వైసీపీ ముందుకొస్తే..రాజీనామాలకు సై!

ABN , First Publish Date - 2021-07-17T08:08:23+05:30 IST

అధికారంలో ఉన్న వైసీపీ ముందుకొచ్చి నాయకత్వం వహిస్తే.. విశా ఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటుపరం కాకుండా కాపాడుకోవడానికి తాము రాజీనామాలకు కూడా సిద్ధమని టీడీపీ ఎంపీలు ప్రకటించారు

వైసీపీ ముందుకొస్తే..రాజీనామాలకు సై!

విశాఖ ఉక్కుపై టీడీపీ ఎంపీల ప్రకటన

వాజపేయి హయాంలో చంద్రబాబు నచ్చజెప్పారు

ప్రైవేటీకరణ ఆపేయించారు.. జగన్‌ కూడా అదే చొరవ చూపాలి

ప్రైవేటీకరణ చేస్తే భూమి ఇవ్వబోమంటే కేంద్రం వెనక్కి తగ్గే అవకాశం

నిలదీసేందుకు వైసీపీయే నాయకత్వం వహించాలి: రామ్మోహన్‌


ఎంపీ రఘురామరాజుపై అనర్హత కోసమే వైసీపీ పార్లమెంటులో పోరాటం చేసేలా ఉంది తప్ప విశాఖ ఉక్కు అంశం పట్టడం లేదు. ముఖ్యమంత్రి బయటకు కంటి తుడుపు మాటలు చెబుతూ లోలోపల పోస్కో కంపెనీ వంటి వారితో బేరాలు కుదుర్చుకుంటున్నారు.

- రామ్మోహన్‌నాయుడు


అమరావతి, జూలై 16(ఆంధ్రజ్యోతి): అధికారంలో ఉన్న వైసీపీ ముందుకొచ్చి నాయకత్వం వహిస్తే.. విశా ఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటుపరం కాకుండా కాపాడుకోవడానికి తాము రాజీనామాలకు కూడా సిద్ధమని టీడీపీ ఎంపీలు ప్రకటించారు. శుక్రవారం టీడీపీ కేంద్ర కా ర్యాలయంలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం మాట్లాడుతూ ఈ సంచలన ప్రతిపాదన చేశారు. ‘గతంలో వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఇలాగే ప్రైవేటీకరణ ప్రతిపాదన వస్తే అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు కేంద్రానికి నచ్చజెప్పి దానిని ఆపుచేయగలిగారు. ఇప్పుడు సీఎంగా ఉన్న జగన్‌ అదే మాదిరి చొరవ తీసుకోవాలి. భూమి అంశం రాష్ట్ర పరిధి లో ఉంది. ప్రైవేటుపరం చేస్తే భూమి ఇవ్వబోమని ఆయన గట్టిగా చెబితే కేంద్రం వెనకడుగు వేసే అవకాశముంది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు సమావేశాల్లో దీనిపై కేంద్రాన్ని నిలదీయడానికి వైసీపీ నాయకత్వం వహించాలి. ఆ పార్టీ ముందుకొస్తే రాజీనామాలకు కూడా మేం సిద్ధం’ అని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్‌నాయుడు అన్నారు.  ఇరు రాష్ట్రాల జల వివాదాలపై కేంద్రం జారీ చేసిన గెజిట్‌ను అధ్యయనం చేస్తామని, అందులో రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకమైనవి ఏమైనా ఉంటే వాటిపై పోరాడతామని అన్నారు. ‘జల వివాదాల పేరుతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నాటకమాడుతున్నారు. కావలసిన అధికారుల బదిలీలు, డిప్యుటేషన్లకు పరస్పరం సహకరించుకుంటారు. పైకి మాత్రం ఒకరిపై ఒకరు పోరాడుతున్నట్లు నటిస్తున్నారు. జగన్‌రెడ్డి తెలంగాణలో ఉన్న తన ఆస్తులు కాపాడుకోవడానికి.. కేసుల్లో అక్కడి ప్రభుత్వం సహకారం కోసం పూర్తిగా పాదాక్రాంతమైపోయారు. ఇది రాష్ట్రం దౌర్భాగ్యం’ అని విమర్శించారు.


మేం గళమెత్తుతాం: కనకమేడల

వైసీపీ కాడి పడేసినా హోదా, విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు కోసం తాము మాత్రం పార్లమెంటులో గళమెత్తుతామని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ పేర్కొన్నారు. ‘తెలుగువారి చరిత్రలో ఇంత మోసపూరితంగా వ్యవహరించిన సీఎం మరొకరు లేరు. బీజేపీకి మెజారిటీ ఉందన్న సాకు చూ పించి హోదా, ఇతర హామీల గురించి కనీసం నోరైనా ఎత్తడం లేదు.  వైసీపీ పాలనలో రాష్ట్రంలో  ఆర్థిక అరాచకత్వం తాండవిస్తోంది. రూ.41 వేల కోట్ల చెల్లింపులకు లెక్కలు లేకుండా పోయాయి. రూ.2 లక్షల కోట్ల మేర అప్పులు తెచ్చి ఎక్కడా ఒక్క పని కూడా చేయలేదు’ అని దుయ్యబట్టారు. 


ఢిల్లీ నడివీధుల్లో హోదా తాకట్టు!

సీబీఐ కేసుల్లో ఇరుక్కున్న సీఎం: బాబు


అమరావతి, జూలై 16(ఆంధ్రజ్యోతి): ‘ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర ప్రయోజనాలను సీఎం జగన్‌ ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెట్టారు. సీబీఐ కేసుల్లో ఇరుక్కున్న ఆయన.. వాటి నుంచి బయటపడేందు కు.. కేంద్రాన్ని ఏ విషయంలోనూ ప్రశ్నించే పరిస్థితి లో లేరు. వైసీపీకి 30 మంది ఎంపీలున్నా వారి వల్ల ఉపయోగం సున్నా. నలుగురే ఉన్నా రాష్ట్ర ప్రజల వాణిగా మీరు నిలవండి’ అని తమ పార్టీ ఎంపీలకు టీడీపీ అధినేత చంద్రబాబు శుక్రవారం సూచించా రు. రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాల అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించడం, ఉపాధి పనులు చేసిన వారికి బిల్లులు చెల్లించకుండా వేధించడం, కేంద్ర భాగస్వామ్యంతో చేపట్టిన టిడ్కో ఇళ్ల ను పూర్తి చేయకుండా లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేయడం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, పంటలకు మద్దతు ధర లేకపోవడం, పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడం వంటి అంశాలను బలంగా లేవనెత్తాలని పేర్కొన్నారు.

Updated Date - 2021-07-17T08:08:23+05:30 IST