పెళ్లితో ఏకమైన తెలుగమ్మాయి.. ఇంగ్లిష్ అబ్బాయి
ABN , First Publish Date - 2020-02-28T15:10:52+05:30 IST
తెలుగమ్మాయి.. ఇంగ్లిష్ అబ్బాయి. ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
హైదరాబాద్ : తెలుగమ్మాయి.. ఇంగ్లిష్ అబ్బాయి. ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయం ఇరువురి పెద్దలకూ తెలియజేశారు. వారి అనుమతితో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లా, మునుగోడు మండలం పలివెల గ్రామానికి చెందిన కొండవీటి విఘ్నేశ్వరరెడ్డి, లత దంపతులు ఎల్‌బీనగర్‌లో నివాసం ఉంటున్నారు. వారి కుమార్తె సింధూజ ఫ్యాషన్ డిజైన్ కోర్సు చేసేందుకు 8 ఏళ్ల కిందట ఇంగ్లాండ్ వెళ్లింది. కోర్సు పూర్తి చేసి ప్రస్తుతం అక్కడే ఉద్యోగం చేస్తోంది.
ఈ క్రమంలో.. ఆమెకు ఇంగ్లాండ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బెంజిమిన్ డేవిడ్‌హాస్ పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్తా ఇరువురి మధ్య ప్రేమను చిగురింపజేసింది. రెండేళ్లు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని.. విషయాన్ని తమ తల్లిదండ్రులకు చేరవేశారు. వారు అంగీకరించి.. గురువారం బండ్లగూడలోని పీఎంఆర్ కన్వెన్షన్‌లో హిందూ సంప్రదాయం ప్రకారం వైభవంగా వివాహం జరిపించారు. వరుడి తల్లిదండ్రులు జోమేహాస్, రోబెక్ట్‌హాస్, వారి బంధువులతోపాటు, విఘ్నేశ్వరరెడ్డి బంధువులు కూడా అధిక సంఖ్యలో హాజరై వధూవరులను ఆశీర్వదించారు.