వణికిస్తున్న ‘తౌక్తే’

ABN , First Publish Date - 2021-05-16T09:06:59+05:30 IST

అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్తే తుఫాన్‌ పశ్చిమ తీర ప్రాంత రాష్ట్రాలను వణికిస్తోంది. లక్షద్వీప్‌ సమీపంలో వాయుగుండం శనివారం తుఫాన్‌గా, ఆ తర్వాత తీవ్ర తుఫాన్‌గా మారింది. పనాజీకి

వణికిస్తున్న ‘తౌక్తే’

అరేబియాలో తీవ్ర తుఫాన్‌ 

నేడు అతి తీవ్రంగా రూపాంతరం 

పశ్చిమతీర రాష్ట్రాలపై ప్రభావం 

కేరళను ముంచెత్తుతున్న వర్షాలు

రంగంలోకి 100 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు 

నేడు దక్షిణ కోస్తా, సీమలో భారీ వర్షాలు 


అమరావతి/విశాఖపట్నం/న్యూఢిల్లీ, మే 15 (ఆంధ్రజ్యోతి): అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్తే తుఫాన్‌ పశ్చిమ తీర ప్రాంత రాష్ట్రాలను వణికిస్తోంది. లక్షద్వీప్‌ సమీపంలో వాయుగుండం శనివారం తుఫాన్‌గా, ఆ తర్వాత తీవ్ర తుఫాన్‌గా మారింది. పనాజీకి నైరుతి దిశగా 290 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరింత బలపడి వాయవ్యంగా పయనించి ఆదివారం ఉదయానికి అతి తీవ్ర తుఫాన్‌గా మారనుందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం గుజరాత్‌లోని పోర్‌బందర్‌-నలియా మధ్య తీరం దాటనున్నదని తెలిపింది. తుఫాన్‌ ప్రభావంతో పశ్చిమ తీరంలో కేరళ నుంచి మహారాష్ట్ర వరకు వర్షాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం నుంచి తీరం వెంబడి గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముంది. గుజరాత్‌, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలపై తుఫాన్‌ ప్రభావం ఎక్కువగా ఉంది. తుఫాన్‌ ప్రభావంతో శనివారం రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. కోస్తాలోని అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రతతో పాటు ఉక్కపోత వాతావరణం నెలకొంది. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది.  


కేరళలో రెడ్‌ అలర్ట్‌ 

తుఫాన్‌ ప్రభావంతో కేరళలో బలమైన ఈదురుగాలులతో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తీర ప్రాంతాలలో జనజీవనం స్తంభించిపోయింది. వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇళ్లు, వాహనాలపై చెట్లు విరిగిపడుతున్నాయి. పలు చోట్ల రవాణాకు ఆటంకం ఏర్పడింది. విద్యుత్‌ స్తంభాలు నేలకూలడంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. తిరువనంతపురం సమీపంలో సముద్రంపై నిర్మించిన వలిమతుర బ్రిడ్జిపై పగులు ఏర్పడటంతో ప్రవేశ ద్వారాన్ని మూసివేశారు. అతి భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ హెచ్చరిక నేపథ్యంలో మలప్పురం, కోజికోడ్‌, వాయనాడ్‌, కన్నూరు, కసరగొడ్‌ జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. కేరళలోని ప్రధాన నదులలో నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు. 


ముంబైకు వానగండం 

కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ముంబై మహానగరానికి ఇప్పుడు వానగండం పొంచి ఉంది. ముంబై, థానె నగరాల్లో అధికారులు యెల్లో అలర్డ్‌ ప్రకటించారు. ముంబైలో మూడు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను మోహరించారు. మహారాష్ట్రలో ముంబై, థానెతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. 


రంగంలోకి ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు

తుఫాన్‌ నేపథ్యంలో జాతీయ విపత్తు సహాయక దళం (ఎన్డీఆర్‌ఎఫ్‌) రంగంలోకి దిగింది. సహాయ, పునరావాస చర్యల కోసం మొదట 53బృందాలను పంపగా.. తాజాగా ఆ సంఖ్యను రెట్టింపు చేసింది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌, గోవాలలో తీర ప్రాంతాలలో మోహరించనున్నట్టు ఎన్డీఆర్‌ఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌ఎన్‌ ప్రధాన్‌ ట్వీట్‌ చేశారు. శుక్రవారం 53 బృందాలు పంపామని, తుఫాన్‌ తీవ్రత దృష్ట్యా మరిన్ని దళాలను సిద్ధంగా ఉంచామని పేర్కొన్నారు.

Updated Date - 2021-05-16T09:06:59+05:30 IST