వేదాల్లో రాశుల్లేవు... అబద్ధాలు చెబుతున్నారు
ABN , First Publish Date - 2020-05-07T21:44:54+05:30 IST
మన దేశంలో మానవతావాదాన్ని, సైన్స్ ప్రాముఖ్యాన్ని పెంచటానికి కృషి చేస్తున్న హేతువాదుల్లో బాబు గోగినేని ప్రముఖులు. ఆయనతో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ చేసిన ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ మూఢ నమ్మకాలపైన, మత ప్రబోధకుల వ్యాఖ్యలపైనా
గ్రహాలు ఇష్టం వచ్చిన్నట్లు రాశులు మారడానికి పొలిటికల్ పార్టీలు కావు
గురుడు సూర్యుడి చుట్టూ తిరక్కుండా సింహరాశిలోకి వెళ్తానంటే ఎలా
ఆధ్యాత్మికత పేరిట వ్యాపారాలు చేస్తున్నారు.. చివరికి సైన్స్‌దే విజయం
దేవుడి రాజ్యం తెస్తానన్న వైఎస్ మజ్లిస్‌తో పొత్తు పెట్టుకోలేదా
నాకు మతం అంటే కోపం లేదు.. భక్తులు చెడ్డవారు కాదు
దేవుడిపై అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ లేదా?
సైన్సును ఆచరించండన్నాడని అభిజిత్ రాయ్‌ను చంపేశారు
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో హేతువాది బాబు గోగినేని
మన దేశంలో మానవతావాదాన్ని, సైన్స్ ప్రాముఖ్యాన్ని పెంచటానికి కృషి చేస్తున్న హేతువాదుల్లో బాబు గోగినేని ప్రముఖులు. ఆయనతో ఏబీఎన్- ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ చేసిన ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ మూఢ నమ్మకాలపైన, మత ప్రబోధకుల వ్యాఖ్యలపైనా నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు... హేతువాదిగా తన అనుభవాలను పంచుకున్నారు. 03-08-2015న ఏబీఎన్‌లో ప్రసారమయిన ఈ కార్యక్రమ వివరాలు...
ఆర్కే: హేతువాదాన్ని బలంగా ప్రచారం చేస్తున్న మీ నేపథ్యమేమిటి?
గోగినేని బాబు : మా తాతగారిది తెనాలి దగ్గర ప్రాంతం. స్వాతంత్రోద్యమం తర్వాత కరువు, పేదరికం ఉండటం చూసి, మనం చదువుకొని ఉద్యోగాలు చేస్తే ఏం లాభమని అనుకొన్నారు. అందరూ ఉద్యోగాలే చేస్తే తిండి ఎవరు పండిస్తారనేది ఆయన వాదన. అందుకే అక్కడున్న పొలాలు అమ్మి బోధన్ దగ్గరకు వచ్చి సెటిలయ్యారు. 1950లోనే మొదటి పంట వెయ్యి బస్తాల బియ్యం పండించారు. మా నాన్నగారు నా చదువుకోసం హైదరాబాద్‌కు వచ్చారు. నేనొక్కడినే సంతానం. నాన్నగారికి మెయిన్ వృత్తి నేను, ఆ తర్వాత వ్యవసాయం. నేను డిగ్రీలో మైక్రోబయాలజీ చదివాక కాలేజ్ చదువు మానేశాను. ఆ తర్వాత ఫ్రెంచ్, జర్మన్ భాషలు నేర్చుకున్నా. ఫ్రెంచ్ టీచింగ్ క్లాసులు చెబుతూ ఇతర యాక్టివిటీస్ చేసేవాడ్ని. ఇక నేను మానవతావాదుల ఉద్యమం పట్ల ఆకర్షణకు లోను కావటానికి ఎమ్.ఎన్.రాయ్ పుస్తకాల ప్రభావం చాలా ఉంది.
ఆర్కే: ఇప్పటితరంలో చాలామందికి ఎమ్.ఎన్.రాయ్‌వంటి గొప్ప మానవతావాదుల పేర్లు కూడా తెలియదు కదా.. కారణాలేమిటి?
గోగినేని బాబు : కొందరికి తెలియదు. తెలిసి చెప్పటానికి భయపడేవాళ్లు కూడా ఉన్నారు. ఒక ఉదాహరణ చెబుతాను. నేను నిజాం కాలేజ్‌లో చదివేటప్పుడు సెంటినరీ సెలబ్రేషన్స్ లాంటిది చేసుకున్నాం. జైపాల్ రెడ్డి గారిని పిలిచాం. అద్భుతంగా మాట్లాడి వెళ్లారు. డార్విన్ బై సెంటినరీ సెలబ్రేషన్స్‌కు మళ్లీ ఆయన్ని పిలిచాం. ఈ దేశంలోని రాజకీయనాయకుల్లో బెట్రాండ్ రస్సెల్ స్పెల్లింగ్ ఆయనకొక్కడికే వచ్చు. అలాంటయనను రమ్మంటే.. ‘అయ్యా ఎలక్షన్లు వస్తున్నాయి. వదిలేసేయండి’ అన్నారంట. డార్విన్ మీటింగ్‌కు రావడానికి, ఆయనెంత గొప్పవాడో చెప్పటానికి, ఆ భావాలు పాటిస్తాను అని చెప్పడానికి వెనకాడని వ్యక్తి మళ్లీ ఆ ఫంక్షన్‌కు రావటానికి భయపడ్డాడు. అంటే మన ఆలోచన చెప్పటానికి భయపడటం.. దేవుడేమైనా కేసు పెడతాడేమో అనుకోవటం.. లేకపోతే ఎవరూ ఓటేయరని అనుకోవటం వల్లే ఇదంతా.
ఆర్కే: ప్రభుత్వాల గణాంకాల ప్రకారం రెండు రాష్ట్రాల్లోని ప్రజలంతా పుష్కరాల్లో మునిగేశారు. మీరు చెప్పింది ఎవరూ వినలేదు. మీకు నిస్పృహ రావట్లేదా?
గోగినేని బాబు : అందర్ని ముంచేశారు. మా ప్రయత్నం మేం చేశాం. ప్రభుత్వాలు పనిగట్టుకుని పుష్కరాల్ని నిర్వహించాయి కాబట్టి ఏమైనా చెప్పాలంటే చాలా కష్టమైంది. పుణ్యభారత్ కోసం పనిచేశారు. రేపు స్వచ్ఛభారత్ కోసం ఎలా పనిచేస్తారో చూద్దాం. మీకో విషయం చెప్పాలి నేను ఈ మఽధ్యే ఫేస్‌బుక్‌లో చేరాను. నేను పెట్టిన పోస్ట్‌లు చూసి కొందరు మా పేరెంట్స్‌ను పుష్కరాలకు వెళ్లకుండా ఆపేశామని మెసేజ్‌లు పెట్టారు. మనం విత్తనాలు చల్లుతూ ఉంటే ఆలోచనలు అవే మొలకెత్తుతాయి.
ఆర్కే: పవిత్ర గోదావరిని బురదనీళ్లంటావా అని శాపనార్థాలు పెట్టేవారున్నారు కదా..
గోగినేని బాబు : ఉంటారు. కానీ వాళ్లు పవిత్రత అంటుంటే.. మనం స్వచ్ఛత అంటున్నాం. పవిత్రత, పాపం అనేవి రిలిజియస్ కాన్సెప్ట్స్. స్వచ్ఛత, నేరం అనేవి సెక్యులర్ కాన్సెప్ట్స్. బ్రహ్మదేవుడు ఏం చేశాడు? ఇంద్రుడ్ని రక్షించాడు. ఇంద్రుడు ఇంకెవరో భార్యతో వేరే రూపంలో వెళ్లి శారీరక సంబంధం పెట్టుకొని ఘోర తప్పిదం చేశాడు. అప్పుడు ఇంద్రుడికి ఆ రుషి శాపం ఇచ్చాడు. ఆ శాపం నుంచి కాపాడమని బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నాడు. ఈ కథలో విక్టిమ్ అహల్య. ఆమె రాయి అయిపోయింది. ఇంద్రుడ్ని మాత్రం ఈ నీళ్లలో మునిగితే నీకు బాగవుతుంది అన్నాడు బ్రహ్మ. వాస్తవానికి బ్రహ్మ నువ్వు చేసింది తప్పురా అని ఇంద్రుడ్ని తిట్టి ఉండాలి. అలా కాకుండా నువ్వు చేసిన పాపం నీళ్లల్లో మునిగితే పోతుంది అన్నారు. ఇది కథే కావొచ్చు. కథను కథగానే అర్థం చేసుకోవాలి. నా దృష్టిలో పాపానికి, నేరానికి మధ్య దూరం ఇక్కడ కనిపిస్తోంది. మన సెక్యులర్ భారతదేశంలో సెక్షన్ 497 కింద ఇంద్రుడిపై ఏ నేరం మోపాలి?
భక్తి పొంగి పొర్లిపోతోంది... కుళ్లిపోయి కంపు కొడుతోంది.
ఆర్కే: వీలైతే నిర్భయచట్టం పెట్టాలి..
గోగినేని బాబు : నా దృష్టిలో రిలిజియస్ కాన్సెప్ట్, సెక్యులర్ కాన్సెప్ట్ వేరు కాదు. ఇదేదో గిల్లటానికి చెప్పట్లేదు. ఈ 2000 సంవత్సరాల్లో రకరకాల భావనలు, విలువలూ మనదాకా వచ్చాయి. ఇవాళ మనం ఎలా బతాకాలి? మన విలువలేంటి ? మంచి అంటే ఏమనుకుంటున్నాం? ఎవరో చెబితే ఏదో చేసేది మంచి కాదు. నిజంగా మంచి అనుకుని చేస్తేనే మంచి అవుతుంది.
ఆర్కే: రాజకీయ వ్యవస్థలోని నాయకులు ప్రజల మనోభావాలను విరుద్ధంగా వెళ్లగలరా? సపోజ్- గోదారిలో మునిగితే పుణ్యం రాకపోగా చర్మవ్యాధులొస్తాయని చెబితే రెండు రాషా్ట్రల ముఖ్యమంత్రుల బతికి బయటపడతారా?
గోగినేని బాబు : పడలేరు. అందుకే పార్టీవ్యవస్థ విల్ బ్రింగవుట్ ద వర్త్ ఇన్ పీపుల్.. పొలిటికల్ లీడర్స్ విల్ రెప్రజెంట్ విల్ దెయిర్ అల్టిమేట్ బ్యాక్‌వర్డ్‌నెస్ అని ఎమ్.ఎన్.రాయ్ అప్పుడే అన్నారు. ఇక్కడ వీళ్లందరూ చేస్తోందదే. ఇక్కడ ద్రోహం ప్రజలకే కాదు.. నాగరికతకు జరుగుతోంది. ఒకప్పుడు చాలామంది ప్రాణాలు కోల్పోబట్టే మనకు ఇవాళ ఈ నాలెడ్జ్ వచ్చింది.
ఆర్కే: తెలుగురాష్ట్రాల్లో భక్తిభావం కంటే భక్తి ప్రదర్శన అధికమవుతోంది. భక్తిభావం అనేది వ్యక్తిగతం. కానీ ఈ ప్రదర్శనలు ఎక్కువయ్యాయి. కారణాలేమంటారు?
గోగినేని బాబు : ఈ థాట్ లీడర్స్ చిన్న చిన్న మనుషులు. అంటే మెదళ్లు చిన్నవి. చాలా డబ్బులుంటాయి. వీళ్లందరికీ అధికారం రావటం. మిగతావారిని తమవైపు తిప్పుకోవటానికి. వారేం చేస్తున్నారో చూసి వీరు అదే చేస్తే తమ దగ్గరికి వారందరూ వస్తారనుకోవటంతో ఇలా జరుగుతోంది.
ఆర్కే: ఇలా మీరు మాట్లాడితే... నేను మాట్లాడిస్తే.. మనల్ని మత ద్రోహులంటారేమో..
గోగినేని బాబు : అంటారు. నాకు మతమంటే కోపం లేదు. మనిషి జీవితంలో ఉండే సమాధానాలకోసం వెతుకుతున్న సమయంలో మతం పుట్టింది. జ్ఞానం ఆధారంగా ముందుకు వెళ్లినపుడు సైన్సుగా మారింది. ఒకప్పుడు మతం సైన్సుగా ఉండొచ్చు కానీ ఇపుడా పరిస్థితి లేదు. గజ్జెల మల్లారెడ్డి గారు చెప్పినట్లు భక్తి పొంగి పొర్లిపోతోంది. కుళ్లిపోయి కంపు కొడుతోంది. ఇవాళ ఆధ్యాత్మికత పేరిట వ్యాపారాలు చేస్తున్నారు. బుద్ధులు రాజ్యంలోంచి అడవుల్లోకి వెళితే.. ఈ సర్వసంగ పరిత్యాగులు అడవుల్లోంచి రాజమందిరాల్లోకి వస్తున్నారు. వీరికి ఎక్కడనుంచి డబ్బులు వస్తున్నాయి. మంచి వారైన భక్తులనుంచి వస్తున్నాయి. భక్తులు చెడ్డవారు కాదు. మంచిగా, నిజాయితీగా ఉండాలనుకుంటారు. నమ్మకాల్ని అడాప్ట్ చేసుకుంటే జీవితం సుఖప్రదంగా ఉంటుందనేది వారి ఆలోచన.
ఆర్కే: ఒకప్పుడు పశ్చిమబెంగాల్, తమిళనాడు, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లలో హేతువాదం, ఆస్తికవాదం, కమ్యూనిజం బలంగా ఉండేవి. ఆ వాదాలన్నీ తగ్గిపోయి మతవాదం ప్రబలటానికి కారణాలేమిటి?
గోగినేని బాబు : పొలిటికల్ డెవలప్‌మెంట్స్ వల్లే ఇదంతా. ఇవాళ స్పాన్సర్డ్ వేలం వెర్రి చూస్తున్నాం. మతాన్ని ఎంతమంది నమ్ముతున్నారు.? న్యూమరాలజీ నమ్మేవారు ఆటోనంబర్ చూసి ఆటో ఎక్కుతున్నారా అంటే లేదు. మతపరంగా ఐడెంటిటీ క్రియేట్ చేసే పొలిటికల్ ప్రాసెస్ ఈ దేశంలో ప్రారంభమైంది. ఇది చాలా ప్రమాదకరం. ఒక పార్టీనే అనటం లేదు. బిజెపిని మాత్రమే అనటం తప్పు. కాంగ్రెస్ నాగాలాండ్‌లో క్రిస్టియన్ రాజ్యాన్ని తెస్తామంది. పంజాబ్‌కెళ్లి ఇంకోటి అంది. అంతెందుకు దివంగత రాజశేఖర్‌రెడ్డి గారు దేవుడి రాజ్యం తెస్తానన్నారు. మరి మజ్లిస్‌తో పొత్తు పెట్టుకోలేదా? సెక్యులర్ రాజ్యమైన మన భారతదేశంలో రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ అందరూ తప్పులు చేశారు. వీళ్లను చూసుకొని సైంటిస్టులు, బ్యూరోక్రాట్స్ ఇలా మిగతావారు తయారయ్యారు. హేతువాదం గురించి మాట్లాడేవారు తక్కువయ్యారు. హేతువాదులు మతవాదులు కారు. మాటలు రాని పిల్లల్ని గుడిలోకి తీసుకెళ్లి దండం పెట్టమని, గుండు చేయిస్తానని చెప్పరు. సొంత ఆలోచనల్ని నేర్పిస్తారు. హేతువాదుల పిల్లలు హేతువాదులు అయ్యారు. వారు ఉద్యమాల్లో లేరు. పొలిటికల్ సపోర్టులేక హేతువాదం లాంటివి వెనక్కు పోయాయి.
ఆర్కే: ఇప్పుడు ఉండే వాదాలు రేప్పొద్దున క్షీణించవచ్చు కదా?
గోగినేని బాబు : హేతువాదం వెలుగును చూసి మతాలు పారిపోతున్నాయి. 1800 సంవత్సరంలో జన్యుశాసా్త్రనికి సంబంధించి ఎలాంటి పరిశోధనలు చేయవద్దని శాస్త్రవేత్తల్ని క్రిస్టియన్లంతా అడ్డుకున్నారు. దేవుడికి వ్యతిరేకమన్న వారు వందేళ్ల తర్వాత ఇంకోలా మాట్లాడారు. ఇవాళ మనదేశంలో జరుగుతోంది అదే. ఈభాషలో నుంచి ఇంకో భాషలోకి తర్జుమా చేస్తేనే తప్పన్నారు. ఇది దైవభాష అన్నారు. తర్వాత వీటినన్నింటినీ ఎదుర్కోలేక చివరికి నారదుడు అన్ని లోకాలు తిరగలేదా అని చెప్పారు.
చట్టం అనేది ఇమ్మోరల్ లా
ఆర్కే: నిజాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
గోగినేని బాబు : నేను లండన్‌లో ఉద్యోగం చేస్తున్నపుడు ఫండ్ రైజింగ్ చేసి యునైటెడ్ నేషన్స్‌లో ‘సెంటర్ ఫర్ బయోథిక్స్’ స్థాపించాను. బైబిల్‌లో లేనివి ఏమీ చేయకూడదా? అనేది నా ప్రశ్న. నిజాన్ని అర్థం చేసుకోవటానికి విశ్వాన్ని పరిశీలించాలి. అదే చేయరు. చివరగా చెప్పేదేంటంటే సైన్స్ చివరికి విజయం సాధిస్తుంది. ఇవాళ వీరు సైన్సుతో పోరాడలేక మన ప్రభుత్వాలతో ఏకీభవిస్తున్నారు. కంచెఐలయ్య దేవుడి గురించి ఓ ఆర్టికల్ రాశారట. ఆయన మీద కేసుపెట్టారు.
ఆర్కే: మా దగ్గరే. ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఐలయ్యతో పాటు మా ఎడిటర్ , నా పైన కూడా కేసు పెట్టారు.
గోగినేని బాబు : అంటే దేవుడిపై అభిప్రాయం చెప్పే స్వేచ్ఛలేదా?
ఆర్కే: ఫిర్యాదు చేయటం వేరు. కాని, చిత్రం ఏంటంటే ఆ ఫిర్యాదు తీసుకున్న పోలీస్ ఆఫీసర్ మేం దర్యాప్తు చేశాం. మీ పాత్ర ఉందని అన్నారు ఏకపక్షంగా.
గోగినేని బాబు : ఐలయ్యగారు కించపరుస్తూ రాయలేదు.
ఆర్కే: అది మతపరంగా కాదు.. ప్రభుత్వపరంగా జరుగుతున్న దాడిలేండి. ఫిర్యాదు చేసినవారు టూల్ మాత్రమే. ఫిర్యాదును ఎంటర్‌టైన్ చేసింది వారే.
గోగినేని బాబు : నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ చెప్పాలి. అదేంటంటే పాకిస్తాన్‌లో డాక్టర్ యూనిషేక్ అరెస్టయ్యారు. నాకా విషయం తెలీదు. నాకు ఓ రోజు ఈమెయిల్ వచ్చింది. దైవదూషణ చేశారని డాక్టర్ యూనిషేక్‌ను పోలీసులు కొట్టుకుంటూ తీసుకెళ్లారు. మరణశిక్ష విధిస్తారు. ఒక సిగరెట్ ముక్కపై ఆయన మీ ఇ- మెయిల్ అడ్రస్ రాసిచ్చి మీకు చెప్పమన్నారు అని రాశారు. పాకిస్తాన్‌లో ఉండే ఆయన నా ఇ- మెయిల్ అడ్రస్ గుర్తుంచుకొని ఎవరికో ఇచ్చి సమాచారం పంపమన్నారు. పన్నెండు దేశాలను ఇన్వాల్వ్ చేసి పాకిస్తాన్ గవర్నమెంట్ ముక్కును నేలకు రాసి యూనిషేక్ గారిని విడిపించాం. యూరప్‌కు తీసుకెళ్లాం. ఇంతకీ ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేశారంటే.. అక్కడ ఓ డిష్కషన్ జరుగుతోంటే పీక్ టాక్స్‌లో కశ్మీర్ మనకు దేనికి? అన్నారట ఆయన. రెండోరోజు ప్రవక్త జీవితంపై ఏదో మాట్లాడావనే నేరం చూపి అరెస్ట్ చేశారు. దైవదూషణ చట్టాన్ని ఇలా దుర్వినియోగం చేస్తున్నారు. చట్టం అనేది ఇమ్మోరల్ లా. ఇలా ఆలోచించాలి, ఇలా ఆలోచించకూడదు అనటమేంటి.
ఆర్కే: ఇలాగ ఇక్కడ మాట్లాడుతున్నాం కానీ అదే ఇస్లామిక్ దేశాల్లో మతంపై మనం మాట్లాడి బయటకు వచ్చేసరికి మనల్ని ఏమైనా చేస్తారు కదా
గోగినేని బాబు : చంపేస్తున్నారు. బంగ్లాదేశీ అయిన నామిత్రుడ్ని ఆ దేశంలో చంపేశారు. తస్లీమా నస్రీన్‌ను చంపబోయారు. ఆవిడతో మేమంతా అక్కడ ఉన్నాం. ఆవిడ బయటికొచ్చింది. మాతో పనిచేసింది. ఆమె నా పేరుతో ఫ్రెంచ్ లవర్ నవలలో ఓ క్యారెక్టర్‌ను క్రియేట్ చేసింది. కొంచెం కంత్రీ క్యారెక్టర్ అది ... కానీ పేరు వాడింది. దురదృష్టవశాత్తూ అభిజిత్ రాయ్ తన కుటుంబాన్ని చూడటానికి ఢాకా వెళ్తే చంపేశారు. ఆయన చేసిన నేరం ఏమీ లేదు. సైన్సును ఆచరించండి.. ఆధునికంగా ఆలోచించండి అన్నాడంతే. ప్రజల శ్రేయస్సుకోరి చెబితే అలా జరిగింది. సౌదీ అరేబియాలో నాస్తికులందరూ టెర్రరిస్ట్‌లని రాజుగారు చట్టం పాస్ చేశారు. ఏది టెర్రరిజం, ఏది ఆలోచన, ఏది స్వేచ్ఛ?
నేను బిర్యానీ వండుకొని తిన్న కోడి మళ్లీ పుడితే ఇబ్బందే కదా
రాశులు ఒక దాని నుంచి మరొక రాశిలోకి వెళ్లటమే విడ్డూరం. గురుగ్రహమేంటీ? ఆ గురుగ్రహానికి బ్రాహ్మణ కులం ఏంటి? గురుడు సూర్యుడి చుట్టూ తిరగాలి. అలాంటి ఆయన సింహరాశిలోకి వెళ్తానంటే సూర్యుడు ఊరుకుంటాడా?
ఇలా ఆయన ఒక నది నుంచి మరొక నదికి ఎలా జంప్ చేస్తుంటాడు? ప్రతి సంవత్సరం ఇలా ఇష్టం వచ్చినట్లు జంప్ చేయటానికి ఇదేమైనా పొలిటికల్ పార్టీనా? గురుత్వాకర్షణ శక్తి ఒప్పుకోదు. ఇలాంటివన్నీ ఫన్నీ స్టోరీస్. నవగ్రహాలుండటం ఏంటి? రాహువు, కేతువు లేంటి?.
ఆర్యభట్టుడు, బుద్ధుడు వంటివారు పుట్టిన దేశం ఇది. వేదాల్లో రాశుల్లేవు. అబద్ధాలు చెబుతున్నారు. అంతా వేలం వెర్రిగా చేస్తున్నారు. మన మతం, విశ్వాసం పట్ల గౌరవం ఉంటే నిజంగా అది ఏం చెప్పిందో తెలుసుకోవాలి.
టీవీ డిష్కషన్స్ తర్వాత కెమెరా ఆఫ్ చేశాకనే ఇబ్బందులొస్తాయి. శాంభవి కేసులో నేను ఒక తండ్రిగా, మానవతావాదిగా స్పందించాను. ఒక బిడ్డను బిడ్డగానే చూడాలి. ఆమెకు అతీంద్రయశక్తులు ఆపాదించటమేంటి, పునర్జన్మ ఏంటి? దలైలామా బాల్య స్నేహితుడు ఈ పాపగా పుట్టాడని.. టెలిపతీ ద్వారా అన్నీ తెలుస్తుంటాయని చెప్పారు. మరి సెల్‌ఫోన్ ఎందుకు వాడుతున్నారు? అసలు చచ్చిపోయినవాళ్లందరూ మళ్లీ పుడితే ఎంత సమస్య?
నేను బిర్యానీ వండుకొని తిన్న కోడి మళ్లీ పుడితే ఇబ్బందే కదా. ఎంత రెడిక్యులస్. వీళ్లను ఎంకరేజ్ చేసిన వారిలో చాలామంది ఉన్నారట. ఆ సమయంలో ుపిల్లల్లో దేవుడు్ అనే హెడ్డింగ్‌తో వచ్చిన కథనాన్ని ఆధారంగా కేసు పెట్టా. స్టూడియోల్లో కూర్చోపెట్టి ఆ అమ్మాయి చేత మాట్లాడించటం తప్పని అందుకే కేస్ పెడతాౄనని ఛానల్ వాళ్లకు చెప్పా. నా వాదనను అర్థం చేసుకుని మీడియా ఈ కేసులో నాకు అండగా ఉంది. చివరకు పిల్లల్లో అతీతశక్తులున్నాయని చెప్పటం మానవోల్లంఘన అని ఆదేశాలు జారీ అయ్యాయి.
విదేశాల్లో టాప్ సైంటిస్టులు క్రియేషనిజం ఒప్పుకోరు. ఇక్కడ అందరూ ఒప్పుకుంటారు. నాయుడమ్మ గారు ఓ సందర్భంలో ుమనదేశంలో సైంటిస్టులు చొక్కా విప్పుకొని లోపలికి వెళ్తారు. తర్వాత మతచొక్కా వేసుకొని తిరిగి బయటకు వెళ్తారు్ అన్నారు. ఇది నిజం. రాకెట్ ప్రయోగాల ముందు వెంకటేశ్వర స్వామిని దర్శించటంపై కూడా చాలాసార్లు ప్రశ్నించా. రాకెట్ సంస్కృతం కారణంగా పైకి వెళ్తుందా.. లేక సైన్స్ వల్లనా? దాంట్లో ఫ్యూయల్ లేకుండా .. యాభైమంది పండితులు శ్లోకాలు చెబుతుంటే పైకి పోతుందా..?
జోతిష్య శాస్త్రం ఆధారంగా మనదేశంలో రెండువేల ఐదువందల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోంది. కనీసం దీన్ని కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కిందికి తీసుకెళ్లాలి అంటాన్నేను. ప్రజాస్వామ్యానికి మూఢనమ్మకాలు సమస్యలు.
ఒక్కోదేశంలో ఒక్కోసృష్టి కథ ఉంటుంది. సృష్టికర్త లేడు. ఏదైనా సృష్టించి ఉంటే వాడు మనిషై ఉంటాడు. వాడి మెదడులో వాస్తవాలు లేనపుడు అందమైన కథలొచ్చాయి. అసలు నిజంగా డివిజన్ ఉంటే- ఆరు బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. మనందరం ఒకటి అని చెప్పింది డార్విన్. అంతేకాని మతాలు కాదు. నా అభిప్రాయం ఏంటంటే ఎంతోమంది మంచి వాళ్లు తమ మోక్షం కోసం దారి వెతుక్కుంటుంటే వారిని కొంతమంది మోసం చేస్తున్నారు. మిస్ గైడ్ చేయటం మంచిది కాదు. ఫలానా కులం వ్యక్తికి దానం చేస్తే పుణ్యం వస్తుంది అన్నారు. ఆకలితో ఉన్నవారికి దానం చేయాలి కదా.
అంటరానితనం జపాన్‌లో ఉండేది. బుద్ధిస్ట్, హిందూ, ఇస్లాంలో, ఆఫ్రికాలో ఉండేది. ఇది మనిషి రోగం. కులం అనేది రోగం అంటాన్నేను. కులాల్ని పోగొట్టాలానే వారందరూ కులాల్ని పటిష్టం చేస్తున్నారు. వాటిని ఆపాలి. ఆంబేద్కర్‌ను గుంజుకెళ్లి దళితవాడలో కూర్చోబెడుతున్నారు. ఆయన మానవచరిత్రలో అతి గొప్పవ్యక్తి. ఆయన నుంచి స్ఫూర్తి తెచ్చుకోవాలి
నా మార్గం కరెక్ట్‌గా ఉంది. ఔట్‌రీచ్ ఇపుడిపుడే డెవలప్ అవుతోంది. రెండ్రోజుల్లో వెయ్యిమంది షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు నెట్‌లో. పదేళ్లు లండన్‌లో వర్క్ చేసినపుడు ఆర్థికంగా స్టెబిలిటీ వచ్చింది. నేను స్కిల్ గురుగా సాఫ్ట్‌స్కిల్స్ చెప్పే బిజినెస్ చేస్తున్నా. ఫ్రెంచ్, జర్మన్, జపనీస్, స్పానిస్ ఐటీ ప్రొఫెషనల్స్‌కు చెబుతున్నాం. శ్రీశ్రీ రవిశంకర్ లాంటి వాళ్లు ఊపిరి తీసుకోవటానికి డబ్బులు తీసుకుంటున్నారు. అట్‌లీస్ట్ నేను కొత్త భాష నేర్పడానికి డబ్బులు తీస్కుంటున్నా.