జగన్ ప్రభుత్వ పతనానికి నాంది
ABN , First Publish Date - 2021-12-19T08:47:16+05:30 IST
జగన్ ప్రభుత్వ పతనానికి నాంది
అమరావతికే అన్ని ప్రాంతాల మద్దతు
తిరుపతిసభ విజయంపై టీడీపీ వ్యాఖ్య
అమరావతి, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): అమరావతి రైతుల పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో జరిగిన సభ జగన్ ప్రభుత్వ పతనానికి నాంది పలికిందని టీడీపీ వ్యాఖ్యానించింది. అమరావతి రాజధానికి అన్ని ప్రాంతాల ప్రజల మద్దతు ఉందని ఆ సభ నిరూపించిందని, దీనిని నీరుగార్చడానికి ప్రయత్నించి వైసీపీ ప్రభుత్వమూ, బులుగు మీడియా బొక్కబోర్లా పడ్డాయని ఆ పార్టీ పేర్కొంది. టీడీపీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి, ఎమ్మెల్సీ పి.అశోక్‌బాబు శనివారమిక్కడ మాట్లాడారు. ‘తిరుపతి సభ ఫెయిలైందని బులుగు మీడియా... ప్రభు త్వ ప్రచార యంత్రాంగం మొదట పెద్దఎత్తున ప్రచారం చేశాయి. కానీ ఆ తర్వాత సభా ప్రాంగణంలోకి ప్రజానీకం వెల్లువెత్తడంతో వారి గొంతులో పచ్చివెలక్కాయ పడింది. సభ సఫలం కాకుండా చేయడానికి సకల ప్రయత్నాలు చేసి దెబ్బతిన్నారు. ప్రభుత్వ నిరంకుశ విధానానికి నిరసనగానే రాయలసీమ మేధావుల పేరుతో ‘వైసీపీ’ నిర్వహించిన పోటీ సభలో అమరావతి నినాదాలు మిన్నంటాయి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందనేది అధికార నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి’’ అని సూచించారు. కాళ్లరిగేలా అమరావతి రైతులు తమకోసం పాదయాత్ర చేయలేదనీ, 5కోట్ల మంది ఆంధ్రుల తరఫున ఒక రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని పోరాటం చేస్తున్నారని అశోక్‌బాబు తెలిపారు. ‘‘పాదయాత్ర పొడవునా రైతులను ఈ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. మహిళలకు తిండి లేకుండా చేసి, వారు కాలకృత్యాలు కూడా తీర్చుకోకుండా అడ్డుపడ్డారు. మూడు రాజధానులతో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని సీఎం, ఆయన బృందం ప్రచారం చేస్తోంది. ఈ మూడేళ్లలో మూడు ప్రాంతాలను ఈ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసింది? గుంతలు పడిన రోడ్లపై తట్టెడు మట్టి వేసిన దిక్కు లేదు. ప్రభుత్వ పెద్దల రౌడీయిజంతో రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలివెళ్లిపోయాయి. అనంతపురంలో కియా పరిశ్రమ అనుబంధ పరిశ్రమలు కూడా పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. రాయలసీమకు సాగునీటి ప్రాజెక్టులు అత్యంత అవసరం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికోసం రూపాయి నిధులు ఇవ్వలేదు. మూడుప్రాంతాల అభివృద్ధి అంటే ఇదేనా? ఊరికే నినాదాలు ఇస్తే ప్రజల కడుపు నిండుతుందా’’ అని ఆయన ప్రశ్నించారు. అమరావతి- అనంతపురం ఎక్స్‌ప్రెస్ వేతోపాటు అమరావతి చుట్టూ ప్రతిపాదించిన ఔటర్ రింగ్ రోడ్డును కూడా జగన్ ప్రభుత్వం విస్మరించి తీవ్రమైన తప్పిదానికి పాల్పడింది’’ అని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి ఔటర్ రింగ్ రోడ్డు కీలకమైన మలుపుగా నిలిచిందని, ఇప్పుడు ఆ నగర అభివృద్ధికి అదే గుండెకాయగా మారిందని చెప్పారు. అటువంటి ప్రాజెక్టును అమరావతికి టీడీపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తే ఈ ప్రభుత్వం దానిని కుదించిందని, రాష్ట్రాభివృద్ధి కంటే కూడా ఈ ప్రభుత్వానికి వ్యక్తిగత స్వార్ధమే ఎక్కువైందనేది ఈ ఉదంతంతో రుజువవుతోందని ఆయన విమర్శించారు. ‘‘అమరావతి ఉద్యమం కేవలం 29 గ్రామాల ఉద్యమం అని వైసీపీ నాయకత్వం ప్రజలను నమ్మించాలని చూస్తోంది. తిరుపతి సభకు 29గ్రామాల ప్రజలు ఎవరూ రాలేదు. రాయలసీమ ప్రజలే వచ్చారు. ఈ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే అభివృద్ధి శూన్యమని ప్రజలకు అర్థం అవుతోంది. ప్రభుత్వం పిలిస్తే చేయడానికి కంట్రాక్టర్లు ముందుకు రావడంలేదు. చేసిన వారికి బిల్లులు రావు. పైగా అధికార నేతల కమీషన్ల బెడద. యువతకు ఉద్యోగాలు రావు. రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చే అవకాశమే మృగ్యమైపోయింది. అమరావతిని కుప్పకూల్చి మొత్తం రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం సర్వ నాశనం చేసిందని అన్ని పార్టీలకు అర్థమైంది. అందుకే తీవ్రమైన రాజకీయ విభేదాలు ఉన్న బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు కూడా సభకు మద్దతు ఇచ్చాయి. వైసీపీ నేతలు ఉక్రోషంతో ఆ పార్టీలను తిట్టిపోస్తున్నా రు. టీడీపీకి అవి తోకపార్టీలని నిందిస్తున్నారు. దేశాన్ని పాలిస్తున్న పార్టీ....టీడీపీకి తోక పార్టీ అవుతుందా’’ అని అశోక్‌బాబు ప్రశ్నించారు.
పోటీ సభ పెట్టి గబ్బు పట్టడం అవసరమా?: సోమిరెడ్డి
తిరుపతిలో పోటీ సభపెట్టి గబ్బు పట్టడం వైసీపీకి అవసరమా అని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ప్రశ్నించారు. తిరుపతి సభపై ఆయన శనివారం తన ట్విటర్ ఖాతాలో స్పందించారు. ‘‘తిరుపతిలో అమరావతి సభ చరిత్ర సృష్టించింది. ఐదు కోట్ల ఆంధ్రుల ఆశీస్సులతో విజయవంతమైన సభ ఇది. అకుంఠిత దీక్షతో చేపట్టిన పాదయాత్రకు ప్రారంభం నుంచి సభ వరకూ ప్రజలంతా స్వచ్ఛందంగా అండగా నిలిచారు. వైసీపీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎన్ని కుట్రలకు పాల్పడినా...ఎన్ని కేసులు బనాయించినా.. ఆటంకాలు కల్పించినా భగవంతుడితోపాటు రాష్ట్ర ప్రజలంతా అమరావతి వైపే నిలిచారు’’ అని సోమిరెడ్డి పేర్కొన్నారు. కేంద్రంలో అత్యంత బలీయమైన శక్తిగా ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా రైతుల పోరాటానికి తలొగ్గి మూడు కీలక బిల్లులను వెనక్కు తీసుకుందని, రాష్ట్రంలో రైతులు నెలల తరబడి దీక్షలు చేసినా... వందల కిలోమీటర్లు నడిచినా సీఎం జగన్ మనసు మాత్రం కరగకపోవడం దురదృష్టకరమన్నారు. ‘‘జగన్ మంచి మనసు చేసుకోకపోగా రైతుల సభకు పోటీసభ పెట్టి కాలేజీల యాజమాన్యాలను బెదిరించి విద్యార్థులను తరలించి గబ్బు పట్టడం అవసరమా? ఆయన ఇప్పటికే ఘోరంగా విఫలమయ్యారు. ప్రతిపక్ష నేతగా జగన్ అమరావతికి మద్దతు తెలిపారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి అమరావతికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలి. లేదంటే ఆయనను ప్రజలు క్షమించరు’’ అని సోమిరెడ్డి హెచ్చరించారు.