గోపీచంద్‌కు సైనా రుణపడి ఉండాలి... ఆమె నాకు పోటీదారు కాదు
ABN , First Publish Date - 2020-05-13T20:27:43+05:30 IST
బాడ్మింటన్‌లోకి వచ్చాకే ఆఫర్స్ వచ్చాయి కానీ అప్పట్లో దాని గురించి అంత ఆలోచించలేదు. (ఆర్కే: ఎందుకని? చెడు అభిప్రాయం ఉందా?) అదేం లేదు. సినిమాల్లో చేయడం చాలా కష్టం
ప్రభాస్ అంటే పడి చస్తా.. చాలా మంది ప్రపోజ్ చేశారు...
సినిమా అవకాశం వస్తే ఆలోచిస్తా... అసోషియేషన్‌లో రాజకీయాలెక్కువ
అజహార్‌తో అఫైర్ కుట్రే... ఒలంపిక్స్‌లో పతకం నా లక్ష్యం
13-12-10న జరిగిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో బ్యాట్మింటన్ బ్యూటీ గుత్తా జ్వాలా
ఆర్కే: అందంగా ఉంటారు కదా హీరోయిన్‌గా ఎందుకు ప్రయత్నించలేదు?
గుత్తా జ్వాలా: బాడ్మింటన్‌లోకి వచ్చాకే ఆఫర్స్ వచ్చాయి కానీ అప్పట్లో దాని గురించి అంత ఆలోచించలేదు. (ఆర్కే: ఎందుకని? చెడు అభిప్రాయం ఉందా?) అదేం లేదు. సినిమాల్లో చేయడం చాలా కష్టం. 24 గంటలూ కష్టపడాలి. ఇప్పుడు ఆఫర్ వస్తే తప్పక ఆలోచిస్తాను. మంచి పాత్ర వస్తే... (ఆర్కే: ఇప్పుడు హీరోయిన్లంటే గ్లామర్ తప్ప డీసెంట్ రోల్స్ లేవు కదా?) ఎందుకు లేవండీ... ఉన్నాయి. హీరోలలో తారక్ (జూనియర్ ఎన్టీఆర్), రానాతో నాకు పరిచయం ఉంది.
ఆర్కే: మిమ్మల్ని చూస్తే తెలుగమ్మాయి అనుకోరు? మీకలా అనిపించిందా?
గుత్తా జ్వాలా: నేను తెలుగులో మాట్లాడితే ఆశ్చర్యపోతారు. అప్పుడు నేను తెలుగమ్మాయినే అని చెబుతాను. అమ్మ చైనీస్ కదా.. అందుకే ఆ పోలికలు ఉన్నాయి. మా తాతయ్య బాగా ఎత్తు. 6.4 అడుగులు. నేను స్పోర్ట్స్‌లో ఉన్నందున పొడుగయ్యానేమో? అమ్మకు తెలుగు కొంచెం వస్తుంది. నాకు చైనీస్ రాదు. మా చెల్లికి వస్తుంది. నాకు ఎనిమిదేళ్లప్పుడు బ్యాట్ పట్టుకున్నాను. నేను పుట్టినప్పుడే స్పోర్ట్స్‌పర్సన్‌ను చేయాలని నాన్న అనుకున్నారట... మొత్తంగా నేను ఇండియన్‌గానే గర్వపడతాను.
ఆర్కే: మీకు ఎంతమంది ప్రపోజ్ చేశారు? మొదటి ప్రపోజల్ ఎప్పుడు?
గుత్తా జ్వాలా: ఇలాంటి వివరాలు నన్ను మొదటిసారిగా అడుగుతోంది మీరే. చాలా మంది ప్రపోజ్ చేశారు. నా 13 ఏళ్ల వయసులో మొదటి ప్రపోజల్ వచ్చింది. (ఆర్కే: సినీ పరిశ్రమ వారు ఎవరైనా ప్రపోజ్ చేశారా?) ఇప్పటి వరకూ లేదండీ.
ఆర్కే: కోచ్‌ల నుంచి లైంగిక వేధింపులు ఎదురయ్యాయా?
గుత్తా జ్వాలా: నాకు అలాంటివి ఎదురు కాలేదు. కానీ, నేను కూడా చాలా విన్నాను. నేను చాలా ఫ్రాంక్‌గా ఉంటాను. అందుకే నా దగ్గర భయపడతారు. ఎవరూ అలాంటి ప్రయత్నాలు చేయలేదు కూడా.
ఆర్కే: బ్యాడ్మింటన్ మీద ఆసక్తి మీరే పెంచుకున్నారా?
గుత్తా జ్వాలా: టెన్నిస్ అయితే నేను నల్లబడిపోతానని అమ్మ బాడ్మింటన్ ఎన్నుకోమని చెప్పింది. టెన్నిస్, టేబుల్ టెన్నిస్ మొదట ఆడేదానిని. ఆ తర్వాత బాడ్మింటన్.
ఆర్కే: చేతన్‌తో లవ్‌గేమ్ ఎప్పుడు మొదలైంది? ఎందుకు విడిపోయారు?
గుత్తా జ్వాలా: 18 ఏళ్ల వయసు నుంచీ చేతన్ నాకు పరిచయం. ఆ తర్వాత ఇష్టపడ్డాం. తొందరగానే పెళ్లి చేసుకున్నాం. ముందు అంత చిన్న వయసులో పెళ్లి ఎందుకు అనుకున్నాను. బయటివారికి మాట్లాడే అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో మా నాన్న పెళ్లి చేశారు. తర్వాత మా ఇద్దరి మధ్యా అభిప్రాయాలు కలవలేదు. అందుకే విడిపోయాం.
ఆర్కే: మీకు సంతృప్తినిచ్చిన టోర్నమెంట్ ఏది?
గుత్తా జ్వాలా: కామన్‌వెల్త్ గేమ్స్. స్థానిక ప్రేక్షకుల ఒత్తిడి మధ్య, నా వ్యక్తిగత సమస్యల నుంచి అప్పుడే బయటపడి ఆడి గెలవడం నిజంగా చాలా కష్టం. అసోసియేషన్ కూడా నాకు మద్దతుగా నిలవలేదు. అందుకే ఆ టోర్నమెంట్‌లో గెలవడం నాకు గర్వంగా అనిపిస్తుంది. రిటైనయ్యాక అసోసియేషన్‌లోకి వచ్చి, క్రీడాకారుల ఇబ్బందులపై దృష్టిపెడతా.
ఆర్కే: అజహర్, మీ గురించి...
గుత్తా జ్వాలా: అదంతా రాజకీయమే... పదేళ్లుగా అజహర్ తెలుసు. ఆయనో క్రీడాకారుడు. బాడ్మింటన్ అసోసియేషన్‌కు పోటీపడ్డారు. అందుకే అలాంటి వదంతులు పుట్టించారు. నేను ఎవరికీ మస్కా కొట్టను. అందుకే నన్ను ప్రమోట్ చేయలేదు. అసోసియేషన్‌లో అన్నీ రాజకీయాలే. బయటి కంటే ఇక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి.
ఆర్కే: గోపీచంద్‌తో విభేదాలు ఎందుకు వచ్చాయి?
గుత్తా జ్వాలా: ఆయనో క్రీడాకారుడిగా ఉండి అసోసియేషన్‌లోకి వచ్చాక క్రీడాకారుల ఇబ్బందుల గురించి ఆలోచిస్తారనుకున్నాను. కానీ, అది జరగలేదు. (ఆర్కే: అందుకేనా ఆయనను కోచ్‌గా కూడా గుర్తించనన్నారు?) ఆయన నేషనల్ చీఫ్ కోచ్. నా కెరీర్‌లో మాత్రం నా ఉన్నతికి ఆరిఫ్ గారే కారకులు. చిన్నప్పటి నుంచీ కోచ్ ఆయనే. గోపీచంద్‌తో నాకు విభేదాలు లేవు. (ఆర్కే: ఎప్పుడు రిటైర్మెంట్?) మరో ఐదేళ్లకు... (ఆర్కే: సైనా మీకు పోటీదారా? గోపీ ఆమెను బాగా ప్రమోట్ చేస్తున్నారు కదా?) అలా ఏం లేదు. అయితే, గోపీచంద్‌కు సైనా రుణపడి ఉండాలి.
ఇంట్లో ఎలాంటి ఆహారం తీసుకుంటారు?
గుత్తా జ్వాలా: అమ్మకు సమయం ఉంటే చైనీస్... రెగ్యులర్‌గా ఇండియన్ ఫుడ్. నేను ఎక్కువ కారం తినలేను. అందుకే చైనీస్ ఫుడ్ నచ్చుతుంది.
సినిమాలు చూస్తారా?
గుత్తా జ్వాలా: చూస్తాను. ఐ లైక్ ప్రభాస్. పక్కా సౌతిండియన్‌లా ఉంటాడు. అందుకే నచ్చుతాడు. ముఖ్యంగా ఎత్తు. హిందీలో అమీర్‌ఖాన్. తెలుగులో ప్రభాస్‌తో కలిసి నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను. అయితే, ఇంట్లో వాళ్లను ఒప్పించాకే.
మళ్లీ పెళ్లి ఎప్పుడు?
గుత్తా జ్వాలా: ఇప్పుడు పూర్తి దృష్టి కెరీర్ మీదే. పెళ్లి గురించి ఆలోచించడం లేదు. నా లక్ష్యం ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే. అదే నా కల. నాన్న కల. సాధించగలననే నమ్మకం ఉంది.