ప్లాఫవుతుందని షూటింగ్‌లోనే బాలకృష్ణ చెప్పేశాడు..
ABN , First Publish Date - 2020-02-08T05:57:55+05:30 IST
విజయవంతమైన డైరెక్టర్‌గా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి.
విజయవంతమైన డైరెక్టర్‌గా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి. దాదాపు రెండు దశాబ్దాల సినీ ప్రస్థానంలో 90 శాతం సినిమాలను హిట్ చేసిన సంచలన దర్శకుడు. ఎందరికో నటనాజీవితాన్నిచ్చిన కోదండరామిరెడ్డి.. ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ 06-05-2013న నిర్వహించిన ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో తన మనోభావాలను వెల్లడించారు...
దాదాపు రెండు దశాబ్దాలు సినీ పరిశ్రమను ఏలారు. అంత ఉజ్వలంగా వెలిగిన మీకు సినిమాలు తగ్గేసరికి ఏమనిపిస్తోంది?
దానికి తగ్గట్టు నా మైండ్‌ను మేకప్ చేసుకున్నాను. భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక టర్మ్ ఇస్తాడు. ఆ టర్మ్ తర్వాత కూడా మనం పాకులాడటం కరెక్టు కాదు అని నాకు నేనే చెప్పుకొన్నాను. అయినా ఎల్లకాలం మనమే ఉండాలంటే జరిగేది కాదుకదా? నేను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. నా గురువులు రాఘవేంద్రరావు, మధుసూదనరావు పెట్టిన భిక్ష ఇది. నా భార్యాపిల్లలు చేసిన పుణ్యంవల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను. అయితే ఇప్పుడు సినిమా తీయాలని ఎవరడిగినా నేను సిద్ధమే.
రాఘవేంద్రరావుగారు, మీరు మధుసూదనరావుగారి దగ్గర శిష్యులుగా పనిచేశారు. రాఘవేంద్రరావు ఇంకా సినిమాలు తీస్తున్నారు. మీరు కూడా అలా తీయాలనే ఆలోచిస్తున్నారా?
ఇప్పుడంతా కొత్తకొత్త హీరోలు వచ్చేశారు. వారితో పనిచేయాలంటే నాకు, వారికీ ఇబ్బందే. అందుకే విరమించుకున్నాను. మంచి సబ్జెక్ట్ దొరికితే కొత్తవారితో ఓ సినిమా తీయాలని ఉంది.
చిన్నప్పుడు శోభన్‌బాబులా ఉండేవారని ఫీలయ్యేవారట కదా?
నాకనిపించలేదు కానీ... మాఊళ్లో (నెల్లూరుజిల్లా మైపాడు ) అమ్మాయిలుసహా అలా అనేవారు. నేను ఏఎన్నార్ అభిమానిని. ఆయన్ని బాగా అనుకరించేవాడిని. అలా హీరో అవ్వాలనే కోరిక బలంగా కలిగింది. చెన్నై వెళ్లగా అక్కడ పీసీ రెడ్డిగారితో పరిచయమైంది. ఏంచేద్దామనుకుంటున్నావంటే ‘హీరో’ అని చెప్పా. అదంత సులభం కాదంటూ మధుసూదనరావుగారికి పరిచయం చేశారు. ‘మనుషులు మారాలి’కి అప్రెంటిస్‌గా చేరాను.
ఎంతో స్నేహితులుగా ఉన్న మీరు, రాఘవేంద్రరావు పోటాపోటీగా సినిమాలు తీశారు కదా? అప్పుడు ఎలా అనిపించేది?
మా మధ్య ఎంతో స్నేహం ఉండేది. ఒక నిర్మాత.. రాఘవేంద్రరావుతో సినిమా తీయాలని డేట్స్‌కోసం వచ్చారు. దానికి అంగీకరిస్తూనే.. తర్వాత సినిమా నాతో చేయాలనే షరతు పెట్టారు. మా మధ్య అంత స్నేహం ఉండేది. దశాబ్దంపాటు పోటాపోటీగా సినిమాలు తీసినా మామధ్య శత్రుత్వమేమీ లేదు. నా సినిమాలను ఆయన విశ్లేషించి, బాగా తీశావని ప్రశంసించేవారు.
దర్శకుడిగా మీకు తొలి అవకాశం ఇచ్చిందెవరు?
నా తొలి చిత్రం సంధ్య. లింగమూర్తిగారి సహాయంతో సూర్యనారాయణబాబు నిర్మించారు. తర్వాత క్రాంతికుమార్‌గారితో ‘న్యాయం కావాలి’ సినిమా తీశాం. అది సూపర్ డూపర్ హిట్. ఆ సినిమాను హిందీలో తీయాలని ఎల్వీ ప్రసాద్ అడిగారు. కానీ భాష సమస్యవల్ల చెయ్యలేకపోయాను. ఎల్వీగారు అడిగితే చేయలేకపోయాననే బాధ ఇప్పటికీ వెంటాడుతోంది. అలాగే ఎన్టీఆర్‌గారు మూడుసార్లు అడిగినా కాల్‌షీట్లు ఫుల్ అయిపోవడంతో తీయలేకపోయాను. దీనిపైనా బాధపడుతుంటాను.
మీది, చిరంజీవిది విజయవంతమైన కాంబినేషన్. దాదాపు 25 సినిమాలు తీశారు. అందులో ఖైదీ టాప్... అసలు ఈ సినిమాకు మొదట కృష్ణను అనుకున్నారట కదా?
అవును. ఖైదీ సినిమా నిర్మాతలది నెల్లూరు. చిరంజీవి తాతగారిదీ నెల్లూరే కావడంతో వాళ్లు చిరంజీవితో తీయాలని పట్టుబట్టారు. ఓ ఇంగ్లిష్ సినిమా హీరో గెటప్ ఆధారంగా ఇది తీశాం. అది సూపర్ డూపర్ హిట్. మా కెరీర్లో అతిపెద్ద హిట్ అదే.
చిరంజీవితో ఎప్పుడైనా అభిప్రాయభేదాలు వచ్చాయా?
అస్సలు లేదు.. ఒకరిగురించి ఒకరికి పూర్తిగా తెలుసు. అందు కే 25 చేస్తే అందులో 22 సూపర్ డూపర్ హిట్లు. త్రినేత్రుడు ఆయనకు 100వ సినిమా. నాకు 50వది. చివరిది ముఠా మేస్ర్తీ. తర్వాత ఒకటి అనుకున్నాం. అంతా సిద్ధమయ్యాక నాకు డైలాగ్స్ నచ్చక ఆపేశాం.
ఆయన రాజకీయాల్లోకి వచ్చాక మిమ్మల్నీ రమ్మనలేదా?
ఎప్పుడూ అడగలేదు. అప్పట్లో ఆయనా రావాలనుకోలేదు. ఎవరి ప్రభావంతో ఆ బాటపట్టారో తెలియదు.
చిరంజీవి 150 సినిమా ఊహాగానాలు వస్తున్నాయి కదా? మీరేమైనా ప్రయత్నిస్తున్నారా?
వాళ్లెవరూ నన్నడగలేదు. వేరే డైరెక్టర్ అనుకుంటున్నారని విన్నాను. ఒకవేళ అడిగితే ప్రయత్నిస్తాను.
మొత్తం ఎన్ని సినిమాలు తీశారు?
93... కొంతమంది ఒత్తిడిమేరకు కొన్ని బలవంతంగా తీయా ల్సి వచ్చింది. అవి ఫ్లాపయ్యాయి. రామారావుగారి ఒత్తిడితో బాలకృష్ణ హీరోగా ‘తిరగబడ్డ తెలుగుబిడ్డ’ తీశాను. అది ఫ్లాపవుతుందని షూటింగ్‌లోనే బాలకృష్ణ చెప్పేశాడు. అలాగే వేట సినిమా కూడా. ఆ కథ నాకు నచ్చలేదు. కానీ నిర్మాతల పట్టుదలతో తీయాల్సి వచ్చింది. అదో పెద్ద ఫ్లాప్. నాకు నచ్చి తీసిన కార్తీక పౌర్ణమి కూడా ఫ్లాప్ అయింది.
మీ అబ్బాయి హీరోగా ఎందుకు నిలదొక్కుకోలేకపోయాడు?
నాకు ఇద్దరు కొడుకులు వారిలో ఒకరు నిర్మాతగా, రెండోవా డు హీరోగా ప్రయత్నించారు. మా అబ్బాయి సినిమాకి నేను దర్శకత్వం చేశాను. అయితే అది ఫ్లాప్ అయింది. దీంతో ఇప్పటి జనరేషన్‌కు నేను అప్‌డేట్ కాలేదేమోనని అనిపించింది. ఎంతో మందికి హిట్ సినిమాలను ఇచ్చిన నేను నాకొడుక్కి హిట్ ఇవ్వలేకపోయాననే బాధ ఉంది.
క్రియేటివ్ కాంబినేషన్‌లో మళ్లీ మీరు, చిరంజీవి,యండమూరి, కేఎస్‌రామారావు కలిసి మరో సినిమా తీయవచ్చు కదా?
అభిలాష విడుదలై 30 ఏళ్లయిన సందర్భంగా ఢిల్లీలో కలిసినప్పుడు ఇదే అంశం చర్చకు వచ్చింది. కేఎస్‌ఆర్‌గారు రెడీ అన్నారు. అయితే చిరంజీవి చేస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. నాకూ తీయాలనే ఉంది.. ఏం జరుగుతుందో చూడాలి.
మీ కాంబినేషన్‌లో మరో సినిమా రావాలని, అది అద్భుత విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు.