అ, ఆ లు వదిలేసినపుడే విలువలూ పోయాయి

ABN , First Publish Date - 2020-02-07T19:32:55+05:30 IST

చిన్నప్పు డే నాటకాలపై అభిరుచి పెంచుకుని.. తెలుగు పద్య నాటక గాన గంధర్వుడిగా ఎదిగిన రంగస్థల కళాకారుడు గుమ్మడి గోపాలకృష్ణ.

అ, ఆ లు వదిలేసినపుడే విలువలూ పోయాయి

పద్యాన్ని బతికించుకోవాలి

నాటకానికి ప్రవాసుల్లో ఆదరణ

ఇతరులను హింసించలేకే సినిమాలోకి రాలేదు

రంగస్థలానికి మంచి రోజులు

ఓపెన్‌ హార్ట్‌లో పద్య గాన గంధర్వుడు గుమ్మడి గోపాల కృష్ణ


చిన్నప్పు డే నాటకాలపై అభిరుచి పెంచుకుని.. తెలుగు పద్య నాటక గాన గంధర్వుడిగా ఎదిగిన రంగస్థల కళాకారుడు గుమ్మడి గోపాలకృష్ణ. ‘శ్రీనాథ కవి’ నాటకాన్ని చూసే తనకు శ్రీనాథ కృష్ణ పేరొచ్చిందంటున్న ఆయన రాగాలు తీయడం తగ్గించి పాడితే ఈ తరానికి నచ్చుతుందన్నారు. ఆయనతో 3-12-12న జరిగిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమం విశేషాలు...


మీకు పద్యం అనే విద్య ఎలా అబ్బింది?

చిన్నప్పుడు నడుం, చెయ్యి విరిగింది. అప్పుడు ఊళ్లో నాటకాలు వేస్తున్నారు. అవి వింటూ నేను పాడుతుంటే తోటివాళ్లు బాగా పాడుతున్నానని ప్రోత్సహించారు. మా ఇంట్లో కోప్పడ్డారు. అయినా, పద్యాన్ని, పాటను కొనసాగించాను. ఏ గురువు దగ్గరా చేరలేదు.


అవకాశం ఎలా వచ్చింది?

1982 వరకూ పనిలేకుండా తిరుగుతూనే ఉన్నాను. ఆ తర్వాత ఆచంట వెంకటరత్నంగారు మా ఊర్లో నా టకం వేశారు. ఆ సమయంలో నన్ను చూసి.. వాళ్ల గ్రూపులో చేర్చుకోవాలనుకున్నారు. నన్ను తీసుకెళ్లి చింతా ఆంజనేయులు అనే హార్మోనిస్టు దగ్గర పెట్టారు. ఒకటి, రెండు నాటకాలు వేశాక తిరిగి ఇంటికి వెళ్లాను. మా అన్నయ్య భార్యకు ఈనాడు రామోజీరావు కోడలు దూరపు బంధువు. దాంతో నన్ను ఈనాడులో పనికోసం హైదరాబాద్‌ పంపించారు. కానీ, పనిదొరక లేదు. ఇంటికి మాత్రం రావొద్దని చెప్పి, హైదరాబాద్‌లో ఓ హౌసింగ్‌ సొసైటీలో ఉద్యోగంలో పెట్టి వెళ్లిపోయారు.


మళ్లీ నాటకాల్లోకి ఎలా వచ్చారు?

ఓ రోజు బస్సెక్కి ఎర్రగడ్డ వెళుతుంటే.. మధ్యలో గోకుల్‌ థియేటర్‌ పక్కన కృష్ణతులాభారం నాటకం వేస్తున్నారు. బస్సు దిగి.. ఆ నాటకం చూశాను. ఓ స్నేహితుడితో కలిసి ఆ ట్రూపు వాళ్లను కలిశాను. అక్కడే మా గురువు విద్వాన్‌ రామచంద్రగారు నా గొంతు విని నాకు అవకాశం ఇచ్చారు. 1983లో నా జీవితం మలుపుతిరిగింది. 1991లో తిరుపతి పరిషత్తులో మొదటిసారి ఉత్తమ యాక్టర్‌ అవార్డు తీసుకున్నాను.


పద్య నాటకం మీకేమైనా ఇచ్చిందా?

మానసికంగా, ఆర్థికంగా ఎంతో ఇచ్చింది. ఎక్కువగా డబ్బులు వచ్చినా తోటి పేద కళాకారులకు సహాయం చేసేవాడిని. 2003లో విజయనగరంలో వేసిన ‘శ్రీనాథుడి’ నాటకాన్ని చూసి అప్పా జోస్యుల ఫౌండేషన్‌ వాళ్లు అమెరికాలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. అద్భుతమైన స్పందన వచ్చింది. మన సంస్కృతిని ప్రవాసులే బాగా కాపాడుతున్నారు. ఇక్కడేమో పోగొట్టుకొంటున్నారు.


శ్రీనాథకృష్ణ పేరెలా వచ్చింది.

‘శ్రీనాథ కవి’ నాటకాన్ని చూసి సి. నారాయణరెడ్డి నాకు ‘శ్రీనాథ కృష్ణ’ అని పేరు పెట్టారు. ఆ పాత్ర ఇప్పటికే 90కి పైగా ప్రదర్శనలు పూర్తయ్యాయి. త్వరలో వందో ప్రదర్శన ఇవ్వనున్నాం. దానిని అల్లు అరవింద్‌గారు ఏర్పాటు చేస్తానన్నారు.


భావం అర్థమయ్యేలా పాడితే బాగుంటుందికదా!

ప్రతీ పద్యంలోనూ ఏదో చెప్పాలన్న తపన ఉంటుంది. కేవలం శ్రవణానందకరంగా ఉన్నందువల్ల పద్యంలోని భావ ప్రకటన సిద్ధించదు. అందుకే రెండింటినీ సమపాళ్లలో రంగరించాలి.


పద్యాలు సాగదీస్తే.. ఇప్పటి యువతకు నచ్చదు కదా?

అ, ఆ లను వదిలి ఏబీసీడీలను ఎప్పుడు మొదలు పెడుతున్నారో.. అప్పటి నుంచి పద్యాలే కాదు, సంస్కృతి, విలువలే పోయాయి. పదాలను, భాషను సరళీకరిస్తే.. నష్టం లేదు. కానీ, పద్యాలన్నీ ఛందస్సుకు అనుగుణంగా ఉంటాయి. అవిలేకపోతే గేయంలాగా వస్తుంది. అయితే.. రాగాలు తీయడం తగ్గించి కూడా ప్రయత్నం చేశాను. వేమన ప్రాజెక్టులో ఆ తరహాలో పద్యాలు పాడాం. అది యువతకు నచ్చుతుంది.


సత్యసాయిబాబా మనసెలా గెలుచుకున్నారు?

దసరా సందర్భంగా నాటకం వేయడానికి హెచ్‌జే దొర గారు నన్ను పుట్టపర్తికి పిలిపించారు. బాబా ఏదో ఒక బహుమతి ఇస్తారని తోటివారందరూ అంటుండగా.. నాకేమో బ్రేస్‌లెట్‌ వేసుకోవాలని ఉందప్పుడు. బాబా ఆశీర్వచనం తీసుకుని నాటకం మొదలుపెట్టాం. మంచంపై పడుకుని.. దుర్యోధనుడి పద్యాలు అయిపోయాక నేను లేవాలి. కానీ, నేను పడుకొన్న కొద్ది సేపటికే.. నా శరీరం గాల్లోకి లేచింది. నాకు ఒక్కసారిగా భయం వేసింది. ఆ మరునాడు బాబా నాకు సన్మానం చేసి.. నేను మనస్సులో కోరుకున్నట్లే బ్రేస్‌లెట్‌ పెట్టారు.


సినిమా రంగంలో ఎందుకు ప్రయత్నం చేయలేదు?

నాకు గాత్ర సౌందర్యం ఉంది గానీ, శరీరం సౌందర్యం లేదు. నేను వేసే వేషాలు ఇప్పుడు సినిమాల్లో లేవు. కానీ, నేను వేస్తున్న నాటకాలను షూట్‌ చేయడం మొదలుపెట్టాను. అవి భావి తరాలకు అందుబాటులో ఉంటాయనేది నా ఆశ. ‘శ్రీనాథ’ నాటకాన్ని చిత్రీకరించి.. సీడీలు చేసి, అమెరికాలో అమ్మాను.


యోగి వేమన ప్రాజెక్టు వివరాలు?

యోగి వేమన ప్రాజెక్టు నా జీవిత లక్ష్యం. వేమన పద్యాలను సినిమా పాటల్లాగా రూపొందించాం. ఇలాంటి వాటిని సీరియళ్లలాగా చేసి.. టీవీల్లో ప్రదర్శించగలిగితే పద్యాలు ఎక్కువగా ప్రచారంలో ఉంటాయి. తర్వాత హరిశ్చంద్ర ప్రాజెక్టు చేపడుతున్నాం. అందులో పద్యాలన్నీ ఉంటాయి. వాటికి తోడు అబద్ధాలు ఆడడం వల్ల నష్టాలను హరిశ్చంద్రుడి వివరణలను జోడించనున్నాం. అందరి సహకారంతో.. త్వరలోనే దానిని చేపడతామనే ఆశ ఉంది.

Updated Date - 2020-02-07T19:32:55+05:30 IST