ఆ ఎమ్మెల్యే అమ్ముడు పోయాడు: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-03-09T00:57:29+05:30 IST

గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే ను నేను గెలిపిస్తే జగన్‌కు అమ్ముడుపోయాడని.. ఒక్కడు పోతే వందమందిని తయారు చేస్తా. ..

ఆ ఎమ్మెల్యే అమ్ముడు పోయాడు: చంద్రబాబు

గుంటూరు: గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేను తాను గెలిపిస్తే జగన్‌కు అమ్ముడుపోయాడని.. ఒక్కడు పోతే వందమందిని తయారు చేస్తానని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సోమవారం చంద్రబాబు మీడియాతో  మాట్లాడుతూ.. మాటల్లోనే మీకు రాజధాని కావాలి.. చేతల్లో ఏం చేయరని చెప్పారు. 460 రోజులకు పైగా రైతులు ఆందోళన చేస్తుంటే మీరు ఏం చేశారని ప్రశ్నించారు. గుంటూరు వాసులకు స్వార్థం, పిరికితనం ఎక్కువ, రోషం లేదన్నారు. ఒక ఉన్మాది చేతుల్లో అమరావతి బలైందన్నారు. కేసులు పెట్టి భయపెడతారని మండిపడ్డారు. ఓ రోజు జైలుకు వెళ్తే ఏమవుతుందని, తన మీద కూడా కేసులు పెట్టారని గుర్తుచేశారు. తాను భయపడే సమస్య లేదని స్పష్టం చేశారు. వడ్డీతో సహా తిరిగి చెల్లించే రోజులు వస్తాయని హెచ్చరించారు. గుంటూరు కార్పొరేషన్‌లో వైసీపీ గెలిస్తే అమరావతిని వారికి రాసిచ్చినట్టేనని చంద్రబాబు వ్యాఖ్యానించారు.


గుంటూరు మిర్చి రోషం మీలో లేదా..

ఓ రౌడీకి మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చారని చెప్పారు. గుంటూరులో నానీ ఓడిపోతే వైసీపీ వాళ్లు భరితెగిస్తారని ధ్వజమెత్తారు. సామాన్యుడు బతికే పరిస్థితి లేకుండా నిత్యవసర ధరలు ఆకాశానికి అంటించారని చంద్రబాబు మండిపడ్డారు. కుక్క, పిల్లి, పంది పిల్లి, గాడిద పిల్లకు కూడా పన్ను వేసే పరిస్థితి వస్తుందన్నారు. మీకు రోషం లేదా.. రెండువేల రూపాయలు ఎవరూ ఇస్తే వాళ్లకి ఓటు వేస్తారా అని ప్రశ్నించారు. భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఇబ్బంది పడుతున్నారని, రెండు వేలు ఇస్తే మర్చిపోతారన్నారు. కరెంటు తీగ పట్టుకోవద్దని చెప్పినా వినలేదని ఇప్పడు పిడిగుద్దులు తింటున్నారని చంద్రబాబు చెప్పారు. ఎవరైనా వస్తే రాజీనామా చేసి రావాలని జగన్ సత్యహరిశ్చంద్రుడులా మాట్లాడాడని దుయ్యబట్టారు. బాబాయ్ కేసు ఏం చేశాడు.. పింక్ డైమండ్ కేసు ఏమైందని నిలదీశారు. చెల్లెలికి న్యాయం చేయలేదన్నారు. గుంటూరు మిర్చి రోషం మీలో లేదా అని ప్రజలను ప్రశ్నించారు. ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. గుంటూరు మిర్చి ఘాటు 10 తేదీ ఎన్నికల్లో చూపించాలని స్పష్టం చేశారు. అపార్టు‌మెంట్లలో ఉండే వారు ఆలోచించాలని, ఎండలో తామేందుకు నిలబడి ఓటు వేయాలని అనుకుంటే మీ కర్మ అని చెప్పారు. అందరి చిట్టా లెక్కలు తేలుస్తా అని చంద్రబాబు హెచ్చరించారు.

Updated Date - 2021-03-09T00:57:29+05:30 IST