కాలుష్య నియంత్రణ మండలి..కలుషితమైంది!

ABN , First Publish Date - 2020-02-15T11:20:49+05:30 IST

సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ బొగ్గు గనుల వల్ల సత్తుపల్లి పరిసర ప్రాంతాలు కాలుష్యం బారిన పడ్డాయని, దీనికారణంగా

కాలుష్య నియంత్రణ మండలి..కలుషితమైంది!

అధికారులను సింగరేణి మేనేజ్‌ చేస్తోంది

ప్రాణాలు పోతున్నా యంత్రాంగం పట్టించుకోదా?

ఓసీలను వెంటనే మూసివేయాలి

సత్తుపల్లి ప్రజాభిప్రాయ సేకరణలో రైతులు, నాయకుల డిమాండ్‌


సత్తుపల్లి, ఫిబ్రవరి 14: సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ బొగ్గు గనుల వల్ల సత్తుపల్లి పరిసర ప్రాంతాలు కాలుష్యం బారిన పడ్డాయని, దీనికారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని రైతులు, ప్రజాసంఘాల నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ కాలుష్యాన్ని నియంత్రించేందుకు పనిచేయాల్సిన నియంత్రణ మండలిలోని కొందరు అధికారులు, సింగరేణి సంస్థ ఇచ్చే ప్యాకేజీకి అలవాటు పడ్డారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. శుక్రవారం సత్తుపల్లిలోని జేవీఆర్‌ కళాశాల ఆవరణలో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో పలువురు రైతులు, నాయకులు సింగరేణి సంస్థ అధికారులు, కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా పాలనా యంత్రాంగంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ బొగ్గు గనులను మూసివేయాలని డిమాండ్‌ చేశారు. బాధిత రైతులకు వెంటనే సమాధానం చెప్పాలని సీపీఎం కార్యదర్శి మోరంపూడి పాండురంగారావు అధికారుల ఎదుట బైఠాయించారు. ప్రజాభిప్రాయ సేకరణ సభ మొదలవ్వగానే రైతులు, పలువురు నాయకులు సింగరేణికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది.


యంత్రాంగంపై ఆగ్రహం..

కాలుష్యాన్ని నియంత్రించేందుకు పనిచేయాల్సిన నియంత్రణ మండలిలోని కొందరు అధికారులు, సింగరేణి సంస్థ ఇచ్చే ప్యాకేజీకి అలవాటు పడ్డారని రేజర్లకు చెందిన కొప్పుల కేశవరెడ్డి తీవ్రంగా ఆరోపించారు. కాలుష్య నియంత్రణ మండలి కలుషితమైపోయిందని అన్నారు. తమ గ్రామానికి సమీపంలోని జీలుగుమెల్లి చెరువు నీరు మొత్తం కలుషితమై, నీటిపై బూడిద మాదిరిగా యాసిడ్‌ కమ్మేసిందని, చెరువులో చేపలు, కప్పలు కూడా చనిపోయాయని, సింగరేణి అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. కాలుష్య నియంత్రణ అధికారులు వేదికకే పరిమితం కాకుండా.. వ్యవసాయ క్షేత్రాలకు వస్తే తమకు జరుగుతున్న నష్టాన్ని స్వయంగా చూపిస్తామని అన్నారు.


సీపీఎం నాయకుడు మోరంపూడి పాండు రంగారావు.. మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఓపెన్‌ కాస్టులకు వ్యతిరేకంగా ప్రస్తుత ముఖ్యమంత్రి మాట్లాడారని, ఆంధ్రా పాలకుల కోసమే ఓపెన్‌ కాస్ట్‌ గనులు తవ్వుతున్నారన్న ముఖ్యమంత్రి ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో ఉత్పతి అయ్యే బొగ్గులో టన్నుకు రూ.90చొప్పున స్థానిక అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సి ఉందని, ఈ లెక్కన సత్తుపల్లి ప్రాంతానికి రావాల్సిన రూ.370కోట్లను ఇతర ప్రాంతాలకు మళ్లించారని ఆరోపించారు. ఓసీల వల్ల గ్రామాలు బొందల గడ్డగా మారుతున్నాయని, వేసవిలో ఉష్ణోగ్రతలు 50దాటుతున్నా.. అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని, భూములు ఇచ్చి త్యాగం చేసిన రైతులకు న్యాయం జరగక అడ్డుక్కుతినే పరిస్థితి వచ్చిందన్నారు. బీజేపీ నాయకుడు ఉడతనేని అప్పారావు మాట్లాడుతూ 2004లో సింగరేణి అధికారులు ఇచ్చిన బుక్‌లెట్‌లో వివరాలకు ప్రస్తుతం జరుగుతున్న దానికి పొంతన లేదని ఆరోపించారు.


కంచే చేను మేసిన చందంగా అధికారుల తీరు ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం మార్చి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని, కేంద్ర పొల్యూషన్‌ బోర్డుకు కనీస సమాచారం కూడా అందడం లేదని అన్నారు. జిల్లా అధికారులు ప్రభుత్వానికి, సింగరేణికి వత్తాసు పలుకుతూ ప్రజలను బలి చేస్తున్నారని, రైతుల త్యాగాలను అవహేళన చేస్తున్నారని, సింగరేణి కాలుష్యం వల్ల గత 15ఏళ్లలో ఈ ప్రాంతంలో 2,672 మంది చనిపోయారని అన్నారు. కంట్రోల్‌ బ్లాస్టింగ్‌ జరగడం లేదని, దీనివల్ల ప్రభావిత గ్రామాల్లో ఇళ్లు బీటలు వారుతున్నాయని అన్నారు. సొసైటీ ఎన్నికల సందర్భంగా రైతులు ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారని చెప్పారు.


కోల్‌ వాషరీ ప్లాంట్‌ను ప్రారంభించవద్దని, దీనివల్ల వాతావరణం మరింత కలుషితం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర నాయకులు, రైతులు, పలువురు మాట్లాడుతూ సింగరేణి చేసే తప్పులకు భయపడి అధికారులు వందల సంఖ్యలో పోలీస్‌ పహారా మధ్య ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారని విమర్శించారు. సింగరేణి ఓసీలు వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పిన అధికారులు ఎన్ని ఉద్యోగాలు అవకాశాలు కల్పించారని ప్రశ్నించారు. సత్తుపల్లి-రేజర్ల మధ్య ఓసీలో బ్లాస్టింగ్‌ సమయంలో ట్రాఫిక్‌ను ఆపుతున్నారని, దీనిలో అంబులెన్స్‌లను కూడా నిలువరించడం వల్ల పలువురు ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. సింగరేణికి అవసరమైన రికార్డులు తయారుచేసే గుమస్తాలుగా జిల్లా అధికారులు తయారవుతున్నారే తప్ప ప్రజల బాధలు పట్టించుకోవడం లేదని విమర్శించారు.


ఓపెన్‌ కాస్ట్‌ కారణంగా ఈ ప్రాంత ప్రజల సగటు జీవన ప్రమాణాలు పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గాలి, నీరు, ధ్వని కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతోందని, విపరీతమైన కాలుష్యం కారణంగా ప్రజలు రోగాల బారిన పడుతున్నారని అన్నారు. బొగ్గు రవాణా చేస్తున్న లారీలు నిబంధనలు పాటించడం లేదని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజాభిప్రాయ సేకరణలో జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌, కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ రవికుమార్‌, కల్లూరు ఆర్డీవో బీ.శివాజీ పాల్గొన్నారు.

Updated Date - 2020-02-15T11:20:49+05:30 IST