మిస్టరీ మర్డర్స్‌

ABN , First Publish Date - 2020-12-12T13:39:03+05:30 IST

భూ వివాదాలు, పాత కక్షలు, ప్రేమ, కులాంతర వివాహాలు..

మిస్టరీ మర్డర్స్‌

పోలీసులకు సవాల్‌ విసురుతున్న కిల్లర్స్‌

గుర్తుతెలియకుండా చంపేసి..

శివారులో ప్రాంతాల్లో పడేస్తున్న వైనం

పహాడీషరీఫ్‌ యువతి హత్య కేసులో...

ఇంకా లభించని ఆచూకీ


భూ వివాదాలు, పాత కక్షలు, ప్రేమ, కులాంతర వివాహాలు.. వివాహేతర సంబంధాలు.. కారణమేదైనా అనుకున్నది జరగకపోతే కొందరు పగబడుతున్నారు. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. నర హంతకులుగా మారుతున్నారు. కొందరు అయినవాళ్లనే అంతమొందిస్తుండగా.. మరికొందరు సుపారీ కిల్లర్స్‌ ద్వారా దారుణంగా హత్య చేయిస్తున్నారు. 


హైదరాబాద్‌ సిటీ: నాలుగు రోజుల క్రితం పహాడీషరీఫ్‌ పరిధిలో దారుణ హత్యకు గురైన యువతి ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. మృతురాలిని ఎవరూ గుర్తుపట్టకుండా బండరాయితో  ముఖాన్ని ఛిద్రం చేశారు హంతకులు. పోలీసులు మృతురాలి ముఖానికి కుట్లువేయించి ఒక రూపాన్ని తీసుకొచ్చినా ఇంతవరకూ ఎవరూ గుర్తించలేదు. దాంతో పోలీసులు ఆమె ముఖంతో రూపొందించిన పోస్టర్‌ రిలీజ్‌ చేసి అన్ని ప్రాంతాలకూ పంపారు. 


శివారు ప్రాంతాలే అడ్డాగా..

హంతకులు, ఘరానా నేరగాళ్లు నగర శివారు ప్రాంతాలను నేరాలకు అడ్డాగా మార్చుకుంటున్నారు. నిర్మానుష్య ప్రాంతాల్లో మద్యం తాగి మృగాళ్లుగా మారుతున్నారు. ఒంటరి మహిళలను ఇతర ప్రాంతాల నుంచి ఎత్తుకొచ్చి సామూహిక అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఆ తర్వాత వారిని అతి కిరాతకంగా అంతమొందిస్తున్నారు. మృతదేహాలు గుర్తుపట్టకుండా చేయడానికి పెట్రోల్‌, డీజిల్‌, కిరోసిన్‌ ఏది అందుబాటులో ఉంటే దానితో మృతదేహాలకు నిప్పంటించి సగం కాలిన స్థితిలో వదిలేసి వెళ్తున్నారు. లేదా బండరాయితో ముఖాన్ని ఛిద్రం చేస్తున్నారు. వివస్త్రలను చేసి పడేసి వెళ్తున్నారు. చనిపోయిన మహిళ ప్రవర్తనపై అనుమానం వచ్చేలా చేయడానికి దుండగులు అలా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.


ఎక్కడో చంపేస్తున్నారు..తెచ్చిపడేస్తున్నారు..

నగరం చుట్టుపక్కల జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన నిందితులు మహిళలు/పురుషులను ఎక్కడో హత్యచేసి వాహనాల్లో తీసుకొచ్చి శివారు ప్రాంతాల్లో పడేసి వెళ్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. ఇటీవల శివారు ప్రాంతాల్లో కాలిన స్థితిలో, గుర్తుపట్టలేని స్థితిలో పోలీసులకు లభ్యమైన మృతదేహాల ఆచూకీ ఇప్పటికీ తెలియకపోవడం గమనార్హం.


2018 మార్చిలో.. తొండుపల్లి శివారు ప్రాంతంలో సగానికి పైగా కాలిపోయి, గుర్తుపట్టలేని స్థితిలో మహిళ మృతదేహం లభించింది. ఇప్పటి వరకు ఆమె ఆచూకీ లభించలేదు. 


అదే సంవత్సరం, అదే నెలలో నార్సింగి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని ఓ ఫ్లైఓవర్‌ వద్ద మహిళ మృతదేహం కాలిపోయి న స్థితిలో కనిపించింది. తనంతట తానే కాల్చుకొని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావించారు. అసలు విషయాలేవీ వెలుగులోకి రాలేదు. పాతబస్తీకి చెందిన మ హిళగా పోలీసులకు ఆధారాలు లభించినట్లు తెలిసింది. 


చేవెళ్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధి శివారు ప్రాంతంలోని నిర్మానుష్య ప్రదేశంలో గతేడాది ఏప్రిల్‌లో యువతి మృతదేహం లభించింది. ఆ మృతదేహం కూడా కాలిపోయిన స్థితిలోనే ఉంది. ఇప్పటి వరకు ఆచూకీ లభించలేదు.


ఇటీవల మేడ్చల్‌ జిల్లా మల్లంపేట-బొల్లారం సరిహద్దు సమీపంలోని రోడ్డు పక్కన ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో ఒక మహిళ అస్తిపంజరం లభించింది. ఆమె ఆచూకీ కూడా తెలియలేదు. 


ఈ ఘటనలన్నీ శివారు ప్రాంతాల్లోని నిర్మానుష్య ప్రాంతాల్లోనే ఎక్కువగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో పోలీస్‌ నిఘాను, సీసీటీవీ కెమెరాలను పెంచాల్సిన అవసరం ఉంది.


భయాందోళనలో ప్రజలు..

ఇటీవల నగర శివారు ప్రాంతాల్లోని చెట్లపొదలు, జాతీయ రహదారుల పక్కన నిర్మానుష్య ప్రాంతాలు, బ్రిడ్జిల కింద, శివారు చెరువుల వద్ద మహిళలను అత్యంత దారుణంగా హత్యచేసి కాల్చేస్తున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం మహిళలే కాదు.. వివాహేతర సంబంధాలు, భూ వివాదాలు, పాతకక్షల నేపథ్యంలో మగాళ్లను చంపేందుకు కూడా శివారు ప్రాంతాలనే దుండగులు ఎంచుకుంటున్నారు. వరుస ఘటనలు శివారు ప్రాంతాల్లోని ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.


ఏడాది క్రితం దిశా సంఘటన దేశాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఆ ఘాతుకానికి పాల్పడిన యువకులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. ఈ ఘటన జరిగిన కొద్దిరోజుల్లోనే సిక్కింకు చెందిన యువతిని ముంబైకి చెందిన యువకుడు నగరానికి రప్పించి.. హైదరాబాద్‌లోని స్నేహితుడి సహకారంతో దారుణంగా హత్య చేశాడు. లాంగ్‌డ్రైవ్‌కు వెళ్తున్నామని నమ్మించి కారులోనే ఉరేసి చంపేశాడు. మృతదేహాన్ని చేవెళ్ల పరిధిలోని తంగడపల్లి బ్రిడ్జికింద పడేసి వెళ్లారు. మృతదేహాన్ని గుర్తుపట్టకుండా ముఖాన్ని ఛిద్రం చేసి వివస్త్రను చేసి పడేశారు. నిందితులను పట్టుకోవడానికి సైబరాబాద్‌ పోలీసులకు నెలరోజులు పట్టింది. ఇదే తరహాలో పహాడీషరీ్‌ఫలో నాలుగు రోజుల క్రితం యువతిని దారుణంగా హత్య చేశారు. తంగడపల్లి ఘటనలో మృతురాలిని చేసినట్లే ఇక్కడా చేశారు. ఒక రకంగా చూస్తే రెండు ఘటనలూ ఒకేలా ఉన్నాయి. 

Updated Date - 2020-12-12T13:39:03+05:30 IST