ఎగ్ 65
ABN , First Publish Date - 2020-06-27T18:37:57+05:30 IST
కోడిగుడ్లు - రెండు(ఉడికించినవి), ఉడకబెట్టని కోడిగుడ్డు - ఒకటి, పిండి - అర కప్పు, ఉప్పు - తగినంత, అల్లం - కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు
కావలసినవి: కోడిగుడ్లు - రెండు(ఉడికించినవి), ఉడకబెట్టని కోడిగుడ్డు - ఒకటి, పిండి - అర కప్పు, ఉప్పు - తగినంత, అల్లం - కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు - నాలుగైదు, పచ్చిమిర్చి - నాలుగు, నూనె - తగినంత, కారం - ఒక టేబుల్‌స్పూన్, గరంమసాలా - ఒక టీస్పూన్, బ్రెడ్ క్రంబ్స్ - కొద్దిగా, కరివేపాకు - ఒక కట్ట, కొత్తిమీర - ఒకకట్ట, పెరుగు - అరకప్పు, పంచదార - చిటికెడు, చిల్లీసాస్ - ఒక టేబుల్‌స్పూన్.
తయారీ: ముందుగా ఉడకబెట్టిన కోడిగుడ్లలోని తెలుపు భాగాన్ని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేయాలి. వాటిని ఒక పాత్రలోకి తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు, కారం, తరిగిన అల్లం ముక్కలు, గరం మసాలా, కొద్దిగా బ్రెడ్ క్రంబ్స్, పిండి వేసి కలపాలి. ఇందులో ఒక కోడిగుడ్డు కొట్టి ఎగ్‌వైట్ మాత్రమే వేయాలి. కొద్దిగా ఉప్పు వేసి అన్నీ బాగా కలిసేలా కలియబెట్టాలి. స్టవ్‌పై ఒక పాత్రపెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతుల్లోకి తీసుకుంటూ నూనెలో వేయాలి. గోధుమరంగులోకి మారే వరకు వేగించి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌పై పాన్‌పెట్టి కాస్త నూనె వేసి తరిగిన అల్లం ముక్కలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగించాలి. కాసేపు వేగిన తరువాత పెరుగు కొద్దిగా చిల్లీ సాస్ కూడా వేయాలి. కారం, గరంమసాలా వేసి కలపాలి. చిటికెడు పంచదార వేస్తే రుచి బాగుంటుంది. ఇప్పుడు కొత్తిమీర వేసి వేగించి పెట్టుకున్న ఎగ్ 65 వేసి కలియబెట్టాలి. కాసేపు వేగిన తరువాత కాస్త ఉప్పు చల్లి దింపాలి. క్రిస్పీగా రుచికరంగా ఉండే ఎగ్ 65ను పిల్లలు ఇష్టంగా తింటారు.