నిఖార్సైన జర్నలిజం మాది.. ఎవరిపైనా కత్తి కట్టలేదు

ABN , First Publish Date - 2020-05-15T21:53:48+05:30 IST

ఎప్పుడూ ‘ఓపెన్‌హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమంలో ప్రశ్నించే స్థానంలో ఆర్కే.. సమాధానాలిచ్చే స్థానంలో సెలబ్రిటీలు ఉంటారు. కానీ, ఏబీఎన్‌ చానెల్‌ ద్వితీయ వార్షికోత్సవం

నిఖార్సైన జర్నలిజం మాది.. ఎవరిపైనా కత్తి కట్టలేదు

వ్యక్తిగత విషయాలు మాకు అనవసరం

వైఎస్‌ అక్రమాలపై మొదట రాసింది మేమే

ఆయన నన్ను రెండుసార్లు పిలిచి... రాయొద్దన్నారు

మాపై నమ్మకంతోనే బాధితులు వస్తున్నారు

మోహన్‌బాబుతో ఆర్కేస్‌ ఓపెన్‌ హార్ట్‌


ఎప్పుడూ ‘ఓపెన్‌హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమంలో ప్రశ్నించే స్థానంలో ఆర్కే.. సమాధానాలిచ్చే స్థానంలో సెలబ్రిటీలు ఉంటారు. కానీ, ఏబీఎన్‌ చానెల్‌ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ నటుడు మోహన్‌బాబు రివర్స్‌ ఓపెన్‌హార్ట్‌ నిర్వహించారు. ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ మనసులోని విషయాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఆ విశేషాలు.. 17-10-2011న ఏబీఎన్‌లో ప్రసారమయిన ఈ కార్యక్రమ వివరాలు..


మోహన్‌బాబు: వచ్చినవాడు యాక్టరా.. డాక్టరా అని ఆలోచించకుండా చిలిపిగా ఇష్టం వచ్చినట్లు ప్రశ్నిస్తారు. అదెంత న్యాయం?

ఆర్కే: అవతలివాళ్లు హర్ట్‌ కానంతవరకు ఏమైనా అడగొచ్చు. ఇతరులు, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉండటం మానవ నైజం.


మోహన్‌బాబు: ఇంట్లో కూడా పిల్లల్ని ఇలాగే టార్చర్‌ చేస్తారా?

ఆర్కే: నేను వాళ్లని చేస్తున్నానో, వాళ్లు నన్ను చేస్తున్నారో తేల్చుకోలేకపోతున్నాను. ఎప్పుడైనా నేను తిడితే.. కాసేపాగి వాళ్లు ‘కానిచ్చేయండి’ అంటున్నారు.


మోహన్‌బాబు: అన్న ఎన్టీఆర్‌ లాంటి మహాభావుడిని కాదని చంద్రబాబుని పొగిడి.. పెద్దాయనను తిట్టారెందుకు?

ఆర్కే: చంద్రబాబును నేను పొగడలేదు. ఎన్టీఆర్‌పై కాదు.. నాటి పరిణామాలకు వ్యతిరేకంగా రాశాం. ఎన్టీఆర్‌ కుంకుమ బొట్టు పెట్టుకునేవారు తప్ప తిలకం కాదు. మూడోసారి సీఎం అయ్యాక కుంకుమ లేదు. లక్ష్మీపార్వతి చిన్న తిలకం పెట్టించారు. అంటే, వ్యక్తిత్వాన్ని ఆయనకు ఆయనే చంపేసుకున్నారు. ఏ జర్నలిస్టయినా ప్రభుత్వంలో, పార్టీలో జరిగేవాటిని కచ్చితంగా రిపోర్ట్‌ చేయాలి కాబట్టి చేశాను.


మోహన్‌బాబు: ఆయన సీఎంగా తప్పుచేస్తే రాయండిగానీ, వ్యక్తిగత జీవితంలోకి వెళ్లడం ఎందుకు?

ఆర్కే: వ్యక్తిగత జీవితంలోకి వెళ్లడం మా లక్ష్యం కాదు. రిపోర్టర్‌గా ఆ రోజు ఏం జరిగితే అదంతా రాశాను. తర్వాత చంద్రబాబు సీఎం అయ్యాక అంతకంటే తీవ్రంగా రాశాం. వ్యక్తిగతంగా ఎన్టీఆర్‌ను వ్యతిరేకించలేదు.


మోహన్‌బాబు: ఇలా రాసినందుకు మీ ఆఫీసు మీద రాళ్లేశారు కదా!

ఆర్కే: నిజం నిష్టూరంగా ఉంటుంది కాబట్టే ఇలాంటి పరిస్థితులు వస్తాయి. పీఆర్పీ గురించి ఏదో స్టోరీ వచ్చింది. దాని గురించి కూడా నాకు తెలీదు. అయినా రాళ్లేశారు. తర్వాత చిరంజీవే ఫోన్‌ చేసి, ఏదో జరిగిపోయిందన్నారు.


మోహన్‌బాబు: చంద్రబాబును మాత్రం మీరు పొగిడారెందుకు?

ఆర్కే: నేను పొగడలేదు. ఒకళ్లు తప్పు చేస్తే మరొకరికి అది అడ్వాంటేజ్‌ అవుతుంది. పార్టీలో ఆరోజు రాజకీయమంతా ఎన్టీఆర్‌, లక్ష్మీపార్వతి, చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు చుట్టూ తిరిగింది. మెజార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబును ఎంచుకున్నారు.


మోహన్‌బాబు: మా బావ వైఎస్‌పై మీరు మొదట్నుంచి కత్తిగట్టారెందుకు?

ఆర్కే: మేం కత్తీ కట్టలేదు.. బరిశా కట్టలేదు. మంచి పనులను ఎవరూ తప్పుపట్టలేరు. కానీ, ఈవాళ ప్రతివాళ్లూ మేం ఆరోజు రాసినదాని గురించే మాట్లాడుతున్నారు, దానిపైనే సీబీఐ విచారణ జరుగుతోంది. ఓబుళాపురం గురించి మొదట రాసింది మేమే. ఆయన తన తప్పుల్ని రాయొద్దు అనేవారు. నన్ను పిలిచి మరీ అడిగారు. రైతుల ఆత్మహత్యల గురించి రాయొద్దు అన్నారు.. అవి జరగకుండా చూడండి అన్నాను.


మోహన్‌బాబు: మీకు కుల పిచ్చి ఉందని విన్నాను.. నిజమేనా?

ఆర్కే: అదృష్టవశాత్తు నేను నిజామాబాద్‌ జిల్లాలో పుట్టి పెరిగా. ఈ కులతత్వం మాకు తెలంగాణలో చాలా తక్కువ. ఎవరేంటో కూడా తెలీదు. మా పత్రిక, చానళ్లలో పనిచేసేవాళ్లు ఎవరు ఏంటో కూడా నాకు చాలావరకు తెలీదు. వాళ్లలో 50 శాతం వరకు వామపక్ష భావజాలం ఉన్నవాళ్లు ఉంటారు. రెండు కులాలు సమవుజ్జీగా ఉన్నప్పుడు కొట్టుకుంటేనే ఈ సమస్య వస్తుంది. ఇదంతా పార్టీలు సృష్టించిన కొత్త ట్రెండు. ఇటీవల మరింత పెరిగింది.


మోహన్‌బాబు: మన రాష్ట్రంలోనే చాలావరకు విద్యాసంస్థల ప్రమాణాలు నీచంగా ఉంటున్నాయెందుకు?

ఆర్కే: ఇలా దిక్కుమాలిన విద్యాసంస్థలు రావడానికి కారణమూ చనిపోయిన మీ బావగారే. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం కోసమే కొన్ని ఇంజనీరింగ్‌ కాలేజీలు పుట్టుకొచ్చాయి. తప్పు చేసినవారు ఎవరైనా ఫలితం తప్పదు.


బాధితులు స్వయంగా తీసిన విజువల్స్‌ అవి


మోహన్‌బాబు: ఈ మధ్య కొందరు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఆకాశంలోంచి ఊడి పడ్డట్టు గర్వంగా ఉంటున్నారెందుకు?

ఆర్కే: ఆనాటి.. నేటి అధికారులకు పోలిక లేదు. పాతవాళ్లు సమాజాన్ని స్టడీ చేసి వచ్చేవారు. వాళ్లలో అంకితభావం ఉండేది. డబ్బు గురించి ఆలోచన ఉండేది కాదు. ఇప్పుడు ఉద్యోగంలోకి వచ్చింది మొదలు.. ఎక్కడ అవకాశం ఉంటుందా అని చూడటమే. ఐఏఎస్‌ అంటే అయాం సేఫ్‌ అంటారు. సర్వీస్‌లోకి వచ్చినప్పుడు గరం.. తర్వాత నరం.. చివరకు బేషరం అని వాళ్లే చెబుతుంటారు. చిన్న ఉదాహరణ.. బీపీ ఆచార్య. వ్యక్తిగతంగా ఆ దంపతులిద్దరూ చాలా మంచి అధికారులు. కానీ, సీఎం మెప్పు కోసం ఎలాంటి పనులు చేసి ఇప్పుడు ఎలా అనుభవిస్తున్నారో చూస్తున్నాం కదా.


మోహన్‌బాబు: కొందరిని మీరు అలా ఎత్తి.. ఇలా పడేస్తారు. డబ్బులేమైనా వస్తాయా?

ఆర్కే: ఇది చాలా సిల్లీ ప్రశ్న. నిజంగా అలా చేస్తే ఎవరైనా రోడ్డుమీదకు వచ్చి చెప్పకుండా ఉంటారా? ఏమీ లేకుండానే ఇష్టం వచ్చిన ఆరోపణలు చేస్తున్నారు. నిజంగా డబ్బులు వస్తే మాకు కష్టాలుండవు. చిరంజీవి విషయంలో.. పార్టీ పెట్టినప్పుడు కొంత ప్రోత్సహించిన విషయం వాస్తవమే. అప్పటివరకు కమ్మ, రెడ్డి వర్గాల మధ్యనే అధికారం ఉంది. మిగిలిన వర్గాలకు అవకాశం వస్తోంది కదా అనుకున్నాం. ఆయన అధికారంలోకి వస్తే తర్వాతి నుంచి సంబంధం ఉండదని కూడా చెప్పా. చంద్రబాబు రెండోసారి అధికారంలోకి వచ్చాక చాలా నియంతృత్వంగా మారారు. దాంతో నేను మాట్లాడటం మానేశా.


మోహన్‌బాబు: రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లోనూ మీ పత్రికకు మంచి ఆదరణ ఉంది. ఎలా సాధ్యం?

ఆర్కే: మేం నికార్సుగా ఉండటం వల్లనే అది సాధ్యమైంది. బాధితులు ఎవరికైనా ఫిర్యాదు చేసినప్పుడు ఒక కాపీ మాకు కూడా ఇస్తారు. వాళ్లకు మా మీద నమ్మకం ఉండటం వల్లనే అలా చేస్తున్నారు. అలాగే స్టోరీలు వస్తున్నాయి.


మోహన్‌బాబు: కానీ కీహోల్‌ జర్నలిజం ఎందుకు? గవర్నర్‌ బెడ్‌రూంలోకి కెమెరా తీసుకెళ్లే హక్కు మీకెక్కడిది?

ఆర్కే: వ్యక్తిగత విషయాల గురించి మాకు అవసరం లేదు. కానీ, బాధితులు ఎవరైనా ఫిర్యాదుచేస్తే దాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిందే. చీకటి వ్యవహారాలు చేసినవాళ్లే అవతలివాళ్లని ‘ఎల్లో’ అంటారు. మాది నికార్సైన జర్నలిజం. గవర్నర్‌ వద్దకు కెమెరా మేం తీసుకెళ్లలేదు. బాధితులు స్వయంగా తీసిన విజువల్స్‌ అవి. వాళ్లే మాకు ఇచ్చారు. ఎప్పుడైనా పొరపాటున ఒకటి రెండు తప్పులు రావచ్చు. అలాంటప్పుడు మేం సవరణ కూడా వేస్తాం.


మోహన్‌బాబు: మీరేమైనా సినిమా యాక్టర్‌ అవ్వాలనుకుంటున్నారా? చిన్నపిల్లాడిలా ఆ డ్రస్సులేంటి? రాజకీయాల్లోకి వెళ్తారా?

ఆర్కే: మీ డ్రస్సులేంటి.. ఆ వయసేంటి? (సినిమాల్లో ఉన్నన్నాళ్లు హీరోకు 20, హీరోయిన్‌కు 18 అని అన్నగారు అనేవారు). రోజుకో గంట వ్యాయామం చేస్తానంతే. రాజకీయాల్లోకి అసలు వెళ్లను. అది నాకు అసలు పడదు.


మోహన్‌బాబు: కేసీఆర్‌ది విజయనగరం, మీది కృష్ణా జిల్లా. మీ ఇద్దరికీ చనువు ఉందన్నారు. ఏమైనా అండర్‌స్టాండింగ్‌ ఉందా?

ఆర్కే: ఏరా ఏరా అని పిలుచుకోడానికీడబ్బులు కావాలా? బాగా చనువు ఉన్నప్పుడే అలా వస్తుంది. మా ఇద్దరికీ దాదాపు 20 ఏళ్ల నుంచి చనువుంది. మండవ వెంకటేశ్వరరావు, నేను క్లాస్‌మేట్స్‌. అలా మాలో కొందరికి అలవాటైపోయింది.


మోహన్‌బాబు: మీకు చాలా వ్యాపారాలు ఉన్నాయంటారు.. ఏంటవి?

ఆర్కే: ఏమైనా ఉంటే రాసిస్తా. తీసుకెళ్లిపోండి. ఒకే ఒక్క మినీ హైడల్‌ ప్రాజెక్టునూ వైఎస్‌ రద్దు చేసేశారు.


మోహన్‌బాబు: పాప.. బాబు ఇద్దరిలో మీకు ఎవరు ఎక్కువ ఇష్టం? పేపర్‌ ఎవరికి ఇస్తారు?

ఆర్కే: ఇద్దరూ ఇష్టమే. కానీ అమ్మాయిపై సహజంగానే కాస్త ఎక్కువ మొగ్గు ఉంటుంది. ఆదిత్య ఆంధ్రజ్యోతిని, అనూష ఏబీఎన్‌ను చూసుకుంటారు.


మోహన్‌బాబు: రాష్ట్రం అట్టుడికిపోతోంది. దీనికి బాధ్యులెవరు? మనమంతా ఎప్పుడు సంతోషంగా ఉండగలం?

ఆర్కే: ఎవరో అడిగితే, దీని గురించి సోనియాగాంధీ నాకేమీ ఫోన్‌ చేయలేదని చెప్పా. పరిస్థితులు చేతులు దాటిపోయాయి. తెలంగాణలో సెంటిమెంట్‌ బాగా ఉంది. దాన్ని నియంత్రించడం ఎవరివల్లా కాదు. కేంద్రం, రాజకీయ పార్టీలే సమస్యను పరిష్కరించాలి. కాలమే నిర్ణయించాలి.


మోహన్‌బాబు: రాబోయే ఎన్నికల్లో ఎవరికి మద్దతిస్తారు?

ఆర్కే: మేం ఎవరికీ మద్దతివ్వం. నోటిఫికేషన్‌ వెలువడిన తర్వాత కేవలం జరుగుతున్న వాస్తవాలు మాత్రమే రాస్తాం. ఎవరికీ అనుకూలం, వ్యతిరేకం కాదు.


మోహన్‌బాబు: సినిమాలు చూస్తారా? ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ల్లో ఎవరిష్టం?

ఆర్కే: అప్పట్లో ఎన్టీఆర్‌ ఇష్టం. అది కూడా పౌరాణికాలే. సాంఘిక చిత్రాల్లో ఆయన నటన చూస్తే నవ్వొస్తుంది.


మోహన్‌బాబు: ఇప్పుడున్న హీరోలు.. హీరోయిన్లలో ఎవరు ఇష్టం?

ఆర్కే: నిజం చెప్పాలంటే ఎవరూ ఇష్టం ఉండరు. అద్భుతమైన నటులు ఉన్నారని అనిపించదు. హీరోయిన్లకు నటన ఎటూ రాదు కాబట్టి, పైన.. కింద రెండు పీలికలు వేస్తున్నారు. అందుకే వాళ్లందరినీ అందరూ చూస్తారు.


మోహన్‌బాబు: సినిమాలు, టీవీలో హృదయాన్ని కదిలించే సన్నివేశాలుంటే ఏడుస్తారట.. నిజమేనా?

ఆర్కే: అవును.. నేనూ మనిషినే. బేసిగ్గా నేను సెంటిమెంటల్‌. కష్టాల సీన్లొస్తే రావు. మానవ సంబంధాల విషయంలోనే వస్తాయి. సినిమా అని తెలిసినా అంతే. అలాంటివి వచ్చినప్పుడు పిల్లలు టీవీకి బదులు నన్ను చూస్తారు.


మోహన్‌బాబు: జీవితంలో ఆనందకరమైన, బాధాకరమైన సంఘటనలేవి?

ఆర్కే: ఆంధ్రజ్యోతిని వీలైనంత ప్రొఫెషనల్‌గా నడపాలని ఆశిస్తున్నా. పత్రిక ఎదుగుదల చూస్తే ఆనందం. దురుద్దేశాలు ఆపాదించాలని చూస్తే బాధ అనిపిస్తుంది.


Updated Date - 2020-05-15T21:53:48+05:30 IST