ఇంట్లో ఉండే చికిత్స పొందా

ABN , First Publish Date - 2020-07-03T08:17:46+05:30 IST

‘కరోనా వైరస్‌ గురించి ఆందోళన చెందొద్దు. పాజిటివ్‌ వచ్చిన వారు ధైర్యంగా ఉండా లి. ఇతర జబ్బుల మాదిరిగానే చికిత్స ..

ఇంట్లో ఉండే చికిత్స పొందా

వైద్యుల సూచనలతో మందులు.. రోజుకు 3సార్లు ఆవిరి.. ప్రాణాయామం

డ్రై ఫూట్స్‌ తిన్నా.. వేడినీళ్లు తీసుకున్నా 

కరోనాపై ఆందోళనొద్దు.. మనోధైర్యమే రక్ష

‘ఆంధ్రజ్యోతి’తో ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా 


నిజామాబాద్‌, జులై 2 (ఆంధ్రజ్యోతి): ‘కరోనా వైరస్‌ గురించి ఆందోళన చెందొద్దు. పాజిటివ్‌ వచ్చిన వారు ధైర్యంగా ఉండా లి. ఇతర జబ్బుల మాదిరిగానే చికిత్స తీసుకుంటే త్వరగా తగ్గిపోతుంది’ అని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా అన్నారు. తనకు కరోనా పాజిటివ్‌ అని తెలియగానే కంగారు పడలేదని, పూర్తిగా ఇంటికే పరిమితమై వైద్యసేవలను పొందినట్లు చెప్పారు. వైద్యులు సూచించిన మందులు వేసుకున్నానని, ఇప్పుడు తాను కరోనా నుంచి దాదాపు స్వస్థత పొందానని పేర్కొన్నారు. గురువారం ఆయన హైదరాబాద్‌ నుంచి ఫోన్‌లో ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు.  


వీడియో కాల్‌ వైద్యం.. సోమవారం మళ్లీ పరీక్ష

కరోనా సోకిందని నిర్ధారణ కాగానే నిజామాబాద్‌ నుంచి హైదరాబాద్‌లోని ఇంటికి వచ్చాను. నగరంలోని ఓ పైవేట్‌ ఆస్పత్రి వైద్యులను సంప్రదించాను. ఇంట్లో ఉండే వైద్యం తీసుకుంటానని వైద్య సిబ్బందికి చెప్పాను. దీంతో వారే వచ్చి నమూనాలు తీసుకొని వెళ్లారు. అన్ని వైద్య పరీక్షలు చేసి చికిత్స ప్రారంభించారు. రోజూ వీడియోకాల్‌ ద్వారా డాక్టర్‌ ఎంవీ రావుతో మాట్లాడుతూ పరిస్థితిని వివరిస్తున్నాను. ఆయన  సూచనల మేరకు రోజూ రెండు పూటల క్రోసిన్‌, ఆజిత్రోమైసిన్‌ మందులు వాడాను. సీ విటమిన్‌కు సంబంధించిన మాత్రలను వేసుకుంటున్నాను.


వేడినీళ్లలో విక్స్‌ గానీ.. జిందాతిలస్మత్‌ గానీ.. పసుపు, తులసి ఆకులు వేసి  రోజుకు మూడుసార్లు ఆవిరి పట్టుకుంటున్నాను. రోజూ ప్రాణాయామం చేయడంతో పాటు వేడినీళ్లను తీసుకుంటున్నాను. వైర్‌సతో బాధపడినా రోజూ తీసుకున్న విధంగానే భోజనం చేశాను. ఎక్కువగా కాజు, కిస్మిస్‌, బాదాం, అంజీర వంటివి  తీసుకున్నాను. ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉంది. జ్వరం ఇతర లక్షణాలన్నీ తగ్గాయి. వైద్యులు మరో దఫా ఈ సోమవారం పరీక్ష నిర్వహించనున్నారు. కరోనా వల్ల వస్తున్న వార్తలను చూసి ఆందోళన చెందొద్దు. మానసిక స్థయిర్యాన్ని కోల్పోవద్దు. ఎక్కువ మంది చికిత్స తీసుకొని కోలుకుంటున్నారు. వైరస్‌ సోకకుండా అందరూ జాగ్రత్త పడాలి. స్వీయ నియంత్రణ పాటించాలి.  

Updated Date - 2020-07-03T08:17:46+05:30 IST