నేను వ్యభిచారం చేశాను.. ఒకబ్బాయి పెళ్లి చేసుకుంటానన్నాడు

ABN , First Publish Date - 2020-05-13T21:00:19+05:30 IST

లక్ష్మణ్‌గా పుట్టినా.. ఏనాడూ నాకు అబ్బాయిలా పెరగాలనిపించలేదు. అమ్మాయిల దుస్తులే వేసుకోవాలనిపించింది. ఇలా ఉండటం మానసిక వైకల్యం కాదు. శారీరకంగానే లోపం ఉంది. మానసిక

నేను వ్యభిచారం చేశాను.. ఒకబ్బాయి పెళ్లి చేసుకుంటానన్నాడు

సమాజం వల్ల మాకు అన్యాయం జరిగింది

అనవసరంగా కొందరు మమ్మల్ని వేధిస్తున్నారు

తప్పుచేస్తే శిక్షించండి.. లేదంటే గౌరవం ఇవ్వండి

కొందరు కుర్రాళ్లు కావాలనే మోసగిస్తున్నారు.. మేం అలా కాదు.

ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కేలో ట్రాన్సజెండర్‌ లైలా


‘‘లక్ష్మణ్‌గా పుట్టినా.. ఏనాడూ నాకు అబ్బాయిలా పెరగాలనిపించలేదు. అమ్మాయిల దుస్తులే వేసుకోవాలనిపించింది. ఇలా ఉండటం మానసిక వైకల్యం కాదు. శారీరకంగానే లోపం ఉంది. మానసిక చికిత్స చేయిస్తే బాగుపడితే సంతోషమే. మమ్మల్ని మనుషుల్లాగే చూడండి’’ అని ఆవేదన వ్యక్తం చేసిన లైలాతో 27-9-10న జరిగిన ఓపెన్‌హార్ట్‌ విత్‌ ఆర్కే వివరాలు...


ఆర్కే: లక్ష్మణ్‌ నుంచి లైలాగా మారాలని ఎందుకు అనిపించింది?

లైలా: చిన్నప్పటి నుంచి నా లోపలే అమ్మాయిలా పెరగాలని అనిపించేది. అమ్మా నాన్న కొట్టినా నాకు అదే అలవాటైంది. లోలోపలే కుమిలిపోయేవాణ్ని. అక్కలు నన్ను బాగా చూసుకునేవారు. నాన్న మాత్రం కొట్టేవారు.


ఆర్కే: అది శారీరక వైకల్యమా.. మనోవైకల్యమా ఎప్పుడు అనిపించింది?

లైలా: పెద్దయ్యాక నన్ను బాయ్స్‌ హాస్టల్లో వేస్తే చిత్రవధ అనుభవించాను. రైల్వేస్టేషన్‌లో హిజ్రాలు కనిపిస్తే మాట్లాడాలనుకున్నా ధైర్యం చాలలేదు. తర్వాత అయినవోలు జాతరలో కనిపిస్తే మాట్లాడాను. వాళ్లు మా పిల్లగాడివే కదా అని అడ్రస్‌ చెప్పారు. ఏడాది తర్వాత వాళ్లతో ఢిల్లీ వెళ్లిపోయాను. మొదట్లో నెల కూడా ఉండలేక ఇంటికెళ్లి డిగ్రీలో చేరినా, మళ్లీ వెళ్లిపోయాను.


ఆర్కే: మీ జీవన విధానం ఎలా ఉంటుంది?

లైలా: సిగ్నల్స్‌ దగ్గర, లవర్స్‌ దగ్గర డబ్బులిమ్మని అడుగుతారు. పెళ్లిళ్లు, ఫంక్షన్ల వద్ద ఆడిపాడి డబ్బులు తీసుకుంటారు. నేను వ్యభిచారం కూడా చేశాను. ఏడాది తర్వాత తిరిగి ఇటు వచ్చేసి, ట్యూషన్లు చెప్పుకొని ఆ డబ్బుతో డిగ్రీ పూర్తి చేశాను. తర్వాత మళ్లీ ఢిల్లీ వెళ్లాను. అప్పుడు పెద్ద ట్రూపులో చేర్చుకున్నారు. కొన్నాళ్లకు మా గురువు వరంగల్‌ వచ్చేశాక.. నేనూ వచ్చాను. విజయవాడలో సర్జరీ చేయించుకున్నాను. తర్వాత హెచ్‌ఐవీ మీద పనిచేసే స్వచ్ఛంద సంస్థలో చేరి దేశమంతా తిరిగాను.


ఆర్కే: మీలో మీకు పెళ్లిళ్లు ఉంటాయా?

లైలా: అది అపోహ మాత్రమే. అక్కా చెల్లెళ్లు, వదినా మరదళ్లు ఉంటారు గానీ.. పెళ్లి ఉండదు. గురువు ఉన్నప్పుడే తాళి కట్టుకుంటాం. గురువు చనిపోతే విధవ అయిపోతాం. కొందరు బెహరూపులను చూసి మమ్మల్ని ఈసడించుకుంటున్నారు. అది సరికాదు. కొందరు కుర్రాళ్లు కావాలనే ప్రజలను మోసగిస్తున్నారు. మేం అలా కాదు.


ఆర్కే: మిమ్మల్ని ఎవరైనా అవమానిస్తారా?

లైలా: చాలా ఎక్కువ. మమ్మల్ని వేధించినప్పుడు చాలా బాధపడతాం. మరీ ఎక్కువైతే తిరగబడతాం. కొన్నిసార్లు ఆటోడ్రైవర్ల లాంటి వాళ్లు గిల్లి, గిచ్చుతారు. మేమూ మనుషులమే కదా.. ఏడవని రోజంటూ లేదు (కళ్లనీళ్లతో).


ఆర్కే: మామూలు చీరలు కట్టుకుంటే మిమ్మల్ని ఎవరూ ఏమీ అనరు కదా?

లైలా: నేను ఎలా ఉంటే ఎందుకు? వాళ్లను ఏమైనా చేస్తే అనాలి గానీ.. మా పని మేం చూసుకుంటే ఎందుకు అనాలి. హిజ్రాలు తప్పు చేస్తే సమర్ధించను. అందరికీ తలవంచుకుంటూ పోతే ఎన్నాళ్లు బతుకుతాం? సమాజం వల్ల నా కుటుంబానికి, నాకు అన్యాయం జరిగింది తప్ప నావల్ల సమాజానికి ఏమీ జరగలేదు. ఇప్పుడు మా హక్కుల్ని కోల్పోతున్నామన్న విషయం తెలిసింది. సినిమాల్లో కూడా మమ్మల్ని చెడ్డగా చూపిస్తున్నారు. దానిపై మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌కు వినతిపత్రం ఇస్తాం.


ఆర్కే: పెళ్లిళ్ల విషయంలో అమ్మాయిల్లాగే మీకూ అనిపిస్తుందా?

లైలా: మాకూ అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది. కానీ కుదరదు కదా అని కోరికలు అణిచేసుకుంటాం. ఒకబ్బాయి నాతో స్నేహం చేసి, పెళ్లి కూడా చేసుకుంటానన్నాడు. సమస్యలొస్తాయని నేను ఒప్పుకోలేదు. ఇంకా వెంటపడుతున్నాడు. అవకాశమొస్తే చెప్పలేను. ఒకవేళ జరిగితే మా కమ్యూనిటీకి ఇది అడ్వాంటేజ్‌ అవుతుంది. దీనిపై లాయర్‌నూ సంప్రదించాను.

Updated Date - 2020-05-13T21:00:19+05:30 IST