చింతలగట్టులో గద్దెకు చేరిన సమ్మక్క

ABN , First Publish Date - 2020-02-07T10:04:04+05:30 IST

గూడూరు మండలంలోని చింతలగట్టు మేడా రం జాతర జనసంద్రమైంది. సమ్మక్క రాకతో భక్తులు వేలాదిగా తరలివచ్చారు. గురువారం రాత్రి 7గంటల 41 నిముషాలకు పూజారులు ..

చింతలగట్టులో గద్దెకు చేరిన సమ్మక్క

తల్లికి స్వాగతం పలికిన సారలమ్మ
కొలువుదీరిన వనదేవతలు
గుభాళించిన ఆదివాసీ సంప్రదాయం
ముమ్మరంగా భక్తుల మొక్కులు
అడుగడుగునా జనం జేజేలు
తల్లులను దర్శించుకున్న నాలుగు లక్షల మంది భక్తులు
 
గూడూరు రూరల్‌, ఫిబ్రవరి 6 : గూడూరు మండలంలోని చింతలగట్టు మేడా రం జాతర జనసంద్రమైంది. సమ్మక్క రాకతో భక్తులు వేలాదిగా తరలివచ్చారు. గురువారం రాత్రి 7గంటల 41 నిముషాలకు పూజారులు తల్లి సమక్కను కుచ్చలగట్టు నుంచి చింతలగట్టు జాతర గద్దెమీదకు చేర్చారు. ఈసందర్భంగా కుచ్చలగుట్ట నుంచి చింతలగట్టు మేడారం వరకు సమ్మక్కను పూజారులు, భక్తులు భారీ బందోబస్తు మధ్యన గద్దెపైకి తీసుకువచ్చారు. తొలుత చింతలగట్టు మేడారంకు సమ్మక్కను తీసుకుచ్చేందుకు సమ్మక్క ప్రధాన పూజారి దారం సిద్ధుతో పాటు మరో నలుగురు సాయంతో మధ్యాహ్నం కుచ్చలగుట్టకు చేరుకున్నారు. కుచ్చలగుట్టలోని సమ్మక్క ఆలయంలో రెండు గంటలపాటు పూజలు నిర్వహణ అనంతరం వెదురుబుట్టలో సమ్మక్కను తీసుకుని బయల్దేరారు. ఈసందర్భంగా వరంపట్టిన భక్తులపై నుంచి ప్రధాన పూజారులు నడుచుకుంటూ ముందుకుసాగారు. సమ్మక్క రాక సందర్భంగా మహిళా భక్తులు చింతలగట్టులో గద్దెను కడిగి ముగ్గులతో అలంకరించారు.సమక్క రాక సందర్భంగా భక్తులు జయజయధ్వానాలు చేశారు.
 
తల్లీ మమ్మల్ని సల్లంగా చూడు అంటూ వేడుకున్నారు. సమ్మక్కను తీసుకువస్తున్న సమయంలో అమ్మవారిని తాకేందుకు భక్తులు ఎగబడ్డారు. స్వల్పంగా తొక్కిసలాట జరిగింది. గణగణ గంటలు మోగుతుంటే ప్రతి గుండె భక్తిభావంతో పులకించిపోయింది. శివసత్తుల పూనకాలతో చింతలగట్టు మేడా రం ఊగిపోయింది. కోయరాజుల కోలాహలం, డప్పుచప్పుళ్లతో వనం దద్దరిల్లింది. ఆదివాసీ ఆచారాల మధ్య గిరిజన పూజారులు సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠించారు.
 
అంతకు ముందు సమ్మక్క-సారలమ్మలకు పనుపు(పసుపు, కుంకుమ) నూతన వస్ర్తాలను పూజారులు సమర్పించారు. అటవీ ప్రాంతం నుంచి వనం(వెదురు కర్ర)లను పూజారుల కమిటీ అధ్యక్షుడు దారం సిద్ధు, జాతర నిర్వాహకులు, పూజారులు పెనుక నాగయ్య, ఈసం సహదేవులు, దారం భద్రయ్య, కారం లక్ష్మయ్య, సనుప వీరస్వామి, సుధాకర్‌, జనార్ధన్‌, సాగర్‌ భక్తుల సందడి నడుమ తీసుకవచ్చి గద్దెలపై చేర్చారు.
 
కోలాహలంగా ఘట్టం...
సమ్మక్కను తీసుకొచ్చే ఘట్టం కోలాహలంగా సాగింది. కుచ్చలగుట్టలో గిరిజనులు సంప్రదాయ వాయిద్యాలను వాయిస్తూ తీసుకొచ్చే ఘట్టాన్ని రాత్రి ప్రారంభించారు. సమ్మక్కను తీసుకొచ్చే పూజారులకు రక్షణగా పోలీసులు, వలంటీర్లు సమారు 200 మంది వెంట వచ్చారు. అనంతరం పూజారులు బుట్టతో పా టు భారీ జనసందోహం మధ్య ఊరేగింపుగా నడుచుకుంటూనే చింతలగట్టు మేడారం చేరుకొని సమ్మక్కను గద్దెపైన ప్రతిష్ఠించారు.
 
వనమంతా జనం..
గురువారం మధ్యాహ్నం నుంచి వేలాదిగా జాతరకు చేరుకున్నారు. బుధవారం సారలమ్మ ఊట్ల మట్వాడ నుంచి, పగిడిద్దరాజును కొత్తగూడ మండలం పెగడపల్లి, గోవిందరాజులును బయ్యారం మండలం చెట్టుపల్లి నుంచి గద్దె చేర్చారు. అలాగే బయ్యారం మం డలం గొరిమిల్ల నుంచి జపన్నను, నాగులమ్మను కొత్తగూడ మండలం గోపాలపురం నుంచి తీసుకువచ్చి గద్దెపైకి చేర్చారు. గురువారం రాత్రి సమ్మక్క రాకతో జాతరకు భక్తుల తాకిడి మరింత పెరిగింది. వేలాది మంది భక్తులతో క్యూలైన్‌లు, గద్దెలు కిక్కిరిసిపోయాయి. జాతర పరిసరాలు జనంతో నిండిపోయాయి. సుమారు నాలుగు లక్షలకు పైగా భక్తులు వచ్చినట్లుగా జాతర కమిటీ సభ్యులు అంచనావేస్తున్నారు.
 
గద్దెల నుంచి ఎటూ చూసినా 2 కిలోమీటర్ల మేర భక్తులు ఏర్పాటు చేసుకున్న గుడారాలే కనిపించాయి. పోలీసు లు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతర ప్రాంగణంలోకి వాహనాలు వెళ్లకుండా ఏఎస్సై శ్యాంసుందర్‌ ఆధ్వర్యంలో పోలీసులు, వలంటీర్లు ట్రాఫిక్‌ జాం కాకుండా చర్యలు తీసుకున్నారు. జాతీయ రహదారిపై బందోబస్తు ఏర్పాటు చేసి జాతరకు వచ్చే భక్తుల వాహనాల కోసం రెండు చోట్ల పార్కింగ్‌ స్థలాలను గుర్తించి అక్కడికి వాహనాలను పంపించారు.
 
రెండో రోజూ ‘ఆంధ్రజ్యోతి’ సేవలు..
చింతలగట్టు మేడారంలో బుధవారం ‘ఆంధ్రజ్యోతి’ ఆధ్వర్యంలో ప్రారంభించిన ఉచిత మినరల్‌ వాటర్‌ పంపిణీ, ఉచిత ఆరోగ్యవైద్యశిబిరం రెండోరోజూ గురువారం కొనసాగింది. మినరల్‌వాటర్‌ పంపిణీ చేయడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ ‘ఆంధ్రజ్యోతి’ని అభినందించారు.

Updated Date - 2020-02-07T10:04:04+05:30 IST