‘గులాబ్‌’ బీభత్సం

ABN , First Publish Date - 2021-09-29T09:20:53+05:30 IST

గులాబ్‌ తుఫాను బలహీనపడినా కోస్తాలో శ్రీకాకుళం నుంచి పశ్చిమగోదావరి వరకు మంగళవారం కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. విశాఖ జిల్లా ఎలమంచిలిలో గత 24 గంటల్లో 190 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పంటపొలాలు రెండు రోజులుగా ముంపులోనే నానుతున్నాయి.

‘గులాబ్‌’ బీభత్సం

  • కోస్తాలో కొనసాగిన భారీ వర్షాలు..
  • ఎలమంచిలిలో 190 మిల్లీమీటర్ల వర్షం
  • ఇంకా ఉధృతంగానే వాగులు, వంకలు.. అనేక చెరువులకు గండ్లు
  • కోతకు గురైన రోడ్లు.. అంధకారంలోనే పలు గ్రామాలు
  • 2 లక్షల ఎకరాల్లో పంట నష్టం! 


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): గులాబ్‌ తుఫాను బలహీనపడినా కోస్తాలో శ్రీకాకుళం నుంచి పశ్చిమగోదావరి వరకు మంగళవారం కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. విశాఖ జిల్లా ఎలమంచిలిలో గత 24 గంటల్లో 190 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పంటపొలాలు రెండు రోజులుగా ముంపులోనే నానుతున్నాయి. విశాఖ ఏజెన్సీలో మత్స్యగెడ్డ, రాయిగెడ్డ ఉధృతికి అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తాండవ, కల్యాణపులోవ, పెద్దేరు రిజర్వాయర్లలో నీటి మట్టాలు గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. విశాఖ నగరానికి ఆనుకుని ఉన్న మేహాద్రిగెడ్డ రిజర్వాయర్‌ గేట్లు ఎత్తి నీటిని కిందకు విడిచిపెడుతున్నారు. జిల్లాలో 8,250 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. 135 ఇళ్లు పూర్తిగా, 180 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మునగపాక మండలం పల్లపు ఆనందపురంలో గోడకూలి కర్రి జోగులమ్మ(68) మృతిచెందారు. జిల్లాలో 30 మండలాల పరిధిలోని 244 గ్రామాలపై వరద ప్రభావం పడినట్టు అధికారులు అంచనా వేశారు. అనంతగిరిలో కేకేలైన్‌లో బురద జారిపడడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విశాఖ ఏజెన్సీలోని పాడేరు ఘాట్‌ మార్గంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. మంగళవారం మధ్యాహ్నం వ్యూ పాయింట్‌ సమీపంలో కొండ చరియ విరిగిపడగా ఆర్‌అండ్‌బీ అధికారులు తొలగించారు. అనంతరం అక్కడ నిలిపి ఉంచిన ఎక్స్‌కవేటర్‌పై సాయంత్రం మరోమారు కొండచరియలు విరిగిపడ్డంతో రాకపోకలు నిలిచిపోయాయి. 


విజయనగరం.. అంధకారం

విజయనగరం జిల్లాలో మంగళవారం రాత్రి వరకు గజపతినగరం, బొండపల్లి, దత్తిరాజేరు మండలాలకు విద్యుత్‌ సరఫరాను పాక్షికంగా పునరుద్ధరించారు. డెంకాడ, నెల్లిమర్ల మండలాలు చీకట్లోనే ఉన్నాయి. విద్యుత్‌ శాఖకు రూ.1.30 కోట్లుమేర నష్టం వాటిల్లినట్లు చెపుతున్నారు. వేలాది ఎకరాల్లోని వరి, అరటి, పత్తి, మొక్కజొన్న, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. రహదారులు ధ్వంసమయ్యాయి. ఈ జిల్లాలో సోమవారం ముగ్గురు మృతిచెందగా.. గజపతినగరం వద్ద చంపావతి నదిలో కొట్టుకుపోయిన బలరామ్‌(70) ఆచూకీ లభ్యంకాలేదు. వేగావతి, సువర్ణముఖీ నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. సీతానగరం, పారది వంతెనలు కూలిపోయేలా ఉండటంతో భారీ వాహనాలను అనుమతించడంలేదు. తోటపల్లి, వట్టిగెడ్డ, వెంగళరాయసాగర్‌, పెద్దగెడ్డ, ఆండ్ర, తాటిపూడి జలాశయాల నుంచి నీటిని విడిచిపెడుతున్నారు. 


నేవీ హెలికాప్టర్‌లో గొర్రెల కాపరి..

సువర్ణముఖీ నదిలో చిక్కుకున్న గొర్రెల కాపరి దుక్కి సింహాచలాన్ని ఒడ్డుకు చేర్చేందుకు విశాఖ నుంచి నేవీ హెలికాప్టర్‌ను రప్పించారు. సోమవారం అర్ధరాత్రి హెలికాఫ్టర్‌ నుంచి తాడు వేసి సింహాచలాన్ని పైకి లాగారు. విశాఖకు తీసుకెళ్లి అంబులెన్స్‌లో కేజీహెచ్‌కు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం స్వగ్రామానికి తరలించారు. నదిలో చిక్కుకున్న 120 గొర్రెలను మంగళవారం ఒడ్డుకు చేర్చారు. 20 గొర్రెలు నదిలో కొట్టుకుపోయాయని సింహాచలం చెప్పారు.


ఉధృతంగా నాగావళి, వంశధార 

శ్రీకాకుళం జిల్లాలో నాగావళి, వంశధార నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. పాలకొండ-అన్నవరం, పాలకొండ-అంపిలి, అల్లెన రోడ్లపై వరదనీరు ప్రవహించడంతో రాకపోకలను నిలిపివేశారు. మడ్డువలస రిజర్వాయర్‌ నీరు గ్రామాల్లోకి ప్రవహిస్తుండడంతో రహదారులు దెబ్బతిన్నాయి. కొత్తవలస-కొప్పర రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. కొత్తవలస-కొండచాకరాపల్లి గ్రామాల మధ్య రహదారి కూడా గోతులమయమైంది. శ్రీహరిపురం, బాగెమ్మపేట రహదారులు కోతకు గురయ్యాయి. శ్రీకాకుళంలోని కాలనీలు, ఇళ్లలోకి నీరుచేరడంతో మోటార్లతో నీటిని తోడించారు.  వంగర, పొందూరు, ఎల్‌ఎన్‌ పేట, పోలాకి, జలుమూరు, గార, శ్రీకాకుళం రూరల్‌ మండలాల్లో పంటపొలాలు నీటమునిగాయి. జిల్లాకు రూ.43.60కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు  నివేదిక సిద్ధం చేశారు. 


పొంగుతున్న తమ్మిలేరు, ఎర్రకాలువ

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలంలో గడచిన 24 గంటల్లో 126.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో వాగులు, వంకలు పొంగడంతో చాలా ప్రాంతాల్లో వరి పంట ముంపునకు గురైంది. దెందులూరు-సత్యనారాయణపురం గ్రామాల మధ్య జాతీయ రహదారిపై గుండేరు వాగు ఉధృతంగా ప్రవహించటంతో మంగళవారం రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.  


ఏలూరు శనివారపేట కాజ్‌వేపై తమ్మిలేరు నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిపివేశారు. ఏలూరు-కైకలూరు రహదారిలో శ్రీపర్రు కాజ్‌ వేపై నుంచి తమ్మిలేరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు స్తంభించాయి. ఎర్రకాలువ పొంగడంతో నిడదవోలు, తాడేపల్లిగూడెం మండలాల్లో వరి, అరటి పంటలు ముంపునకు గురయ్యాయి. అనంతపల్లి వద్ద ఎర్రకాలువ మొదటి ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తోంది. జిల్లాలోని 49,550 ఎకరాల్లో వరి ముంపునకు గురైందని అధికారులు అంచనా వేశారు.


బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం

విశాఖపట్నం, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): వాయవ్య బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారి ఉత్తర ఒడిశా తీరానికి చేరుతుంది. రానున్న 24 గంటల్లో కోస్తాలో ఎక్కువచోట్ల, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు గులాబ్‌ తుఫాన్‌ బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారి విదర్భలో ప్రవేశించింది. ఇది మరింత బలహీనపడి అల్పపీడనంగా మారిన తర్వాత ఈశాన్య అరేబియా సముద్రంలో ప్రవేశించి 24 గంటల్లో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అనంతరం మరింత బలపడి తుఫాన్‌గా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికి ఖతార్‌ సూచించిన ‘షహీన్‌’ అని పేరు కూడా పెట్టేశారు. కాగా, శ్రీశైలం జలాశయానికి జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి 40,267 క్యూసెక్కుల నీరు చేరుతోంది. 




శ్రీకాకుళం జిల్లా వంగర మండలం కొప్పరలో కొట్టుకుపోయిన రహదారి


విశాఖపట్నం జిల్లా బుచ్చెయ్యపేట మండలంలో నీటిలోనే వరి పొలాలు


పాడేరు ఘాట్‌ రోడ్డులో విరిగిపడిన కొండ చరియలు 

Updated Date - 2021-09-29T09:20:53+05:30 IST