ఊతకర్రకు చెదలు!

ABN , First Publish Date - 2020-12-12T07:58:55+05:30 IST

ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలం గుట్టకింద తండా గ్రామానికి చెందిన చౌహాన్‌ యశోదా బాయి అనారోగ్యంతో మూడు నెలల క్రితం మృతి చెందింది.

ఊతకర్రకు  చెదలు!

ఆసరా పింఛన్లు రూ.కోట్లలో పక్కదారి

అనర్హుల ఖాతాల్లో నెలనెలా డబ్బులు.. తప్పుడు ధ్రువీకరణపత్రాలతో లబ్ధి 

40ఏళ్లవారికీ పింఛన్లు.. ఆధార్‌, ఓటర్‌ ఐడీల్లో 65 ప్లస్‌ వయసుగా మార్పులు

చనిపోయిన వారి పేరిటా జారీ.. వైకల్యం లేకున్నా ఉన్నట్లుగా సర్టిఫికెట్లు

ఆదిలాబాద్‌ జిల్లాలో ఏటా రూ.4.8 కోట్ల అక్రమాలు


ఆదిలాబాద్‌ జిల్లా బేల మండలం జునోని గ్రామానికి చెందిన పెట్కూలె తాయిబాయి వయస్సు 45 ఏళ్లు. ఆమె నెలనెలా వృద్ధాప్య పింఛను పొందుతోంది. ఇలా జిల్లాల్లో పలు చోట్ల 40 ఏళ్లవారూ పింఛన్లు పొందు తున్నారు. త మకు 65 ఏళ్లు.. ఆపై వయసు ఉన్నట్లుగా నకిలీ రికార్డులు సృష్టిస్తున్నారు. అసలు వయసుకన్నా 25-27 ఏళ్లు పెంచేసి అఫిడవిట్లు సమర్పి స్తూ ఆధార్‌లో వయసును మార్చేస్తున్నారు. ఆసరా పింఛను అర్హత వయసు ధ్రువీకరణ కోసం ఆధార్‌తో పాటు ఓటరు కార్డునూ తప్ప నిసరి చేయడంతో అందు లోనూ వయసును మార్చేసి పింఛను పొందుతున్నారు. 


ఆదిలాబాద్‌, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలం గుట్టకింద తండా గ్రామానికి చెందిన చౌహాన్‌ యశోదా బాయి అనారోగ్యంతో మూడు నెలల క్రితం మృతి చెందింది. రికార్డుల్లో ఆమె చనిపోయినట్లు రాయలేదు. యశోదాబాయి ఇంకా ఆసరా పింఛను తీసుకుంటున్నట్లుగానే చూపుతూ ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రతినెలా ఆ డబ్బంతా డ్రా చేసుకొని జేబులో వేసుకుంటున్నారు. 

కొన్నిచోట్ల వృద్ధాప్యం రాకున్నా వచ్చినట్లు చెప్పుకొంటూ.. లబ్ధిదారు చనిపోయినా బతికున్నట్లుగా చూపుతూ పించన్లు పొందుతున్నారు. ఇంకొన్నిచోట్ల మానసిక, శారీరక వైకల్యం నిబంధనల శాతానికి అనుగుణంగా లేకున్నా ఉన్నట్లుగా నకిలీ ధ్రువీకరణ పత్రాలు సమర్పించి కొందరు.. సంతానం ప్రభుత్వ ఉద్యోగులై ఉన్నాకూడా ఆ విషయాన్ని దాచి ఇంకొందరు.. దర్జాగా పింఛన్లు పొందుతున్నారు.


రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఆసరా పింఛన్ల పథకంలో అర్హులకు అందాల్సిన డబ్బులు పక్కదారిపడుతున్నాయి. తీవ్ర కలకలం రేపిన కల్యాణలక్ష్మి అక్రమాలను మరిచిపోక ముందే ఆదిలాబాద్‌ జిల్లాలో ఆసరా పథకంలో జరుగుతున్న అక్రమాలు బయటకు వస్తున్నాయి. 65 ఏళ్లుపైబడిన వారికే వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలని.. సంతానం ప్రభుత్వ ఉద్యోగులైతే వారికి పింఛన్లు ఇవ్వొద్దని నిబంధనలు చెబుతున్నాయి. అయితే చాలాచోట్ల ఈ నిబంధనలు అమలు కావడం లేదు.


ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా 67,652 ఆసరా పింఛన్లు ఉన్నాయి. ఇందులో వృద్ధాప్య పింఛన్లు 22,358, వితంతు పింఛన్లు 28,911, వికలాంగుల పింఛన్లు 7,116, చేతివృత్తుల పింఛన్లు 19, హెచ్‌ఐవీ పింఛన్లు 1738, పైలేరియా పింఛన్లు 1170, ఒంటరి మహిళల పింఛన్లు 2232, బీడీ వర్క్‌ర్స్‌ పింఛన్లు 5521 ఉన్నాయి. ఇందులో దాదాపుగా 2వేలకుపైగా పింఛన్లు అక్రమమైనవని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా ఏడాదికి దాదాపు రూ. 4.8 కోట్లు పక్కదారిపడుతున్నట్లు  అంచనా. 


కార్యదర్శుల వేలిముద్రకు అవకాశమివ్వడంతోనే

పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కొందరు ప్రజాప్రతినిధులు తమవారికి ఆసరా పింఛన్లను ఇప్పించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అక్రమమని తెలిసినా కూడా మంజూరు చేయాలంటూ సంబంధిత అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. జిల్లాలో కొందరికి బ్యాంకు ఖాతాల్లో ఆసరా డబ్బులు జమ చేస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు బయోమెట్రిక్‌ విధానం ద్వారా నేరుగానే అందిస్తున్నారు.


అయితే వ్యవసాయదారులు, కూలీల్లో కొందరు లబ్ధిదారులకు వేలిముద్రలు పడకపోవడంతో పంచాయతీ కార్యదర్శుల వేలిముద్రలకు అనుమతించి లబ్ధిదారులకు డబ్బులు ఇచ్చే వెసులుబాటును కల్పించారు. ఇదే చాలాచోట్ల అక్రమాలకు అవకాశం కల్పిస్తోందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. లబ్ధిదారుల్లో ఎవరైనా చనిపోయినప్పుడు ఆ విషయాన్ని దాచి తమ వేలిముద్రలనే వేస్తూ ఆ డబ్బంతా జేబుల్లో వేసుకుంటున్నారు. ఇందులో ఇతర అధికారులు, ప్రజాప్రతినిధుల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 



అడ్డగోలుగా సర్టిఫికెట్ల జారీ

దివ్యాంగుల పింఛను కోసం అర్హత లేకున్నా కొందరు వైద్యులు అడ్డగోలుగా ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దివ్యాంగులు పింఛనుకు దరఖాస్తు కోసం తొలుత మీ-సేవా కేంద్రంలో స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సంబంధిత వైద్యుడు సమయం ఇచ్చిన రోజే పరీక్షలు చేసి సర్టిఫికెట్‌ జారీ చేయాల్సి ఉంటుంది. ఇదంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది.

నిబంధనల ప్రకారం మననోవైకల్యం 52ు, శారీరక వైకల్యం కలిగిన వారికి 40ు ఉంటేనే ఆసరా పించన్లకు అర్హులవుతారు. ఆ మేరకు వైకల్యం లేకపోయినా.. ఆసరా పింఛన్లను దృష్టిలో పెట్టుకొని కొందరు వైద్యులు నిబంధనల్లో పొందుపర్చిన వైకల్యం శాతం మేరకు ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నారు. ఇందుకు వైద్యుల వద్ద పని చేస్తున్న సిబ్బంది, కొందరు దళారులు దందా నడిపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.




విచారణ జరిపిస్తాం

ఆసరా పింఛన్లలో అవకతవకలు ఉన్నట్లు వస్తున్న ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తాం. ఇప్పటికే కొన్ని అక్రమంగా ఉన్నట్లు గుర్తించి జాబితా నుంచి తొలగించాం. ఇంకెవరైనా నకిలీ లబ్ధిదారులు ఉంటే గుర్తించి చర్యలు తీసుకుంటాం. బోథ్‌ మండలంలో ఓ పంచాయతీ కార్యదర్శి పింఛను డబ్బులను తీసుకున్నట్లు మా దృష్టికి వచ్చింది. 


- రాథోడ్‌ రాజేశ్వర్‌, డీఆర్డీఏ పీడీ, ఆదిలాబాద్‌ 




  అర్హత ఉన్నా పింఛను లేకపాయె! 

ఈ ఫొటోలోని మహిళ పేరు ఆడె కవిత. ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం వెంకటాపూర్‌ గ్రామం. ఈమె వినికిడి లోపంతో బాధపడుతోంది. ప్రభుత్వం అందించే ఆసరా పింఛను పొందేందుకు నిరుడు సదరం సర్టిఫికెట్‌ను తీసుకుంది. పలుమార్లు దరఖాస్తు చేసుకున్నా తనకు పింఛను మంజూరు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది.


Updated Date - 2020-12-12T07:58:55+05:30 IST