నాకు ఉత్తరాలు రాసే స్త్రీ పురుషుల్లో అదే తేడా..
ABN , First Publish Date - 2020-05-12T18:11:57+05:30 IST
దేవుడు ఉన్నాడు అనే ఆస్తికత్వానికి, లేడు అనే నాస్తికత్వానికీ పోరాటం ఈనాటిది కాదు. కరుడుగట్టిన శివభక్తుల కుటుంబంలో పుట్టిన గోరా... నాస్తికోద్యమాన్ని విస్తృతం చేశారు. కులం, మతం, మూఢవిశ్వాసాల మీద తిరుగుబాటు చేసి.. లక్షల మందిని ఆలోచింపజేశారు.
సెక్స్ అంటే శరీరాల కలయిక కాదు.. నాన్న సూచనతోనే సెక్సాలజిస్ట్‌గా మారా
నా పిల్లలకు నేను సంబంధాలు చూడలేదు.. మీరే చూసుకోండన్నా..
క్యాస్ట్ చోట ‘నిల్’ రాసినందుకు నాకు లయోలాలో సీటివ్వలేదు
నాస్తికత్వం మనిషిని గౌరవిస్తుంది.. దేవుడు లేడన్న మా నాన్నను ఉద్యోగంలోంచి తీసేశారు..
కూతుర్ని హరిజనుడికిచ్చి పెళ్లి చేస్తానని మా నాన్న అంటే గాంధీజీ ఆశ్చర్యపోయారు
ఇది పద్దతి కాదని చిరంజీవికి చెప్పినా ఆయన వినలేదు..
చిరంజీవి రాజకీయాల్లోకి రాకుండా ఉంటే బాగుండేది..
పార్టీలోకి రమ్మని వైఎస్ పిలిచారు.. ధన రాజకీయాలు ఇష్టం లేదని చెప్పా
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో డాక్టర్ సమరం
దేవుడు ఉన్నాడు అనే ఆస్తికత్వానికి, లేడు అనే నాస్తికత్వానికీ పోరాటం ఈనాటిది కాదు. కరుడుగట్టిన శివభక్తుల కుటుంబంలో పుట్టిన గోరా... నాస్తికోద్యమాన్ని విస్తృతం చేశారు. కులం, మతం, మూఢవిశ్వాసాల మీద తిరుగుబాటు చేసి.. లక్షల మందిని ఆలోచింపజేశారు. అలాంటి కుటుంబంలో పుట్టిన సమరశీలి డాక్టర్ సమరం. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ నిర్వహించే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో ఆయన తన మనోభావాలను పంచుకున్నారు. 14-09-2015న ఏబీఎన్‌లో ప్రసారమయిన ఈ కార్యక్రమ వివరాలు...
ఆర్కే : భారతదేశంలో నాస్తిక ఉద్యమానికి ఆద్యులు గోరా గారు అని చెప్పవచ్చు. శివభక్తుడి కొడుకు నాస్తికుడు ఎలా అయ్యారు? అసలు ఆయనకు ప్రేరణ ఏమిటి?
సమరం : అంటరానితనం ఏమిటి? అసమానతలు ఏమిటి? దేవుడేంటీ అనే అంతర్మథనం నాన్న గోరాలో మొదలైంది. ఆయనకు 22 ఏళ్లప్పుడు పెళ్లయ్యింది. మా పెద్దక్కయ్య పుట్టాక.. సమాజంలో ఇలాంటి ఆచారాలు ఏంటీ అని జంధ్యం తీసి పడేశారు. వెంటనే తాతయ్య గారు మా నాన్నను ఇంటి నుంచి వెళ్లగొట్టారు. ‘కులంలో చెడపుట్టావు. కులద్రోహివి నువ్వు’ అని తిట్టారు. నాన్న కుటుంబాన్ని తీసుకుని బ్రహ్మసమాజానికి చెందిన ఒకరి ఇంటి బయటున్న ఓ అరుగు మీద తడికెలు వేసుకుని కాపురం పెట్టారు.
ఆర్కే : అసలు మీ కులమేంటి?
సమరం : మా తాత గారు బ్రాహ్మణులు. ఆరు వేల యోగుల్లో మా తాత గారు ఉండేవారు. ఆయన గొప్ప శివభక్తులు. శివతాండవం చేసేవారు. అలాంటి వారి కడుపున మా నాన్న పుట్టారు.
ఆర్కే : మీ బాల్యం ఎలా ఉండేది?
సమరం : నేను పుట్టిన ఆర్నెల్ల తర్వాత మా నాన్న సస్పెండ్ అయ్యారు. ఇన్నిసార్లు సస్పెండ్ కావటం ఎందుకు.. అని ఆలోచించి ఉద్యోగానికి రాజీనామా చేశారు. సంపాదించింది విద్యార్థులకు దానం చేసి పూర్తిగా కట్టుబట్టలతో బయటికి వచ్చారు. ఓ గ్రామానికి వెళ్లి అక్కడ నాస్తిక ఉద్యమాన్ని 1940లో ఏర్పాటు చేశారు. పదేళ్లపాటు చిల్లిగవ్వ లేదు. ఆరేళ్ల వయసులో నేను గాంధీజీని చూశాను. ఇప్పటికీ ఆయన లీలగా కనిపిస్తుంటారు. గాంధీ అంటే హరేరామ, రాట్నం అనుకుంటాం గానీ.. గాంధీయిజంలో మానవత్వం ఉంది, సేవ ఉంది. అలాగే నాస్తికత్వం మనిషిని గౌరవిస్తుంది. ‘నాస్తికత్వానికి వాస్తవిక, సంఘదృష్టి, వ్యక్తిత్వం ఉండాలి’ అని పదే పదే చెప్పేవారు నాన్న.
ఆర్కే : మీ నాన్న నాస్తిక ఉద్యమాన్ని నడిపించిన ఈ ప్రాంతంలో భక్తి పరవళ్లు తొక్కుతోంది కదా?
సమరం : ఇదంతా పాలిటిక్స్. మనిషిలోని మౌఢ్యాన్ని పెంచి పోషిస్తున్నారు పాలకులు. పుష్కరాల్ని ప్రభుత్వాలు స్పాన్సర్ చేయడమేంటి ? తప్పు. పుష్కరుడు అనేది ఊహాగానం. అసలు పుష్కరాల సమయంలో నీటిలో మునిగితే పాపాలు పోవడమేమిటి? మతం, ఆచారం వ్యక్తిగతం. ప్రశ్నించే గుణాన్ని చంపేశారు. జిజ్ఞాసను సమాధి చేస్తున్నారు. అందుకే ఈ దేశంలో బాబాలు తయారయ్యారు. భక్తి వ్యాపారం అయ్యింది. శాస్త్రవేత్తలు కూడా మతం అంటూ విజ్ఞతను కోల్పోతున్నారు.
రెండో ప్రపంచ యుద్ధ సమయం కాబట్టే ‘సమరం’ పేరు
ఆర్కే : గోరా గారు తొమ్మిదిమంది సంతానానికీ విచిత్రమైన పేర్లు పెట్టారేంటీ?
సమరం : మా నాన్న సిలోన్‌లో పని చేసేటపుడు మా పెద్దక్కయ్యకు ‘మనోరమ’ అని పేరు పెట్టారు. నాన్న స్వాతంత్య్ర ఉద్యమంలో ఉన్నప్పుడు అన్నయ్యకు ‘లవణం’ అని, రెండో అక్కయ్యకు ‘మైత్రి’ అని పెట్టారు. గాంధీ అందరికీ విద్య ఉద్యమం చేసినప్పుడు మూడో అక్కయ్య పుట్టింది. దాంతో ఆమెకు ‘విద్య’ అన్న పేరు ఖరారైంది. కాంగ్రెస్ ఆరు రాష్ట్రాల్లో విజయం సాధించిందని అన్నయ్యకు ‘విజయ్’ అని పేరు పెట్టారు. 1939లో రెండో ప్రపంచ యుద్ధ సమయం కాబట్టి నాకు ‘సమరం’ అనే పేరు పెట్టారు. స్టాలిన్, హిట్లర్ యుగంలో తమ్ముడు పుట్టాడని ‘నియంత’ అని పేరు పెట్టారు. స్వాతంత్య్రం వచ్చే ముందు మా చెల్లెలు పుట్టిందని ‘మారు’ అని పేరు పెట్టారు. చివరి చెల్లెలు పేరు ‘నౌ’. హిందీలో ‘నౌ’ అంటే తొమ్మిది కాబట్టి.. అందులోను స్వాతంత్య్రం వచ్చిన సమయంలో తక్షణ కర్తవ్యం ఏమిటి అన్న అర్థంలో ఆ పేరు పెట్టారు. ఆ తర్వాత అక్కయ్య, అన్నయ్య పిల్లలకూ సందర్భానుసారంగా ఇలాంటి పేర్లు పెట్టాం. మా కుటుంబ సభ్యులందరికీ కలిపి 59 మంది పిల్లలు ఉన్నారు. నా ఇద్దరు కూతుళ్లకీ పెళ్లి సంబంధాలు చూడలేదు. మీరే చూసుకొని పెళ్లి చేసుకోమని చెప్పాను. పిల్లలకు పెళ్లిళ్లు అయ్యాక అల్లుళ్ల్ల కులాలు చాన్నాళ్లకు తెలిశాయి. అంతేకాని ఏనాడూ మీదే కులమని అడగలేదు.
ఆర్కే : కులం అనేది ఈ దేశంలో రియాలిటీ?
సమరం : హరిజనులను ఊరి బయట పెట్టడమేమిటి. వాట్ ఈజ్ హ్యుమానిటీ. అందరూ దేవుని బిడ్డలే కదా!
ఆర్కే : మీరు అసంకల్పితంగా అందరూ దేవుని బిడ్డలే అన్నారు చూశారా?
సమరం : తప్పుదిద్దుకున్నా. ‘అందరూ దేవుని బిడ్డలే అంటారు’ కదా అనాలి. మనలో హిపోక్రసీ ఉందంటే.. ఆస్తికత్వం అంతా హిపోక్రసీయే.
ఆర్కే : మీకు ఎదురైన సమస్యలు మీ బ్రదర్స్, సిస్టర్స్ కు ఎదురుకాలేదా?
సమరం : మెదక్‌జిల్లాలో చేతబడి, బాణామతి దురాచారాలు చాలా ప్రబలంగా ఉండేవి. ‘పోలీసుల లాఠీలకు ఈ మౌఢ్యం లొంగలేదు.. నువ్వు వచ్చి చూడు సమరం’ అని ఎస్పీ అరవిందరావు ఉత్తరం రాశారు. మేం జోగిపేట అనే పారంతానికి వెళ్లాం. అక్కడ కొన్ని వందల మంది ఈ దురాచారాలను నమ్ముతున్నారు. ‘మీరేం భయపడాల్సిన అవసరం లేదు.. పెద్ద డాక్టర్లు వస్తారు..’ అని పోలీసులు వారికి చెప్పారు. మేం అక్కడ ప్రజలకు చేతబడి, బాణామతి గురించి చెప్పటానికి ప్రయత్నించాం. కానీ వారిలో కొందరు తిరగబడ్డారు. పోలీసుల సమక్షంలోనే మాపై దాడి చేశారు. ఆ రోజు పోలీసులు రక్షించకపోయి ఉంటే మా శవాలు విజయవాడకు వచ్చేవి. ఆ మౌఢ్యం అలా ఉంటుంది. వికారాబాద్‌లో ఒకసారి చేతబడి చేశాడని ఒకాయన్ని పళ్లు ఊడగొట్టి చెట్టుకు వేలాడేశారు. మేం అక్కడికి వెళ్తే.. నన్ను అక్కడ నుంచి వెళ్లగొట్టేశారు. మంత్రాలు లేవు తంత్రాలు లేవు. అన్నీ వొట్టివే. డబ్బుల కోసం కొన్ని టీవీ చానెల్స్ వారు వీటిని ప్రోత్సహిస్తున్నారు.
ఆర్కే : ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్ నుంచి సెక్సాలజిస్ట్‌గా ఎలా మారారు?
సమరం : నేను మెడిసిన్ చదివే సమయంలో నాన్న దగ్గరకు వెంకట్రావు అనే బి.ఎ. చదివిన కుర్రాడొచ్చాడు. అతనిదో వింత గాధ. వెంకటరావుకు పెళ్లి అయిన తర్వాత- శోభనం రోజున అమ్మాయి కాళ్లు పట్టుకొని- ‘నేను సంసారానికి పనికిరాను. నేను హస్తప్రయోగం చేసుకున్నా. అపార వీర్యనష్టం జరిగింది. నపుంసకుణ్ణి’ అని చెప్పాడట. నీకు రెండెకరాల పొలం ఇస్తానన్నాడట. అతను ఒక సైకిల్ షాపు పెట్టాడు. ఈ విషయం తెలుసుకొని కొందరు అతనిని నాన్నగారి దగ్గరకు తీసుకువచ్చారు. మా నాన్న అన్ని విషయాలు ఆ కుర్రాడికి వివరించి చెప్పారు. ఆ తర్వాత వెంకట్రావు మారాడు. ఆ సమయంలో నాన్న నన్ను పిలిచి ‘డాక్టరుగా ఇలాంటి మూఢనమ్మకాలను రూపు మాపాలి’ అన్నాడు. మా కాలేజీ ప్రొఫెసర్ దగ్గరకు కూడా ఒక ఐఏఎస్ ఇలాంటి సమస్యతోనే వచ్చాడట. ఈ రెండు సంఘటనల స్ఫూర్తితో నేను సెక్సాలజిస్ట్‌గా ప్రాక్టీస్ పెట్టాను. కాలేజీలోని కుర్రాళ్లతో నేను క్లోజ్‌గా ఉండేవాడిని. ‘సమరం ఎక్కడ ఉంటే అక్కడ సందడి ఉంటుంది’ అనేవారు. 1974లో విజయవాడలో ఆల్ ఇండియా రేడియోలో ‘సెక్స్ గురించి అపోహలు’ టాపిక్‌పై మాట్లాడాను. అంత ఓపెన్‌గా అప్పటివరకూ ఎవరూ మాట్లాడలేదు. ఆల్ ఇండియా రేడియోకు పదివేల ఉత్తరాలు వచ్చాయి. ఆ ప్రశంసలు చూసి.. ‘ఆల్‌ఇండియా రేడియో చరిత్రలో ఇన్నేసి ఉత్తరాలు ఎన్నడూ రాలేదని’ వారు చెప్పారు.
స్త్రీలకూ, పురుషులకూ అదే తేడా..
పత్రికల్లోకి కూడా ఎంటరయ్యారు...
అదే టైంలో ఈనాడు దిన పత్రిక వైజాగ్ ఎడిషన్ మొదలవుతోంది. నా మాటలు రేడియోలో విని రామోజీరావు గారు నాకు ఓ ఉత్తరం రాశారు. ‘ఎప్పటి నుంచో ఈ సమస్య గురించి అనుకుంటున్నా. దీని గురించి పత్రికలో రాయి. చాలా అపోహలున్నాయి’ అని రామోజీ గారు రాస్తే ‘నాకేం పెద్దగా తెలీదు. ఏదో తెలిసింది చెబుతున్నా’ అన్నాను. ఆ తర్వాత ఈనాడు పత్రిక పెట్టిన మూడో రోజున ‘సెక్స్ సైన్స్’ అనే కాలమ్ రాశాను. దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఏడు సంవత్సరాలు ఆర్టికల్స్ రాశాను. ఆ పత్రిక ద్వారా ఆరు లక్షల ఉత్తరాలు వచ్చాయి. ‘స్వాతి’లో రాసేటప్పుడు రోజుకి వేయి ఉత్తరాలు వచ్చేవి. సాధారణంగా మహిళలు సమస్యను వివరిస్తూ పెద్ద ఉత్తరాలు రాస్తారు. పురుషులు తక్కువ రాస్తారు. ఎక్కువ రాస్తే మహిళలని.. తక్కువ రాస్తే పురుషులని అర్థం చేసుకోవచ్చు.
ఆర్కే : ఇలాంటి సమస్యలు అన్ని దేశాల్లో కూడా ఉంటాయి కదా?
సమరం : అక్కడ పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది. మా మనవరాలు వెస్ట్‌ఇండీస్‌లో ఉంటుంది. ఏడేళ్ల వయసుకే ఆ పిల్లకు శరీరానికి సంబంధించిన అన్ని విషయాలు తెలుసు. దీనికి కారణం అక్కడ ఈ విషయాలకు సంబంధించిన విషయాలు స్కూల్లో చెబుతారు కాబట్టి. మన దేశంలో కూడా హై స్కూల్ నుంచే సెక్స్ ఎడ్యుకేషన్ ఉండాలి.
ఆర్కే : అయితే దీన్ని కొందరు ప్రతిఘటిస్తున్నారు కదా?
సమరం : వారిని మూఢులు అనవచ్చు. వీళ్లందరూ ‘‘సమరానికి మతి చెడిందా.. సమరం ఒక బూతు, సమరానికి బుద్ధి ఉందా’’ అనే పుస్తకాలు వేశారు.
ఆర్కే : మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు?
సమరం : చిరంజీవితో నాకు పదేళ్ల నుంచి మంచి అనుబంధం ఉంది. ఓ సారి ఫోన్ చేసి నా గైడెన్స్ కావాలన్నారు. అతను మంచి వ్యక్తి. ఆయనలో మంచి భావాలున్నాయి. ప్రజాకర్షణ ఉంది కదా అని ఎంకరేజ్ చేశాను. కులరాజకీయాలు తీసుకురాడనే నమ్మకంతో ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లాను. ఆ పార్టీకోసం కృషిచేశాను. మార్పుకోసం పార్టీ పని చేస్తుందని త్యాగం చేశాను.
ఆర్కే : మీరు ఎప్పుడు అసంతృప్తి చెందారు?
సమరం : పార్టీలోకి జంప్‌జిలానీలు వచ్చినపుడు బాధపడ్డాను. చిరంజీవి గారితో ‘ఇది పద్ధతి కాదు. మీ అభిమానులు మీకు బలం’ అని చెప్పాను. ఆయన వినలేదు. చివరికి పార్టీసీట్లు ఎవరెవరికో వెళ్లిపోయాయి. జంప్‌జిలానీలు వచ్చి చిరంజీవిని హైజాక్ చేశారు. ‘రాజకీయ అనుభవం సరిపోలేదు. అభిమానులు కాదని.. తక్కిన వారికి పెద్ద పీట వేశారు’ అని ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో అన్నాను. అంతేగానీ చిరంజీవి గారిని ఏమీ అనలేదు. ఆయన రాజకీయాల్లోకి రాకుంటేనే బావుండేది. ఆయనపై ఇప్పటికీ గౌరవం ఉంది.
ఆర్కే : మీరు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారా?
సమరం : కొత్త రాజకీయాలు వస్తే మళ్లీ రాజకీయాల్లోకి వస్తాను. ప్రజారాజ్యం పార్టీనుంచి బయటికి వస్తూనే వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ‘డాక్టర్ గారూ మా పార్టీలోకి రండి’ అని అడిగారు. ‘ధన రాజకీయాలు ఇష్టం లేదు’ అని చెప్పాను. సి.ఎం పిలిస్తే ఎందుకు రాలేదు..? అని ఒకాయన నా దగ్గరికొచ్చి రాజకీయం నెరిపారు. మంచి రాజకీయాలకు ఏదో ఒక రోజు మంచి సమయం వస్తుందని నేను ఇప్పటికీ ఆశిస్తున్నాను.
ఆర్కే: మీరే ప్రశ్నలు, జవాబులు రాసుకుంటారట కదా..?
సమరం : ఇది కొందరు కావాలని చేస్తున్న ప్రచారం. సెక్స్‌కు సంబంధించిన విషయాలలో చాలా మంది సలహా కోరుకుంటారు. వీరికి అనేక అనుమానాలుంటాయి. మనిషికి పెళ్లి అయినా కాకపోయినా సెక్స్ విజ్ఞానం ఉండాలి. సెక్స్ అంటే శరీరాల కలయిక కాదు. రొమాంటిక్ మూడ్ ఉండాలి. సెక్స్‌ను ఎంజాయ్ చేయటం చాలా మందికి తెలీదు. ఉదాహరణకు కొందరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లనే తీసుకుందాం. వారిలో చాలా మంది ఒత్తిడితో ఉంటారు. వారి బుర్రల్లో బాస్‌లు, క్లయింట్స్ తిరుగుతూ ఉంటారు. నా దగ్గరకు వచ్చే వారిలో ఇలాంటి వారే ఎక్కువ. అంతే కాదు. ఎనభై శాతం సాఫ్ట్‌వేర్ వారే విడాకులు తీసుకుంటున్నారు. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈ తరం అమ్మాయిలు బాగా మారారు. ముందులా పడి ఉండటం లేదు.
పెళ్లిలో ‘సత్యసాక్షిగా’ అని చేశాను.’
ఆర్కే : మన సమాజం ఇంత ఓపెన్‌గా మాట్లాడటానికి రెడీగా ఉందా?
సమరం : ఇపుడిపుడే మారుతోంది. మా ఇంట్లోని అమ్మాయిల్ని క్లాసుల్లో కూర్చోబెట్టి, మిగతా వారితో పాటు వారికీ సెక్స్ ఎడ్యుకేషన్ గురించి చెప్పాను. ఆడపిల్లలైతే ఒకటీ అబ్బాయిలైతే ఒకటీ కాదు కదా. ముందు నా ఇంట్లో వారికి చెప్పి మిగతా వారికి చెబితే వింటారు. గోరా అబ్బాయిగా నమ్మినదాన్ని ఆచరించాను.
ఆర్కే : కౌన్సెలింగ్ పెరిగితే ప్రయోజనముంటుందా?
సమరం : కొందరు డాక్టర్లు కూడా మోసం చేస్తున్నారు. చాలా మంది డాక్టర్లకు కూడా సెక్స్ విజ్ఞానం తెలియదు. అందుకే సమాజంలో అన్ని వర్గాలు నా దగ్గరకు వస్తారు. మన దగ్గర సెక్స్ విజ్ఞానాన్ని పెంచే సెంటర్లు పెరగాలి.
ఆర్కే : లవణం గారు పోయిన విషాదం నుంచి కోలుకున్నారా?
సమరం : చాలా బాధాకరమైన విషయం. ఆయనే మాకు పెద్దదిక్కు. నాన్నగారి తర్వాత నాస్తిక వాదాన్ని వినిపించిన లెజెండ్. స్టువర్టుపురం దొంగల విషయంలో సంస్కరణలు చేపట్టి 200 కుటుంబాలను కాపాడారు. నిజామాబాద్ జిల్లాలోని జోగిని దురాచారాన్ని నిర్మూలించేందుకు కృషి చేశారు. ఊర్లో ఏదైనా జరిగితే దళిత కుటుంబంలోని అమ్మాయిని యల్లమ్మకో, పుల్లమ్మకో దానం చేయాలని.. ఆ ఊర్లోని పెత్తందార్లకు ఆ అమ్మాయి ఉంపుడుగత్తెగా, ఊరుమ్మడి సరుకుగా చేయటమనే కరుడుగట్టిన.. అమానవీయ సంస్కృతి ఉండేది. దాన్ని నిర్మూలించేందుకు అన్నయ్య, వదిన ఎంతో కృషి చేశారు.
ఆర్కే : లవణం గారు కులాంతర వివాహాల్ని ప్రోత్సహించినపుడు మీ ఇంటిపై దాడులు జరిగాయట కదా?
సమరం : చివరికి లవణం గారు పోయేముందు కూడా ఓ పెళ్లి జరగాల్సి ఉండేది. ఓ బ్రాహ్మణ యువకుడు, హరిజన యువతి ప్రేమించుకున్నారు. ఇంట్లో వాళ్లు ఏమంటారోనని భయపడుతుంటే మా ఇంటికి తెచ్చుకున్నాం. ఇలా కులాంతర వివాహాలు చేసేటప్పుడు మా ఇంటి దగ్గర పెద్ద ఏడుపులు వినపడతాయి. ఇంటిపైకొచ్చి గోల చేసేవారు, దాడి చేసేవారు, కొట్టడానికి వచ్చేవారు. వారందరినీ మేం నాస్తికంలోకి లాగి అట్టిపెట్టుకుని నెలలపాటు మాతోనే ఉంచుకునేవాళ్లం.
మెట్రిక్యులేషన్‌లో నాకు ఆరో ర్యాంకు వచ్చింది. అది పాసయ్యాక లయోలా కాలేజీకి అప్లికేషన్ పెడితే క్యాస్ట్ అనే చోట ‘నిల్’ అని రాశా. దాన్ని చూసి ‘సీటు ఇవ్వం’ అన్నారు. ‘అప్లికేషన్‌లో కులం, మతం రాయనందుకు సీటు ఇవ్వలేదు’ అని కాగితంమీద రాసివ్వమన్నా. అందుకు కాలేజీ వారు అంగీకరించలేదు. ఆఖరికి సీటివ్వకపోతే వెంటనే యూనివర్శిటీ హెడ్‌కు లెటర్ రాశా. సెక్యులర్ స్టేట్‌లో కులం, మతం అని సీట్ ఇవ్వకపోవటమా.. అని అందులో పేర్కొన్నాను. ‘‘ఆ అబ్బాయికి సీటు ఇవ్వకపోతేయాక్షన్ తీసుకుంటాం. దరఖాస్తులో కులం, మతం రాయకపోతే అలా చేస్తారా’ అని యూనివర్శిటీ వారు కాలేజీకి తిరుగు ఉత్తరం రాశారు. ఆ సమయంలో ఈ అంశంపై పత్రికల్లో ఎడిటోరియల్స్ వచ్చాయి. చివరికి ఆ కాలేజీవారు అడ్మిషన్ టైంలో చాలా సేపు కూర్చోబెట్టి మిగతా ర్యాంకుల వారికి సీటు ఇచ్చారు. చివరికి నన్ను పిలిచారు. లేటుగా వచ్చావు కదా సీటు లేదన్నారు.
నా వయస్సు 76. నేను పాజిటివ్ థింకింగ్‌తో ఉంటాను. రోజుకు 18 గంటలు పని చేస్తాను. పేదవాళ్లకు సాయం చేస్తా. మందులు ఇస్తా. కొన్ని వందల మెడికల్ క్యాంపులు కండక్ట్ చేశా.. నేను సక్సె్‌స్‌ఫుల్ పర్సన్‌ను. ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రక్షాళన చేయాలని ఆశగా ఉంది. యూనివర్శిటీ తీసుకురావాలనుంది. ప్రస్తుతం చాలా మంది డబ్బు సంపాదించడం పరమావధిగా చూస్తున్నారు. ‘నేను’ అని ఆలోచించేవారే ఎక్కువ. పుట్టిన గడ్డను, కన్నతల్లిని, మాతృభాషను మర్చిపోరాదు. అలా చేసిన వాడు నా దృష్టిలో దుర్మార్గుడు.
‘ప్రతి సంస్కరణ వాదికి ప్రతిఘటనలు తప్పవు. అన్నయ్య (లవణం) కూడా ఇబ్బందుల్ని సంతోషంగా స్వీకరించారు. మా నాన్న గోరా గారు రాతపత్రికలో దేవుడు లేడని రాస్తే ఉద్యోగంలో నుంచి తీసేశారు. విద్యార్థులతో క్లోజ్‌గా ఉన్నారనీ, బందరు కాలేజీలో దేవుడు లేడని ఉపన్యాసం ఇస్తున్నారని నాన్నగారిని ఉద్యోగంలోంచి తొలగించారు. ‘‘కులాలు, మతాలు పనికిరాని రావు.. అంటరానితనం తప్పు. దేవుడు లేడు..’’ సమావేశాల్లో ఇలాంటి విషయాలను మాట్లాడి ఇంటికొచ్చిన రోజు ఆయన చొక్కామీద పేడ, కోడిగుడ్ల సొన ఉండేది. ’
‘ఈ దళితుల్ని సమాజమే సృష్టించింది. అందరూ మనుషులే! అంటరానితనం అనేది ఘోరం. మా నాన్న గాంధీ గారితో సన్నిహితంగా ఉండేవారు. గాంధీ హరిజనోద్ధరణ అంటున్న సమయంలో ‘‘మనం మాటలు చెప్పటం కాదు బాపూజీ.. మన పిల్లల్ని హరిజనులకు ఇచ్చి పెళ్లి చేయాలి’’ అని అన్నారు. గాంధీ గారు ఒక్కసారి అవాక్కయ్యారు. వెంటనే ‘‘అలాంటి వారు ఎవరుంటారు?’’ అన్నారు. అప్పుడు నాన్నగారు ‘‘మా అమ్మాయిని గుడిసెలో ఉండే హరిజన యువకుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను’’ అంటూనే గాంధీజీ ఆశ్చర్యపోయారు.
‘‘గోరా నువ్వు ఆవేశంలో మాట్లాడుతున్నావు. మీ అమ్మాయిని, అబ్బాయిని మా ఆశ్రమంలో రెండేళ్లపాటు ఉంచితే అప్పుడు వారిని పరీక్షిస్తాను’’ అన్నారు గాంధీ. ఈ విషయాన్ని ఆయనే అందరికీ చెప్పారు. ఆ తర్వాత గాంధీగారు ‘‘మా ఆశ్రమంలో ఒకరు హరిజనులై ఉండాలి, ఇంకొకరు ఇతర కులాల వారు ఉండాలి’’ అన్నారు. గాంధీ గారు అశాశ్వతులయ్యాక నా పెళ్లికి జవహర్‌లాల్ నెహ్రూ వచ్చారు. మేం నాస్తికులం. కాబట్టి.. పెళ్లిలో నేను దైవసాక్షిగా ప్రమాణం చేయలేదు.. ‘సత్యసాక్షిగా’ అని చేశాను.’
నాన్నగారికి అయిదుగురు అక్కచెల్లెల్లు, ఇద్దరు అన్నదమ్ములు. వీరిలో గోరా ఒక్కరే నాస్తికులు. అయితే ఆ తర్వాత పెద్దనాన్నగారిలో మార్పొచ్చింది. నాన్నను ఇంటి నుంచి వెళ్లగొట్టిన పరమ సంప్రదాయ వాది అయిన మా తాతయ్యను కూడా మా నాన్న మార్చేశారు. నాస్తికత్వం అనేది అంత తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. నాన్న గారు దుర్గాభాయ్‌కి పాఠాలు కూడా చెప్పారు. చివరికి గాంధీగారు సైతం నాన్నతో ‘‘నా ఆస్తికత్వం ఒప్పు అనీ, నీ నాస్తికత్వం ఒప్పు అని చెప్పను. ఇద్దరం సత్యాన్వేషకులం’’ అన్నారట.
నాన్న రాసిన పుస్తకాల్లో ఈ విషయాలన్నీ ఉన్నాయి. బెంగాల్‌లో ఓసారి క్షామం వచ్చింది. లక్షలాది మంది చనిపోతున్నారు. పేదవాడు నా కర్మ అనుకుంటున్నాడు. గోధుమల గోదాముల పక్కన పడి చనిపోయాడు కానీ గోధుమల్ని ఎత్తుకెళ్లి తినాలనే చైతన్యం వాడిలో లేదప్పుడు. ఆ సమయంలో నాన్న ‘ఓ కుక్క ఆకలిగా ఉంటే మిఠాయి కొట్టు మీద పడి తింటుంది. మనిషికి అలాంటి చైతన్యం లేదు. నా కర్మ, నా దురదృష్టం, నా తలరాత అనుకోవటం వల్లే ఇలా జరుగుతోంది అని భావిస్తున్నాడు’’ అంటూ గాంధీతో చెప్పారు. ఆస్తికత్వం అనేది మనిషిలో చైతన్యం లేకుండా చేసింది.