ఉద్యమాల పాపం పాపం రాజకీయాలదే
ABN , First Publish Date - 2020-05-15T20:42:29+05:30 IST
మా తెలంగాణ మాగ్గావాలె అని చంద్రబాబును నిలదీసిన పణికర మల్లయ్య, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవిని ఆకట్టుకుని టికెట్టు సాధించి ఎన్నికల్లో పోటీచేసిన యానాది కులస్తురాలు తుపాకుల మునెమ్మ, నష్టాల వ్యవసాయం చేయలేక ఆత్మహత్య వరకు వెళ్లి.. మళ్లీ తన జీవితాన్ని పూలబాటగా మార్చుకున్న కంబం శివశంకర్ రెడ్డి..
నేతల్ని ప్రజలదారిలోకి తీసుకురాలేము
అన్ని ప్రాంతాల్లోనూ పేదలున్నారు
బలమైనోడికే తిండి పెడితే ఎలా
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో మూడు ప్రాంతాల వ్యక్తులు
మా తెలంగాణ మాగ్గావాలె అని చంద్రబాబును నిలదీసిన పణికర మల్లయ్య, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చిరంజీవిని ఆకట్టుకుని టికెట్టు సాధించి ఎన్నికల్లో పోటీచేసిన యానాది కులస్తురాలు తుపాకుల మునెమ్మ, నష్టాల వ్యవసాయం చేయలేక ఆత్మహత్య వరకు వెళ్లి.. మళ్లీ తన జీవితాన్ని పూలబాటగా మార్చుకున్న కంబం శివశంకర్ రెడ్డి.. ఉత్తరాంధ్ర గొంతును బలంగా వినిపిస్తున్న పిరియా అబ్బాయి నాయుడు.. ఇలా మూడు ప్రాంతాల సామాన్యుని గుండెచప్పుళ్లు వీళ్లు. రాష్ట్రవిభజనతో అట్టుడుకుతున్న సమయంలో వీళ్ల మనసులో ఏముంది? ఏం కోరుకుంటున్నారు? తెలుసుకునే ప్రయత్నం చేశారు ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ. 7-10-2013న ఏబీఎన్‌లో ‘ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే’లో ప్రసారం అయిన కార్యక్రమం మీకు అందిస్తున్నాం..
ఆర్కే : రాష్ట్రంలోని మూడు ప్రాంతాల నుంచి వచ్చిన మీకందరికీ నమస్కారం. శ్రీకాకుళం, నెల్లూరు, చిత్తూరు, తెలంగాణ నుంచి వచ్చారు మీరు. పణికర మల్లయ్య.. మీరే కదా చంద్రబాబును అప్పట్లో నిలదీసింది? మీ గురించి ఆంధ్రజ్యోతిలో రాసేవరకు మీరు ఎవరికీ తెలీదు అనుకుంటా! అప్పటి నుంచి ఇప్పటికి మీ జీవితం ఏమైనా మారిందా?
మల్లయ్య : మా జీవితం ఏం మారలేదు. తెలంగాణ వస్తే మారుతుంది. మాది మాకు కావాలె.
ఆర్కే : అటు పక్క వద్దని, ఇటు పక్క కావాలని అడుగుతున్నారు. మీకేమనిపిస్తోంది శివశంకర్‌రెడ్డి గారు?
శివశంకర్ : రాష్ట్ర విభజన జరిగితే పాలనా ఖర్చులు, పన్నులు పెరిగిపోతాయి. సమైక్యంగా ఉంటేనే మంచిది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఉత్పత్తి చేసుకోవచ్చు. ఏ ప్రాంతంలో సంప్రదాయాలు ఆ ప్రాంతంలో ఉంటాయి. విడిపోవడం అంటే తల్లిని, తండ్రిని విడదీసినట్లు అనిపిస్తుంది.
ఆర్కే : మీరేమంటారు నాయుడుగారూ?
నాయుడు : ఎంతోమంది మహానుభావులు కలిసి సాధించుకున్న రాష్ట్రం ఇది. ఉమ్మడి మద్రాసులో బానిసత్వంలో బతికాము. పొట్టిశ్రీరాములు పోరాటం వల్ల ఎన్నో కమిటీలు, చర్చల తర్వాత ఏర్పడిందీ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ ఏమంత ఈజీగా రాలేదు. మన ముఖ్యపట్టణం హైదరాబాద్ అనుకున్నాం. అన్ని ప్రాంతాల నుంచి వచ్చి అందరం ఇక్కడే స్థిరపడ్డాం. ఇవాళ విడిపోతామంటే ఏమనాలో, ఏమి చెప్పాలో అర్థం కావడం లేదు. అందరూ హైదరాబాదులో పెట్టుబడులు పెట్టి ఇంత డెవలప్ చేసుకున్నాము. ఇప్పుడు వెళ్లిపోమంటే ఎక్కడికి వెళ్లిపోవాలి? ఎలా బతకాలి? ఏదైనా వెనకబడిన ప్రాంతం ఉంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి, ఆ ప్రాంతంలో దొరికే వనరులతో అభివృద్ధి చేయాలి. అక్కడే ఒక కేంద్రం పెట్టి ఉపాధి చూపిస్తే బేధాభిప్రాయాలు రావు.
ఆర్కే : మీకేమనిపిస్తుందమ్మా మునెమ్మా?
మణెమ్మ : హైదరాబాద్ అంటేనే పిల్లల సదువులకాడ్నుంచి అన్నింటికీ ఈడికే వస్తారు. అందరూ కలిసికట్టుగా ఉంటేనే మంచిది.
ఆర్కే : ఆయనేమో (మల్లయ్య) మా జీవితం బాగుపడాలంటే తెలంగాణ రావాలి అంటున్నాడు?
మునెమ్మ : అందరూ కలిసికట్టుగా ఉంటేనే కదా సార్ అందరి జీవితాలు బాగుపడేది.
ఆర్కే : హైదరాబాద్ మీద మీకెందుకు అంత మమకారం?
మునెమ్మ : మాలాంటి బీదోళ్లు చాలామంది అక్కడ బతుకుతున్నారు. వాళ్లందరి గురించి ఆలోచించాలి. ప్రెతోళ్లు నిద్రలేస్తే హైదరాబాదు హైదరాబాదు అంటూ వస్తుంటారు.
ఆర్కే : విడిపోయినా హైదరాబాదు వెళ్లొచ్చుగా?
మునెమ్మ : అట్టకుదరదు సార్.
ఆర్కే : ఏముంది ? మన వాళ్లు ముంబయికి వెళుతున్నారుగా?
మునెమ్మ: ఇప్పుడున్న అవకాశాలు, అప్పుడు దొరకవు కదా! వేరే రాష్ట్రం అన్న భావన వస్తుంది.
ఆర్కే : మీ చుట్టాలు ఎవరైనా హైదరాబాద్‌లో ఉన్నారా?
నాయుడు : మా మేనమామగారి అబ్బాయి ఒకతను పాతికేళ్ల నుంచి హైదరాబాద్‌లో ఉన్నారు. దూరపు బంధువులు కూడా ఉన్నారు. వివిధ స్థాయిల్లో ఆస్తులను అమ్ముకుని, పిల్లల చదువుల కోసమని రాజధాని వచ్చారు. పెద్ద రైతులు, చిన్న రైతులు, కూలీలు అందరూ జీవనోపాధి మీద నమ్మకంతో వచ్చారు.
ఆర్కే : ఇప్పుడు చెప్పు పెద్దాయన. వాళ్లు చెప్పింది విన్నాక ఏమనిపిస్తోంది?
మల్లయ్య : ఏమనిపించినా తప్పదు సారు. తెలంగాణ కావాలె. మాకు సదువులు గావాలె, నౌకర్లు గావాలె అంటే తెలంగాణ రావాలె. మా పిలగాళ్లకు బువ్వ లేక, బుగ్గి లేక సత్తాంటిమి. ఒక తండ్రి కడుపున నల్గురు పుడితే పాలు (ఆస్తులు) పంచుకుంటున్రా పంచుకోరా? మనమట్లనే పంచుకుంటే ఏమైతది..
శివశంకర్ : మల్లయ్య చెప్పేదాన్ని నేను కాదనను. నలుగురు కలిసి ఒక కొబ్బరి చెట్టును పెంచి పోషించినాము అనుకుందాం. దాన్ని సరిగా పంచుకోవాలి కదా! ఇప్పుడేమో ఇలాగంటే ఎలా..
మా పిల్లల భవిష్యత్తు ఏమి కావాలి
ఆర్కే : కొన్నేళ్ల నుంచి ఉద్యమం జరుగుతోంది. కొన్నాళ్లు నెమ్మదించింది. మళ్లీ 2009 నుంచి పరాకాష్టకు చేరింది. ఇంత తీవ్రంగా ఉద్యమం జరుగుతున్నప్పుడు మీరెందుకు వాళ్లకు నచ్చజెప్పలేదు. అప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు?
శివశంకర్ : వ్యవసాయ పనులు చేసుకునేదానికే సమయం సరిపోదు. ఎక్కడ ఏమి జరుగుతా వుండేది కూడా ఆలోచన చేసేంత శక్తి లేక కాదు. జ్ఞానం లేక కాదు. పది రూపాయలు సంపాదించుకోని రెండు పూటలా తిండితినడానికే కష్టం. రాష్ట్రం విడిపోతుందా? ప్రధాని ఎవరు? అని ఆలోచించే తీరిక లేదు మాకు.
ఆర్కే : ఇప్పుడు ఎందుకు అనిపించింది?
శివశంకర్ : ప్రస్తుతం రాష్ట్రం విడిపోతోంది కాబట్టి ముందుకొచ్చాం. రాష్ట్రం విడిపోతే రాయలసీమ ఎడారి అయిపోతుంది. పంటలు పండకపోతే మాకు తిండిపెట్టేవారు ఎవరు? పిల్లలకు చదువులు చెప్పించాలంటే మేము కష్టపడాలి. అందుకు భూమి, నీళ్లు, కరెంటు కావాలి. అవేవీ లేకపోతే కష్టం.
ఆర్కే : తెలంగాణ మల్లయ్య చెప్పేదాని ప్రకారం వాళ్ల భూమి, వాళ్ల నీళ్లు, వాళ్ల ఉద్యోగాలు వాళ్లకు కావాలంటే విడిపోవాలని అంటున్నాడు. ఆ విషయంలో ఆయనను కన్విన్స్ చేయాల్సిన బాధ్యత మీకు లేదా?
శివశంకర్ : ఇంతకుముందు కొబ్బరి చెట్టును (హైదరాబాద్‌ను ఉద్దేశించి) మనమంతా కలిసి పెంచుకున్నామని చెప్పాను. కొబ్బరికాయలన్నీ మాకు ఇచ్చేసేయండి. మీకు చెట్టు మొదలు మాత్రమే వదిలిపెడతాము అంటే ఎలా? ఉపాధి, వైద్యం, విద్య ఇవన్నీ ఉండేది హైదరాబాద్‌లోనే! ఇవన్నీ విడిచిపెట్టుకునేదానికి వీలవుతుందా, పోనీ వదిలిపెట్టుకుందాం అనుకుంటే, మా పిల్లల భవిష్యత్తు ఏమి కావాలి.
ఆర్కే : రాజకీయ నాయకులు చెబుతున్నట్లుగా - రాష్ట్రం విడిపోతే రాయలసీమ ఎడారి అవుతుందని మీరు కూడా నమ్ముతున్నారా?
శివశంకర్ : నిజంగానే ఎడారి అవుతుంది. రాజకీయనేతల దృష్టితో చెప్పడం లేదు నేను. ఒక రైతుగానే చెబుతున్నా. వర్షాలు లేక నీళ్లు లేక మేము భ్రష్టు పట్టిపోవడం ఖాయం. ఇతరుల మీద ఆధారపడి బతకడానికి మేము బిక్షగాళ్లం కాదు.
నాయుడు : ముప్పయి ఏళ్ల కిందట హైదరాబాదు వెనుకబడిన ప్రాంతం. సిటీని మినహాయిస్తే చుట్టుపక్కలంతా కొండలు, గుట్టలు ఉండేవి. ముఖ్యమంత్రులంతా డెవలప్ చేస్తే ఇంత అభివృద్ధి అయ్యింది. ప్రస్తుతం సీమాంధ్రలో ఇంత ఉద్యమం జరుగుతుంటే కేంద్రప్రభుత్వం రెండు లక్షల కోట్లు (ఐటిఐఆర్ ప్రాజెక్టును ఉద్దేశించి) హైదరాబాదుకే ప్రకటించింది. ఏమండీ ఈ రాష్ట్రంలో ఒక్క హైదరాబాదు ప్రాంతమే ఉందా? అటు వైజాగు లేదా, ఇటు తిరుపతి లేదా..? అంటే - కేవలం రాజకీయ స్వార్థబుద్ధితో చేస్తున్నదే తప్ప మరొకటి కాదు. పరిపాలనా విధానం కనుక కరెక్టుగా ఉంటే ఈ సమస్య వచ్చేదే కాదు. నీటిపారుదల కింద ఉన్న వరి పంటను ఒక్కదాన్నే కాదు. వర్షాధారం కింద సాగయ్యే జీడి, మామిడి, కొబ్బరి, పనస - వీటిని కూడా ఇంప్రూవ్ చేయాలి. అన్ని ప్రాంతాలను విడిచిపెట్టి హైదరాబాద్‌ను డెవలప్ చేయడం వల్ల ఇవాళ ఏమైంది. హైదరాబాదు 48 శాతం వృద్ధిరేటుకు వచ్చింది. తెలంగాణ 22 శాతం (హైదరాబాదును మినహాయిస్తే), రాయలసీమ 6 శాతం మాత్రమే ఉంది. సీమాంధ్ర మొత్తం 24 శాతం అభివృద్ధి ఉంటే, హైదరాబాద్‌తో కలిపిన తెలంగాణ 70 శాతం అభివృద్ధి అయ్యింది. కేవలం 30 శాతం అభివృద్ధి ఉన్న సీమాంధ్ర పరిస్థితి ఏమిటి? హైదరాబాదు దేశంలో అభివృద్ధి చెందిన నగరాల్లో అయిదో నగరంగా ప్రసిద్ధి పొందింది. కాబట్టి బలమైనోడికే తిండి పెడతామంటే ఎలా?
ఆర్కే : ఆయన (మల్లయ్య) బలమైనోడిలా కనిపిస్తున్నాడా?
నాయుడు : అతని గురించి కాదు. ఇష్యూ గురించి చెబుతున్నాను. అలాంటి వాళ్లు ఆంధ్రప్రాంతంలోను ఉన్నారు. తెలంగాణలోను ఉన్నారు. డెవలప్‌మెంట్ అనేది ప్రతి జిల్లా చివరి ప్రాంతం నుంచి పట్నం వరకు అభివృద్ధి చేసుంటే, ఇవాళ విభజన ప్రసక్తే ఉండేదికాదు.
ఆర్కే : డబ్బులు తీసుకుని ఓట్లు వేయడం నేరమా కాదా మల్లయ్యా?
మల్లయ్య : నేరమే. కాంగ్రెస్ నాయకులు డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటుండ్రు. అందరూ పైసలకు చెడిపోతుండ్రు.
ఆర్కే : మరి పైసలకు చెడిపోతే ఎలా? తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పైసలకే చెడిపోతారు కదా?
మల్లయ్య : అందుకే మా రాష్ట్రం మాకు గావాలె అంటుండ్రు.
ఆర్కే : కేసీఆర్ అప్పట్లో నీకు రెండెకరాల పొలం ఇస్తానని చెప్పాడు. ఇచ్చాడా?
మల్లయ్య: ఇస్తలేడు. స్టేషన్‌లో శాలువ కప్పిండు. రెండెకరాల భూమి ఇస్తనని కేసీఆర్ ఆయన బిడ్డ కవిత, కొడుకు రామారావు కూడా చెప్పిండ్రు. ఆర్థిక సహాయం చేయలే, భూమి ఇవ్వలే.
ఆర్కే: మీ గురించి పత్రికల్లో వచ్చిన తర్వాత మీ జీవితం మారిందా? నేతల మీద నమ్మకం ఉందా?
మల్లయ్య : నాయకుల మీద నమ్మకం లేదు. తెలంగాణ వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని ఆశ అంతే! నీళ్లు, కరెంటు, బొగ్గు అన్నీ అటుపోతుండయనే బాధ.
ఆర్కే : చంద్రబాబు మీ ఊరు వచ్చినప్పుడు తెలంగాణ ఇవ్వాలని గట్టిగా ఎందుకు అడగాలనిపించింది?
మల్లయ్య : దేవుడు బుద్ది పుట్టించిండు. అడిగిన. చంద్రబాబే ఏంగావాలె అని నన్ను అడిగితె, తెలంగాణ గావాలె అని చెప్పిన. అప్పట్లో అది పేపర్ల రాగానే జయశంకర్‌సారును, దేశపతి శ్రీనివాసును కలిసిన. కేసీఆర్‌ను కూడా కలిసిన.
ఆర్కే : కేసీఆర్ ఇస్తానన్న భూమిని మళ్లీ అడిగారా?
మల్లయ్య : ఎట్లడుగుత. మందిలో ఉన్నడు.
శివశంకర్ : అప్పుడు హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పటికీ భూమి ఇవ్వలేదా? ఇంకా ఇస్తాడని నమ్ముతున్నావా?
మల్లయ్య : ఇస్తడనే నమ్ముతున్నాను.
నాయుడు : ఇలా అందరికీ కేసీఆర్ భూములు ఇస్తూ పోతే దేశంలోని భూములు చాలవు.
మల్లయ్య : ఎకరం ఎంతవుతుంది అన్నారు కేసీఆర్. అయిదు లక్షలు అవుతుందని చెప్పిన. భూమిని చూసుకోమన్నడు. నాకు ముగ్గురు ఆడపిల్లలు. తెలంగాణ వస్తే వాళ్లకు ఉద్యోగాలు వస్తయని నమ్ముతున్నా.
శివశంకర్ : తెలంగాణ రాకపోయినా ఉద్యోగాలు వస్తాయి కదా!
ఆర్కే : ఈ ప్రాంతానికి, ఆ ప్రాంతానికి తేడా గమనించండి. ఒక అంశాన్ని విశ్లేషించడంలో మీకున్న (శివశంకర్) నైపుణ్యం, మల్లయ్యకు లేదు. ఆయన చదువుకోలేదు. ఏది తోస్తే అది మాట్లాడుతున్నాడు. తన మనసుకు నచ్చింది అడుగుతున్నాడు.
మల్లయ్య : లేనోడికి ఉన్నోడు సాయం చేయడు. ఉన్నోడికి ఉన్నోడే చేస్తాడు.
ఆర్కే : నువ్వు చెప్పమ్మా, పేదోళ్లకు ఏమీ అందట్లేదు అని అంటున్నారు?
మునెమ్మ: అవును సార్. మేము యానాదులం. పేదోళ్లం. మమ్మల్ని ఎలక్షన్లప్పుడు తప్ప ఆ తర్వాత ఎవరు పట్టించుకోరు.
మా బాధలు మేము పడుతున్నాం
ఆర్కే : ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మీరు చాలా ఉత్సాహంగా మాట్లాడారు. చిరంజీవి మెచ్చి పార్టీ టికెట్ ఇస్తే, పోటీ చేసి ఓడిపోయారు. మీలో ఏమైనా మార్పు వచ్చిందా? ఆ తర్వాత చిరంజీవిని కలిశారా?
మునెమ్మ : ఏ మార్పు రాలేదు. మా యానాదుల కోసమే కృషి చేస్తున్నాను. ఎన్నికలయ్యాక చిరంజీవిని కలవలేదు. ఏమయ్యా మమ్మల్నందరినీ వదిలి అలా కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయావని మేము ఆయన్ని అడగలేదు. పోతున్నానని ఆయనా మాకు చెప్పలేదు. మా బాధలు మేము పడుతున్నాం.
ఆర్కే : సరే, శివశంకర్ గారు మీ విషయానికి వద్దాం. కొన్నేళ్ల కిందట మీరు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నానంటూ ఆంధ్రజ్యోతికి ఓ ఉత్తరం రాశారు. ఇప్పుడు మీరెంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు?
శివశంకర్ : అది చెప్పుకోవాలంటే నాకే అవమానం. అప్పట్లో పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. సేద్యానికి పెట్టుబడులు పెరిగిపోయినాయ్. కరెంటు ఛార్జీలు ఎక్కువయ్యాయి. ప్రభుత్వాన్ని నిందించలేము. అప్పులివ్వని బ్యాంకుల్నీ ఏమీ అనలేము. నా వల్ల కాలేదు. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. ఒకసారి కాదు. వందసార్లు. అయితే ఒకటి ఆలోచించాను. చనిపోయి ఏమి సాధించాలి? అలా చేస్తే నా పిల్లలు వీధిన పడతారు. అవమానం పాలవుతారు. అనుకున్నాను. మళ్లీ నిలదొక్కుకున్నాను. పదిమందికి ఆదర్శం కావాలనిపించింది. దీనికి ఒక్కటే మార్గం. పంట ఉత్పత్తి పెరగాలి. దానికి మార్కెట్‌లో డిమాండ్ పలకాలి. రైతుకు కావాల్సింది గిట్టుబాటు ధర కాదు. గిట్టుబాటు వ్యవసాయ విధానం కావాలి. ఏ రైతూ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలతో బాగుపడడు. నా పొలంలో నేనొక రీసెర్చ్ స్టేషన్‌ను ఏర్పాటు చేసుకున్నాను. వేరుసెనగ, వరి, చెరకులతోపాటు కొత్త పంట రకాలను సాగు చేశాను. దేనికి ఎంత పెట్టుబడి అవుతుంది? ఎంత మిగులుతుంది లెక్కవేశాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో పూలతోటల పెంపకం మేలు అనిపించింది. ఎకరానికి అయిదు నుంచి ఇరవై అయిదు లక్షలు వస్తోందిప్పుడు. పంట అవసరం తీర్చిన తర్వాతనే తిండీనిద్ర. వ్యవసాయాన్ని ‘ఉరి’ అన్నారు అందరూ. అదే వ్యవసాయాన్ని నేనెందుకు పూలబాటగా మార్చుకోకూడదు అనుకున్నాను.
ఆర్కే : ఎకరాకు అంత ఆదాయం వస్తున్నదంటే మల్లయ్య, మునెమ్మ నమ్మడం లేదు. వీళ్లిద్దరినీ మీ పొలానికి తీసుకెళ్లి చూపించవచ్చు కదా?
శివశంకర్ : తప్పకుండా వాళ్లకు సహాయం చేస్తాను. అవగాహన కల్పిస్తాను.
ఆర్కే : చూశారా! మునెమ్మ భూమి వేరేవాళ్ల ఆధీనంలో ఉందంటే.. నాగలి వేసుకుని దున్నమన్నాడు మల్లయ్య. ఇదే మల్లయ్య వ్యవసాయంలో ఇబ్బందులు పడుతుంటే తన తోటను చూపించి, సాగు పద్ధతుల్ని చెబుతానంటున్నాడు శివశంకర్. మీరందరూ ఇంత కల్మషం లేకుండా ఉన్నారు. మరి రాజకీయ నాయకులు చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే మీకేమనిపిస్తుంది?
నాయుడు : రాజకీయ నాయకులు హీనమైనవారు. ఇప్పుడు జరుగుతున్నది రాజకీయ ఉద్యమం కాదు. ప్రజా ఉద్యమం. జన, ధన, మద బలమున్న నేతల్ని ప్రజల దారిలోకి తీసుకురాలేము.
మల్లయ్య: మా నాయకులు కూడా వాళ్ల కడుపు నిండే వరకు వాళ్లు చూసుకుంటారు. మా గురించి పట్టించుకోరు.
కంబం శివశంకర్‌రెడ్డి, రైతు
వయసు 56 ఏళ్లు. చిత్తూరు జిల్లా వాయల్పాడు మండలం, అయ్యవారిపల్లి. మూడున్నర ఎకరాల రైతు. మేలు రకాల వంగడాలతో మెరుగైన ఫలితాలు సాధిస్తుంటారు. ఏటా ఐదుగురు రైతులకు సొంత ఖర్చుతో ‘ఉత్తమ రైతు’ అవార్డులిస్తారు. కొన్నేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకోవాలన్నంత నిర్వేదంలో ఉండి కూడా దాన్నించి బయటపడి ‘గట్టి’ రైతుగా నిలదొక్కుకున్నారు.
పిరియా అబ్బాయి నాయుడు, రైతు
వయసు 58 ఏళ్లు. శ్రీకాకుళం జిల్లా, కవిటి మండలం, ప్రగడపుట్టుగ గ్రామం. ఎనిమిదెకరాల కొబ్బరితోట ఉంది. సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి మెండు.
తుపాకుల మునెమ్మ, రైతుకూలీ
నెల్లూరు జిల్లా వాకాడు మండలం, పంబలి గ్రామం. యానాదుల నాయకురాలు. చదువు లేకపోయినా ఈ వ్యవస్థను ఏకిపారేయగలిగే జ్ఞానసంపన్నురాలు.
పణికర మల్లయ్య, రైతు
వరంగల్ జిల్లా, పాలకుర్తి మండలం, గూడూరు గ్రామం. అర ఎకరా రైతు. చంద్రబాబును నిలదీసిన తర్వాత వార్తల్లోకి ఎక్కాడు.
ఆర్కే : మూడు ప్రాంతాల్లోని ప్రజలకూ ఒకరితో ఒకరికి అవసరాలు ఉంటాయి. ఈ వాతావరణం కొన్ని రోజులే ఉంటుంది. ఆ తర్వాత అందరూ కలిసిమెలసి ఉంటారు. ఉండాలని ఆశిద్దాం.