ఏమిటీ అరాచకం?

ABN , First Publish Date - 2021-02-12T08:32:34+05:30 IST

ఎన్నికలను ఫార్సుగా మార్చి అధికార పార్టీ నేతలు పలు నియోజకవర్గాల్లో బలవంతపు ఏకగ్రీవాల అరాచకాన్ని సృష్టిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు.

ఏమిటీ అరాచకం?

  • పంచాయతీలన్నీ బలవంతంగా ఏకగ్రీవం చేసేస్తారా?
  • ఆ 3 నియోజకవర్గాల్లో నామినేషన్లు వేయనివ్వలేదు
  • వేసినా అధికారులతో తిరస్కరింపజేశారు
  • పోలీసులను ముందుపెట్టి బెదిరిస్తున్నారు
  • ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే అడ్డుకునే బాధ్యత ఎస్‌ఈసీకి లేదా?
  • అది విఫలమవడం వల్లే హైకోర్టుకెళ్లాం
  • గవర్నర్‌ కూడా చోద్యం చూస్తున్నారు
  • టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజం
  • పుంగనూరు, మాచర్ల, తంబళ్లపల్లెలో ఎన్నికల రద్దుకు డిమాండ్‌
  • జోక్యం చేసుకుని అదనపు బలగాలు పంపండి
  • రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రికి బాబు లేఖలు 


అమరావతి, ఫిబ్రవరి 11(ఆంధ్రజ్యోతి): ఎన్నికలను ఫార్సుగా మార్చి అధికార పార్టీ నేతలు పలు నియోజకవర్గాల్లో బలవంతపు ఏకగ్రీవాల అరాచకాన్ని సృష్టిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. గురువారమిక్కడ తమ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పుంగనూరులో 83 పంచాయతీలుంటే కేవలం 3 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సగం చోట్ల అసలు నామినేషన్లే వేయనివ్వలేదు. మిగతా చోట్ల వేసిన నామినేషన్లను అధికారులతో తిరస్కరింపజేశారు. ఆయన తమ్ముడు ఎమ్మెల్యేగా ఉన్న తంబళ్లపల్లెలోనూ 22 పంచాయతీల్లో ఏకగ్రీవం చేసుకున్నారు. మాచర్ల నియోజకవర్గంలో 77 పంచాయతీలకు 76 పంచాయతీల్లో ఏకగ్రీవమైనట్లు చూపిస్తున్నారు. పోలీసు అధికారులను ముందు పెట్టుకుని.. ప్రతిపక్షాల వారిని భయోత్పాతానికి గురిచేసి నామినేషన్లు వేయకుండా అడ్డుపడడం.. వేసిన నామినేషన్లను తిరస్కరించడం చేస్తున్నారు. ఇటువంటి అరాచకాలను ప్రాణాలొడ్డి ఎదుర్కొంటాం’ అని స్పష్టం చేశారు. 


ఈ మూడు నియోజకవర్గాల్లో ఎన్నికలను రద్దు చేసి కొత్త నోటిఫికేషన్‌ ఇచ్చి మళ్లీ జరపాలని, కేంద్ర బలగాలను పిలిపించి ప్రత్యేక పరిశీలకుల ఆధ్వర్యంలో ఈ ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కేవలం ఎన్నికలు నిర్వహిస్తే సరిపోతోందని భావిస్తోంది తప్ప.. ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే అడ్డుకోలేకపోతోందని ఆక్షేపించారు. ‘ఎంపీటీసీ ఎన్నికల్లో ఇవే నియోజకవర్గాల్లో బలవంతపు ఏకగ్రీవాలు జరిగాయి. అక్కడి స్థానిక అధికారులందరినీ మార్చి పంచాయతీ ఎన్నికలు జరుపుతామని ఎస్‌ఈసీ ప్రకటించింది. కానీ మార్చలేకపోయింది. ఈ 3 నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న ఘోరమైన పరిస్థితుల గురించి ప్రతి గంటకూ మేం ఫిర్యాదులు పంపాం. కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులకు కూడా ఇచ్చాం. అయినా ఫలితం లేకపోయింది. ఎన్నికల్లో పోటీ చేసే హక్కును కాపాడడంలో ఎస్‌ఈసీ విఫలమైంది. అందుకే హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. న్యాయస్థానంలో న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఈ అక్రమాలను కేంద్ర ఎన్నికల కమిషన్‌, కేంద్ర హోం మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లాం’ అని తెలిపారు.


ఉపసంహరించుకుంటే.. ఆమోదించాలంటారా? 

చిత్తూరు జిల్లా కుప్పం మండలం మెట్టపల్లి గ్రామ పంచాయతీలో వైసీపీ బలపర్చిన అభ్యర్థులు వ్యక్తిగతంగా తమ నామినేషన్లను మీడియా, అధికారుల సమక్షంలో ఉపసంహరించుకోగా, మళ్లీ వాటిని ఆమోదించాలని అధికార పార్టీ నేతలు ఎన్నికల అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు  ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుధవారం ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఒకసారి నామినేషన్‌ ఉపసంహరించుకున్న తర్వాత వాటిని ఆమోదించాలని కోరటం చట్ట విరుద్ధమని, తుది జాబితాలో వారి పేర్లు లేకుండా చూడాలని కోరారు. కాగా, పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు అడగటానికి వచ్చే వైసీపీ మద్దతుదారుల చొక్కాలు పట్టుకుని ప్రజలు నిలదీయాలని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి సూచించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మోసపూరిత హామీలపై అధికార పార్టీ నేతల్ని ప్రజలు నిలదీయాలన్నారు. 


మీరెలా గెలిచి వచ్చారు?

రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాల్సిన పంచాయతీరాజ్‌ మంత్రి పెద్దిరెడ్డి తన నియోజకవర్గంలోనే అరాచకం సృష్టిస్తున్నారని, ఇతరులెవరికీ పోటీ చేసే హక్కు లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. ‘ఈ ముఖ్యమంత్రి, మంత్రులు ఆకాశం నుంచి ఊడిపడ్డారా? ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి రాలేదా? మీకు పోటీ చేసే అవకాశం ఇవ్వకపోతే ఏం చేసేవారు? ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్లి ప్రచారం చేసుకోవడానికి బదులు ఉదయం నుంచి రాత్రి వరకూ మాకు ఈ అరాచకాలపై పోరాడడమే సరిపోతోంది. ఎస్‌ఈసీ స్వతంత్ర వ్యవస్థ. అధికారులంతా దాని కింద పనిచేయాలి. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో అధికారులతో సీఎం సమీక్షలు కూడా జరపకూడదు. అన్ని పార్టీలకు సమాన అవకాశాలు ఉండాలని ఈ నిబంధనలు పెట్టారు. వాటిని అమలు చేసి ఇతర పార్టీల వారిలో నమ్మకం కలిగించడంలో ఎస్‌ఈసీ విఫలమైంది. ఇటువంటి పరిస్ధితుల్లో గవర్నర్‌ జోక్యం చేసుకుని రాజ్యాంగాన్ని కాపాడాలి. కానీ ఆయన కూడా చోద్యం చూస్తూ కూర్చుంటున్నారు. న్యాయమూర్తులు, ఎన్నికల కమిషనర్‌తో ప్రమాణం చేయించేది గవర్నర్‌. 


వారిని అధికార పార్టీ నేతలు బూతులు తిడుతున్నా ఆయన రక్షణ కల్పించలేకపోతున్నారు’ అని అన్నారు. అధికార పార్టీకి లొంగి ఇష్టానుసారం వ్యవహరిస్తున్న అధికారులను వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. ‘ఇవాళ మీతో ఇవన్నీ చేస్తున్నవాళ్ళు రేపు మిమ్మల్ని కాపాడలేరు. గతంలో ఇలాగే చేసి జైలుకు వెళ్లినవాళ్లను గుర్తుకు తెచ్చుకోండి. ప్రభుత్వం చర్య తీసుకోకపోతే ఈ అధికారులపై ప్రైవేటు కేసులు వేసి కోర్టు బోనులో నిలబెడతాం. చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతున్న అందరినీ గుర్తు పెట్టుకుంటాం. ఇవాళ కాకపోతే రేపైనా వారు మూల్యం చెల్లించుకోక తప్పదు’ అని హెచ్చరించారు. కాగా.. గుంటూరు జిల్లా వినుకొండ, మాచర్ల నియోజకవర్గాల్లో టీడీపీ బలపరచిన అభ్యర్థులను, సానుభూతిపరులను పోలీసులు భయబ్రాంతులకు గురిచేస్తూ, ఇబ్బందులు పెడుతున్నారని చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్‌ఈసీకి లేఖ రాశారు. 

Updated Date - 2021-02-12T08:32:34+05:30 IST