ఎంటర్‌టైన్ చేయడమే మా పని
ABN , First Publish Date - 2020-02-08T10:01:48+05:30 IST
బొద్ద్దుగుమ్మ చార్మి గ్లామర్‌తోనే కాదు... వైవిధ్యమైన నటనతోనూ అందర్నీ ఆకట్టుకునే హీరోయిన్. తనకు నచ్చిన పాత్రల్ని చేస్తూనే ఐటమ్ సాంగ్స్‌నూ చేస్తోంది....
బొద్ద్దుగుమ్మ చార్మి గ్లామర్‌తోనే కాదు... వైవిధ్యమైన నటనతోనూ అందర్నీ ఆకట్టుకునే హీరోయిన్. తనకు నచ్చిన పాత్రల్ని చేస్తూనే ఐటమ్ సాంగ్స్‌నూ చేస్తోంది. వచ్చిన కొత్తలో హిట్స్ లేకున్నా తన అందంతో, అభినయంతో నిలదొక్కుకుందీ తార.. తన భయంతో ‘మంత్ర’ముగ్ధుల్ని చేసి వేశ్య పాత్రలోనూ నటిస్తోంది. ప్రతిఘటన ద్వారా నేటి సమాజంలో సీ్త్రలు ఎలా ఉండాలో చెప్పామంటున్న ఆమెతో 2-9-13న జరిగిన ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో కార్యక్రమంలో ఆర్కేతో చెప్పిన ముచ్చట్లివి.
నమస్తే చార్మి. ఎలా ఉన్నారు?
సూపర్‌గా ఉన్నాను.
‘చార్మి’ అన్న పేరెందుకు పెట్టారు. చార్మింగ్‌గా ఉంటావనా?
నాకేదైనా యూనిక్ నేమ్ పెట్టాలని మా అమ్మ ఆలోచించింది. మొదట్లో చార్మికౌర్ అని పెట్టింది అమ్మ. ఆ పేరు స్పెల్లింగ్ మార్చాను. మొదట్లో సిహెచ్‌ఆర్‌ఎంఐ ఉండేది. ఆ తర్వాత ‘సిహెచ్‌ఎఆర్‌ఎంఎంఇ’ అని సరిచేశాను.
మరి మీ లక్ష్యం నెరవేరిందా?
హా!! నెరవేరిందో లేదో మళ్లీ చెబుతాను (నవ్వుతూ).
మీ రంగు చూస్తే ఉత్తరభారతీయురాలిలా కనిపిస్తున్నారు. కాని తెలుగు బాగా మాట్లాడుతున్నారు? మీరు పంజాబీనా?
పుట్టింది బాంబేలో. మా డాడీ సర్దార్. మా అమ్మ హర్యానావాసి. ఆమె హైదరాబాద్‌లో పుట్టింది. అంటే -సగం బాంబే, సగం హైదరాబాద్. తమిళ, కన్నడ, మరాఠీ, హిందీ, తెలుగు భాషలు మాట్లాడటం వచ్చు.
అంటే బహుభాషా కోవిధులన్నమాట. చిన్న వయసులోనే సినిమాల్లోకి ఎందుకు రావాలనిపించింది?
చాలామందికి తెలియని విషయం ఒకటుంది. పదమూడేళ్లప్పుడు నేను మా అన్నతో కలిసి గురుద్వార నుంచి ఇంటికి వెళుతుంటే.. నన్ను ఒకతను చూసి.. ఒక రిక్వయిర్‌మెంట్ ఉంది.. నటించేందుకు వస్తారా? అని అడిగారు. పంజాబీ కుటుంబంలో పుట్టి సినిమాలేంటి? అని మా అన్నయ్య ఒప్పుకోలేదు. ఆ రోజు ఇద్దరం ఇంటికొచ్చాం. నన్ను అడిగిన అతను ఒక వారం పాటు ఫోన్ చేసి అడుగుతూనే ఉన్నాడు. ఆడిషన్స్‌కు రమ్మని రిక్వెస్ట్ చేశాడు. ‘‘సార్, మీ అమ్మాయి కచ్చితంగా ఎంపిక అవుతుంది’’ అని మా వాళ్లతో చెప్పాడు. అప్పుడు నాకు వేసవి సెలవులు. ఒక సారి అమ్మ దగ్గరికి వెళ్లి ‘‘అతను అంతగా అడుగుతున్నాడు. షూటింగ్ వద్దకు వెళ్లి చూసొస్తానమ్మా’’ అన్నాను.
ఆమె నాన్నను ఒప్పించింది. అన్నయ్యను తీసుకుని షూటింగ్ జరుగుతున్న మెహబూబ్ స్టూడియోకు వెళితే అక్కడికి 5 వేల మంది అమ్మాయిలొచ్చారు. అది ‘మే ప్రేమ్‌కీ దివానీ’ షూటింగ్. నాకర్థం కాలేదు. అందరిలా లైన్‌లో నిల్చోమంటే నిల్చున్నా. ఒక్కొక్కరినే చూసి ‘సెలెక్ట్ సెలెక్ట్’ అని లోపలికి పంపిస్తున్నాడు కో ఆర్డినేటర్. అంటే నేను వచ్చింది జూనియర్ ఆర్టిస్ట్ వేషం కోసం అన్నమాట. నాకు రెండొందల రూపాయల పేమెంట్ ఇచ్చారు. కరీనాకపూర్, హృతిక్‌రోషన్, అభిషేక్‌బచ్చన్‌లు వచ్చారక్కడికి. హృతిక్‌ను చూడగానే ఆహా.. అనుకున్నాను. నేను అతని వీరాభిమానిని. నన్ను అభిషేక్‌బచ్చన్ వెనకాల కూర్చోబెట్టారు. నన్ను అద్దంలో చూసిన ఆయన ‘షి లుక్స్ సో బ్యూటిఫుల్. యు కెన్ రికవర్ హీరోయిన్’ అన్నాడు అక్కడే ఉన్న మరొకరితో. ఒక నిమిషం నాకు మతిపోయింది. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ మై లైఫ్ అనుకున్నాను. ఇప్పుడు కూడా యూట్యూబ్‌లోకి వెళ్లి కొడితే.. అభిషేక్‌బచ్చన్ వెనకాల స్కిన్‌కలర్ టాప్‌లో పెద్ద పెద్ద కనుబొమలతో కనిపిస్తాను నేను. ఆ రోజు ఐబ్రోస్ కూడా షేప్ చేసుకోలేదు. ఆరోజు రెండొందలు పారితోషికం తీసుకున్నాను.
అదే తొలి అరంగేట్రం అన్నమాట?
అవును. మా అన్నయ్య చేతిలో రెండొందలు పెడితే అదే పెద్ద మొత్తంలా భావించానప్పుడు. మా కుటుంబానికి అప్పట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండేవి. మెహబూబ్ స్టూడియో నుంచి మేమున్న ఇంటికి చేరుకోవాలంటే అప్పట్లో 75 రూపాయలు ఛార్జీలు అయ్యేవి. భోజనం తినాలంటే డబ్బు ఖర్చవుతుందని.. మూడు రూపాయలు పెట్టి వడాపావ్ కొనుక్కుని తిన్నాం. రైల్వేస్టేషన్‌కు బస్సుకు వెళ్లాలంటే నాలుగు రూపాయలు అంటే నాకు, అన్నయ్యకు ఎనిమిది అవుతుంది. దాన్ని కూడా మిగిలించేందుకు నడుచుకుంటూ స్టేషన్‌కు వెళ్లాం. అలా ఏడు రోజుల షూటింగ్‌లో వెయ్యి రూపాయల్ని మిగిల్చుకున్నాను. ఆ డబ్బుతోనే ఎనిమిదో తరగతి చదివేందుకు నెలకు రూ.120 స్కూలు ఫీజు కట్టగలిగాను.
నూటా ఇరవై రూపాయలు నుంచి యాభై లక్షల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి వచ్చారన్న మాట?
లెక్కలేవీ నాకు తెలీదు. అవన్నీ మా డాడ్ చూసుకుంటాడు.
ప్రతి హీరోయిన్ చెప్పేమాట ఇదేగా! నిజంగా హీరోయిన్లు అంత అమాయకంగా ఉంటారా?
నాకు వేరే వాళ్ల గురించి తెలియదు. నా లెక్కలైతే మా అన్నయ్య, నాన్న, మేనేజర్ చూసుకుంటారు. నేను పెద్దగా చదువుకోలేదు కాబట్టి అకౌంట్స్ గురించి తెలీదు. ఒక రకంగా చెప్పాలంటే నేను, మా అమ్మ- ఇన్నోసెంట్ పీపుల్ ఆఫ్ ద హౌస్. నాకు కొంచెం డ్యాన్స్ వచ్చు. కొంచెం యాక్టింగ్ వచ్చు. అంతే! అకౌంట్స్ అండ్ మనీ ఈజ్ నాట్ మై కప్ ఆప్ టీ.
మీరు డ్యాన్స్ ఎక్కడ నేర్చుకున్నారు..?
ఎక్కడా నేర్చుకోలేదు. మా నాన్న ఏడేళ్లపాటు డిస్కో ఛాంపియన్. అందుకే డ్యాన్స్ అనేది నా బ్లడ్‌లోనే ఉంది.
హీరోయిన్ కావడానికి సంఘర్షణకు లోనయ్యారా?
ఓహ్!! అభిషేక్‌బచ్చన్ ఆ రోజు ఆ మాట చెప్పారుగా! అదే మనసులో పడిపోయింది. హీరోయిన్ అవుతానని కలలు కనేదాన్ని. ఆ షూటింగ్‌కు కరీనాకపూర్ ఎరుపు రంగు గాగ్రాచోలీ వేసుకుని వస్తుంటే, వెనక ఒకతను గొడుగు పట్టుకుని ఆమెను ఫాలో అవుతున్నాడు. జనమంతా ‘కరీనా.. కరీనా’ అని అరుచుకుంటూ పరిగెత్తుకొస్తున్నారు. హీరోయిన్‌కు ఇంత క్రేజ్ ఉంటుందా? అనిపించింది. అప్పుడే నేను కూడా హీరోయిన్ కావాలని డిసైడ్ అయిపోయాను.
మరి మొదటి అవకాశం ఎలా వచ్చింది?
హీరోయిన కావాలని ఒక్కసారి డిసైడ్ అయ్యాకే స్ట్రగుల్ మొదలవుతుంది. ఆ తర్వాత చిన్న చిన్న సీరియళ్లు, చిన్న పాత్రలు వేశాను. ఒక సినిమాలో డ్యాన్సర్‌గా కూడా చేశాను. సరిగ్గా ఆ సమయంలోనే మా నాన్నగారి స్నేహితుడైన హరీష్‌చాచా మా ఇంటికొచ్చినప్పుడు ‘‘ఎన్నాళ్లిలా చేస్తావు? ప్రధాన పాత్రలకు ప్రయత్నించవచ్చు కదా’’ అన్నాడు. ఫోటో షూట్‌కు డబ్బుల్లేవు అన్న సంగతిని గుర్తించిన ఆయన ఓ పదివేలు నా చేతిలో పెట్టాడు. ఆ డబ్బును ఫోటోగ్రాఫర్‌కు ఇచ్చి.. ఫోటోషూట్‌లో పాల్గొన్నాను. హీరోయిన్ వేషం కోసం ఆ ఫోటోలను అందరికీ పంపించడం మొదలుపెట్టాను. అప్పుడే భీమనేని శ్రీనివాసరావుగారు ‘నీ తోడు కావాలి’ కోసమని నా ఫోటో చూసి పిలిచారు.
షూటింగ్ జరిగేటపుడు భయపడలేదా..?
షూటింగ్‌కు వస్తే ఒక్క ముక్క తెలుగు చెప్పలేకపోయా. ‘ఈ అమ్మాయికి ఏమీ రాదు’ అనుకుని ఇంటికి పంపించేశారు వాళ్లు. మళ్లీ ఇరవై రోజుల తర్వాత - వారి నుంచే పిలుపొచ్చింది. ‘ఈ అమ్మాయి తెలుగు కొంచెం నేర్చుకుంటే బాగాచేస్తుంది’ అనుకున్నారు. అలా ‘నీ తోడు కావాలి’ షూటింగ్ కోసమని హైదరాబాద్ వచ్చాను. నన్ను చూసిన మా మేనేజర్ శ్రీనివాస్ ‘మీ అమ్మాయి చాలా బాగుందండీ. దర్శకుల దగ్గరికి నేను తీసుకెళతాను. భవిష్యత్తులో తప్పక అవకాశాలు వస్తాయి’ అన్నాడు నాన్నతో. అవకాశాల కోసం ఆటోలు పట్టుకుని ఎంతోమంది దర్శకుల ఇళ్లకు వెళ్లి కలిశాను. మెల్లమెల్లగా తెలుగు, తమిళ భాషలలో వేషాలొచ్చాయి. కృష్టవంశీగారు ఓ విమానాశ్రయంలో నన్ను చూసి ‘శ్రీ ఆంజనేయం’లో అవకాశం ఇచ్చారు.
హీరోయిన్‌గా స్థిరపడేందుకు ఎన్నేళ్లు పట్టింది?
‘శ్రీ ఆంజనేయం’ తర్వాత కెరీర్ మలుపు తిరిగింది. అంతకుముందు ‘చక్రం’, ‘గౌరి’ చేశాను.
ఆ తర్వాత సినిమాలేవీ లేవు. మరెలా నిలబడ్డారు?
ఎలా నిలబడ్డానో నాకే తెలీదు. మా నాన్న బాంబేలో వాస్తుశాస్త్ర కన్సల్టెంట్. మా కుటుంబానికి ఆయనే ఆధారం. అలాంటి పరిస్థితుల్లో అన్నీ వదిలేసి నా కోసం హైౖదరాబాద్ రావడం పెద్ద సాహసం. పెద్ద రిస్కు. అయినా వచ్చారు.
అప్పట్లో మీ సినిమాలేవీ సరిగా ఆడలేదు. అప్పుడు ఎలా అనిపించింది?
నాకప్పుడు హిట్ అంటే ఏమిటి? ఫ్లాప్ అంటే ఏమిటి? అర్థం కాలేదు. పదహారేళ్ల వయసుకు ఏమర్థం అవుతుంది..? వాళ్లిచ్చిన దుస్తులు వేసుకోవడం, షూటింగ్‌లో నటించడం ఇదే నా పని. నిజం చెప్పాలంటే నాకు పర్సనల్ సెల్‌ఫోన్ కూడా ఉండేది కాదు. నాకెవ్వరైనా ఫోన్ చెయ్యాలంటే నాన్న సెల్‌కు చేసేవారు. ఈ మెయిల్స్ కూడా మా అన్నయ్యే మేనేజ్ చేసేవాడు. ‘మాస్’ వరకు హిట్ రాలేదు. అందుకని ‘నీకొక హిట్ వస్తే కెరీర్ బాగుంటుంది’ అనేవారు మా మేనేజర్. ‘అందుకు నేనేం చేయాలి?’ అనేదాన్ని అమాయకంగా. ‘మాస్’ సూపర్‌హిట్ అయ్యాక ‘హిట్ అంటే ఇదే!
మీరు అమాయకురాలిని అంటున్నారు. మరి, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండటం కష్టం కదా!
ఎవరైనా ఇండస్ట్రీలో డేంజరస్ అంటే నాకు కోపం వస్తుంది. ఎందుకంటే నేను ఇదే రంగంలో ఉన్నాను కనుక. సినిమా ఫీల్డ్ గురించి కొందరు బూతు ధ్వనించేలా మాట్లాడుతుంటారు. అది తప్పు. మన ఫిల్మ్ ఇండస్ట్రీలో రేప్‌లు చేయడం లేదుగా. బయట ఎన్ని రేప్‌లు జరుగుతున్నాయో చూస్తున్నాం కదా!
మీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరున్నారు?
చాలామందే ఉన్నారు. పేర్లు ఎందుకులెండి.
హీరోయిన్లుగా రెండు మూడేళ్లకంటే ఎక్కువ చేయలేని పరిస్థితుల్లో.. మీరు పదేళ్లు ఎలా చేయగలిగారు?
నేనెప్పుడూ పదేళ్లు హీరోయిన్‌గా చేయాలని ప్రత్యేకించి ప్లాన్ చేసుకోలేదు. బాగా నటిస్తే ఎవరైనా వెతుక్కుంటూ వస్తారన్నది నా నమ్మకం. ప్రస్తుతం నా రేంజ్ ఏంటి అని నేను చెప్పను. ఇండస్ట్రీలో కంటిన్యూ కాగలనన్న ఆత్మవిశ్వాసం మాత్రం ఉంది నాకు. మాధురీదీక్షిత్ కూడా ఈ వయసులో ఐటంసాంగ్ చేసింది.
మీ టాలెంట్‌కు ఎన్ని మార్కులు వేసుకుంటారు?
కొన్ని సినిమాలకు తొంభై, మరికొన్నింటికి యాభై, ఇరవై ఇలా సినిమాలను బట్టి మార్కులుంటాయి.
‘మంత్ర’కు ఎన్ని మార్కులు?
రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు ఇచ్చిందిగా! మార్కులు వేయడానికి ఇంకేముంది.
ఇంత తెలివిగా సమాధానం చెబుతున్నారు. అయినా నేను అమాయకురాలినని ఎలాగంటారు?
అన్నీ నేర్చుకున్నానిప్పుడు. కొత్తలో వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా తేడా ఉంది.
‘ప్రేమే ఒక మైకం’ ఎలా ఉంది?
మంచి టాక్ వచ్చింది. వేరే సినిమాలేవీ లేనప్పుడు ఇది రిలీజ్ కావడం కలిసొచ్చింది. ఒక సినిమా సరైన సమయానికి విడుదల కావడం మీదే దాని విజయం ఆధారపడి ఉంటుంది. ఈ సినిమాకు 75 మార్కులు వేసుకుంటాను.
ఇందులో కాల్‌గర్ల్ పాత్ర చేసేముందు అధ్యయనం చేశారా?
ఏమీ చేయలేదు. ఫలానా సినిమాలో కాల్‌గర్ల్ పాత్రను ఫలానా నటి అలా చేసింది.. ఇలా చేసింది. చార్మి ఎలా చేస్తుందో ఏమోనని మీడియా కంపారిజన్ ఎక్కువైంది. అలాంటి విశ్లేషణలు వస్తున్నప్పుడు అన్నింటినీ వదిలేసి ప్రశాంతగా నటిస్తాను.
మొదట్లో మీరెందుకు ఆ క్యారెక్టర్ వద్దన్నారు?
నేను యాక్టర్‌ని మాత్రమే. బోల్డ్ యాక్టర్‌ను కాదు. అందుకే మల్లిక పాత్ర చేయడానికి భయపడ్డాను.
మీరు బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ అంటారే?
అలాంటి ఇమేజ్ క్రియేట్ చేశాను. బయట శివంగి ఆడపులిలా ఉంటానే కాని లోపల మాత్రం తుస్సే నేను. నాకంత సీన్ లేదు. ఎనిమిది నెలలు ఆలోచించి ‘ప్రేమే ఒక మైకం’కు ఒప్పుకున్నాను. ఈ సినిమాలో నాది కాల్‌గర్ల్ పాత్ర అయినా కుటుంబ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని చేశా.
మరి, వాల్‌పోస్టర్లలో ఎక్స్‌ఫోజింగ్ ఎక్కువున్నట్లుందే?
వాల్‌పోస్టర్లలో ఎంత చూపించానో సినిమాలో కూడా అంతే చూపించాను. దానికన్నా ఎక్కువ ఉండదు. తక్కువ ఉండదు. జనం ప్రిపేరై వస్తారు.
ఇంకా ఎక్కువ ఎక్స్‌ఫోజింగ్ ఉందని వస్తారు?
అలా వుంటే వాల్‌పోస్టర్ల మీద వేస్తాం కదా! సాధారణంగా అయితే పోస్టర్ల మీద ఎక్కువ చూపించి, సినిమాల్లో తక్కువ చూపిస్తారు (నవ్వులు).
‘ప్రేమే ఒక మైకం’ అని మీకెప్పుడైనా అనిపించిందా?
ప్రేమ ఎప్పుడూ ఒక బర్డన్‌లాగే అనిపిస్తుంది. అదొక బాధ్యత. అయితే లవ్ ఈజ్ బ్యూటిఫుల్.
అలాంటి ప్రేమ అనుభవం అయ్యిందా?
నో కామెంట్స్ (నవ్వులు)
పెద్ద హీరోలతో నటించినప్పుడు ఏమనిపించింది?
‘బుడ్డా హోగా తేరాబాప్’లో నటించినప్పుడు అమితాబ్‌ను చూస్తూనే నా అనుభవం అంతా మటుమాయం అయ్యింది. కెమెరా ముందు కొత్త నటి నిల్చున్నట్లు నిల్చున్నాను. కాని మళ్లీ ఆయనతో మాట్లాడాక.. ఒక సామాన్యుడి పక్కనే ఉన్నట్లు అనిపించింది.
సినిమా రంగంలో నిర్మాతల్ని, దర్శకుల్ని ‘గారు’ అని సంభోదిస్తుంటారు. కాని హీరోయిన్లను పేరుపెట్టే పిలుస్తారు. ఎందుకని?
‘గారు’, ‘జీ’ అనే పదాలను వాడటం వల్లే గౌరవించినట్లు కాదు. వాళ్ల ప్రవర్తన మర్యాదపూర్వకంగా ఉంటే చాలు. అలా లేకపోతే కోపం వస్తుంది. నా ఎదురుగా ఎవరైనా బూతులు మాట్లాడితే సహించను. తెలుగు బూతులు అర్థం కాకపోయినా.. మాట్లాడేవాళ్ల హావభావాల వల్ల అవి బూతులని తెలిసిపోతాయి.
గ్లామర్స్ పాత్రల నుంచి హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రల వైపు ఎందుకు మళ్లారు?
ప్రతి దానికీ ‘అంతా దేవుడే నడిపిస్తాడు’ అంటారుగా. నా కెరీర్‌ను కూడా దేవుడే అంటువైపు తీసుకెళ్లాడు అనిపిస్తుంది. నేనైతే ప్రత్యేకించి ప్లాన్ చేయలేదు. అందుకే ఇంకా అవకాశాలు వస్తున్నాయి. లేకపోతే వచ్చేవి కావు.
అత్యాచారాలు జరగడానికి సినిమాల్లో హీరోయిన్లు ఎక్స్‌పోజ్ చేయడం కూడా ఒక కారణం అంటున్నారు. ఏమంటారు?
దానికి జవాబు ‘ప్రతిఘటన’ సినిమాలో ఉంది. నా పరిధి నాకు తెలుసు. ఎక్స్‌పోజింగ్ చేస్తుందనే చార్మికి కథలు రావడం లేదు.
ఐటమ్‌సాంగ్స్‌కు ఎందుకు మారిపోయారు?
నేనేమీ మారలేదు. దర్శకులే అడుగుతున్నారు. ‘ఢమరుకం’లో ‘సక్కుబాయి’పాటను అనుకోకుండా చేయమన్నారు. రాంచరణ్‌తేజ సినిమాలో నెల్లూరు సాంగ్ కూడా అలా వచ్చిందే!. అప్పుడు నేను హాలిడేస్‌కు వెళ్లాలనుకున్నాను. ‘రాత్రిపూట షూటింగ్. తప్పక రావాలి’ అని దర్శకుల నుంచి పిలుపొచ్చింది. ఈ రెండు పాటలు పెద్ద హిట్ కావడంతో సంతోషమేసింది.
ఇలాంటి పాటల వల్ల మీ స్థాయిని తగ్గించుకున్నట్లు ఉండదా?
ఏ పాటనైనా నేను ఇష్టపడితేనే చేస్తాను. ఇష్టం లేకపోతే చచ్చినా చేయను. అందుకే పన్నెండు స్ర్కిప్టుల్ని తిరస్కరించాను. యాక్టర్ తర్వాతే హీరోయిన్. ఎంటర్‌టైన్ చేయడమే మా పని. నా స్థాయి తగ్గిందా, పెరిగిందా అనేవి పట్టిచుకోను. అందుకే ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను.
నచ్చితే డబ్బులు తీసుకోకుండా చేస్తారా?
అలాంటివి కూడా చేశాను. ఇంట్రస్ట్ ‘పొంగిపోయి’ చేశావాటిని. అప్పుడప్పుడు ఓవర్‌యాక్షన్ కూడా చేస్తుంటాను (నవ్వులు).
ఇంతకుముందు లావుగా ఉండేవారు. ఈ మధ్య సన్నబడినట్లున్నారే? జీరో సైజా?
ఇప్పుడు చిన్న టీషర్టులు కూడా టైట్ అవుతున్నాయి. రెండు నెలల్లో ఏడు కిలోలు తగ్గాను. ఇంకా అయిదు కిలోలు తగ్గాలి. మరీ సన్నబడితే ఛార్మి బాగుండదు అని జనాలంటే మళ్లీ లావెక్కుతాను. తిండి మానేస్తే లావెక్కుతారు. సమయానికి తింటే తగ్గుతారు. నేను పండ్లు, గ్రీన్ టీ తీసుకుంటాను. వేళకు నిద్రపోతున్నాను.
ఆర్కే: మీలో ప్లస్ పాయింట్స్ ఏంటి?
చార్మి: నాలో ప్లస్ పాయింట్స్ ఏమీ లేవు.
పోనీ, మైనస్ పాయింట్లున్నాయా?
అయామ్ వెరీ సెన్సిటివ్. ఇందులో ప్లస్ ఏంటంటే ఆ సెన్సిటివ్‌నెస్‌ను బయటికి కనిపించనీయకపోవడం. నాకెప్పుడైనా ఏడుపొస్తే మా అమ్మానాన్నల దగ్గర కూడా ఏడ్వను. నా గదిలోకి వెళ్లి తలుపులేసుకుని బాగా ఏడ్చేస్తాను. నన్ను ఎక్కువగా బాధపెట్టేవి ఫిజికల్ పెయిన్, ఎమోషనల్ పెయిన్.
మీకు ఎలాంటి అభిరుచులు ఉన్నాయి?
సినిమాలు బాగా చూస్తాను. నా గదిలో కూర్చుని ఒక్కోరోజు నాలుగు సినిమాలు చూస్తాను. ఆ టైమ్‌లో పొద్దున నుంచి రాత్రి వరకు టిఫిను, మీల్స్, డిన్నర్ అన్నీ నా వద్దకే వచ్చిపోతుంటాయి.