అల్లు అర్జున్‌ని హీరో చేసింది నేనే
ABN , First Publish Date - 2020-02-08T10:05:50+05:30 IST
తీసినవి చాలా తక్కువ సినిమాలైనా ఓ అగ్ర శ్రేణి దర్శకుడికి ఉండాల్సిన కీర్తి గడించిన రచయిత చిన్నికృష్ణ. చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోల
తీసినవి చాలా తక్కువ సినిమాలైనా ఓ అగ్ర శ్రేణి దర్శకుడికి ఉండాల్సిన కీర్తి గడించిన రచయిత చిన్నికృష్ణ. చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోల సూపర్ హిట్ కథలందించిన సెన్సేషనల్ కథా రచయిత చిన్నికృష్ణ ..1-7-13న ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఆ వివరాలు.
సినిమా ఇండస్ర్టీలోకి ఎలా రావాలనిపించింది?
మాది గుంటూరు జిల్లా తెనాలి. మాజీ మంత్రి మోపిదేవి, నేను కలిసి చదువుకున్నాం. భాగ్యరాజా సినిమాల ప్రభావంతో పరిశ్రమలోకొచ్చా. ఆయన దగ్గర అసిస్టెంట్ గా చేరా. బి.గోపాల్ ద్వారా తెలుగు సినిమాల్లోకి వచ్చా.
పదిహేనేళ్లు పరిశ్రమలో ఉన్నా అన్ని తక్కువ సినిమాలెందుకు చేశారు?
ప్రపంచంలో ఆత్మ సంతృప్తికి మించిందిలేదు. నాకు నచ్చినప్పుడు, నాకు నచ్చిన వ్యక్తులతోనే సినిమాలు తీ స్తాను. దీనివల్లే పదేళ్లలో నాలుగు సినిమాలు తీశాను.
ఇప్పటి వరకు ఎన్ని సినిమాలకు కథలు రాశారు?
తెలుగులో ఐదు, తమిళంలో మూడు.
తక్కువ రాసినా మీకు మంచి పేరు రావడానికి కారణం?
నేను కథలు అందించిన నరసింహనాయుడు, ఇంద్ర రికార్డులు సృష్టించాయి. పరిశ్రమకు రెండు కళ్లులా ఉండే చిరంజీవి, బాలకృష్ణల కెరీర్లో సూపర్ హిట్లు అవి.
గంగోత్రి సినిమా గురించి చెప్పండి?
రాఘవేంద్రరావుగారి 100 వ సినిమా చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌తో తీద్దామనుకున్నాం. ఆ సినిమాకి త్రివేణి సంగమం అని పేరుకూడా పెట్టాం. ఎందుకో తెలియదు ఆ ప్రాజెక్టు కేన్సిల్ అయింది. అప్పుడే అల్లు అర్జున్‌తో గంగోత్రి సినిమా తీశాం. ముందు ఈ సినిమాను నితిన్‌తో చేద్దామని రాఘవేంద్రరావుగారు అనుకోగా, అల్లు అర్జున్‌తో చెయ్యాలని చెప్పాను. ఆ విధంగా అర్జున్ హీరో కావడానికి నేనే కారణం.
వివాదాలెందుకు వచ్చాయి?
హీరోలు, దర్శకులు, నిర్మాతలు తమ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలనుకున్నప్పుడు రచయిత ఎందుకు అనుకోకూడదన్నది నా అభిప్రాయం. అందుకే కొందరికి ఎక్కువ బిల్డప్ ఇచ్చేవాడిలా నేను కనబడతాను.
సీమసింహం, బద్రీనాథ్ ఫ్లాపే కదా?
సీమ సింహం సినిమాకు అసలు నాపేరు వేయొద్దని చెప్పాను. నేనిచ్చిన స్ర్కిప్ట్‌లో చాలా మార్పులు చేశారు. అందుకే నాపేరు వేయొద్దన్నాను. బద్రీనాథ్ ఫ్లాప్ అంటే నేనుఒప్పుకోను. రూ. 35 కోట్లు వసూలు చేసింది.
తారా చౌదరి వివాదమేంటి?
హీరోయిన్‌ని చేస్తానని డబ్బులు తీసుకున్నానని తారా చౌదరి ఆరోపించింది. అవన్నీ అబద్ధాలు. ఇప్పటికైనా వివాదాల జోలికి పోకుండా చక్కగా పెళ్లి చేసుకుంటే ఆశీర్వదిస్తాను.
ఇంద్ర తర్వాత చిరంజీవితో సినిమా తీయలేదే?
150వ సినిమాకు కథ చెప్పాను. ఆయనేం చెప్పలేదు.
ప్రస్తుతం ఏం సినిమాలు చేస్తున్నారు?
ఏవీ చేయడం లేదు. దర్శకత్వంపై ఆలోచిస్తున్నా.