ముదిరిన రంగుల పిచ్చి
ABN , First Publish Date - 2021-10-08T07:25:25+05:30 IST
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి రంగుల పిచ్చి ముదిరింది. ప్రభుత్వ భవనాలూ, జాతీయ నేతల విగ్రహాల్నే కాదు.. చెత్తకుండీలనూ వదలకుండా పార్టీ రంగులు వేసి మురిసిపోతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చివరకు కొత్తగా నియమితులైన సీఎస్ సమీర్‌శర్మ సీఎంను కలిసినప్పుడు ఇచ్చిన పూలబొకే కూడా వైసీపీ రంగులతో ఉండటం...

- ముఖ్యమంత్రి ‘ఆసరా’ కార్యక్రమాన్ని ముంచెత్తిన వైసీపీ జెండా రంగులు
- వీఐపీల బొకేలనూ వదలని వర్ణాలు
- దుర్గమ్మ ముస్తాబులోనూ అదే ముచ్చట
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వానికి రంగుల పిచ్చి ముదిరింది. ప్రభుత్వ భవనాలూ, జాతీయ నేతల విగ్రహాల్నే కాదు.. చెత్తకుండీలనూ వదలకుండా పార్టీ రంగులు వేసి మురిసిపోతున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చివరకు కొత్తగా నియమితులైన సీఎస్ సమీర్‌శర్మ సీఎంను కలిసినప్పుడు ఇచ్చిన పూలబొకే కూడా వైసీపీ రంగులతో ఉండటం...ప్రభుత్వ పెద్దలకు పార్టీ రంగుల పిచ్చి పరాకాష్ఠకు చేరిందనేందుకు నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ వ్యయంతో నిర్వహించే అధికారిక సమావేశాల్లోనూ వైసీపీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. నిజానికి, హైకోర్టు, సుప్రీంకోర్టుల తీర్పుల అనంతరం కాస్త తగ్గినట్టు కనిపించారు. ఇప్పుడు మళ్లీ మొదలయిపోయింది. గురువారం ఒంగోలులో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్న ఆసరా పథకం రెండో విడత పంపిణీ కార్యక్రమం పూర్తిగా వైసీపీ రంగులతో నిండిపోవడం చర్చనీయాంశమైంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ భవనాలకు వైసీపీ పతాక రంగులు వేయాలని వివాదాస్పద మెమో ఇచ్చిన ఘనత మొదట పంచాయతీరాజ్‌శాఖ అధికారులకే దక్కింది. దీనిని హైకోర్టు తప్పుపడితే సుప్రీంకోర్టు తలుపుతట్టారు. అత్యున్నత ధర్మాసనం కూడా హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించడంతో కొత్తకొత్త వ్యూహాలతో సమర్థించే ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వ భవనాలకు ఏ రంగులు వేయాలన్న దానిపై జాతీయ బిల్డింగ్ కోడ్ ప్రకారం నిర్ణయం తీసుకోవాలని, ఉన్నతస్థాయి కమిటీ వేయాలని హైకోర్టు ఆదేశించింది.
ఎన్నిన్నె సమర్థనలో!
హైకోర్టు ఆదేశాలతో సీసీఎల్‌ఏ, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో కమిటీ వేశారు. ఈ కమిటీ వైసీపీ రంగులకి అదనంగా ఎర్రమట్టి రంగు వేయాలని నిర్ణయం తీసుకుంది. పంచాయతీ భవనాలకు వేసే రంగు మట్టి, వ్యవసాయం, ఆక్వా, డైరీ తదితర రంగాలను ప్రతిబింబించే విధంగా ఉండాలంటూ భూమి, మట్టికి సంబంధించి టెర్రా కోటా రంగును; పంటలు, మొక్కలకు ప్రాతినిథ్యం వహిస్తూ ఆకుపచ్చ; నీటి వనరులు, ఆక్వా సంపదను ప్రతిబింబిస్తూ బులుగు, పాల ఉత్పత్తులు పెంచడం, పశువుల పెంపకానికి సంబంధించి తెలుపు రంగు ఉండాలంటూ జీవో 623ను విడుదల చేశారు. ఇందులో చివరి మూడు వర్ణాలూ వైసీపీ జెండా రంగులే. అంటే గతంలో ఉన్న రంగులతో పాటు అదనంగా టెర్రా కోటా మాత్రమే అదనంగా చేర్చారన్నమాట. అయితే, ఈ జీవోను కూడా రద్దు చేస్తూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆ తర్వాత కొంత సమయమిచ్చి ఆ లోపు రంగులు మార్చకుంటే కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని రిజిస్ట్రీని ఆదేశించింది. అయినా రంగుల పిచ్చి ముదిరిన సర్కార్ ఓపట్టాన కోర్టు ఆదేశాలను అమలు చేయలేదు. చివరకు స్వయానా సీఎ్‌సతో పాటు పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు కోర్టు ధిక్కార కేసులో హైకోర్టులో రోజంతా నిలబడ్డారు. రంగుల విషయంలో ప్రభుత్వ పెద్దలను నొప్పించలేని ఐఏఎ్‌సలు కోర్టుల చుట్టూ తిరగడానికి సిద్ధపడ్డారు. సుప్రీంకోర్టు సైతం 4 వారాల్లోపు హైకోర్టు ఆదేశాలు అమలు చేసి ప్రభుత్వ భవనాలకు రంగులు యథావిధిగా వైట్ కలర్ వేయాలని, పార్టీ రంగులు మార్చాలని... లేకపోతే ధిక్కార కేసులు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించింది. పంచాయతీ ఎన్నికల్లోపు రంగులు తొలగించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. అయితే యంత్రాంగమంతా ప్రభుత్వం చేతిలో ఉండటంతో కమిషనర్‌ను అధికారులు ఖాతరు చేయలేదు. వారిపై హైకోర్టు చర్యలు తీసుకునే అవకాశముందని గ్రహించిన తర్వాతే.. ప్రభుత్వ భవనాలకు రంగులు మార్చేందుకు చర్యలు తీసుకున్నారు. అవి కూడా పూర్తి స్థాయిలో చేయకుండా మొక్కుబడి తంతుగా ముగించి అఫిడవిట్ దాఖలు చేశారు.
‘చెత్త’నూ వదలకుండా..
‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ ఈనెల రెండో తేదీన సుమారు 4 వేల చెత్త తరలించే వాహనాలను ప్రారంభించారు. ఆ వాహనాలకు సైతం బులుగు, పచ్చ రంగులు వేశారు. దానిపై కూడా కొందరు హైకోర్టులో సవాలు చేశారు. అలాగే, చెత్త నుంచి సంపదను సృష్టించే కేంద్రాలకు పార్టీ రంగులు తొలగించాలని మళ్లీ హైకోర్టే ఆదేశించాల్సి వచ్చింది. ఇన్ని ఆదేశాలు జారీచేస్తున్నా.. రంగుల పిచ్చి మాత్రం వదలడం లేదు. తాజాగా దసరా కోసం కనకదురమ్మ గుడికి చేసిన ముస్తాబులోనూ వైసీపీ రంగులు జిగేల్‌మనడం విస్మయపరిచింది.