చేతికిందే చమురు!
ABN , First Publish Date - 2021-06-13T08:09:41+05:30 IST
కరువు సీమలో... పెట్రోలియం నిక్షేపాలు! అది కూడా 6,000 కోట్ల బ్యారెళ్ల చమురు! తీస్తే అందుతుంది. ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. కానీ...
అయినా... పట్టించుకోరు
కర్నూలు జిల్లా కృష్ణగిరిలో 60 బిలియన్ బ్యారెళ్ల ముడిచమురు
నాలుగేళ్ల క్రితం ఓఎన్జీసీ అన్వేషణ
ఉపగ్రహం, 2డీ ఆధారంగా సర్వేలు
రెండు వేల అడుగుల మేర డ్రిల్లింగ్
కేంద్ర కార్యాలయానికి నివేదికలు
ఆ తర్వాత ముందుకెళ్లని పనులు
దేశంలో పెట్రో ధర ఎప్పుడో సెంచరీ కొట్టింది. మరింత ముందుకు పరుగులు పెడుతోంది. దీనికి... చమురు కోసం ‘దిగుమతులపైనే అధికంగా ఆధారపడటం’ ఒక కారణమైతే... భారీగా సుంకాలు, పన్నులు వేసి జనాన్ని బాదడం మరో కారణం! దేశీయంగా అందుబాటులో ఉన్న చమురు నిక్షేపాలను వెలికి తీయగలిగితే.... జనంపై భారం కొంతైనా తగ్గుతుంది. కానీ... ఆ దిశగా జరుగుతున్న ప్రయత్నమేదీ!?
(కర్నూలు - ఆంధ్రజ్యోతి)
కరువు సీమలో... పెట్రోలియం నిక్షేపాలు! అది కూడా 6,000 కోట్ల బ్యారెళ్ల చమురు! తీస్తే అందుతుంది. ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. కానీ... ఎందుకో ఆ దిశగా అడుగు ముందుకు పడటంలేదు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలంలో చమురు నిక్షేపాలు ఉన్నట్టు ఓఎన్జీసీ అధికారులు నాలుగేళ్ల క్రితమే గుర్తించారు. ఇంతలో ఏమైందో ఏమోగానీ సర్వే పనులు ఆగిపోయాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో ఈ పనులు పట్టాలెక్కలేదు. సర్వే ఆధారంగా ఒక్క కర్నూలు జిల్లాలోనే 60 బిలియన్ల బ్యారెల్స్ ముడిచమురు ఉండొచ్చని అంచనా. గ్యాస్ కూడా సమృద్ధిగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. చమురు, గ్యాస్ నిక్షేపాల అన్వేషణ నిరంతరం జరిగే ప్రక్రియ. ఇందులో భాగంగా కొన్నేళ్ల క్రితం ఉపగ్రహం సహాయంతో కర్నూలు జిల్లాతోపాటు కర్నూలు, కడప, ఒంగోలు, తూర్పు గోదావరి తదితర జిల్లాల్లో చమురు నిక్షేపాల కోసం అన్వేషణ సాగింది. ఒక్క కర్నూలు జిల్లా కృష్ణగిరి ప్రాంతంలోనే వందలాది కిలోమీటర్ల విస్తీర్ణంలో చమురు నిక్షేపాలు విస్తరించి ఉన్నట్లుగా గుర్తించారు. రాష్ట్రంలో సర్వే జరిపిన ప్రాంతాల్లో మరికొన్ని చోట్ల నిక్షేపాలను కనుగొన్నారు. ఓఎన్జీసీ అధికారులు జోన్లువారీగా సర్వే పనులు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2డీ సర్వే ద్వారా చమురు, సహజవాయు నిక్షేపాలను అన్వేషించేందుకు 2017లో గ్లోబల్ ఎకోలజీన్ అనే సంస్థకు అప్పటి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ సంస్థ ఒంగోలు, కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పాణ్యం, ఆత్మకూరు, నంద్యాల, కృష్ణగిరి మండలాల్లోని వేలాది కిలోమీటర్లలో సర్వేలు జరిపింది. కర్నూలు జిల్లాలోని కృష్ణగిరి మండలం కంబాలపాడు ఉన్నత పాఠశాల నుంచి మాదాపురం, అమకతాడు, కంబాలపాడు గ్రామాల మీదుగా నంద్యాల వరకు పెట్రోలియం, సహజవాయు నిక్షేపాల కోసం అన్వేషణ చేపట్టారు. సర్వే సమయంలో స్థానిక రైతుల పొలాలకు నష్టపరిహారం కూడా అందిస్తామని, అందుకు సహకరించాల్సిందిగా స్థానిక డిప్యూటీ ఎమ్మార్వోను కూడా ఆ సర్వే అధికారులు కోరారు. ఈ ప్రాంతంలో సుమారు 2వేల అడుగుల మేర భూమిలో డ్రిల్లింగ్ పనులు దాదాపు నెలపాటు కొనసాగాయి.
ఈ క్రమంలో చమురు నిల్వలను గుర్తించారు. ఈ వార్తలు అప్పట్లో సంచలనం రేపాయి. సర్వే తుది ఫలితాల కోసం అప్పట్లో జిల్లా ప్రజలతో పాటు యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూసింది. అయితే కాంట్రాక్ట్ పొందిన గ్లోబల్ ఎకోలజీన్ పూర్తి వివరాలు వెలువరించకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయింది. తదనంతరం మరో రెండు కంపెనీలకు అనుమతులు వచ్చినప్పటికీ సర్వేపై ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు. కర్నూలు జిల్లా, పరిసర జిల్లాల్లో జరిపిన సర్వే వివరాలను ఓఎన్జీసీ ప్రధాన కార్యాలయానికి పరీక్షల నిమిత్తం పంపామని అప్పటి సర్వేలో పాల్గొన్న గిరిధర్ కుమార్ అనే కాంట్రాక్ట్ ప్రైవేట్ ఏజెన్సీ నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. అక్కడి నుంచి తుది నివేదికలు వెలువడ్డాకే మలి దశ పనులు ప్రారంభమవుతాయని వివరిస్తున్నారు.
తుది దశలో...
2019 ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చాక ఈ రెండేళ్లలో ఎక్కడా ఈ సర్వే పనులు ప్రారంభంకాలేదు. కర్నూలు జిల్లాలో లభించిన ఆధారాల ప్రకారం చమురు నిక్షేపాల్లో భాగంగా పెట్రోల్‌తో పాటు గ్యాస్ సంబంధిత నిక్షేపాలు ఎక్కువగా ఉండొచ్చన్న అభిప్రాయాలను సర్వే అధికారులు వెల్లడిస్తున్నారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే వందలాది కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ చమురు నిక్షేపాలున్నాయని అంటున్నారు. అప్పట్లో కృష్ణా జిల్లా ఆగిరిపల్లి, హనుమాన్ జంక్షన్; విశాఖ జిల్లా అనకాపల్లి తదితర పరిసర ప్రాంతాల్లోనూ సర్వేలు జరిగాయి. రెండేళ్ల క్రితం వరకు జరిగిన సర్వేల వివరాలను ఓఎన్జీసీ ప్రధాన కార్యాలయాలకు పంపగా, జియాలజిస్టులు నిర్ధారించి తుది నివేదికలు వెలువరించేందుకు మరి కొన్నేళ్లు పడుతుందని అంటున్నారు. వాటి ఆధారంగా వెల్ లొకేషన్లను గుర్తించి, మలి దశ పనులను ప్రారంభించాలని సర్వే అధికారులు చెబుతున్నారు.
మరో రెండేళ్లు పట్టొచ్చు
‘‘నాలుగేళ్లక్రితం కర్నూలు జిల్లాలో సర్వే పనులు పూర్తి చేశాం. ఓఎన్జీసీకి అప్పుడే నివేదిక సమర్పించాం. తుది నిర్ణయం అక్కడి నుంచి రావాల్సిఉంది. ఆ తర్వాత మలి దశ పనులు ప్రారంభమవుతాయి. ఇందుకు మరో రెండేళ్లకు పైగా పట్టవచ్చు’’
- గిరిధర్ కుమార్, ప్రైవేట్ సర్వే ఏజెన్సీ నిర్వాహకుడు
రూ.43కే లీటర్ పెట్రోల్
దుబాయ్, యూఏఈ దేశాల కరెన్సీ దిర్హామ్ విలువ మనదేశ రూపాయి రూ.19.86కు సమా నం. ప్రస్తుతం అరబ్ దేశాల్లో లీటర్ పెట్రోల్ ధర అన్ని పన్నులతో కలిపి రూ.43.48. సాధారణంగా అరబ్ దేశాల్లో లభ్యమయ్యే చమురును ఉపయోగించే ఇంజన్లను బట్టి ఈ-ప్లస్ 91, స్పెషల్ 95, సూపర్ 98, డీజిల్‌గా చమురును విభజించి వాడుతుంటారు. అందులో ఈ-ప్లస్ 91ను తక్కువ కంప్రెషన్ ఉండే ఇంజన్లకు, స్పెషల్ 95ను సాధారణ స్థితి కంప్రెషన్ ఇంజన్లకు ఉపయోగిస్తారు. సూపర్ 98ను మాత్రం అఽత్యధిక కంప్రెషన్ వంటి ఇంజన్లకు మాత్రమే ఉపయోగిస్తారు. ప్రస్తుతం సామాన్యులు ఉపయోగించే వాహనాలన్నీ తక్కువ కంప్రెషన్లోని ఇంజన్లే కాబట్టి వాటికి ఈ-ప్లస్ 91నే వాడుతుంటారు. ఈ తరహా చమురుతో పాటు డీ జిల్ వంటి పలు నిక్షేపాలు కర్నూలు జిల్లాలో జరిపిన తవ్వకాల్లో గుర్తించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తు తం పెట్రో ఉత్పత్తులు లీటర్ రూ.101. దాదాపు పదేళ్ల క్రితం దేశంలో లీటర్ పెట్రోల్ ధర రూ.60 మించి ఉండేది కాదు. కృష్ణగిరి నిక్షేపాలు అందుబాటులోకి వస్తే.. దుబాయ్ అంత చౌకగా కాకపోయినా, దశాబ్దం క్రితం ధరల స్థాయికి పెట్రోలు దిగి రావచ్చునని నిపుణులు చెబుతున్నారు.