ఫోన్‌ చేసి గెస్ట్‌హౌజ్‌కు రమ్మనేవారు

ABN , First Publish Date - 2020-02-08T06:55:38+05:30 IST

‘జంబలకిడిపంబ’తో తెలుగుతెరకు పరిచయమై, ‘శుభలగ్నం’లో ‘ఏమిటో...’ డైలాగుతో అందర్నీ ఆకట్టుకున్న ఆమని ఎన్నో మంచి పాత్రలు పోషించి తనకంటూ ఓ ఇమేజ్‌ సృష్టించుకుంది.

ఫోన్‌ చేసి గెస్ట్‌హౌజ్‌కు రమ్మనేవారు

‘జంబలకిడిపంబ’తో తెలుగుతెరకు పరిచయమై, ‘శుభలగ్నం’లో ‘ఏమిటో...’ డైలాగుతో అందర్నీ ఆకట్టుకున్న ఆమని ఎన్నో మంచి పాత్రలు పోషించి తనకంటూ ఓ ఇమేజ్‌ సృష్టించుకుంది. కమర్షియల్‌ దర్శకులతో పాటు కళాత్మక దర్శకులైన బాపు, కె.విశ్వనాథ్‌లతో కూడా పనిచేసే అదృష్టం ఆమెకు దక్కింది. కెరీర్‌ పీక్‌లో ఉన్నప్పుడే హఠాత్తుగా ప్రేమపెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన ఆమని ఆ తర్వాత ‘ఆ నలుగురు’తో రీ ఎంట్రీ ఇచ్చింది. ‘నాతో ఎవరన్నా ప్రేమగా మాట్లాడితే వాళ్లను నమ్మేస్తాను. అది వాళ్లు అడ్వాంటేజ్‌గా తీసుకుంటారు. అలా కొందర్ని నమ్మి కోట్లు పోగొట్టుకున్నా’ అంటున్నారు ఆమని. ‘ఏబీఎన్‌- ఆంధ్రజ్యోతి’ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వేమూరి రాధా కృష్ణ ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో ఆమె వెలిబుచ్చిన అభిప్రాయాలు...

 ఆర్కే: చాలా రోజుల తరువాత రీ ఎంట్రీ ఇచ్చారు. ఎలా ఉంది?

ఆమని: చాలా సంతోషంగా ఉంది.


 ఆర్కే: హీరోయిన్‌గా పీక్‌ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఇంపార్టెన్స్‌ వేరుగా ఉంటుంది. ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేస్తున్న సమయంలో అంత ఇంపార్టెన్స్‌ ఉండదు. ఇండస్ట్రీలో అది సహజం. కానీ మానసికంగా ఏమనిపించదా?

ఆమని: ప్రొడ్యూసర్స్‌కి, డైరెక్టర్స్‌కి తెలుసు... మేం ఎన్ని సినిమాలు చేశాం, ఎలాంటి క్యారెక్టర్లు చేశామని! ఆ రెస్పెక్ట్‌ ఉంటుంది. యంగ్‌స్టర్స్‌కి తెలియదు. అందరూ అలా ఉన్నారని కూడా చెప్పలేం.

 

ఆర్కే: మీరు హీరోయిన్‌గా చేసిన సమయంలో మీ ముందుతరం వారిని ఎలా చూసేవారు?

ఆమని: చాలా గౌరవించేవాళ్లం. సీనియర్స్‌కి చాలా రెస్పెక్ట్‌ ఇచ్చేవాళ్లం.


ఆర్కే: రీ ఎంట్రీ తరువాత బిజీగానే ఉన్నారా?

ఆమని: బిజీగానే ఉన్నాను. మంచి మంచి క్యారెక్టర్స్‌ చేస్తున్నాను.

 

ఆర్కే: మీరు బాపు, విశ్వనాథ్‌ వంటి డైరెక్టర్లతో కలిసి పనిచేశారు. ఇప్పటి డైరెక్టర్లకు, వాళ్లకు ఏంటి తేడా?

ఆమని: వాళ్లు లెజెండ్స్‌. ఆ స్కూలే వేరు. వాళ్లతో సినిమా చేయడమనేది నా అదృష్టం.

 

ఆర్కే: వాళ్లు అప్పటికే టాప్‌ డైరెక్టర్స్‌. వాళ్లతో సినిమా అంటే భయం వేయలేదా? అది మేకప్‌ లేకుండా అంటే..?

ఆమని: చాలా భయమేసింది. ఎవ్వరికైనా మేకప్‌ లేకుండా చేయాలంటే దడ వచ్చేస్తుంది. ‘శుభసంకల్పం’ సినిమాకు పి.సి.శ్రీరామ్‌ కెమెరామ్యాన్‌. మొదటిరోజు అందరం మేకప్‌‌లోనే వెళ్లాం. షూటింగ్‌కు వెళ్లాక అందరినీ మేకప్‌ తీసేయమన్నారు. నాకైతే దడొచ్చేసింది. మేకప్‌ లేకుండా ఎలా చేయడమని. ప్రియారామన్‌ మంచి కలర్‌ ఉంది. కమల్‌హాసన్‌ గారు ఎప్పుడూ మేకప్‌ వేయరు. నేనే కలర్‌ తక్కువ. అప్పుడు కమల్‌హాసన్‌ గారే చెప్పారు. ‘మేకప్‌ తీయి. స్కిన్‌ ఎంత ట్యాన్‌ అయితే సినిమాలో అంత అందంగా కనిపిస్తావు చూడు’ అన్నారు. అంత సీనియర్‌ యాక్టర్‌ చెప్పినపుడు తీయకపోతే బాగుండదని తీసేశా.


 ఆర్కే: ఆ సినిమాలో ఒక సన్నివేశంలో నిజంగానే కొట్టారట కదా?

ఆమని: ఫస్ట్‌ డే షూటింగ్‌. పెద్ద డైరెక్టర్‌, పక్కన కమల్‌హాసన్‌ గారు. ఏమీ రావడం లేదు. డైరెక్టర్‌గారు కొట్టమన్నారు. రిహార్సల్‌ చేసే సమయంలో ఎవరినో నిలుచోబెట్టారు. అప్పుడు బాగానే చేశాను. ‘టేక్‌’ అనేసరికి ఫట్‌మని కొట్టేశాను. అప్పుడు పిలిచి ‘కొట్టడమంటే నిజంగా కొట్టకూడదు’ అని చిన్న పిల్లలకు చెప్పినట్టుగా చెప్పాడు.


ఆర్కే: అలాంటి అనుభవాలు మళ్లీ జరిగాయా?

ఆమని: లేదు. కానీ అదే సినిమాలో నేను చనిపోయిన సీన్‌ ఉంటుంది. పడవలో సముద్రంలోకి తీసుకెళతాడు. కెమెరా దూరంగా ఉంటుంది. కేరళలో తీశారు. ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఆ తీవ్రతకు కనురెప్పలు కదులుతున్నాయి. కమల్‌హాసన్‌గారేమో ‘నువ్వు చచ్చిపోయావు, కదలకూడదు’ అనేవారు. అలా మంచి మంచి ఎక్స్‌పీరియన్స్‌ ఆ సినిమాలో చాలా జరిగాయి. నా కాలి గోళ్లు కొద్దిగా పెరిగి ఉంటే ‘కట్‌ చేయమ’ని చెప్పారు. నేనేమో ‘ఈరోజు శుక్రవారం సర్‌, ఎలా?’ అన్నాను. ‘శుక్రవారం లేదు, ఏమీ లేదు కట్‌ చేయి’ అని కమల్‌హాసన్‌గారు చెప్పడంతో కట్‌ చేశాను. అలాంటి సెంటిమెంట్లు కూడా ఉండేవి.

 

ఆర్కే: కెరీర్‌ మంచి స్టేజ్‌లో ఉండగా పెళ్లెందుకు చేసుకున్నారు?

ఆమని: ఫేట్‌ అంటారు కదా! అది. ఎంతో మంది చెప్పారు. కానీ వినలేదు. ఎవ్వరు చెప్పినా వినిపించుకోలేదు. ఇప్పుడు లైఫ్‌లో ప్రాబ్లం ఏమీలేదు. కానీ ఇంకొన్ని సినిమాలు చేసుంటే బాగుండేది.

 

ఆర్కే: లవ్‌లో మీరే పడ్డారా?

ఆమని: ఆయన పడేశారు. ఆయన బిజినెస్‌మ్యాన్‌.

 

ఆర్కే: ఇంట్లో వాళ్లు ఒప్పుకున్నారా?

ఆమని: నేను సినిమాలు చేయాలని మా అమ్మ చాలా ఎంకరేజ్‌ చేసింది. ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్టేజ్‌కు వచ్చాం. వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ కష్టాలు కనిపించడం లేదా! ఇంత మంచి లైఫ్‌ నీకు దొరకదు అని అమ్మ గుర్తు చేసింది. కానీ అమ్మ మాటలు కూడా కేర్‌ చేయలేదు. అమ్మ చాలా ఫీలయింది. ఫైట్‌ చేసింది కూడా. చివరకు పెళ్లి చేసుకో... అయితే నటించు అంది. కానీ మా ఆయనకు నటించడం ఇష్టం లేదు.

 

ఆర్కే: మీ ఆయనకు పొసెసివ్‌నెస్‌ ఎక్కువనుకుంటా?

ఆమని: అవును. అయితే ఇప్పుడు మారారు. పిల్లలయ్యారు కదా!(నవ్వులు)

 

ఆర్కే: పెళ్లికి ముందే కండిషన్‌ పెట్టారా?

ఆమని: అవును. ఆ కండిషన్‌కు కూడా ఒప్పుకున్నాను. ఎలా ఒప్పుకున్నానో నాకే తెలియదు. ప్రేమ గుడ్డిది అంటారు కదా! ఒప్పుకోకుండా ఉంటే బాగుండేది కదా అని ఇప్పుడనిపిస్తుంది.

 

ఆర్కే: సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాలనేది మీ ఆలోచనా? మీ ఆయనదా?

ఆమని: నాదే. చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టంతో వచ్చాను. నటనంటే నాకు చాలా ఇష్టం. అదే విషయం ఆయనకు చెబితే ఓకే అన్నారు.

 

ఆర్కే: పిల్లలను ఎవరు చూసుకుంటారు?

ఆమని: అమ్మ చూసుకుంటుంది. నా కష్టాలతో మా అమ్మ ట్రావెల్‌ చేస్తూ ఉంటుంది. అమ్మ ఉంది కాబట్టే ధైర్యంగా వస్తున్నాను.


ఆర్కే: తెలుగమ్మాయివి చెన్నైకి వెళ్లాలనే ధైర్యం ఎలా వచ్చింది?

ఆమని: సినిమా అంటే పిచ్చి. మా నాన్నగారు డిస్ట్రిబ్యూటర్‌. ఆయనకేమో నేను సినిమాలకు వెళ్లడం ఇష్టంలేదు. పెళ్లి లేక చదువు రెండింటిలో ఏదో ఒకటి ఎంచుకో అన్నారు. నేనేమో సినిమా అని మంకుపట్టు పట్టాను. దాంతో ఓకే అన్నారు. అమ్మతో కలిసి చెన్నై వచ్చాను. నాన్న ఫ్రెండ్‌ చెన్నైలో ఉంటారు. వాళ్లింట్లో ఉన్నాం.


ఆర్కే: సినిమా కష్టాలు పడ్డారా?

ఆమని: ఫొటోజెనిక్‌ ఫేస్‌ ఉంది. ఫోటోలు చూస్తే ఓకే అంటారు. డైరెక్ట్‌గా చూస్తే నచ్చేవారు కాదు. దాంతో నాకు ఇంకా పట్టుదల ఎక్కువయింది. తమిళ్‌లో మొదటి సినిమా చేశాను. రెండోసినిమా తెలుగులో ‘జంబలకిడిపంబ’.

 

ఆర్కే: సినిమా అవకాశాలు వచ్చే వరకు ఆర్థిక ఇబ్బందులు ఎలా ఎదుర్కొన్నారు?

ఆమని: నాన్న ఉన్నంత వరకు ఇబ్బంది లేదు. తరువాత ఇబ్బంది పడ్డాం. అమ్మ తెలియనిచ్చేది కాదు. ఆ సమయంలోనే సినిమా అవకాశాలు వచ్చాయి.

 

ఆర్కే: ఇప్పుడు క్యాస్టింగ్‌ కౌచ్‌ కల్చర్‌ బాగా పెరిగిపోయిందంటున్నారు. అప్పట్లో కూడా ఉందా?

ఆమని: నాకు తెలిసి లేదు. కొన్ని కొత్త కంపెనీల్లో అలాంటివి ఎదురయ్యాయి. బాగున్నావు, ఓకే మా సినిమాలో తీసుకుంటాం అనే వారు. నెక్స్ట్‌ డే ఫోన్‌ చేసి గెస్ట్‌హౌజ్‌కు రండి. ఒకసారి మేకప్‌ టెస్ట్‌ చేసి చూద్దాం అనే వారు. గెస్ట్‌హౌజ్‌ అనగానే అర్థమయిపోయేది. ఇలాంటివన్నీ కొత్త కంపెనీలో ఉంటాయి. ప్రొఫెషనల్‌ కంపెనీల్లో కనిపించవు. సినిమాలు తీస్తారో కూడా తెలియని కంపెనీలు చాలా ఉంటాయి. అలాంటి వాటిల్లో జరుగుతూ ఉంటాయి.


ఆర్కే: జంబలకిడిపంబ సినిమా కథను చెప్పినప్పుడు ఏమనిపించింది?

ఆమని: కథ చెప్పలేదు. స్పాట్‌లో డైరెక్టర్‌గారు వచ్చి చెప్పారు. నువ్వు ఇప్పుడు సిగరెట్‌ తాగాలి అని సీన్‌ చెప్పారు. నేను ఒక్కసారి స్టన్‌ అయ్యాను. నిజంగా తాగాలా? అని అడిగాను. ఏం కాదమ్మా! రెండుసార్లు పీల్చి వదలాలి అన్నారు. బాగానే చేశాను.

 

ఆర్కే: ఈ సినిమాలో మీతో నటించిన నరేష్‌ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతారట? (ఫోన్‌లో...)

నరేష్‌: ఆమని... అందాల నటి, అందమైన నటి. ‘జంబలకిడిపంబ’ లో నాతో ఇంట్రడ్యూస్‌ అయ్యావు. మాస్‌ క్యారెక్టర్‌ చేశావు. ఆ తరువాత ‘చందమామ కథలు’ చేశావు. ఈ రెండు సినిమాల మధ్య కాలంలో నీకు నచ్చిన సినిమాలు ఏమున్నాయి? ఈ రెండు సినిమాల్లో నీకేదిష్టం?

ఆమని: నాకు ‘జంబలకిడిపంబ’ సినిమానే ఇష్టం. అందులో కమాండింగ్‌ ఇష్టం. హీరో గారికి సమానంగా రోల్‌ ఉంటుంది. ‘చందమామ కథల’తో పోల్చితే ‘జంబలకిడిపంబ’నే ఇష్టం. ‘భరత్‌ అనే నేను’ సినిమాలో కూడా మంచి రోల్‌ చేశాను. చాలా ఫోన్లు వచ్చాయి.

 

ఆర్కే: ‘శుభలగ్నం’ సినిమాలో నటనలో విశ్వరూపం చూపించావు. నిజంగా కూడా డబ్బు పిచ్చి ఉందా?

ఆమని: లేదు..లేదు(నవ్వులు). ఇప్పటికీ బయటకు వెళితే ‘ శుభలగ్నం’ సినిమాలో బాగా చేశారు మేడమ్‌ అంటుంటారు. డబ్బు కావాలనుకుంటే గ్లామర్‌ రోల్స్‌ ఎంచుకునే దాన్ని. మంచి పాత్రలు చేయాలి. నెగెటివ్‌ క్యారెక్టర్‌ అవుతుందని ముందు భయపడ్డాను. కానీ చాలా మంచి పేరు తెచ్చింది.

 

ఆర్కే: బయట అలాంటి వ్యక్తులను చూశారా?

ఆమని: చూశాను. డబ్బు వచ్చాక ఎలా మారిపోతారో, ఎలా ఓవర్‌యాక్ట్‌ చేస్తారో చూశాను.

 

ఆర్కే: ‘శుభలగ్నం’ సినిమా డైరెక్టర్‌ ఎస్‌.వి.కృష్ణారెడ్డిగారు మీతో మాట్లాడతారట? (ఫోన్‌లో...)

ఎస్‌.వి.కృష్ణారెడ్డి: ‘శుభలగ్నం’ సినిమా 25 సెప్టెంబర్‌ 1994లో విడుదలయింది. 23 సంవత్సరాల 9 నెలలయింది. ఇప్పుడు ఆ సినిమాను టీవీలో చూస్తున్నప్పుడు గానీ, కంప్యూటర్‌లో చూస్తున్నప్పుడు గానీ, ఏ రకంగా చూసినా నువ్వు ఎలా ఫీలవుతావు?

ఆమని: చాలా గర్వంగా ఫీలవుతాను. ఇది నేను చేశానా అనిపిస్తుంది. ‘ఏమిటో’ అన్న డైలాగ్‌ను చెప్పమని ఇప్పటికీ అడుగుతుంటారు.

 

ఆర్కే: బాగా గుర్తుండిపోయిన కాంప్లిమెంట్‌ చెప్పండి?

ఆమని: డైరెక్టర్‌ కృష్ణారెడ్డిగారిచ్చిన కాంప్లిమెంట్‌ ఎప్పటికీ మరిచిపోలేను. ‘మావిచిగురు’ సినిమాలో నేను చచ్చిపోయే సీన్‌ ఉంటుంది. ఆ సీన్‌ చేసినపుడు కృష్ణారెడ్డి గారొచ్చి ‘ఎంత బాగా చేశావమ్మా! చచ్చి నీ కడుపున పుట్టాలనుంది’ అన్నారు. ఆస్కార్‌ అవార్డు వచ్చినంత ఫీలయ్యాను. నేను కూడా ఏడ్చేశాను. శుభలగ్నం, మావిచిగురు, శుభసంకల్పం... ఇలాంటి మంచిమంచి సినిమాలు చేశాను కాబట్టే ఆడియన్స్‌ ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటారు.

 

ఆర్కే: హీరోయిన్‌గా పీక్‌ స్టేజ్‌లో ఉన్నప్పుడు మీరు డబ్బును ఎలా మేనేజ్‌ చేసుకునేవారు? ఎవరన్నా మిమ్మల్ని మోసం చేశారా?

ఆమని: అలాంటివి చాలా జరిగాయి సార్‌. కానీ... పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు. నేను షూటింగ్స్‌లో బిజీగా ఉండేదాన్ని. డబ్బు కంటే కూడా మంచి నటి అనిపించుకోవలనే తపన ఎక్కువ. కొన్నిసార్లు ఇంటికి వచ్చే టైమ్‌ కూడా ఉండేది కాదు. నాన్న చనిపోయారు. అమ్మకు అంతగా తెలియదు. తమ్ముడు చిన్నవాడు. ఇలా కోట్లల్లో పోయింది. అలా మోసం చేసిన వారందరూ మేనేజర్లు తదితర ఇండస్ర్టీవాళ్లే. చేజారిపోయినదాన్ని ఏమీ చేయలేం. ఉన్నదే దాచుకోవాలి కదా!

 

ఆర్కే: ‘మహానటి’ సినిమా చూసినప్పుడు మీ జీవితంలో జరిగిన అలాంటి ఘటనలు గుర్తుకు వచ్చాయా?

ఆమని: ఆర్టిస్టుగా అందులో నాకు చాలా కనెక్ట్‌ అయ్యాయి. ఎప్పుడూ వెంట ఉండే మేనేజరు ఆవిడ కళ్ల ముందే నిర్మాతైపోతాడు. నాకు కూడా అలానే జరిగింది (నవ్వు). ఏది ఏమైనా గతం గతః!

 

ఆర్కే: మీరు హీరోయిన్‌గా చేస్తున్నప్పుడే సావిత్రి గారి గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు కదా! మరి మీరెందుకు జాగ్రత్త పడలేదు?

ఆమని: సావిత్రి గారి గురించి నాకు ఇంత లోతుగా తెలియదు. ఆవిడ ఏవో సినిమాలు తీసి పోగొట్టుకున్నారని విన్నాను. నేను కూడా ఎక్కడో తప్పులో కాలేశాను (నవ్వు). నాతో ఎవరన్నా ప్రేమగా మాట్లాడితే వాళ్లను నమ్మేస్తాను. అది వాళ్లు అడ్వాంటేజ్‌గా తీసుకుంటారు. కానీ... ఫైనల్‌గా నేను దేవుడి మీద వదిలేస్తాను. దేవుడి మీద నమ్మకం ఎక్కువ.

 

ఆర్కే: ఏఏ సందర్భాల్లో దేవుడిని గుర్తుకు తెచ్చుకుంటారు?

ఆమని: అన్ని సందర్భాల్లో తలుచుకుంటా! బాధలోనే కాదు... ఎక్కువ సంతోషం వచ్చినప్పుడు కూడా వెళ్లి దేవుడి దగ్గరే ఏడుస్తాను. నా కష్టాలు, అనుభవంలో మనుషుల కంటే దేవుడు నాకు తోడున్నాడనేది నా నమ్మకం. నా కలర్‌, పర్సనాలిటీకి హీరోయిన్‌ అవ్వడమంటే అంత సులువు కాదు. కానీ... ఆ విషయాన్ని దేవుడికే వదిలేశా! అలాగే పెళ్లి, పిల్లల విషయంలో కూడా సమస్యలు వచ్చినప్పుడు కూడా భగవంతుడి పైనే భారం వేశాను. ఏ ఊరు వెళ్లినా అక్కడి గుళ్లకు వెళుతుంటా!

 

ఆర్కే: మరి మీ వారు క్రైస్తవుడు కదా! మరి ఎప్పుడు ఇబ్బందులు రాలేదా?

ఆమని: ఆయన్ని మార్చేశాను కదా (నవ్వు)! ఆయన పూర్తి నాన్‌వెజ్‌. కానీ... నా భక్తిని చూసి పరవశమైపోయి శనివారం ఆయన కూడా నాన్‌వెజ్‌ తినడం మానేశారు. చివరకు వెంకటేశ్వర స్వామి భక్తుడైపోయారు. ప్రతి శనివారం స్వామి గుడికి వెళతారు. నాకు వెంకన్నపై అమితమైన భక్తి.


ఆర్కే: బాపూ గారితో మీ అనుభవం?

ఆమని: ‘మిస్టర్‌ పెళ్లాం’ కోసం రాజేంద్ర ప్రసాద్‌ గారు నన్ను తీసుకువెళ్లి బాపూ గారికి పరిచయం చేశారు. బాపూ గారు మేకప్‌ టెస్ట్‌ కూడా ఏమీ లేకుండానే వెంటనే ఓకే చేశారు. నాకది మూడో సినిమా. ‘జంబలకిడిపంబ’కు పూర్తి విరుద్ధమైన చిత్రం అది. బాపూ గారి వద్ద నటన సహజంగా ఉండాలి. చేతులు ఎప్పుడు ఊపాలో అప్పుడే ఊపాలి. కూరగాయలు తరుగుతున్నామంటే కాలు కత్తిపీట మీద అలానే పెట్టాలి. ప్రతి ఫ్రేమూ ఒక భంగిమలా, బొమ్మలా ఇమిడిపోవాలి. తరువాత ఆయన స్కూల్‌కి అలవాటుపడిపోయాను. బాపూ గారు చాలా తక్కువ మాట్లాడతారు. సూక్ష్మంగా చెబుతారు... దాన్ని వెంటనే పట్టేసుకోవాలి. అనుకున్న స్థాయిలో నటించకపోతే ఆయన ఫేస్‌ డల్‌ అయిపోతుంది. కానీ తిట్టరు... అరవరు. అదే బాగా చేస్తే ఎంతో అభినందిస్తారు.

 

ఆర్కే: విశ్వనాథ్‌ గారితో చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది?

ఆమని: ఆయన స్కూలు ఇంకా డిఫరెంట్‌. ఎలా చెయ్యాలో ఫస్ట్‌ ఆయన చేసి చూపిస్తారు. లైటింగ్‌ సెట్‌ చేసుకునే దాకా రిహార్సల్స్‌ చేయిస్తూనే ఉంటారు. కమల్‌హాసన్‌ లాంటి పెద్ద హీరోతో కూడా ఆయన అలానే చేయిస్తారు. అందుకు కమల్‌ గారు కూడా ఏమీ ఫీలవ్వరు. ఎంత బాగా నటించినా ‘బాగా చేశావు... ఆహా... ఓహో’ అనే ప్రశంసలేవీ ఉండవు. ఆయన టేక్‌ ఓకే చేశారంటేనే చాలా బాగా వచ్చినట్టు (నవ్వు)!

 

ఆర్కే: హీరో జగపతిబాబు మిమ్మల్ని ఏదో అడగాలనుకుంటున్నారు... (ఫోన్‌లో...)

జగపతిబాబు: సింపుల్‌ లుకింగ్‌ గర్ల్‌ విత్‌ ఎక్స్‌ట్రార్డినరీ టాలెంట్‌ ఈజ్‌ ఆమని. నా మొదటి ప్రశ్న... ఓ షూటింగ్‌లో నువ్వు రాగానే యూనిట్‌ అంతా ‘అబ్బో అబ్బో దీని తొట్టి ముట్టుకుంటె ఎంత జిల్లు అంటదో..’ అని పాడింది. ఎందుకు? రెండోది... ‘బాబు గారు’ అని నన్ను మాత్రమే పిలుస్తావా? అందర్నీనా?

ఆమని: పాతవన్నీ గుర్తు చేశారు. ‘బాబు గారు’ అని ఆయన్నే పిలుస్తా. ఎందుకో తెలీదు. జగపతిబాబు గారు, అలీగారితో ‘తీర్పు’ సినిమా చేశాను. అప్పుడు నేను బాగా యంగ్‌. ఆర్టిస్టులందరం గోల గోల చేశాం. అప్పటి నుంచే ‘బాబు గారు’ అని పిలవడం అలవాటైపోయింది. సౌందర్య, నేను బెస్ట్‌ ఫ్రెండ్స్‌. తను కూడా అలానే పిలిచేది. ఇక ఫస్ట్‌ కొశ్చన్‌కి ఆన్సర్‌ నాకు తెలియదు. ఈ మధ్యే ఆయనతో ‘పటేల్‌ సార్‌’ చేశాను. అప్పుడు కూడా నన్ను చూసినప్పుడల్లా ఆయన ఆ పాట పాడారు. నన్ను ఎప్పుడూ ఆయన ‘తొట్టి’ అనేవారు (నవ్వు). ఆయనతో బాగా ఎక్కువ చనువు. ఫ్రెండ్లీగా ఉంటాం. హిట్‌ పెయిర్‌ కూడా మాది. ఊటీలో మేమంతా అర్ధరాత్రి రోడ్డు మీద నడుస్తూ, పాటలు పాడుకుంటూ ఎంజాయ్‌ చేసేవాళ్లం. ఇప్పుడలా ఎవరూ ఉండటం లేదు. షూటింగ్‌ అయిపోగానే ఎవరి దారి వారిది. ‘పటేల్‌ సార్‌’ చేసినప్పుడు కూడా పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాం.

 

ఆర్కే: ఇప్పుడు జగపతిబాబుది కూడా రెండో ఇన్నింగ్సే! విలన్‌, క్యారెక్టర్‌ ఆర్టి్‌స్టగా పీక్‌లో ఉన్నారు!

ఆమని: అవును సార్‌. అప్పటి కంటే ఇప్పుడా చాలా బాగా చేస్తున్నారు. చూస్తుంటే ‘జగపతిబాబుగారేనా చేస్తుంది’ అనిపిస్తోంది. ‘రంగస్థలం’ చూశాను. ఆయన నటన ఫెంటాస్టిక్‌.

 

ఆర్కే: మీకు సౌందర్యతో అంత స్నేహం ఎలా కుదిరింది?

ఆమని: తను, నేను కన్నడ. అలా కనెక్ట్‌ అయ్యాం. ఇద్దరం కలిసి మూడు నాలుగు సినిమాలు చేశాం. షాట్‌ అయిపోగానే ఇద్దరం కూర్చొని కన్నడ, తెలుగు పాటలు పాడుకునేవాళ్లం. అలా బెస్ట్‌ ఫ్రెండ్స్‌ అయ్యాం. తనకు నేనంటే... నాకు తనంటే చాలా ఇష్టం. వాళ్ల అమ్మ, నాన్న, సోదరుడు అమర్‌ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు.

 

ఆర్కే: ఆవిడ కూడా కెరీర్‌ పీక్‌లో పెళ్లి చేసుకున్నారు?

ఆమని: ఫేట్‌ అంతే! అయితే పెళ్లి విషయంలో తను బాగా ఆలోచించే చేసుకుంది. మంచి నిర్ణయం తీసుకుంది. కానీ దేవుడు ఆవిడ తల రాతను మార్చేశాడు. ఎవరికి ఎంత ప్రాప్తం ఉందో అంతే!

 

ఆర్కే: ఇంత చిన్న వయసుకే మీకు అంత ఆధ్యాత్మికత ఎలా వచ్చింది?

ఆమని: చిన్నప్పటి నుంచే నాకు దేవుడంటే ఇష్టం. ఏడెనిమిది ఏళ్లప్పుడే ఇంట్లో పూజలు చేసేదాన్ని. ఇంట్లో అందరూ అనేవారు... ‘ఇది సన్యాసి అయిపోతుంది’ అని (నవ్వు). దీపం పెట్టకుండా అన్నం తినను. చిన్నప్పుడే ఉపవాసాలు ఉండేదాన్ని. అమ్మ కూడా తిట్టేది... ‘ఈ వయసులో ఎందుకే ఇవన్నీ’ అని!

 

ఆర్కే: ఆమనిలో నటన ఉందని ప్రారంభంలో ఎవరూ గుర్తించలేదు కదా!

ఆమని: లేదు సార్‌. ‘జంబలకిడిపంబ’కు డైరెక్టర్‌ ఫొటోస్‌ చూసి ఓకే చేశారు. కానీ... ప్రత్యక్షంగా చూసి కాస్త అప్‌సెట్‌ అయ్యారు (నవ్వు). వెంటనే వీడియో టెస్ట్‌ చేశారు. దాంతో ఆయనకు డబుల్‌ ఓకే అయింది. ఫస్ట్‌ డే నేను నటించినప్పుడు డైరెక్టర్‌ బాగా ఇంప్రెస్‌ అయ్యారు. సెకండ్‌ టేక్‌లు తీసుకుంది చాలా చాలా తక్కువ.

 

ఆర్కే: ఇప్పుడు నరేశ్‌ను గానీ, జగపతిబాబును గానీ చూస్తుంటే వీళ్లలో ఇంతటి నటనుందా అనిపిస్తుంది కదా! అన్ని భావాలు పలికించగలిగే వారు ఎంత మంది ఉన్నారిప్పుడు!

ఆమని: అవును. ఉన్నారు. కానీ పర్సెంటేజ్‌ తక్కువ. ఇప్పుడు అంతా గ్లామరస్‌ అయిపోయింది.

 

ఆర్కే: ఇప్పుడు హీరోల సినిమాలపై మీకు సంతృప్తి ఉందా?

ఆమని: ప్రస్తుత జనరేషన్‌ డ్యాన్స్‌లు, ఫైట్స్‌, మాస్‌ సినిమాలే ఇష్టపడుతున్నారు. ఇందులో హీరోలను తప్పు పట్టకూడదు. ప్రేక్షకులు ఏం కోరుకుంటున్నారో, దర్శకులు ఏం చెబుతున్నారో అవే చేస్తున్నారు.

 

ఆర్కే: పిల్లలు ఎంతమంది?

ఆమని: ఇద్దరు. అమ్మాయి... అబ్బాయి.

 

ఆర్కే: మీ వారితో మధ్యలో మనస్పర్థలు వచ్చాయట కదా!

ఆమని: అలాంటివేమీ లేవు. సినిమాల గురించే వచ్చాయి. తరువాత ఆయన చేసుకోమన్నారు. కానీ నేనే బ్రేక్‌ తీసుకున్నా. సినిమాలు చేయవద్దని ఆయన పెట్టిన కండిషన్‌కు ఒప్పుకునే కదా పెళ్లి చేసుకున్నాను. కాకపోతే ఎప్పుడూ లైట్లు, ఫ్లయిట్స్‌... కెమెరా... గ్లామర్‌గా ఉండే నాకు ఫ్యామిలీ లైఫ్‌కు అలవాటు పడటానికి కొంచెం సమయం పట్టింది.

 

ఆర్కే: సినిమా ఇండస్ర్టీలో అవమానాలేమైనా ఎదురయ్యాయా?

ఆమని: అలాంటివేమీ లేవు సార్‌. కాకపోతే నన్ను చూసిన తరువాత ‘ఆలోచించి చెబుతాం’ అంటే చాలు కదా! అంతకంటే అవమానం ఏం కావాలి (నవ్వు)? అలాంటివి ఎదుర్కొన్నాను.


ఆర్కే: ఒక్క చిరంజీవి, వెంకటేశ్‌తో చేయలేదు కదా! ఆ లోటు అలాగే ఉందా?

ఆమని: అవును. చిరంజీవి గారితో సినిమా చెయ్యాల్సింది. ఎందుకో మిస్సయింది. పాలిటిక్స్‌ ఏమన్నా జరిగాయేమో తెలియదు. నా ఫేవరెట్‌ హీరో. ఆయనతో చేయలేదనే లోటు చాలా ఉంది. వెంకటేశ్‌ బాబుగారితో చేసే అవకాశం రాలేదు. ఆయనన్నా చాలా ఇష్టం.

 

ఆర్కే: ఆమనిలో గ్లామరస్‌ తల్లిగా కాకుండా గొప్ప నటిని మళ్లీ చూడాలని కోరుకుంటూ థాంక్యూ.

ఆమని: థ్యాంక్యూ సార్‌. థ్యాంక్యూ వెరీమచ్‌.


నా బలం

ఆత్మవిశ్వాసం.

బలహీనత

ఎవరన్నా ప్రేమగా మాట్లాడితే నా బాధలు చెప్పుకుంటాను. నమ్మేస్తాను. ఎక్కడో అక్కడ మోసపోతాను. అది నా బలహీనత. ఇప్పటికీ అలాంటివి ఎదురవుతూనే ఉన్నాయి. బంధువులను కూడా నమ్మి కొంత పోగొట్టుకున్నా. దేవుడి దయవల్ల ఇప్పుడు ఆర్థికంగా బాగున్నాను. మా వారిది చెన్నైలో మార్బుల్‌, గ్రనైట్‌ బిజినెస్‌. ఇండస్ర్టీతో అసలు సంబంధం లేదు.

 

ఈతరం నటులకు సందేశం..

వాళ్లు మాకు సలహాలిచ్చే స్టేజ్‌లో ఉన్నారు (నవ్వు). నేను చెప్పేది ఒక్కటే... సీనియర్‌ ఆర్టిస్టులకు కనీస గౌరవం ఇవ్వాలి. మా అంతట మేమే వెళ్లి గుడ్‌మార్నింగ్‌ అంటూ విష్‌ చేసినా కూడా కొందరు పట్టించుకోకుండా వెళ్లిపోతుంటారు. కృష్ణారెడ్డి గారైతే పెళ్లి తరువాత కూడా ఫోన్‌ చేసి సినిమాలు చేయమని చాలాసార్లు అడిగారు. అలాంటి మంచి డైరెక్టర్లు, నిర్మాతలు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, బాబు గారు, నరేశ్‌ గారు వంటి వాళ్లందరితో నటించిన నాకు ఇప్పుడు ఇలాంటి సంఘటనలు ఎదురైతే బాధగా అనిపిస్తుంది.

 

ఆ క్రెడిట్‌ ఆయనకే వెళ్లాలి

రాజేంద్రప్రసాద్‌ ఇండస్ర్టీలో నాకు తోడుగా నిలబడ్డారు. నిజం చెప్పాలంటే ‘మిస్టర్‌ పెళ్లాం’ సినిమా క్రెడిట్‌ ఆయనకే వెళ్లాలి. తరువాత సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ‘ఆ నలుగురు’ సినిమా కోసం డైరెక్టర్‌ ఫోన్‌ చేశారు. ఆ క్యారెక్టర్‌కి భానుప్రియను అనుకుంటే డేట్స్‌ దొరకలేదట. అందుకే నన్ను తీసుకోమని రాజేంద్రప్రసాద్‌గారు చెప్పారట. షూటింగ్‌కు వెళ్లినప్పుడు ‘ఏంటమ్మా మొదట చేయనన్నావట’ అని ఆయన అడిగారు. నాకేమో అప్పుడే తల్లి పాత్రలు వేయడమంటే ఇష్టం లేదు. కానీ... ఇంపార్టెన్స్‌ ఉన్న క్యారెక్టర్‌ కావడంతో చేశాను. మీరు చెప్పినట్టు ఇప్పటి సినిమాల్లో గ్లామరస్‌ మదర్స్‌ వస్తున్నారు. జుట్టుకు తెల్ల రంగు వేయడం లాంటివేమీ లేవు (నవ్వు). ‘ఎంసీఏ’లో ‘శుభలగ్నం’లో నా రోల్‌ లాంటిదే ఇక్కడా క్రియేట్‌ చేశారని దిల్‌ రాజు గారు చెప్పారు. అలా అందులో చేశాను.

Updated Date - 2020-02-08T06:55:38+05:30 IST