రామ్ గోపాల్ వర్మతో ‘అటాక్’ చేస్తా...
ABN , First Publish Date - 2020-02-08T08:42:37+05:30 IST
‘‘సహాయం చేయమని ఎవ్వరి దగ్గరకు వెళ్లను. హడ్రెండ్ పర్సెంట్ నేను రౌడీనే. నన్ను లేపేయాలని ప్లాన్ చేసేలోపే నేనే లేపేస్తా..’’
‘‘సహాయం చేయమని ఎవ్వరి దగ్గరకు వెళ్లను. హడ్రెండ్ పర్సెంట్ నేను రౌడీనే. నన్ను లేపేయాలని ప్లాన్ చేసేలోపే నేనే లేపేస్తా..’’ సినిమా డైలాగుల మాదిరిగా అనిపిస్తున్న ఈ మాటలను అన్నది సినిమా నిర్మాత సి.కళ్యాణ్. సినిమా నిర్మాతగానే కాకుండా ఎప్పుడూ గొడవలతో ఫోకస్‌లో ఉంటారాయన. ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణతో ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో తన మనసులోని భావాలను పంచుకున్నారు కళ్యాణ్..
ఆర్కే: వెల్‌కం టు ఓపెన్ హార్ట్, నమస్కారం కళ్యాణ్ గారు
సి.కళ్యాణ్: నమస్తే
ఆర్కే: బీపీ కంట్రోల్‌లో ఉందా?
సి.కళ్యాణ్: పూర్తి కంట్రోల్‌లో ఉంది.
ఆర్కే:సినిమా ఇండస్ట్రీలో ఉండే వారికి లౌక్యం ఉండాలంటారు. మీరేమో సి. కళ్యాణ్ అంటే కాంట్రవర్సీ కళ్యాణ్‌గా మారిపోయారు. ఎందుకని?
సి.కళ్యాణ్: స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడే అందరికీ ఎదురయ్యే సమస్యే ఇది. నాకు డ్రామాలు చేతకావు. వెళ్లిన పనేంటి? ఆ పనిలో లాభం ఉంటే లాభం, నష్టం ఉంటే నష్టం స్ట్రెయిట్‌గా చెప్పడం, ఒప్పుకుంటే చేయడం.. నాకు తెలిసింది అంతే.
ఆర్కే: సినిమా జీవితం ఎలా మొదలయింది?
సి.కళ్యాణ్: నేను వ్యవసాయం మీద ఆధారపడిన కుటుంబం నుంచి వచ్చిన వాణ్ణే. మోహన్‌బాబు గారు మా మామయ్యకు ఫ్రెండ్. ఇద్దరూ కలిసి చదువుకున్నారు. మా ఫ్యామిలీకి బాగా లింక్ ఉన్న ఆర్టిస్ట్ రాజనాల గారు. వీరిద్దరి ప్రభావం ఉంది.
ఆర్కే: అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఎన్నాళ్లు చేశారు?
సి.కళ్యాణ్: మా అన్నయ్య తమ్మారెడ్డి భరద్వాజ డైరెక్టర్ అయ్యే వరకు చేశాను. ఒక దశలో నాకు సరిపడదని వెళ్లిపోతే అలా కాదన్నయ్యా మీరు రండి అని చెప్పి ఒప్పించి మరీ పట్టుకొచ్చాను.
ఆర్కే: దాసరి, భరద్వాజలో ఉన్న టెంపర్‌మెంట్‌లన్నీ వచ్చినట్టున్నాయి?
సి.కళ్యాణ్: బాగా.... ఓపెన్‌గానే. నేను తప్పు చేశానంటే సరెండర్ అవుతాను. నాది తప్పులేకపోతే ఎదుటి వ్యక్తి అంతు చూసే వరకు నిద్రపోను.
ఆర్కే: పెద్ద ప్రొడ్యూసర్‌గా ఎలా మారారు?
సి.కళ్యాణ్: నేను చిన్న చిన్న సినిమాలు చేస్తుంటే ఒక స్టెప్ ఎదగడానికి హీరో రాజశేఖర్ చాలా హెల్ప్ చేశాడు. పెద్ద సినిమా ప్రొడ్యూసర్‌గా మారడానికి సహాయపడ్డాడు. రెండో వ్యక్తి శ్రీహరి.
ఆర్కే: నేతలకు సన్నిహితంగా ఉంటారా?
సి.కళ్యాణ్: బాగానే ఉంటాను. కానీ ఇప్పటి వరకు వారితో ఏపనీ చేయించుకోలేదు. ఒక్క పని చేయమని అడగలేదు. అయితే అనుకోకుండా ఈ మధ్య గొడవపడాల్సి వచ్చింది.
ఆర్కే: ఎందుకు? వివేకానందరెడ్డితోనేనా?
సి.కళ్యాణ్: అవును. ముందు నుంచీ మేము ఆనంగారి నీడలోనే పెరిగాము. వారి మనుషులుగానే ఉన్నాము. అలాంటిది వారితోనే వైరం వస్తుందని ఊహించలేదు.
ఆర్కే: భూమి గొడవేనా?
సి.కళ్యాణ్: అవును. ముప్పావు ఎకరా స్థలం విషయంలో గొడవ సృష్టించారు. నేను ఆ స్థలాన్ని కొనుగోలు చేశాను. అయితే ఆ స్థలం వక్ఫ్‌బోర్డుదని ఇష్యూ లేవదీశారు. కళ్యాణ్ కబ్జా చేశాడని ప్రచారం చేశారు. నేను హీరోనయ్యానే తప్పితే ఆ విషయంలో నాదేమీ పోలేదు.
ఆర్కే: ఆనం బ్రదర్స్ ఇప్పుడు అధికారపార్టీలో చేరారు కదా? ఇబ్బంది సృష్టిస్తే?
సి.కళ్యాణ్: ఏం చేస్తారు. ఏం చేయలేరు. ప్రభుత్వ భూమైతే తీసుకుంటారు. కానప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఏం చేయలేడు. నేను చట్టాన్ని, న్యాయాన్ని నమ్ముతాను.
ఆర్కే:వందల కోట్ల ఆస్తి ఉంది కదా? ఆ చిన్న స్థలం గురించి గొడవెందుకు?
సి.కళ్యాణ్: ప్రిస్టేజ్ ఇష్యూ. కళ్యాణ్ కబ్జా చేశాడా, చట్టపరంగా కొనుగోలు చేశాడా అనే విషయం ప్రజలకు తెలియాలి కదా. వాళ్లు కబ్జాలు చేసి నన్ను కబ్జాకోరు అంటే ఎలా ఊరుకుంటాను. నేను కోర్టుకెళతాను. వాళ్లు పొలిటిషియన్ అయితే నేను వాళ్లకన్నా పెద్ద పొలిటీషియన్‌ని. అదే నెల్లూరులో వాళ్లపైనే పోటీ చేస్తాను రమ్మనండి.
ఆర్కే: హాయిగా సినిమాలు తీసుకోకుండా ఎందుకు ఈ గొడవంతా?
సి.కళ్యాణ్: నేను ఒక్కటే నమ్ముతాను. మనం చేసేది ఏదైనా ఆ దేవుడే చేయిస్తున్నాడు. ఏది జరగాలో అది జరుగుతుంది. నేను అందరికీ చెబుతుంటాను సిమ్‌కార్డులో ఏదుంటే అది జరిగిపోవాల్సిందే.
ఆర్కే:కళ్యాణ్ ఎవరికో బినామీ.. వెనక ఎవరో ఉన్నారంటారు. నిజమేనా?
సి.కళ్యాణ్: పచ్చి అబద్దం. కమల్ సింగ్, అర్జున్ సింగ్ అని 47 ఎకరాలకు యజమానులు. నానక్‌రామ్‌గూడలో వాళ్ల స్థలాలుండేవి. వాళ్లకు తోట ఉండేది. ఆ తోటలో సినిమా షూటింగ్ చేసి మూడు వేలు బాకీపడ్డాను. అయితే నా దగ్గర డబ్బుల్లేక చాలా రోజుల పాటు ఇవ్వలేకపోయాను. ఆ తరువాత ఎప్పుడో డబ్బులు వస్తే తీసుకెళ్లి ఇచ్చా. కొన్ని రోజుల తరువాత మూవీ టవర్స్ కట్టాలని అనుకున్నాం. స్థలం కోసం చూస్తుంటే వీళ్లు గుర్తొచ్చారు. నేను వెళ్లి వారితో మాట్లాడి ఆ స్థలాన్ని కొన్నాం. డబ్బంతా ఇచ్చి రిజిసే్ట్రషన్ చేసుకున్నాం. ఐదురోజుల తరువాత వాళ్లు మళ్లీ తిరిగి వచ్చి డబ్బంతా నాకిచ్చి మీదగ్గరే పెట్టుకోండి, రూపాయి మిత్తి ఇవ్వండి చాలన్నారు. ఆ మూడు వేలు వాళ్లకు తిరిగి ఇచ్చాను కదా అది వారికి నా మీద నమ్మకం. ఆ డబ్బులతోనే నానక్‌రామ్‌గూడలో రియల్‌ఎస్టేట్ వ్యాపారం చేసి సంపాదించాను. అంతేకానీ సో కాల్డ్ పీపుల్ భాను, సూరి.. ఇలా ఎవరికి నేను బినామీని కాను.
ఆర్కే:రెండున్నర కోట్లు ఇచ్చి మీరు కొత్త జీవితం ప్రారంభించేలా చేసిన కమల్‌సింగ్, అర్జున్‌సింగ్ ఇప్పుడున్నారా?
సి.కళ్యాణ్: నానక్‌రామ్‌గూడలోనే బ్రహ్మాండమైన ఐదంతస్తుల ఇల్లు కట్టుకుని ఉంటున్నారు. వాళ్లింట్లో ఏ శుభకార్యమైన మొదటి ఫోన్ నాకే వస్తుంది.
ఆర్కే: వేల ఎకరాలు సంపాదించారా?
సి.కళ్యాణ్: దేవుని దయవల్ల డబ్బుకు ఇబ్బంది లేకుండానే ఉన్నాను.
ఆర్కే: మొత్తం ఎన్ని సినిమాలు తీశారు?
సి.కళ్యాణ్: 59 తీశాను.
ఆర్కే: 59లో గొప్ప సక్సెస్ సినిమాలు ఏమీ లేవనుకుంటా?
సి.కళ్యాణ్: ఫ్లాప్‌లు లేవు.
ఆర్కే: ఇన్ని సినిమాల తరువాత లాభమా? నష్టమా?
సి.కళ్యాణ్: సినిమాల్లో సంపాదించిందేమీ లేదు. పోగొట్టుకున్నదే ఎక్కువ. ఏమైనా మిగిలింది అంటే అది రియల్‌ఎస్టేట్‌లోనే.
ఆర్కే:ఇప్పుడు ఏం సినిమా రిలీజవుతోంది?
సి.కళ్యాణ్: లోఫర్. 17న రిలీజ్ చేస్తున్నాం.
ఆర్కే: ఎందుకు అలాంటి టైటిల్ ఎంచుకుంటున్నారు?
సి.కళ్యాణ్: ‘కుమారి 21 ఎఫ్’ చూశారు కదా పెద్ద హిట్. అంతేకాకుండా మా సినిమా కథకు అది కరెక్ట్ టైటిల్.
ఆర్కే: వర్మతో సినిమా ప్లాన్ చేస్తున్నారట?
సి.కళ్యాణ్: ఈ చిత్రం పేరు ‘అటాక్’. పాత రామ్‌గోపాల్‌వర్మను ఈ సినిమాతో మళ్లీ చూస్తారు.
ఆర్కే: ‘పాతళభైరవి’ మళ్లీ తీస్తానని అన్నారు. ఎంతవరకు వచ్చింది? .
సి.కళ్యాణ్: ఒకసారి ముంబైలో డిస్కస్ చేశాం.
ఆర్కే:ఎప్పుడు డిస్కస్ చేశారు, మందు కొడుతూనా?
సి.కళ్యాణ్: లేదు. మందు కొడుతున్నప్పుడు స్టోరీ డిస్కషన్ పెట్టొద్దని గట్టిగా చెప్పాను. వర్మ అదే పనిగా ట్విట్టర్‌లో పోస్టు చేస్తుంటాడు. రాత్రి పూట ట్విట్టర్‌లో ఏమీ పెట్టకూడదని కూడా కండిషన్ పెట్టాను. కావాలంటే పొద్దున పెట్టుకో అని చెప్పా. అందుకే ఈ మధ్యకాలంలో ట్విట్టర్‌లో పోస్టులు తగ్గించాడు.
ఆర్కే:ఎంతమంది పిల్లలు?
సి.కళ్యాణ్: ఇద్దరబ్బాయిలు, ఒకమ్మాయి. అమ్మాయి పెళ్లయిపోయింది. పెద్దబ్బాయి ఫ్యాక్టరీ చూసుకుంటున్నాడు. చిన్నబ్బాయిని హీరో చేయాలని అనుకుంటున్నా.
ఆర్కే: హీరోని చేయాల్సి వస్తే ఎవరి చేతుల్లో పెడతారు?
సి.కళ్యాణ్: ఆ రోజుకి ఎవరి టైం బాగుంటే వారి చేతుల్లో పెడతాను.
ఆర్కే:: దాసరితో సత్సంబంధాలు ఉన్నాయా?
సి.కళ్యాణ్: ఆయన నాకు తండ్రితో సమానం. ఆయనతో ఎప్పటికీ సత్సంబంధాలే ఉంటాయి.
ఆర్కే: ఇండస్ట్రీలో మీకు స్నేహితులెవరో చెప్పలేదు?
సి.కళ్యాణ్: ఆశోక్, కె.ఎస్.రామారావు గారు ఫోన్ చేసి సలహాలు చెబుతుంటారు. కేసుల విషయం జరిగినప్పుడు అరవింద్‌గారు సపోర్ట్‌గా ఉన్నారు.
ఆర్కే:మొత్తం జర్నీలో గుర్తుపెట్టుకోదగ్గ సంఘటనలున్నాయా?
సి.కళ్యాణ్: 2011లో జైలుకెళ్లడమే. పెద్ద పెద్ద కేసుల్లో వెళ్లలేదు కానీ ఒక పిచ్చి కేసులో వెళ్లాల్సి వచ్చింది. సినిమాను మా దగ్గర కొని మాకు డబ్బు ఇవ్వకపోగా మాపైనే కేసుపెట్టారు. జైల్లో మూడు రోజులున్నాను.
ఇండస్ట్రీలో నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మోహన్‌బాబు కారణం. ఇండసీ్ట్రకి నన్ను లీడ్ చేసిన వ్యక్తి, లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి ఆయన.
దాసరి నారాయణరావు పేరులో 9 అక్షరాలున్నాయని.. నేను కూడా చిల్లర భారతీ కళ్యాణ్ అని 9 అక్షరాలు వచ్చేలా పెట్టుకున్నాను. ఇండస్ట్రీలో ఒడుదొడుకులను ఎలా ఎదుర్కోవాలో నేర్పించింది తమ్మారెడ్డి భరద్వాజ. నేను ఆయనని అన్నయ్య అని పిలుస్తాను.
సుమన్ కేసులో ఇరుక్కున్నప్పుడు మేజర్ పాత్ర నాదే. జైలుకు వెళ్లే దశలో బయటపడ్డాను. బాతరూమ్‌లో దాక్కుంటే పోలీసులొచ్చి పట్టుకెళ్లారు.
నాకు అమావాస్య రోజు బాగా కలిసొస్తుందని నమ్మకం. నా మొదటి సినిమా ఆదివారం అమావాస్య రోజునే మొదలయింది. చెన్నై కన్నా హైదరాబాద్ బాగా కలిసొచ్చింది. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి గారు నా సినిమా పార్ట్‌నర్.
సూరి హత్య జరిగాక మొదటి స్టేట్‌మెంట్‌ను పోలీసులు నా దగ్గరే తీసుకున్నారు. భాను చంపి ఉండడని చెప్పాను. నాకు ఫ్యాక్షనిస్టులతో అవసరం లేదు. ఎదుటి వాడు నన్ను లేపేద్దామని ప్లాన్ వేస్తుంటే ఆ లోపే నేను వేసేస్తాను. సూరి కేసులో పోలీస్‌బాస్‌లకు మేం బంగారు బాతుల్లా కనిపించాం. అందుకే మమ్మల్ని ఇరికించారు. అయితే రెండు, మూడు రోజుల్లోనే నా ప్రమేయం లేదని తెలిపోయింది. సూరి కన్నా పరిటాల రవి దగ్గరనే నాకు చనువు ఎక్కువుండేది.