ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన కృనాల్ పాండ్యా
ABN , First Publish Date - 2020-10-05T01:50:15+05:30 IST
ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా ఐపీఎల్‌లో ఆల్‌టైం రికార్డు సృష్టించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కొద్దిసేపటి క్రితం జరిగిన
షార్జా: ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా ఐపీఎల్‌లో ఆల్‌టైం రికార్డు సృష్టించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో కొద్దిసేపటి క్రితం జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఇన్నింగ్స్ 20వ ఓవర్ రెండో బంతికి హార్దిక్ పాండ్యా (28) అవుటయ్యాక కృనాల్ పాండ్యా క్రీజులోకి వచ్చాడు. అప్పటికి ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగా, సిద్ధార్థ్ కౌల్ వేసిన 20వ ఓవర్ మూడో బంతిని లాంగాన్‌లోకి కొట్టి ఆరు పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాతి బంతిని బౌండరీకి తరలించాడు. ఐదో బంతిని ఎక్స్‌ట్రా కవర్ మీదుగా బౌండరీ బాదిన కృనాల్.. ఆరో బంతిని మళ్లీ సిక్సర్‌గా మలిచాడు.
నాలుగు బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 20 పరుగులు సాధించాడు. ఫలితంగా 29 ఏళ్ల కృనాల్ అత్యంత అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్‌లో కనీసం 10 పరుగులు చేసిన ఆటగాళ్లలో 500 స్ట్రైక్ రేట్ కలిగిన తొలి బ్యాట్స్‌మన్‌గా చరిత్ర సృష్టించాడు.