం చెయ్యలేకపోతాం. ఓటమిని ఒప్పుకున్నప్పుడే గెలుపుబాటలో ముందుకు సాగగలం. నేనొకసారి మిర్యాలగూడలో అవధానం చేస్తున్నాను. పృచ్ఛకుల్లో మరింగంటి పురుషోత్తమాచార్యులని మంచి కవి ఉన్నారు. ఆయన ఇచ్చిన సమస్యకు ఏం చెప్పాలో నాకు వెంటనే తోచలేదు. అవధానంలో సమస్య ఇచ్చిన నిమిషం లోపల పద్యాన్ని మొదలుపెట్టాలి. భావ స్ఫురణ ఉండాలి. చురుగ్గా బుర్రను పరుగెత్తించాలి. అది కుదరక ఏదో గిట్టుబాటు చేశాను. అది సరికాదని నాకూ తెలుసు. అవధానం పూర్తి చేసి వేదిక దిగి రాగానే నాకు అది స్ఫురించింది. మర్నాడు ఫోన్‌ చేసి, ‘ఆచార్యులుగారూ క్షమించండి. నాకు తోచలేదండీ. వేదిక దిగాక తోచింది..’ అని చెప్పాను. ఆయనెంత మంచివాళ్లంటే, ‘పర్వాలేదయ్యా, నేను నిన్నలా ఇబ్బంది పెట్టకుండా ఉండాల్సింది...’ అన్నారు!


ఆర్కే : మీరు రాజకీయాల మీద కూడా చేస్తుంటారా?

గరికపాటి : చిరంజీవి పార్టీ పెట్టిన కొత్తలో ఓ దత్తపది ఇచ్చారు. ఆయన నటించిన సినిమాలు ఖైదీ, ఠాగూరు వంటివి ఇచ్చి అధికారంలోకి వస్తే ఏం చేస్తారో చెప్పమన్నారు.


‘‘కాలుమోపగానె ఖైదీల విడిపించు - ఈ స్వయంకృషికిక ఎదురులేదు - అదుపుచేయునేమో అవినీతి ఠాగూరు...’ అంటూ చెప్పాను. వారి అదృష్టమో మన అదృష్టమో వారు అధికారంలోకి రాలేదనుకోండి.

 

‘మాకు 180 సీట్లొస్తాయి’ అన్నారు ముందు. ఫలితాలు చూస్తే 18 వచ్చాయి. ‘కోల్పోయినదేముంది శూన్యం తప్ప’ అని ఛలోక్తి విసిరాను. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరి మీదైనా ఛలోక్తి విసరాలంటే ఇబ్బందిగా ఉంది. మనిషి సరసాన్ని, ఛలోక్తిని కోల్పోతే జీవితం ఏముంటుంది? ఇప్పటికీ అవధానాల్లో అప్రస్తుత ప్రసంగం అంటే రాజకీయాలే ఎక్కువగా వస్తాయి. ‘ద్రౌపది ఐదుగురిని చేసుకోవడం ధర్మమా, రాముడు వాలిని చంపడం ధర్మమా అని. అవి తప్ప మరేమీ మంచి విషయాలు లేనట్టు. మన జాతికి చర్య మీద ఆసక్తి లేదు, కేవలం చర్చ మీదే ఆసక్తి.


ఆర్కే : ఇంకా ఇలాంటి రాజకీయ ఛలోక్తులు ఏం చేశారు?

గరికపాటి : మీ సొమ్మేం పోయిందండి, అడుగుతారు తర్వాత నేను ఇబ్బంది పడాలి...


ఆర్కే : నాది కదా బాధ్యత మీరు చెప్పండి.

గరికపాటి : ఆ విషయంలో నాకు మీరే స్ఫూర్తి. సింగిల్‌ మేన్‌ ఆర్మీలా దూసుకెళ్లిపోతుంటారు మీరు. మిమ్మల్ని చూసి నేను కూడా ధైర్యంగా మాట్లాడుతుంటాను. మొన్న మచిలీపట్నంలో కిరణ్‌కుమార్‌ రెడ్డి ధైర్యస్తులని చెప్పాను. కాంగ్రెస్‌ అక్కడ, ఇక్కడ కూడా పోతుందని చెప్పాను. కేసీఆర్‌తో కలిస్తే ఏమో. అయితే ఆయన తన పట్టు ఎందుకు వదులుకుంటారు? ఎవరి పట్టు వాళ్లు చూసుకుంటారు. అవధానాల్లో రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మిక పరిస్థితులను విశ్లేషించాలి. ముఖ్యంగా యువతరాన్ని ఆకట్టుకోవాలంటే శృంగారం, హాస్యం, నేరాలు ఘోరాలు ఇవన్నీ చెప్పాలి. కొన్ని చెప్పలేను. చెప్పినవి సైతం పరిమితుల్లో ఉండాలి. కమ్యూనికేషన్‌ స్కిల్‌ కావాలంటే రామాయణ భారతాలు చదవాలి.


ఆర్కే : ఇవాళ అంత విద్య, విద్వత్తు ఎవరి దగ్గరుంది?

గరికపాటి : విశ్వవిద్యాలయాల్లో చదువులే అలా ఉంటున్నాయి. ఆశతో ముందుకు వెళ్లాలి. మీరు పత్రిక నడపటం లేదా ఆశావహ దృక్పథంతో?


ఆర్కే : రేపటి గురించి ఆశ లేకపోతే ఎలా?

గరికపాటి : భగవంతుడు నాకీ కండువా వేసినందుకు నాకు తోచింది చేస్తాను. ఇప్పటికైనా ఒకటి నుంచి ఐదు వరకు తెలుగు మాథ్యమం పెడితే పది పదిహేనేళ్లకు మార్పు వస్తుంది. బడి విడిచే ముందు ఒక్క అరగంట తెలుగు పద్యాలు పాడిస్తే ఏడాదికి వంద పద్యాలు, పదేళ్లకు వెయ్యి పద్యాలు నోటికి వచ్చేస్తాయి. ‘సరదాగా వినండి - నాతో పాటు అనండి’ అంటే చాలు. వాళ్ల తెలివితేటలు, ధారణ బాగా పెరుగుతాయి. అవి చేస్తే బురదలో నుంచి తామరపూలు పూస్తాయి. ఒక్క శ్లోకం నన్ను ఇవాళ మీ ముందు నిలబెట్టింది.


ఆర్కే : అదేమిటి?

గరికపాటి : తె లుగు యూనివర్సిటీలో ఉద్యోగం వస్తుందనుకుంటే చివరి నిమిషంలో పిడుగులాంటి వార్త విన్నాను. 250 అపాయింట్‌మెంట్లు రద్దు చేశారు. అవధాన ప్రతిభ ఉందిగాని దాని మీద బతకడం ఎలా? అప్పటికి పెళ్లయింది, ఇద్దరు పిల్లలు. విరక్తి వచ్చేసి అయిపోదామనుకున్నా. హిమాలయాల్లో సింహాన్ని వేటాడ్డానికి వెళ్లిన కిరాతుల గురించి వర్ణిస్తూ కాళిదాసు రాసిన శ్లోకం చదివాను. అప్పుడు నాలో ఆలోచన మొదలైంది. బహుశా ఆ ఉద్యోగం జారిపోవడం మన మంచికేనేమో. నన్ను అమ్మవారు అవధానానికే వాడుకోవాలనుకుంటోందేమో అనిపించింది. అప్పటివరకూ నాస్తికుణ్ని. ఆ తర్వాతే నేను ఆస్తికుడిగా మారాను. గుంటూరు వెళ్లి విజ్ఞాన్‌ రత్తయ్యగారి దగ్గర పని చెయ్యడం మొదలుపెట్టాను. తర్వాత కొందరం కలిసి కోనసీమలో రెసిడెన్షియల్‌ కాలేజీ పెట్టాం. భాగస్వాముల మధ్య కుదరక అది మానేశాను. తర్వాత కాకినాడలో ఆదిత్య కాలేజీలో శేషారెడ్డిగారు ఆఫర్‌ ఇచ్చారు. ‘ఆరు వేల జీతం ఇస్తాను ప్రిన్సిపాల్‌గా ఉండండి’ అని. అదికూడా వినలేదు. గరికపాటి కాలేజ్‌ అని సొంతంగా ఒకటి పెట్టాను. దానిలో మా వాళ్లెవరూ చేరలేదు, వేరేవాళ్లు అసలే చేరలేదు.


ఆర్కే : ఉభయ భ్రష్టత్వం అన్నమాట.

గరికపాటి : బ్రాహ్మలం కదండీ. వ్యాపారం మా స్వభావంలో లేదు. మా నాన్న ఇచ్చిన నాలుగు ఎకరాలను కరిగించేశాను. ఇంట్లో పనిమనిషి చేతే పనిచేయించలేం, పదిమంది చేత ఎలా చేయించగలం? పనిమనిషులెవరూ లేక నా తల్లి కాలేజీ పిల్లల కంచాలు కడుగుతుంటే చూడలేకపోయాను. కాలేజీ మూసెయ్యాలనుకున్నా. అప్పుడు చైతన్య మెడికల్‌ కాలేజీ రాజుగారు లక్ష రూపాయలు డబ్బు పట్టుకుని వచ్చారు. ‘మీ కాలేజీ ఇబ్బందుల్లో ఉందని తెలిసింది. మీరు మా కాలేజీలో చేరండి’ అని డబ్బులు అక్కడ పెట్టి వెళ్లిపోయారు. బ్లాంకు చెక్కు కూడా ఇచ్చారు. రాత్రి ఇంట్లో చర్చించుకుని కాలేజీ సామానంతా విలువ కట్టి ఆయనకు అమ్మేశాను. చెక్కు మళ్లీ ఆయన చేతుల్లోనే పెట్టేశాను. తర్వాత ఆయన కాలేజీలో చేరి పాఠాలు చెబుతూ అవధానాన్ని మెరుగుపరుచుకున్నాను. శంకరాచార్య సాహిత్యం చదువుతుంటే దుఃఖం తగ్గి, ఆశ పెరిగింది. దైవానుగ్రహం అంటే ఎక్కణ్నుంచో వచ్చేది కాదు. అనుసృత్య గ్రహణమ్‌ అని అర్థ్థం. దైవాన్ని అనుసరించి సాధన చెయ్యాలి. నెమ్మదిగా సమస్యల్లోంచి బయటపడ్డాను. టైమ్‌టేబుల్‌ ప్రకారం పుస్తకాలు చదువుకుంటుంటాను.


ఆర్కే : ఇప్పటికీ టైమ్‌ టేబుల్‌ ఉందా?

గరికపాటి : ఉంది. నేను దానికి కవిసమయం అనే పేరు పెట్టుకున్నాను. గంటగంటకు ఏం చెయ్యాలనేది అందులో ఉంటుంది.

ఆర్కే : ఇంత పాండిత్యం ఉండి మీరు సినిమాల్లోకి ఎందుకు అడుగుపెట్టలేదు?

గరికపాటి : గడచిన ఆరేడేళ్లుగా బాగా అవకాశాలొస్తున్నాయి. కాని మనసుకు సంపూర్ణమైన స్వేచ్ఛ ఉండాలి తత్వవేత్తకు. ఆందోళన లేకపోతేనే స్వేచ్ఛ ఉంటుంది. సినిమా రంగంలో దర్శకుడు, నిర్మాత, నటీనటులు అందరికీ ఆందోళనే. అంతా వైకుంఠపాళీనే అక్కడ. ‘మీరు అక్కడకెళ్లి దాన్ని బాగుచెయ్యొచ్చు కదా’ అంటుంటారు. ‘అక్కడికి వెళ్లాక మనం దాన్ని బాగుచేసేదేం ఉండదు, మనం చెడిపోతాం అంతే’ అంటాన్నేను. పైౖగా అక్కడ గ్లాసు లేనిదే మాట్లాడరు. నాకది చిరాకు. 


ఆర్కే : అందరూ అలా ఉండరండి. గ్లాసు ముట్టనివాళ్లు చాలామందే ఉన్నారు సినిమాల్లో...

గరికపాటి : అవును. మా మిత్రుడు జొన్నవిత్తుల ఉన్నాడు. కాని తెల్లవార్లూ మెలకువగా ఉండటం, చర్చలు - నాకు నడవవు. రెండోది మనం ప్రాచీన సాహిత్యం చదువుకున్నాక ఏ నిర్మాతో వచ్చి రాసిన దానిలో వేలు పెడితే అవమానంగా అనిపిస్తుంది. అలాగని అందులో ప్రతిభ తక్కువని కాదు. సీతారామశాస్త్రి, రామజోగయ్య, చంద్రబోస్‌, అనంతశ్రీరామ్‌ - ఇంతమంది ఉండగా ఆ రంగానికి మన సేవలు అవసరం లేదు. ఆధ్యాత్మికతను కుండబద్దలు కొట్టి చెప్పేవారు కావాలి. ముఖ్యంగా అవధానం.


ఆర్కే : ఆధ్యాత్మిక రంగంలో ప్రవచనాలు చెప్పేవాళ్లు ఎక్కువైౖపోయారు. ఎవరికి వాళ్లు పీఠాలు, పీటలు వేసుకుని కూచున్నారు. భక్తులూ కిటకిటలాడుతున్నారు. ఇంత భక్తి పెరుగుతుంటే పాపాలు ఎందుకు పెరుగుతున్నట్టు? స్వాములు మూఢభక్తిని పెంచుతున్నారా? ఎన్ని పాపాలు చేసినా ఏదో ఒకటి చేస్తే సరిపోతుందని చెప్పడమా? మీ విశ్లేషణ ఏమిటి?

గరికపాటి : ఆముక్త మాల్యదలో ఒక పద్యం ఉంది. మౌనంగా అర్థరాత్రి గాలి వీచినంత సహజంగా మన పని మనం చేసుకుపోతే మంచి ఫలితాలు వాటంతటవే వస్తాయి. ఏ ఉపన్యాసం చెప్పినా, చివర్లో తెలుగులో మాట్లాడదాం అని చెబుతుంటాను. వ్యవస్థ ఎంత చెడిపోయినా, చిట్టచివరి వేరు పట్టుకుని నేను శాయశక్తులా ధర్మాన్ని నిలబెట్టడానికి కృషి చేస్తాను. ఉదారస్య తృణం విత్తం - శూరస్య మరణం తృణం - విరక్తస్య తృణం భార్య - నిస్పృహస్య తృణం జగత్‌ అన్న మాటను నేను నమ్ముతాను. కోరికలేని వాడికి ప్రపంచమే గరిక పాటి.


ఆర్కే : మీ భవిష్యత్‌ ప్రణాళికలు ఏమిటి?

గరికపాటి : యువతరం కోసం వ్యక్తిత్వ వికాసం, సంభాషణా నైపుణ్యం, నాయకత్వ లక్షణాలు, నిర్వహణ సామర్థ్యం - ఈ నాలుగింటినీ మన సాహిత్యం ఆధారంగా చిన్న పుస్తకాలుగా సరళమైన భాషలో, వాళ్లకు ఉపయోగపడేట్టుగా రాయాలనుకుంటున్నాను. అలాగే దేవాలయాల్లోనూ, వయసు మళ్లినవారికీ ప్రవచనాలుగా కాకుండా ఇంజనీరింగ్‌, మెడికల్‌ కాలేజీలకెళ్లి నవతరానికి మంచి మాటలు చెప్పి మార్పు తేవాలన్నది నా ఉద్దేశం.


గరికపాటి: శ్రీశ్రీ సాహిత్యం చదివి నేనెంతో ప్రభావితం అయ్యాను, అందుకని పెద్దవాడికి శ్రీశ్రీ అని పెట్టాను. తర్వాత ఆడపిల్ల పుడితే గరికపాటి సూకీ అని పేరు పెడదామనుకున్నాను. కాని మగపిల్లాడు పుట్టాడు. కన్యాశుల్కం తొమ్మిది గంటల నాటకం ప్రదర్శిస్తున్న రోజే పుట్టాడని వాడికి గురజాడ అని పెట్టుకున్నా. ఎక్కడికెళ్లినా ‘మీ నాన్న భలే పేర్లు పెట్టారు’ అంటుంటారు వాళ్లను.


నాకు ఎన్టీఆర్‌ అంటే అభిమానం. రాముడి పాత్రలో మెప్పించిన ఎన్టీఆర్‌ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకున్నప్పుడు స్పందించమంటే ‘ఆయన రాముడు ఈయన ఏన్టీరాముడు. ఆయన ఏకపత్నీవ్రతుడు - ఈయన లోకపత్నీవ్రతుడు’ అని చమత్కరించాను.


నేను ఆధ్యాత్మిక ఉపన్యాసాల్లోనూ అంతే నిక్కచ్చిగా ఉంటాను. ‘ఎన్ని పాపాలు చేసినా కార్తీకమాసంలో దీపాలు పెడితే అవన్నీ పోతాయి’ లాంటి పనికిమాలిన ప్రకటనలు ఎందుకు? అలా చెప్పి పాపాలను ప్రోత్సహిస్తున్నారు. సారా కొట్టు పెట్టి వంద కుటుంబాలను ఆర్పేసి నెలకోసారి దీపం పెడితే సరిపోతుందా? హిందూ ధర్మం అంత లోకువ కాదు. కోటి కల్పాలు గడిచినా చేసిన కర్మను అనుభవించక తప్పదని ఉంది శాస్త్రంలో. ‘ఒక్క దీపం కోటి పాపం...’ అని కొటేషన్లు చెప్పకూడదు. శివుడంత లోకువగా ఉన్నాడా? భగవంతుడికి ఓట్లు అవసరం లేదు. అందువల్ల ఆయన దేన్నీ మాఫీ చెయ్యడు. పాపం ఒక జ్ఞాపకం. మనస్సులోంచి అది పోవాలి. సీడీలో ఒక పాట స్థానంలో మరొక పాట రికార్డు చేసినట్టు నిరంతరం ఆర్తితో భగవన్నామ స్మరణ చేస్తే ఆ జ్ఞాపకాలు పోయి ఇది రికార్డవుతుంది.


ప్రాంతాలు విడిపోవడం సమస్య కాదు. స్వాంతాలు విడిపోవడం సమస్య. స్వాంతమంటే మనసు. కలిసి కూర్చుని చర్చించుకుంటే అన్నీ పరిష్కరించుకోవచ్చు. విడిపోయామని తెలంగాణవాళ్లు నన్నయ భారతం చదవడం మానెయ్యరు. ఆంధ్రాలో పశువుల కాపర్లు సైతం పాడుకునే పోతన భాగవత పద్యాలను వాళ్లేం పాడుకోవడం ఆపెయ్యరు. ఘంటశాల గానప్రవాహాన్ని చీలుస్తారా? తెలుగు విడిపోదు, చెడిపోదు తెలుగు వెలుగుతుంది. రెండు కన్నులతో ఇక నుండి ఇంకా వెలుగుతుంది.


ఆర్కే : మీరు అలుపెరగని పోరాటం చేయాలని కోరుకుంటున్నాను.

గరికపాటి : కృతజ్ఞతలు.

Updated Date - 2020-02-07T19:50:50+05:30 IST