‘అయ్య బాబోయ్‌.. చూడు ఈమె అమలానే’ అన్నారు

ABN , First Publish Date - 2020-02-08T07:02:36+05:30 IST

అమల, నాగార్జున సినిమాల్లో ఎంత మెచ్యూర్డ్‌గా నటిస్తారో.. నిజ జీవితంలోను వీరిద్దరూ అంత విశాల దృక్పథంతోనే కనిపిస్తారు. ఎవరి ఇండివిడ్యువాలిటీ వారికుంది. కాని వారి అనుబంధానికి ఇవేవీ అడ్డురాలేదు.

‘అయ్య బాబోయ్‌.. చూడు ఈమె అమలానే’ అన్నారు

అమల, నాగార్జున సినిమాల్లో ఎంత మెచ్యూర్డ్‌గా నటిస్తారో.. నిజ జీవితంలోను వీరిద్దరూ అంత విశాల దృక్పథంతోనే కనిపిస్తారు. ఎవరి ఇండివిడ్యువాలిటీ వారికుంది. కాని వారి అనుబంధానికి ఇవేవీ అడ్డురాలేదు. సున్నిత మనస్కురాలైన అమల.. కుటుంబ నేపథ్యం, నాగార్జునను పెళ్లి చేసుకున్నాక సాగిన ప్రయాణం, పిల్లలతో అనుబంధం, జంతుప్రేమ, ఫిల్మ్‌స్కూల్‌ బాధ్యతలు.. వంటి విషయాలన్నీ మనసు విప్పి మాట్లాడారు. ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ కోసం ఎబీఎన్‌ ఎండీ వేమూరి రాధాకృష్ణ చేసిన ఇంటర్వ్యూ 10-8-15న ఏబీఎనలో ప్రసారమయింది.. ఆ వివరాలు...


ఆర్కే : నాగార్జున, మీరు ఫిట్‌నెస్‌ విషయంలో పోటీ పడుతుంటారా? అసలు మీ బ్యూటీ సీక్రెట్‌ ఏంటి?

అమల : స్వీట్స్‌, డిజర్ట్స్‌కు దూరంగా ఉంటాను. ఎక్సర్‌సైజ్‌లు చేస్తాను. ఆయన తెల్లవారుజామునే నిద్రలేచి జిమ్‌ చేసి షూటింగ్‌కి వెళ్లిపోతారు. తర్వాత నేను జిమ్‌ చేస్తాను. యోగా చేస్తాను. వాకింగ్‌ కూడా చేస్తాను. సీజన్‌ను బట్టి రకరకాల ఫిజికల్‌ యాక్టివిటీస్‌ చేస్తాను. ఇలా చేయటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది.


ఆర్కే : నిజ జీవితంలోనూ మీ లైఫ్‌ బ్యూటిఫుల్‌ అంటుంటారు. ఇది నిజమేనా?

అమల : మీరన్నది నిజమే. బి హైండ్‌ ద సీన్స్‌ మై లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌. అందుకే ఎక్కువ సినిమాల్లో నటించాలని అనిపించలేదు. ఐ యామ్‌ వండర్‌ఫుల్‌ శాటి్‌సఫైడ్‌.


ఆర్కే : మీ ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు ఎక్కడా కనిపించవు. అసలు మీలో ఎవరి గొప్పదనం ఎక్కువగా ఉంది?

అమల : ఒకరికొకరం బాగా అర్థం చేసుకుంటాం. ఆయన విషయంలో ఆయన సా్ట్రంగ్‌, నా విషయంలో నేను సా్ట్రంగ్‌. మా మధ్య ఈగోలు, డామినేషన్లు లేవు. పైగా మెచ్యూరిటీ మైండ్స్‌ కాబట్టి సమస్యలేం రావు. వాతావరణంలో మార్పులు వచ్చినపుడు ఆయనకు అలర్జీలు వస్తుంటాయి. అప్పుడు ఆయన్ని బాగా చూసుకుంటాను. నాకు సమస్యలొస్తే ఆయన దగ్గరుండి నన్ను చూసుకుంటారు.


ఆర్కే : మీ కుటుంబ నేపథ్యం ఏంటి?

అమల : అమ్మ ఐర్లాండ్‌ దేశస్థురాలు. మా నాన్న బంగ్లాదేశ్‌కు చెందినవారు. అయితే బెంగాల్‌ విడిపోయాక ఇండియాలోని పశ్చిమబెంగాల్‌కు వచ్చారు. నాన్న నేవీ. ట్రావెలింగ్‌లో ఎక్కువగా ఉండేవారు. నేను తొలిసారిగా క్లాసికల్‌ డ్యాన్స్‌ను చూసినపుడు ప్రపంచంలో ఇంతకంటే గొప్ప ఆర్ట్‌ ఏమీ ఉండదు అనిపించింది. తెల్లవారుజామున మూడున్నర గంటల నుండి ఐదు గంటల వరకూ డ్యాన్స్‌ నేర్చుకునేదాన్ని. ఆ తర్వాత క్లాసికల్‌ డ్యాన్స్‌ బాగా నేర్చుకోవాలనుకున్నా. అలా నేను ఎనిమిది ఏళ్ల వయస్సులోనే కళాక్షేత్రలో చేరతానని అమ్మను అడిగాను. సరే అంది అమ్మ. మా ఇంట్లో అంతటి ఫ్రీడం ఉండేది. అలా నేను చిన్నప్పటినుంచే వెరీ ఇండిపెండెంట్‌.


ఆర్కే : మీ పేరెంట్స్‌ది లవ్‌ మ్యారేజా? మీ పేరు ఎవరు పెట్టారు?

అమల : అవును. వారిద్దరిదీ ప్రేమవివాహం. అమ్మా, నాన్న ఇద్దరూ ఆలోచించి నా పేరు పెట్టారు. వాస్తవానికి అమల బెంగాలీ పేరు. సంస్కృత పదం కాబట్టి ఆల్‌ ఇండియాకు నా పేరు కనెక్ట్‌ అవుతుంది. నేషనల్‌ ఇంటిగ్రిటీ అన్నమాట.


ఆర్కే : సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారు? అసలు తొలి అవకాశం ఎలా వచ్చింది?

అమల : సినిమాల్లోకి రాకముందు చెన్నైలో ‘కళాక్షేత్ర కాలేజ్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌’ లో చదివాను. కళాక్షేత్రలో ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌ నేర్చుకున్నా. రుక్మిణిదేవి అరుంగళ్‌ అనే ఫేమస్‌ ఆర్టిస్ట్‌ స్థాపించిన ఇన్‌స్టిట్యూట్‌లో భరతనాట్యం అభ్యసించాను. పదమూడేళ్ల వయసులోనే క్లాసికల్‌ డ్యాన్స్‌ స్టేజ్‌ షోలు ఇవ్వడానికి డ్యాన్స్‌ ట్రూప్‌తో కలిసి ఇండియా అంతా తిరిగాను. విదేశాలకూ వెళ్లాను. అలా ఓ స్టేజ్‌ పెర్ఫార్మెన్స్‌ ఇస్తుండగా దర్శకుడు టి.రాజేందర్‌ గారు చూసి ‘మా సినిమాలో హీరోయిన్‌ క్లాసికల్‌ డ్యాన్సర్‌ అయ్యుండాలి. మీరు అయితే బావుంటుంది, చేస్తారా?’ అని అడిగారు. అలా సినిమాల్లో తొలి అవకాశం వచ్చింది.


ఆర్కే : వెంటనే ఒప్పుకున్నారా?

అమల : నటన ఎలా ఉంటుందో చూద్దామని తెలుసుకోవటానికి ఓకే అన్నాను. డ్యాన్స్‌ బాగా వచ్చిన నేను క్లాసికల్‌ డ్యాన్సర్‌ రోల్‌ చేయటానికి ఇబ్బంది పడలేదు. తొలి చిత్రం అయినా షూటింగ్‌లో చాలా కంఫర్ట్‌గా ఫీలయ్యాను. డ్యాన్స్‌ కంటే నటనే ఈజీ అనిపించింది.


ఆర్కే : సినిమాలో కథానాయిక అంటూనే మీ పేరెంట్స్‌ ఒప్పుకున్నారా? ఏమన్నారు?

అమల : మంచి నిర్ణయాలు తీసుకుంటాను కాబట్టే మా పేరెంట్స్‌ నా నిర్ణయాన్ని గౌరవిస్తారు. సినిమా ఫీల్డ్‌లోకి వెళ్తానంటే వారు కాదనలేదు.


ఆర్కే : మీ సినిమా బ్యాక్‌గ్రౌండ్‌ గురించి చెప్పండి?

అమల : నేను ఐదు భాషల్లో సినిమాలు చేశాను. తమిళంలో ఎక్కువగా 22 చిత్రాల్లో నటించాను. కన్నడంలో కొన్ని చిత్రాలు చేశాను. నాలుగు మళయాలం, ఎనిమిది తెలుగు, ఐదు హిందీ చిత్రాల్లో నటించాను. మొత్తం 54 సినిమాల్లో నటించాను. మీకో విషయం తెలుసా.. చిన్నప్పటి నుంచి మూవీస్‌ చేసే వరకూ నేను హాస్టల్స్‌లోనే జీవితం గడిపాను. నా సొంత ఖర్చులకు నేనే డబ్బులు సంపాదించుకునేదాన్ని.


ఆర్కే : సినిమా హీరోను పెళ్లి చేసుకోవటానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు కదా? మీకేం అనిపించలేదా?

అమల : నా చుట్టూ ఎవరూ లేరు అలా ఆలోచించడానికి. మీరు సినిమా హీరో గురించి అలా మాట్లాడితే సినిమా హీరోయిన్‌ గురించి ఎలా మాట్లాడతారు చెప్పండి? నేనూ హీరోయిన్నే కదా. అవన్నీ నిజం కాదని తెలుసు. అందుకే అలాంటి ఆలోచనలు లేవు. 


ఆర్కే : పెళ్లయ్యాక సినిమాలెందుకు మానేశారు?

అమల : పదమూడేళ్ల నుంచీ నా లైఫ్‌ బిజీ. ఆ వయసులో రెండు గంటల పెర్ఫార్మెన్స్‌ కోసం నాలుగైదు గంటలు రిహార్సల్స్‌ చేసేదాన్ని. వివిధ ప్రాంతాలు తిరగటం.. తర్వాత హీరోయిన్‌ అయ్యాక షూటింగ్‌లతో బిజీ కావటం వల్ల నాకు ఫ్రెండ్స్‌తో, కుటుంబంతో గడపడానికి సమయమే లేదు. అలా అప్పటికే చాలా అలసిపోయాను. అందుకే పెళ్లయ్యాక ‘నేను రేపటి నుంచి షూటింగ్‌కు రానవసరం లేదా? అని నాగార్జునను అడిగాను. ఆయన ఓ నవ్వు నవ్వి, ‘అవసరం లేదు. నీ ఇష్టం. నువ్వు ఏది చేయాలనుకుంటే అది చేయ్‌’ అన్నారు. ఒక లాంగ్‌ హాలిడే తీస్కుందామని నేను ఏ సినిమా ఒప్పుకోలేదు. ఆ లాంగ్‌ హాలిడే ట్వంటీ ఇయర్స్‌ అయ్యింది (నవ్వులు).


ఆర్కే : జంతువులపై ప్రేమ ఎలా కలిగింది?

అమల : ఆరేళ్ల వయసులో నేను గాయపడిన కాకిని కాపాడాను. రెక్కలు విరిగాయి. ఈకలు ఊడిపోయాయి. రక్తం బాగా కారుతోంది. ఆ కాకిని ఇంటికి తీసుకెళ్లాను. సాధారణంగా అయితే బయటపడేయ్‌ అంటారు పెద్దలు. అయితే మా అమ్మ అలా కాదు. అమ్మా .. తీసుకొచ్చావా? అంది. నాకో బాక్స్‌ ఇచ్చింది. దాన్ని ఎలా చూసుకోవాలో చెప్పింది. అంతే కానీ తిట్టలేదు. అదీ ఆమె గొప్పదనం. నేను హైదరాబాద్‌లో ఓ రోజు కారులో వెళ్తుంటే ట్రక్‌ కింద పడిన కుక్కను చూశాను. వెంటనే ఇంటికి తీసుకొచ్చాను. అప్పుడు హైదరాబాద్‌లో యానిమల్‌ రెస్క్యూ సర్వీస్‌ లేదు. ఆ తర్వాత తీవ్రంగా గాయపడిన ఎద్దు, ఎనుము ఇంటికి తీసుకొచ్చాం. గాడిద, బ్లైండ్‌ ముంగీస, కుక్క పిల్లలు, కుందేళ్లు, పిల్లి పిల్లలు, గద్దలు, పావురాలు, గుడ్లగూబ.. ఇలా మా ఇంట్లో ఒక నెలలో గాయపడిన జంతువులు 60 చేరాయి. మా ఇల్లే పక్షులకు, జంతువులకు షెల్టర్‌గా ఉండేది. ఒక రోజు నాగార్జున ఇంటికి వచ్చారు. పెద్ద గేదె గరాజ్‌లో ఉంది.


ఆర్కే : అప్పుడు కార్‌ పార్క్‌ చేయటానికి స్థలం లేదా?

అమల : (నవ్వులు) లేదు. రోడ్‌ మీద పార్క్‌ చేశారు. ఆయన ఇంట్లోకి వచ్చి ‘సరే అమలా.. నువ్వు చేసేది చాలా బావుంది. కానీ ఇల్లే జూ అయిపోయింది. కొంచెం ఆర్గనైజ్డ్‌గా చేయవచ్చు కదా. సిటీ కోసం ఏదైనా చేయాలంటే..’ అని అన్నారు. అలా ఆయన తొలిసారి నాకు ఐడియా ఇచ్చారు.


ఆర్కే : మీ వారు ఎప్పుడూ విసుక్కోలేదంటారా?

అమల : విసుక్కోలేదు. ఆయన ఇచ్చిన ఐడియా ఆలోచింపచేసింది. ఆ తర్వాతే నేను జంతువుల కోసం ఏదైనా చేద్దామని చెన్నైకి వెళ్లి అక్కడ బ్లూక్రాస్‌ ఆఫ్‌ ఇండియాలో శిక్షణ పొందాను. జంతువుల కోసం సంస్థను స్థాపించాను. అలా అప్పటి నుంచి ఇప్పటి వరకూ జంతువులను చూసుకుంటున్నా. ఈ 23 సంవత్సరాలలో దాదాపు 4 లక్షల 50 వేల జంతువులకు సహాయం చేయగలిగాం. మాకు 600 మంది వాలెంటీర్లు, శ్రేయోభిలాషులు ఉన్నారు.


ఆర్కే : మీ సంస్థకు ఫండ్స్‌ ఎలా వస్తాయి?

అమల : మా అమ్మ నాకు ఓ విషయం నేర్పించింది. ‘యు మేక్‌ యువర్‌ కోట్‌ అకార్డింగ్‌ ద క్లాత్‌ అవైలబుల్‌’. బోలెడంత డబ్బు వచ్చిన తర్వాత నేను అది చేస్తాను అని చెప్పను. ఇప్పుడెంత డబ్బు ఉంది అని చూసుకొని పనిలోకి దిగే నేచర్‌ నాది. తొలిసారి బ్లూక్రాస్‌ హాస్పిటల్‌ కట్టాలంటే 75 లక్షలు అవసరమవుతాయన్నారు. ఆ సమయంలో నా దగ్గర ఏడు లక్షలే ఉంది. ఆ సొమ్ముతో ఎబిసి సెంటర్‌ స్టార్ట్‌ చేశాం. తర్వాత ప్రతీ నెల 500 కుక్కలకు స్టెరిలైజేషన్‌ మొదలుపెట్టాం. ఆ తర్వాత మున్సిపాలిటీ, యానిమల్‌ వెల్ఫేర్‌ బోర్డులు మా ముందుకు వచ్చాయి. ఇప్పుడు హైదరాబాద్‌లో 5 స్టెరిలైజేషన్‌ యూనిట్స్‌ ఉన్నాయి. సంవత్సరానికి లక్షల కుక్కల్ని స్టెరిలైజేషన్‌ చేస్తున్నాం. నేను చెప్పేదేంటంటే ముందు పని పట్ల నమ్మకముండాలి.


ఆర్కే : ఇప్పుడు మీ పేరెంట్స్‌ ఏం చేస్తున్నారు?

అమల : మా అమ్మ నాతోనే ఉంది. మా నాన్న వయస్సు 80 యేళ్లు. ముంబైలో ఇప్పటికీ నేవీలో పనిచేస్తారు. అందుకే జెనటిక్‌గా కూడా నేను స్ట్రాంగ్‌ (నవ్వులు).


ఆర్కే : బిజినెస్‌లో మీరు ఇన్వాల్వ్‌ అవుతుంటారా?

అమల : కొన్ని ఆర్గనైజేషన్స్‌తోపాటు బ్లూక్రా్‌సలోను ఇన్వాల్వ్‌ అవుతుంటాను. ప్రస్తుతం ఫిల్మ్‌స్కూల్‌ వ్యవహారాలు చూసుకుంటున్నాను. స్కూల్‌లో రెండొందల మంది విద్యార్థులు ఉన్నారు. నేను ఎప్పటి నుంచో బ్లూక్రా్‌సతో పాటు మరికొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తూనే ఉన్నాను. కాబట్టి ఆయన నన్ను స్కూల్‌ మీద దృష్టి పెట్టమన్నారు. నాకు కూడా ఆసక్తి ఏర్పడింది. మా ఫిల్మ్‌స్కూల్‌లో ఫీజులు అధికంగానే ఉన్నాయి. ఇక్కడున్న క్వాలిటీ అలాంటిది. అంతర్జాతీయ స్టాండర్స్‌తో నిర్వహిస్తున్నాం. ఫీజు పదహారు లక్షలు. ఇక్కడ ఈ ఫీజు అధికమే కావొచ్చు. న్యూయార్క్‌, కాలిఫోర్నియాలలో ఇదే కోర్సు చేస్తే ఐదురెట్లు ఎక్కువ ఖర్చు అవుతుంది. దేశవ్యాప్తంగా అందరు విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు.


ఆర్కే : ఏఎన్నార్‌గారు నటించిన ‘మనం’ ఆఖరి సినిమా. అందులో నాగార్జున భార్యగా శ్రియ చేసింది. ఆ పాత్రను మీరు చేసుంటే బావుండేది కదా!

అమల : ఆ ఆలోచన రాలేదు. భార్యభర్తలిద్దరం సినిమాలో కలిసి పనిచేయాలన్న ఉద్దేశం లేదు. ఆశ కూడా లేదు. దర్శకుడు కూడా నన్ను అడగలేదు. నిజంగా చెప్పాలంటే ఒక బ్యూటిఫుల్‌ ఆర్ట్‌ పీస్‌ను తీసుకురావాలంటే పర్సనల్‌ ఫీలింగ్స్‌ను తీసుకురాకూడదు అన్నది నా అభిప్రాయం. అది మంచి సినిమా అవ్వాలి అంతేకాని.. అందులో మా బాబును పెట్టండి. నాకు అవకాశం ఇవ్వండి అని అడగడం బావుండదు.


ఆర్కే : మీ భవిష్యత్తు లక్ష్యం ఏమిటి?

అమల : ప్రస్తుతం ఫిల్మ్‌స్కూల్‌ అభివృద్ధిలోనే ఉన్నాను. ఇండియాలో దీన్ని నెంబర్‌వన్‌ ఫిల్మ్‌ స్కూల్‌గా తీర్చిదిద్దాలన్నదే నా లక్ష్యం. ప్రపంచ దేశాల నుంచి మా స్కూల్‌కు విద్యార్థులు రావాలన్నది నా ఆశ. అందుకోసం కృషి చేస్తున్నాను. ఫిల్మ్‌ అన్నది ఫ్యూచర్‌ ఇండసీ్ట్ర. టెలివిజన్‌ కోసం ఏడాది కోర్సును తయారుచేస్తున్నాం. భారత్‌లో టీవీరంగంలో మంచి ఉద్యోగావకాశాలు ఉన్నాయి. 


ఆర్కే : అఖిల్‌ సినిమాల్లోకి రాబోతున్నాడు కదా! మీరు ఒక తల్లిగా, నటిగా గైడెన్స్‌ ఇస్తున్నారా?

అమల : అతను చదువుకునేప్పుడు నన్ను అడిగేవాడు. సినిమాల్లో నటన గురించి, నా అనుభవాల గురించి. అప్పుడు నేను కొన్ని సలహాలు ఇచ్చాను. సినిమాలు, వ్యాపారం గురించి అన్నయ్య, తమ్ముడు కూర్చుని మాట్లాడుకుంటుంటారు. నేను ఆ విషయాల జోలికి వెళ్లను. నటన గురించి మాత్రమే మాట్లాడేదాన్ని. నటన అనేదానికి శిక్షణ అవసరం. ‘‘మీరు ఎంత కఠినమైన శిక్షణ తీసుకుంటే అంత మంచిది. సినిమాల్లో నటించడానికి ఎప్పుడు అవకాశం వచ్చినా మీరు రెడీగా ఉండాలి’’ అని మాత్రం పిల్లలకు చెప్పేదాన్ని. యు హ్యావ్‌ టు బీ రెడీ అన్నది ముఖ్యం.


ఆర్కే : అక్కినేని నాగేశ్వరరావుగారితో మీకు మంచి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయా?

అమల : మాకు పెళ్లి అయిన తరువాత ఒక రోజున డిన్నర్‌కు పిలిచారు. నిజంగా చెప్పాలంటే అప్పటికి - ఏఎన్నార్‌గారి గురించి సినిమాల్లో నటుడిగా తప్ప ఇంకేమీ తెలియదు. ఆయనకు స్టూడియో ఉందని, అవీఇవీ ఉన్నాయని తెలియదు. మా నాన్నగారికి ఏఎన్నార్‌గారి గురించి కొంత తెలుసు. నేను నాగార్జున గారిని పెళ్లి చేసుకుంటున్నాను అని నాన్నతో చెప్పినప్పుడు ఏఎన్నార్‌ గారు ఎంత పెద్ద నటులో చెప్పారప్పుడు. తొలినాళ్లలో.. ఏఎన్నార్‌గారిని నేను కలిసినప్పుడు.. చాలా ప్రశ్నలు అడిగేవారు. ఆయనకు కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఎక్కువ. ఊరికే కబుర్లు చెప్పరు.

 

ఆయనతో ఎవరు మాట్లాడినా.. వెరీ రిచ్చింగ్‌ కాన్వర్జేషన్స్‌ ఉండేవి. ఆయన ఇంట్లో ఉంటేనే ఒక మహానుభావుని వద్ద ఉంటున్నాము అనిపించేది. అక్కడ ఉన్నంతసేపు బెస్ట్‌ బిహేవియర్‌తో ఉంటాం. ఆ భావన అనుకోకుండా మనందరికీ వస్తుంది అంతే! ఆఖరి వరకు అలాగే ఉండేవారాయన. క్యాన్సర్‌ వచ్చినప్పుడు కూడా ఫ్యామిలీ అందరినీ ప్రిపేర్‌ చేశారు. ఇప్పుడు కూడా ఆయన గురించి తల్చుకుంటే.. ఎంత గొప్ప మనిషి అనిపిస్తుంది. కాని ఆయన లేరు అన్న భావన బాధ కలిగించదు. మనం బతికితే ఆయనలా బతకాలి.


ఆర్కే : మీరిద్దరు ఎప్పుడైనా కోప్పడుకున్న సందర్భాలు?

అమల : మా ఇంటికి ఒకసారి- ఒక చిన్న లాబ్రడార్‌ పప్పీని తీసుకొచ్చాం. ఇంటికి ఎవరొచ్చినా వారి మీదికి ఎగిరేది ఆ కుక్కపిల్ల. అఖిల్‌, నాగార్జునలకు ఆ పప్పీ అంటే చాలా ఇష్టం. ఆయన ఎప్పుడు ఇంటికి వచ్చినా ఎంతో ఇష్టంగా, ప్రేమగా ఎదురువెళ్లి ఆహ్వానం పలికేది. అయితే అది అందరి మీదికి ఎగురుతోందని.. ఒక నెల రోజులు ట్రైనింగ్‌కు పంపించాను. ఆ విషయం తెలిసిన నాగార్జున.. అందుకు ఇష్టపడలేదు. ఇంట్లో కుక్కపిల్ల లేదని ఆయన అలిగారు. దాంతో నేను మళ్లీ పప్పీని ఇంటికి తీసుకొచ్చే వరకు ఆయన వదల్లేదు. మరిచిపోతారని వారం ఆపాను. కాని లాభం లేదు. చేసేది లేక వెంటనే ట్రైనింగ్‌ నుంచి తెప్పించాను. అప్పుడు ఆయన హ్యాపీ!


ఆర్కే : మీకు తెలుగు ఎవరు నేర్పించారు?

అమల : పెళ్లి చేసుకున్నప్పుడు.. తెలుగు భాష అసలు రాదు. అయితే తమిళం బాగా వచ్చు. మా అత్తమ్మకు కూడా తమిళం వచ్చు. ఆమె ద్వారానే తమిళం నుంచి తెలుగు నేర్చుకున్నాను. ఆవిడే నాకు రాయడం కూడా నేర్పించారు. నేను తెలుగులో మొదటి ఉత్తరం అత్తగారికే రాశాను. ఆ తరువాత మరిచిపోయాను. ఇప్పుడు అస్సలు రాదు. ఈ వయసులో ఇంకెక్కడ వస్తుంది? చదవడం కూడా కష్టం. నేను తెలుగు అక్షరాలను గుర్తుపడతాను అంతే! ఆ ఉత్తరాన్ని అత్తమ్మ కప్‌బోర్డులో దాచారు. కొన్నేళ్లకు సుశీల తీసింది.


ఆర్కే : నాగార్జున అంటే మన్మథుడు. మహిళా అభిమానులెక్కువ. మీరు అసూయగా ఫీల్‌ కాలేదా?

అమల : నన్ను చాలా మంది ఇలానే అడుగుతారు. ఆయన ఎంత దూరంలో ఉన్నా నాతో ఉన్నట్లుంటుంది. ఆయన గురించి పత్రికలు, మ్యాగజైన్స్‌లో ‘నాగార్జున డ్యాన్సింగ్‌ విత్‌ అట్రాక్టివ్‌ విమెన్‌’ అని రాస్తారు. ఆ రోజు నేనే ఆయనతో ఉన్నానని వారికి తెలీదు. నాగార్జున టోటల్‌గా ఫ్యామిలీ పర్సన్‌. నా నలభైయ్యవ పుట్టిన రోజు సందర్భంగా తిరుపతిలో వెంకటేశ్వరునికి తలనీలాలు సమర్పించాను. ఆ తర్వాత సింగపూర్‌ తనతో వెళ్లాను.


నాకుండే కొంచెం జుట్టు ఫ్యాషన్‌ లుక్‌ అయ్యింది. సింగపూర్‌లో మేం నడిచి వెళ్తుంటే.. అక్కడ ఓ తమిళాయన ‘నాగార్జున మీరు అమలాను పెళ్లి చేసుకున్నారు కదా, వేరే అమ్మాయితో వెళ్తున్నారే?’ అని ఆయన గట్టిగా అడిగారు. ‘అయ్య బాబోయ్‌.. చూడు ఈమె అమలానే’ అన్నారు నాగార్జున. అలాంటి సహనవంతులు ఆయన. సినిమా వాళ్లకే ఓ విషయం తెలుస్తుంది. ఒక రొమాంటిక్‌ సీన్‌ చేస్తుంటే అక్కడ సెట్లో యాభై మంది మనుషులు ఉంటారు. అందుకే నేను ఎలాంటి రూమర్స్‌ పట్టించుకోను.

Updated Date - 2020-02-08T07:02:36+05:30 IST