రంగంలోకి ఐఏఎస్ శేషాద్రి
ABN , First Publish Date - 2020-09-05T09:36:04+05:30 IST
భూముల/రెవెన్యూ చట్టాలను జల్లెడ పట్టే బాధ్యతలను ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి వి.శేషాద్రికి అప్పగించింది.
- తెలంగాణ ప్రభుత్వానికి రిపోర్ట్ చేసిన అధికారి
- వచ్చీరాగానే భూ చట్టాల జల్లెడ బాధ్యత
- సీసీఎల్‌ఏ కార్యాలయంలో విధుల్లోకి
హైదరాబాద్, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): భూముల/రెవెన్యూ చట్టాలను జల్లెడ పట్టే బాధ్యతలను ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి వి.శేషాద్రికి అప్పగించింది. ఐదున్నరేళ్లుగా కేంద్ర సర్వీసులో, అందులోనూ ప్రధాన మంత్రి కార్యాలయ బాధ్యతల్లో ఉన్న ఆయన తాజాగా అక్కడ సర్వీసులు పూర్తిచేసుకొని.. నాలుగు రోజుల కింద రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. ఆయన వచ్చీరాగానే ప్రభుత్వం రెవెన్యూ/భూ చట్టాల సమీక్ష బాధ్యతలను కట్టబెట్టింది. 1999 బ్యాచ్‌కు చెందిన శేషాద్రి రెవెన్యూ శాఖలో కీలక ముద్ర వేశారు. అత్యంత విలువైన భూములు కలిగిన రంగారెడ్డి జిల్లాలో జాయింట్ కలెక్టర్‌గా, కలెక్టర్‌గా పనిచేశారు. యూఎల్సీ ప్రత్యేకాధికారిగా కూడా ఉన్నారు. రికార్డ్ ఆఫ్ రైట్(ఆర్‌వోఆర్) చట్టాన్ని అనుసరించి, ఆయన ఇచ్చిన ఉత్తర్వులు చిరస్థాయిగా ఉంటాయని రెవెన్యూ అధికారులు చెబుతుంటారు.
ప్రస్తుతం రెవెన్యూశాఖకు వచ్చే అర్జీల్లో 95 శాతం ఆర్‌వోఆర్ యాక్ట్‌తో ముడిపడి ఉన్నవే. తాజాగా భూముల సమగ్ర చట్టాన్ని రూపొందించాలని యోచిస్తున్న ప్రభుత్వం.. సేవల ఆలసత్వానికి ఏ మాత్రం అవకాశం లేని విధంగా చట్టాలను తయారు చేయాలని నిర్ణయించింది. ఈ సమయంలో రికార్డ్ ఆఫ్ రైట్ చట్టంపై సమగ్ర అవగాహన కలిగిన శేషాద్రి కేంద్ర సర్వీసుల నుంచి రిలీవై.. తెలంగాణ సర్వీసులో చేరడం ప్రభుత్వానికి కలిసి వచ్చింది. దాంతో సమగ్ర రెవెన్యూ చట్టాన్ని ఫైనలైజ్ చేసే బాధ్యతను ఆయనకు అప్పగించినట్లు సమాచారం. శుక్రవారం ఉదయం ఆయన సీసీఎల్‌ఏ కార్యాలయానికి వచ్చీరాగానే పాత చట్టాలు/ప్రస్తుతం అమలులో లేనివి/ఏ మాత్రం మనుగడలో లేని చట్టాలేంటి..? వాటిలో కీలక అంశాలేంటి..? వంటి వాటిపై దృష్టి సారించారు.
సీసీఎల్‌ఏగా ఛాన్స్
ప్రస్తుతం భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ), రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కార్యదర్శి హోదా కలిగిన శేషాద్రికి ఈ రెండింటిలో ఒక పోస్టు(సీసీఎల్‌ఏ)ను కట్టబెట్టే అవకాశాలున్నాయి. బెంగళూరులోని నేషనల్ స్కూల్ ఆఫ్ లా నుంచి పట్టభద్రుడైన శేషాద్రికి రెవెన్యూ చట్టాలపై గట్టి పట్టుంది. మితభాషిగా పేరున్న ఆయనకు సమర్థుడైన అధికారిగా పేరుంది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో సీసీఎల్‌ఏ బాధ్యతలు అప్పగించి.. రెవెన్యూ చట్టానికి దశ దిశను చూపించే బాధ్యత ఆయనకు కట్టబెడతారని భావిస్తున్నారు.