లతాజీకి బలయింది నేనే కాదు..
ABN , First Publish Date - 2020-02-08T10:17:40+05:30 IST
ఆమె ఇంట భేటీ తర్వాతే పాటలు తగ్గాయి ‘గుడ్డీ’ నాకూ, జయ బాదురికి తొలి చిత్రం మహదేవన్ సలహాతో దక్షినాదికి వచ్చేశాను పెళ్లి ఆంధ్రాలోనే జరిగింది...పాటలు రాస్తాను కూడా 8-8-11న ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో వాణీ జయరామ్
ఆమె ఇంట భేటీ తర్వాతే పాటలు తగ్గాయి
‘గుడ్డీ’ నాకూ, జయ బాదురికి తొలి చిత్రం
మహదేవన్ సలహాతో దక్షినాదికి వచ్చేశాను
పెళ్లి ఆంధ్రాలోనే జరిగింది...పాటలు రాస్తాను కూడా
8-8-11న ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో వాణీ జయరామ్
ఇప్పుడు మీకు కాలక్షేపం ఎలా అవుతోంది?
నిజం చెప్పాలంటే ప్లే బ్యాక్ సింగర్‌గా అప్పటికన్నా ఇప్పుడే ఎక్కువ బిజీగా ఉన్నాను.
మీ గురించి ఎక్కువ మందికి తెలియదు?
‘ఇప్పుడు ఏమి చేస్తున్నార’ని అందరూ అడుగుతారు. నేను చాలా లోప్రొఫైల్ పర్సన్. రోజూ ఏంచేస్తామో ఇంటి కప్పు ఎక్కి చెప్పలేం కదా. సంగీతమంటే ఎన్నో రకాలున్నాయి. వాటన్నింటి లో స్పెషలైజ్ చేశాను.
భాషా సమస్య రాలేదా?
లేదు. మేము తమిళియన్స్ అయినా అమ్మ కర్నూల్లోనే పెరిగింది. తాతయ్య ఆంధ్రాలో డీఎస్పీగా ఉండేవారు. అమ్మవల్లే సంగీతం అబ్బింది. నా పెళ్లి సికింద్రాబాద్‌లోనే జరిగింది. అప్పుడు నేను స్టేట్ బ్యాంక్‌లో పని చేసేదాన్ని.
పెళ్లి ప్రస్తావన ఎలా వచ్చింది? మీది పెద్దలు కుదిర్చిన పెళ్లా?
పెద్దలు కుదిర్చినదే. నా భర్త వాళ్లదీ తమిళనాడే. పెళ్లి చూపులప్పుడు నా పాట విని నన్ను తన కోడలుగా నిర్ణయించేశాను అన్నారు అత్తయ్య. అయితే, వేరే జిల్లావారికి పిల్లనెలా ఇస్తామని అమ్మ అభ్యంతరపెట్టింది.అయితే, మావారు సంగీతాభిమాని కావడంతో ఏడాది తరువాత అమ్మ ఒప్పుకుంది.
ఇంత తియ్యటి గొంతుండీ పాటలు పాడటం మానేశారెందుకు?
ఆపేయలేదు. ప్రైవేట్ సాంగ్స్ ఎక్కువగా పాడుతున్నాను. అట్లాంటాలో ఉన్న అభిమాని ఇటీవలే 7 సీడీలు రికార్డు చేసుకువెళ్లారు. వాటిలో స్పానిష్, జాజ్, జానపదం అన్నీ ఉన్నాయి.
వయస్సుతోపాటు గొంతులో వణుకురాలేదు. కారణం?
నా చేతిలో ఏమీలేదు. దేవుని దయే అంతా.
ఇప్పుడు నాలుగు సినిమాల్లో పాడగానే అసిస్టెంట్లను పెట్టుకుంటున్నారు. మీరు పాపులర్ సింగరైనా వంటమనిషి కూడా లేదు?
నేను ఎల్వీ ప్రసాద్‌గారు, నాగిరెడ్డిగారు, హిందీలో నౌషాద్ గారి వంటి ఎందరో పెద్దలను చూశాను. వారినుంచే వినయం నేర్చుకున్నాను. తన స్టూడియోలో రికార్డింగ్ జరుగుతున్నా ‘వాణీజీ రావొచ్చా?’ అని ఎల్వీ ప్రసాద్ నా అనుమతి కోరేవారు.
చాలా మంది కళాకారులు అహంభావులే అయి ఉంటారు?
ఈ విషయంపైనే ‘తెరపైనే కానీ జీవితంలో నటించొద్ద’’ని ఓ కవిత రాశాను. హిందీ, తమిళ్‌లో పాటలు కూడా రాశాను. బొమ్మలు వేస్తాను. గుల్జార్‌గారి ఇంట్లో ఒక హిందీపాట రాసి చదివాను.
మీకు లతా మంగేష్కర్ ఇబ్బందులు సృష్టించారని భావిస్తారు?.
నాకనే కాదు. షంషద్ బేగం, సుమన్ కల్యాణ్ కూడా చెప్పారు. కవితా కృష్ణమూర్తి చెప్పరుగానీ, నేను మీడియాలో చదివాను.‘1942 ఎ లవ్ స్టోరీ’ కోసం ఆమెతో ఆర్డీ బర్మన్ అన్ని పాటలు పాడించారు. అయితే, ఆచిత్ర నిర్మాత కవితని ఒప్పించి, ‘కుచ్ నా కహో’ పాటని లతాజీతో పాడించారు.
మీలో ఇటు ఆధ్యాత్మిక వేత్త... అటు సంస్కర్త ఉన్నారు.. అదెలా?
విలువలన్నీ తల్లిదండ్రులు నేర్పినవే. నాకు మొదటి పాట ఇచ్చిన వసంత్‌దేశాయ్ కూడా... హిందీలో ‘గుడ్డీ’ చిత్రంలో వా రే నాతో పాడించారు. జయ భాదురికీ అది తొలిచిత్రమే. అందులో పాటకు నాకు జాతీయ అవార్డు వచ్చింది. దానికి ముందు కుమార గంధర్వ సంగీత దర్శకత్వంలో మరాఠాలో పాడాను.
దేశాయ్‌ని ఎలా కలిశారు?
పటియాలా ఘరానాకు చెందిన ఉస్తాద్ అబ్దుల్ రెహమాన్ సాబ్ నన్ను దేశాయ్‌కి పరిచయం చేశారు. అప్పట్లో మా వారు బొంబాయ్‌లో ‘బెల్గో ఇండియా చాంబర్ ఆఫ్ కామర్స్’లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. ఆయన కోసం నేను అక్కడికి బదిలీ చేయించుకున్నాను. ఆ సమయంలో హిందూస్థానీ సంగీతం నేర్చుకోమని మావారు సలహా ఇస్తే ఉస్తాద్‌జీని కలిశాం. ఉద్యోగం చేస్తూ ప్రాక్టీస్ కుదరదన్నారు. అందుకని జాబ్ మానేసి రోజుకు 8 గంలు ప్రాక్టీస్‌చేశా. దాంతో రోజూ జ్వరం వచ్చేది. అయినా, అలాగే పాడేదాన్ని. ఉస్తాద్‌జీకి వసంత్ దేశాయ్ (దాదా) స్నేహితుడు. అప్పట్లో రికార్డింగ్ థియేటర్‌లో పాడించి దాన్ని రంగస్థలంపై ప్లే చేసేవారు. అలా మరాఠా నాటకం కోసం తొలి పాట పాడాను. అదే సమయంలో హృషీకేష్ ముఖర్జీ ‘గుడ్డీ’ చిత్రంలో పాటకు కొత్త టాలెంట్ కోసం వెతుకుతుండగా దేశాయ్ సిఫార్సుతో నాకు అవకాశం ఇచ్చారు.
తొలి రోజుల్లోనే అంత పాపులర్ అయిన మీరు, దక్షిణాదికి ఎందుకు వచ్చేశారు?
హిందీలో ఆర్డీ బర్మన్, నయ్యర్ వంటి ప్రసిద్ధ సంగీత దర్శకులవద్ద పనిచేశాను. మహ్మద్ రఫీ, కిశోర్‌కుమార్, ముకేశ్ వంటి అగ్ర గాయకులందరితో పాడాను. అలాంటి సమయంలో హఠాత్తుగా నన్ను పక్కన నెట్టేసిన (డ్రాప్) భావన కలిగింది.
మీకొచ్చిన డిప్ (మునక) సహజమా? ఎవరివల్లనైనా వచ్చిందా?
మీడియాసహా అందరికీ నాకన్నా ఆ విషయం బాగా తెలుసు. మీకూ తెలుసు.ఎస్పీబీ గారు ( బాల సుబ్రహ్మణ్యం), ఏసుదాస్ గారు హిందీలో చాలా పాటలు పాడారు. ఎందుకు కొనసాగలేకపోయారు?
ఉత్తరాది సినిమాపై అగ్రనటుల పట్టు ఎక్కువ. వారు వీరిని ఎదగనివ్వలేదు.. మీ విషయంలోనూ అదే జరిగిందని భావిస్తున్నారా?
నన్ను వాళ్లు నిండు హృదయంతో ఆహ్వానించారు. ఎక్కువ పాటలు పాడేస్తున్నానని ముకేశ్‌జీ తరచూ ఆట పట్టించేవారు. ‘కాళ్లు పట్టుకు లాగేయకండి’’ అని సరదాగా అనేదాన్ని.
అయినా లాగేశారు కదా..?
ఎదుగుతున్నానని అనుకున్న సమయంలో పాటలన్నీ ఆగిపోయాయి. తెలుగులో వచ్చిన సంపూర్ణ రామాయణం చిత్రాన్ని హిందీలో తీస్తూంటే రికార్డింగ్ కోసం మద్రాస్ వచ్చా. దీనికి మహదేవన్ సంగీత దర్శకుడు. హిందీతో పాటు దక్షిణాది చిత్రాల్లోనూ పాడమని ఆయన సలహా ఇచ్చారు. అలా తమిళంలో ‘తాయింసేయం’’, మలయాళంలో ‘స్వప్నం’, తెలుగులో ‘‘అభిమానవంతులు’’ చిత్రాల కోసం పాడాను. అప్పటి నుంచి వారంలో రెండుమూడు సార్లు రావాల్సి వచ్చేది.
ఇప్పుడు మీరు, లతాజీ ఎప్పుడైనా మాట్లాడుకుంటారా?
నేను లతాజీకి పిచ్చి అభిమానిని. ఆమెను ఆరాధిస్తూనే నా బాల్యం గడిచింది. ఒకసారి లతాజీ ఇంట్లో నేపథ్య గాయకుల సమావేశం జరిగింది. ఆ తరువాత నాకు పాటలు తగ్గాయి.
మహిళా గాయకులను సంగీత దర్శకులు లోబరుచుకునేందుకు ప్రయత్నిస్తారనే అపవాదు ఉంది కదా?
ఏదైనా మనల్ని బట్టే ఉంటుంది. మీలో గట్టిదనం, క్రమశిక్షణ ఉంటే అలాంటిదేమీ జరగవు.
ఇండస్ర్టీలో రాజకీయాల వల్ల ఎన్ని సార్లు ఏడ్చారు?
చాలాసార్లు. ప్రతి వారం ఏడ్చేదాన్ని. ఒక్కోసారి మీరు పాడిన పాట క్యాసెట్‌లో ఉండదు. మరోసారి అసలది సినిమాలోనే ఉండదు. ఇంకోసారి తప్పుగా రికార్డు అవుతుంది. గత వారం కూడా ఏడ్చాను.
తెలుగులో మీకు పేరు తెచ్చిన సినిమా పాట?
శంకరాభరణం. కె.వి.మహదేవన్ సంగీత దర్శకులు. అది ‘మానస సంచరరే..’’ అనే పాట.