ఓపెన్ హార్ట్‌కు జగన్ వస్తే మొదటగా ఈ ప్రశ్నే అడుగుతా....

ABN , First Publish Date - 2020-05-15T21:41:25+05:30 IST

‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో ప్రముఖులతో సంభాషించే ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణని వీక్షకులే ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది? దుబాయ్‌లో అలాంటి ఆత్మీయ కార్యక్రమమే జరిగింది.

ఓపెన్ హార్ట్‌కు జగన్ వస్తే మొదటగా ఈ ప్రశ్నే అడుగుతా....

మోస్ట్‌ డేంజరస్‌ షో అని రామ్‌గోపాల్‌ వర్మ అన్నారు

పట్టుదలతోనే ఏబీఎన్ చానెల్‌

వ్యవస్థల్ని సక్రమంగా పనిచేసుకోనివ్వాలి

గల్ఫ్‌లో తెలుగువారితో ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ


‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో ప్రముఖులతో సంభాషించే ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణని వీక్షకులే ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది? దుబాయ్‌లో అలాంటి ఆత్మీయ కార్యక్రమమే జరిగింది.  04-06-2012న ఆద్యంతం ఆహ్లాదంగా సాగిన ఆ కార్యక్రమంలో అక్కడి తెలుగువారు అడిగిన ప్రశ్నలు.. రాధాకృష్ణ జవాబులూ...ఇవీ! ఏబీఎన్‌లో ప్రసారమయిన ఈ కార్యక్రమ వివరాలు..


ఆర్కే: అందరికీ నమస్కారం, ఇప్పుడు మనందరం కాసేపు సరదాగా మాట్లాడుకుందాం. మీకు తోచింది, ఇష్టం వచ్చింది.. నిర్మొహమాటంగా మాట్లాడండి. నేను కూడా నాకు తెలియని విషయాలని తెలియదు అని చెప్పేస్తా. నాకేం మొహమాటం లేదు. నేను చెప్పగలిగినవి అంతే నిర్మొహమాటంగా చెప్పేస్తా.


జర్నలిజం అంటే ఏంటి? 1-10 స్కేలులో మీరెంత వరకూ ఎదిగారనుకుంటున్నారు? ఇంకెంత ఎదగాలనుకుంటున్నారు?

ఆర్కే: జర్నలిజం అంటే ఏంటనేది ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడో పెద్ద ప్రశ్న. ఏది జర్నలిజం? ఏది పత్రికా స్వేచ్ఛ? వీటన్నిటికీ కొత్త నిర్వచనాలు ఇవ్వాల్సిన పరిస్థితులున్నాయి. ఇక నా ప్రయాణంలో.. నేనెంతదాకా ఎదిగానో నాకే తెలీదు.


జర్నలిజంలో నిష్పాక్షికత ఎందుకు కనిపించట్లేదు?

ఆర్కే: రాజకీయ పార్టీలు పేపర్లు, చానెళ్లు పెట్టిన తర్వాత జర్నలిజంలో నిష్పాక్షికతను వెతకడం అర్థం లేని పని. వాటితో ఇతర చానెళ్లు, పేపర్లను పోల్చడం అన్యాయం.


కుంభకోణాలు, అవినీతి అక్రమాల ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వ వ్యవస్థలు వాటిని నిర్ధారించడానికి ఎందుకు ఏళ్లూపూళ్లూ పడుతోంది?

ఆర్కే: మన వ్యవస్థలను సక్రమంగా పనిచేసుకోనిస్తే ఏ సమస్యా ఉండదు. ధర్మో రక్షతి రక్షితః!


‘ఓపెన్‌హార్ట్‌ విత్‌ ఆర్కే’కు వచ్చే వారంతా నిజంగా ‘ఓపెన్‌’గానే మాట్లాడతారని మీరనుకుంటున్నారా?

ఆర్కే: పొరపాటున కూడా అనుకోను. అందుకే ఎస్సెమ్మెస్‌ కూడా పెడతాం కదా. కొంతమంది కొంచెం ఓపెనవుతారు. వాళ్లు అబద్ధం చెబుతున్నారనిపించినప్పుడు నవ్వుతాను. అప్పుడు మీకు అర్థమైపోతుంది.


మీరు ఏబీఎన్‌ చానెల్‌ ఎందుకు పెట్టారు?

ఆర్కే: నేను మొదట్నుంచీ జర్నలిజంలో ఉన్నాను కనుక అదొకటే నాకు తెలుసు. నిజానికి నాకు చానెల్‌ పెట్టాలనే ఆలోచన లేదు. ఒక జాతీయ చానెల్‌ వాళ్లు వచ్చి ఆంధ్రజ్యోతితో కలిసి చానెల్‌ ప్రారంభిద్దామని ప్రతిపాదించారు. అది తుది దశకు వచ్చే సమయంలో.. ఆనాడు అధికారంలో ఉన్నవాళ్లు ఆపేశారు. దాంతో నాకు పట్టుదల వచ్చింది. నేనే సొంతంగా చానెల్‌ పెట్టాను.


మీరింత వరకూ చేసిన ఓపెన్‌హార్ట్‌లలో ఎవరిది మీకు బాగా నచ్చింది? ఎందుకు?

ఆర్కే: రామ్‌గోపాల్‌వర్మతో చేసింది నచ్చింది. ఎందుకంటే.. ఇద్దరం తిక్కలోళ్లం గనక (నవ్వుతూ)


మీరు గనక రాష్ట్రానికి సీఎం అయితే ఏంచేస్తారు?

ఆర్కే: నేనసలు అవనుగా..! నాకూ రాజకీయాలకూ పడ దు. తీసుకెళ్లి బలవంతంగా కట్టేసినా నా వల్ల కాదు.


‘ఓపెన్‌హార్ట్‌ విత్‌ ఆర్కే’లో మీ ప్రశ్నలకు ఎక్కువగా ఇబ్బంది పడినవారెవరైనా ఉన్నారా?

ఆర్కే: కొందరు లోపల ఇబ్బంది పడతారుగానీ.. బయటికి చెప్పరు. అయినా, ఇదేదో ప్రశ్న-జవాబు తరహాలో కా కుండా ఏదో అరుగు మీద కూర్చుని మాట్లాడుకుంటున్నట్టుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించాను. దీంతో అవతలి వ్యక్తి మామూలుగా మాట్లాడేస్తారు. రామ్‌గోపాల్‌వర్మ దీన్ని కరెక్ట్‌గా విశ్లేషించారు. ‘‘మోస్ట్‌ డేంజరస్‌ షో ఇది నాకు. ఎందుకంటే నేను ఇవన్నీ బయటికి చెప్తాననుకోలేదు. ఆయన నాతో చెప్పించారు’’ అన్నారు.


కడిగిన ముత్యాలు దొరకరు


మీరు చేసిన ఓపెన్‌హార్ట్‌ కార్యక్రమాలన్నింటిలో బాగా ఓపెన్‌గా మాట్లాడిందెవరు?

ఆర్కే: ఇటీవలి కాలంలో దర్శకుడు తేజ.


ఏబీఎన్‌ చానెల్‌ క్యాప్షన్‌ ‘వుయ్‌ రిపోర్ట్‌, యూ డిసైడ్‌’ అని పెట్టడంలో మీ ఉద్దేశమేమిటి?

ఆర్కే: ‘మేమిది చెప్పాం. అది నిజమో కాదో నిర్ణయించుకోవాల్సింది మీరే’ అనే ఉద్దేశంతో అలా పెట్టాం.


ఒకప్పుడు యథా రాజా తథా ప్రజా అనేవాళ్లం. ప్రజాస్వామ్యంలో యథా ప్రజా, తథా రాజా అనాల్సిన పరిస్థితి. ఈ లెక్కన మనం ఎంత బాధ్యతగా ఉంటున్నాం?

ఆర్కే: వారసుల్ని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నప్పుడు ప్రజలకు వారిని తిరస్కరించే అవకాశం ఉంది కదా? ఇప్పుడున్న పరిస్థితుల్లో కడిగిన ముత్యాలు దొరకరు. ఉన్నవాళ్లల్లో తక్కువ ప్రమాదకరమైనవారిని ఎంచుకోవడమే!


మీరు ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డారో సింపుల్‌గా కాకుండా ‘ఓపెన్‌’గా చెప్పండి?

ఆర్కే: ఉన్నది పోతుందన్న భయం లేదు. లేనిది కావాలన్న ఆశ లేదు నాకు. ఈ క్షణంలో రోడ్డు మీద నడవమంటే నడుస్తాను. బస్సులో వెళ్లమంటే వెళ్తాను. ఆంధ్రజ్యోతి టేకప్‌ చేసినప్పుడు కూడా నా భార్యకు, పిల్లలకు చెప్పిందొక్కటే.. మనం కిందిస్థాయి నుంచి వచ్చాం కాబట్టి, మళ్లీ ఆ స్థాయికే వెళ్లాలన్నా సిద్ధంగా ఉండండి అని. అంతకంటే దిగజారలేం కదా! మనం ఏది చేయాలనుకున్నా.. మంచి చేయాలన్నా, చెడు చేయాలనుకున్నా సరే, దాన్ని నిబద్ధతతో పద్ధతిగా చేయాలి.


డబ్బు, సమయం, వృత్తి.. ఈ మూడిట్లో మీ ప్రాధాన్యం దేనికి?

ఆర్కే: నేను వృత్తికి ప్రాధాన్యమిస్తాను. డబ్బు కావాలనుకుంటే నేను జర్నలిజంలో సంతృప్తిని వదులుకోవాల్సి వస్తుంది. ఆ ఆత్మసంతృప్తి ఉన్నంతవరకూ నాకు డబ్బు రాకపోయినా అది పెద్ద విషయం కాదనుకుంటాను.


ఓపెన్‌హార్ట్‌ విత్‌ ఆర్కేలో సామాజిక సేవ చేసేవారి గురించి ఎందుకు వేయరు?

ఆర్కే: చాలా చేస్తున్నామండీ. ‘నీ బడి పిలుస్తోంది’ అనే మంచి కార్యక్రమం చేస్తే యూట్యూబ్‌లో అతి తక్కువ హిట్లు దానికే. యంగిస్థాన్‌ అనే ప్రోగ్రామ్‌ పరిస్థితీ అంతే. అంధ బాలలకు పాఠశాల నడుపుతున్న ఒకాయనతో ఓపెన్‌ హార్ట్‌ నిర్వహించాం. ఇప్పటిదాకా ఓపెన్‌ హార్ట్‌లన్నింటిలోనూ తక్కువ మంది చూసింది అదే!


సమాజంలో జరుగుతున్న తప్పులపై మీ ముందు వాళ్లు పోరాడారు, ఇప్పుడు మీరు, మీ తర్వాతా.. ఈ పోరాటానికి అంతం ఎక్కడ?

ఆర్కే: జనంలో చైతన్యం వస్తే అన్నీ సర్దుకుంటాయి.


జగన్‌ ఓపెన్‌ హార్ట్‌కు వస్తే మీ మొదటి ప్రశ్న ఏంటి?

ఆర్కే: ‘మనశ్శాంతిగా ఉన్నావా’ అని అడుగుతా. మనకు ఎంత సంపద ఉందనేది కాదు.. ఎంత ప్రశాంతంగా బతుకుతున్నారనేది ముఖ్యం నా దృష్టిలో. కొంచెం ఆరాటాన్ని తగ్గించుకుంటే ఏ బాధలూ ఉండవు.


సాధారణ పౌరుడిగా మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు?

ఆర్కే: నేను పీజీ చదివేటప్పటి నుంచీ ఏ పార్టీకి ఓటు వేస్తే ఆ పార్టీ ఓడిపోతోంది! నేను మొదటిసారి జనతాపార్టీకి వేశాను. ఓడిపోయింది. కిందటిసారి లోక్‌సత్తాకు వేశాను. ఓడిపోయింది.


జర్నలిజంలో నాటి, నేటి తరాల్ని చూశారు.. మీరు గమనించిన తేడా?

ఆర్కే: నాటి తరంలో.. ఆత్మ తృప్తి కోసం జర్నలిజంలోకి వచ్చేవారు. ఇప్పుడు ఆర్థిక తృప్తి కోసం వస్తున్నారు.


పత్రికా స్వేచ్ఛ గురించి నిర్వచనం ఇస్తారా?

ఆర్కే: పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడే జర్నలిస్టులు వాళ్లు పని చేసే సంస్థల్లో ఎంతవరకూ అంతర్గతంగా పత్రికాస్వేచ్ఛ ఉంది అని ప్రశ్నించుకోవాలి.

Updated Date - 2020-05-15T21:41:25+05:30 IST