నిమజ్జనం.. నిరాడంబరం..
ABN , First Publish Date - 2020-09-02T09:25:29+05:30 IST
నవ రాత్రులు పూజలందుకున్న గణపయ్య మంగళవారం నిరాడంబరంగా గంగమ్మ ఒడికి చేరాడు. ప్రతి యేటా రాష్ట్రవ్యాప్తంగా ఎంతో సందడిగా జరిగే ఏకదంతుడి నిమజ్జన వేడుక ఈసారి కొవిడ్ నిబంధనల నేపథ్యంలో సాదాసీదాగా
- గంగమ్మ ఒడికి చేరిన గణనాథుడు
- జనం తగ్గినా.. సాగర తీరంలో సందడి
- బాలాపూర్ లడ్డూ సీఎం కేసీఆర్‌కు
- సాయంత్రం ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం పూర్తి
ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్: నవ రాత్రులు పూజలందుకున్న గణపయ్య మంగళవారం నిరాడంబరంగా గంగమ్మ ఒడికి చేరాడు. ప్రతి యేటా రాష్ట్రవ్యాప్తంగా ఎంతో సందడిగా జరిగే ఏకదంతుడి నిమజ్జన వేడుక ఈసారి కొవిడ్ నిబంధనల నేపథ్యంలో సాదాసీదాగా జరిగింది. హైదరాబాద్ నగరంలోనూ ఎటువంటి హంగూ, ఆర్భాటం లేకుండా గణనాథుడి శోభాయాత్ర సాగింది. గతంతో పోలిస్తే నగరంలో నిమజ్జన కోలాహలం తక్కువగా కనిపించింది. మధ్యాహ్నం వరకు జనం లేకుండా కనిపించిన హుస్సేన్‌సాగర్ తీరం, అనంతరం సందడిగా మారింది. సాయంత్రానికి విగ్రహాల సంఖ్యతోపాటు భక్తులూ పెరిగారు. కొవిడ్ నిబంధనల నేపథ్యంలో బాలాపూర్ గణనాథుడి ఊరేగింపు జరగలేదు. ఉదయం 11.30 గంటలకే ట్యాంక్‌బండ్‌పై బాలాపూర్ గణపతి నిమజ్జనం జరిగింది. బాలాపూర్ లడ్డూను ఈసారి వేలం వేయకుండా సీఎం కేసీఆర్‌కు అందజేయాలని ఉత్సవ కమిటీ తీర్మానించింది.
4 గంటల పాటు సాగిన శోభాయాత్ర
తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ గణపతి నిమజ్జనమూ సాయంత్రంలోపే ముగిసింది. తొమ్మిది అడుగుల ధన్వంతరి నారాయణ మహాగణపతి శోభాయాత్ర మధ్యాహ్నం 12.45కు మొదలైంది. దాదాపు 4 గంటలపాటు సాగి, 4.35కు క్రేన్ నెంబర్ 3 వద్దకు విగ్రహం చేరుకుంది. సాయంత్రం 5.26 గంటలకు గణపయ్య గంగమ్మ ఒడికి చేరాడు.
అయినా.. వేల గణపతులు
కొవిడ్ నిబంధనల నేపథ్యంలో ఈసారి గణేశ్ మండపాలకు అనుమతి లేనప్పటికీ నగరంలో వేల సంఖ్యలో విగ్రహాల ప్రతిష్ఠాపన జరిగింది. అయితే, గతంలోలా భారీ స్థాయిలో మండపాలు ఏర్పాటు చేయకుండా ఏకదంతునికి పూజలు నిర్వహించారు. విగ్రహాల ఎత్తు చాలా వరకు తగ్గింది. ఎక్కువగా ఐదారు అడుగుల లోపు విగ్రహాలు ఉండగా, పదుల సంఖ్యలో 8-10 అడుగుల విగ్రహాలు వచ్చాయని, దీంతో నిమజ్జనం వేగంగా జరిగిందని అధికారులు తెలిపారు. రాత్రి ఏడు గంటల వరకు సాగర్‌లో 3,500 విగ్రహాలు నిమజ్జనం జరిగినట్టు అధికారులు చెప్పారు. సరూర్‌నగర్, సఫిల్‌గూడ, కాప్రా చెరువుల వద్ద నిమజ్జన కోలాహలం కనిపించింది.
మురికికూపంగా కొలనులు
నెక్లెస్ రోడ్డులో గణనాథుల నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన వినాయక కొలనులు మురికికూపంగా మారాయి. మూడేళ్ల క్రితం జీహెచ్‌ఎంసీ ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కొలనుల వద్ద ఈసారి నిమజ్జన ఏర్పాట్లు చేయలేదు. దీంతో కొలనుల పరిస్థితి చూసి చాలా మంది నిమజ్జనం చేయకుండా అక్కడి నుంచి వెనుదిరిగారు.
పోచంపల్లి గణేశుడి లడ్డూ వేలం రూ.4,11,111
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి మునిసిపాలిటీలో 101 యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణేశుడి లడ్డూ ప్రసాదం వేలంలో రూ.4,11,111 పలికింది. జిల్లా వ్యాప్తంగా స్వామివారి లడ్డూ ప్రసాదం రూ.4లక్షల పైచిలుకు పలకడం ఇదే ప్రథమం కావడం విశేషం.
ఒత్తిడి తగ్గింది: లింగయ్య, క్రేన్ ఆపరేటర్, కూకట్‌పల్లి
గతంలో ట్యాంక్‌బండ్‌పై గణపతి విగ్రహాలను నిమజ్జనం చేయాలంటే విపరీతమైన ఒత్తిడి ఉండేది. ఈసారి అన్నీ 6-10 ఫీట్ల ఎత్తున్న విగ్రహాలే వచ్చాయి. గతంలో ఉన్నంత ఒత్తిడి ఈసారి లేదు.
నిమజ్జనంలో అపశ్రుతి.. ఒకరి మృతి
భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగులో గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి దొర్లింది. గ్రామానికి చెందిన ఎలుగుల శ్రీనివాస్(45) సోమవారం అర్ధరాత్రి నిమజ్జనం అనంతరం చెరువులో మునిగి చనిపోయాడు.
మాస్కులు మరిచారు..
ట్యాంక్‌బండ్‌కు వచ్చిన భక్తుల్లో కొందరు మాస్కులు ధరించలేదు. గుంపులుగా తిర గడంతోపాటు డ్యాన్సులు చేశా రు. మాస్కులు ధరించాలని అధికారులు చెప్పినా కొందరు పట్టించుకోలేదు.