తెలుగు నేలపై వెలుగు దివిటీ

ABN , First Publish Date - 2021-08-03T08:41:23+05:30 IST

ఎక్కడో అమెరికాలో వ్యాపారం చేసుకుంటున్న గల్లా రామచంద్రనాయుడును...

తెలుగు నేలపై వెలుగు దివిటీ

  • ఎన్టీఆర్‌ పిలుపుతో అమరరాజా ఆవిర్భావం
  • బ్యాటరీల తయారీలో ప్రపంచ స్థాయి
  • 16వేల మందికి ప్రత్యక్ష ఉపాధి
  • సామాజిక సేవలోనూ ముందంజ


(తిరుపతి/అమరావతి - ఆంధ్రజ్యోతి) : ఎక్కడో అమెరికాలో వ్యాపారం చేసుకుంటున్న గల్లా రామచంద్రనాయుడును... ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయిన కొత్తలోనే రాష్ట్రానికి రప్పించారు. రాష్ట్ర ప్రజలకోసం,  ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమ అభివృద్ధి కోసం అక్కడ పరిశ్రమలను స్థాపించాలని కోరారు. ఎన్టీఆర్‌ చేసిన విజ్ఞప్తికి అంగీకరించి, మాతృభూమిపై ఉన్న అభిమానంతో రామచంద్రనాయుడు బ్యాటరీస్‌ ఉత్పత్తి కర్మాగారాన్ని తిరుపతి పరిసరాల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. 1985లో స్వయంగా ఎన్టీరామారావే ఆ ఫ్యాకర్టీకి శంకుస్థాపన చేశారు. తిరుపతి నుంచి కడప వైపునకు వెళ్లే దారిలో కరకంబాడి రహదారి వద్ద, కొండల నడుమ, సువిశాల ప్రాంతంలో దీనిని ఏర్పాటు చేశారు. రామచంద్రనాయుడు సతీమణి గల్లా అరుణకుమారి. అప్పటికి ఆమె కాంగ్రె్‌సలో ఉన్నారు. అయినా సరే... ఎన్టీఆర్‌ స్వయంగా రంగంలోకి దిగి ఫ్యాకర్టీకి అవసరమైన స్థలాన్ని సమకూర్చారు. గల్లా అరుణ తల్లిపేరు అమరావతి, తండ్రిపేరు రాజగోపాల్‌ నాయుడు. వీరిద్దరి పేర్లు కలిసివచ్చేలా ‘అమరరాజా’ అనే పేరు పెట్టారు. ఆ తర్వాత... ఇదే సంస్థ నుంచి అమరరాజా ఎలకా్ట్రనిక్స్‌, అమరరాజా ఇన్‌ఫ్రా, అమరరాజా పవర్‌ సిస్టమ్స్‌, మంగళ్‌ ఇండస్ట్రీస్‌, అమరరాజా మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, గల్లా ఫుడ్స్‌ పేరిట అనేక కంపెనీలు ఏర్పాటయ్యాయి. 


ఏటా వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి పన్నుల రూపేణా చెల్లిస్తున్నారు. రేణిగుంట మండలం కరకంబాడిలో ప్రధాన యూనిట్‌ ఉంది. అక్కడ ఇండస్ట్రియల్‌ ప్యానెల్స్‌, విద్యుత్‌ సబ్‌ స్టేషన్లలో వినియోగించే ప్యానెల్‌ బోర్డులు వంటివి తయారవుతాయి. ద్విచక్ర వాహనాలు మొదలుకుని రైల్వే బ్యాటరీల వరకు ఇక్కడే తయారవుతాయి. యాదమరి మండలం నూనెగుండ్లపల్లె వద్ద 2014లో అమరరాజా గ్రోత్‌ కారిడార్‌ పేరిట సెజ్‌ ప్రారంభించారు. అక్కడ కూడా అన్ని రకాల బ్యాటరీలూ తయారవుతున్నాయి. మాజీ మంత్రి గల్లా అరుణకుమారి స్వగ్రామమైన తవణంపల్లె మండలం దిగువమాఘం గ్రామంలో పూర్తిగా మహిళా ఉద్యోగులతో నడిచే అమరరాజా ఎలక్ర్టానిక్స్‌ యూనిట్‌ ఏర్పాటైంది. రామచంద్ర నాయుడు స్వగ్రామమైన పేటమిట్ట గ్రామంలో ఏర్పాటు చేసిన యూనిట్‌లో బ్యాటరీల తయారీకి అవసరమైన బోల్టులు, నట్లు వంటివి ఉత్పత్తి చేస్తున్నారు. దాని పొరుగునే ఉన్న తేనేపల్లె యూనిట్‌లో స్టోరేజ్‌ సొల్యూషన్స్‌, ఇండస్ట్రియల్‌ స్టోరేజీ ర్యాక్స్‌ తయారవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అంత భారీ ఉపాధిని కల్పించే ప్రైవేటు సంస్థ మరొకటి లేదు. అమరరాజాకు దేశవ్యాప్తంగా 3500 ఫ్రాంచైజీలు ఉన్నాయి. వయోభారం రీత్యా రామచంద్రనాయుడు ఇటీవలే సంస్థ చైర్మన్‌ పదవి నుంచి తప్పుకొని తన కుమారుడు జయదేవ్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. 


రూ. 10 వేల కోట్లు దాటిన టర్నోవర్‌...

అమర రాజా సంస్థ ప్రస్తుత టర్నోవర్‌ రూ. 10 వేల కోట్లు దాటి రూ.11 వేల కోట్లకు చేరువైంది. ఈ పరిశ్రమ ఒక్క ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికే ఏటా 1200 కోట్లు పన్ను చెల్లిస్తోంది. చిత్తూరు జిల్లాలో 16 వేల మందికి ప్రత్యక్షంగా, 50 వేల మందికి పరోక్షంగా ఉపాధి అందిస్తోంది. ఈ సంస్థలో పని చేస్తున్న వారంతా... వందశాతం చిత్తూరు జిల్లాకు చెందిన వారే కావడం విశేషం. మరోవైపు డిస్ట్రిబ్యూషన్‌, ఎక్స్‌పోర్ట్స్‌ వంటి ప్రక్రియల ద్వారా దేశంలో సుమారు లక్ష మంది దాకా ఉపాధి పొందుతున్నారు.అమరరాజా పరిశ్రమల ఉత్పత్తులు దక్షిణాసియా దేశాలన్నింటితోపాటు జపాన్‌, జర్మనీ, రష్యా, ఆస్ట్రేలియా తదితర దేశాలన్నింటికీ ఎగుమతవుతున్నాయి.


గల్లా అరుణ తండ్రి , మాజీ ఎంపీ దివంగత రాజగోపాల్‌ నాయుడు పేరుతో రాజన్న ట్రస్టును ఏర్పాటు చేసి కార్పొరేట్‌ సొషల్‌ రెస్పాన్సిబులిటీ కింద అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  పేటమిట్టలో అమరరాజా స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ ద్వారా నిరుద్యోగ యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ ముగిశాక తమ యూనిట్లలోనూ ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు. అమరరాజా సంస్థ నిర్వహిస్తున్న విద్యా సంస్థలు గ్రామీణ ప్రాంత పిల్లలకు నామమాత్రపు ఫీజులతో నాణ్యమైన విద్యనందిస్తున్నాయి. ఎల్‌కేజీ నుంచీ  జూనియర్‌ కాలేజీ వరకు 5 వేల మందికి ఉచిత విద్యను అందిస్తున్నారు. వీరంతా సంస్థ ఉద్యోగుల, ఆ ప్రాంత పేద కుటుంబాలకు చెందినవారి పిల్లలే.

Updated Date - 2021-08-03T08:41:23+05:30 IST