అకాశ ఎయిర్... రెడీ టు ఫ్లై...

ABN , First Publish Date - 2021-11-18T11:35:15+05:30 IST

ఏస్ ఇన్వెస్టర్, బిగ్‌బుల్ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా కీలక పెట్టుబడిదారుగా ఉన్న భారతీయ స్టార్టప్ ఎయిర్‌లైన్ ‘అకాశ ఎయిర్’ వినువీధిలో విహరించేందుకు సిద్ధమవుతోంది.

అకాశ ఎయిర్... రెడీ టు ఫ్లై...

న్యూఢిల్లీ/ముంబై : ఏస్ ఇన్వెస్టర్, బిగ్‌బుల్ రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా కీలక పెట్టుబడిదారుగా ఉన్న భారతీయ స్టార్టప్ ఎయిర్‌లైన్ ‘అకాశ ఎయిర్’ వినువీధిలో విహరించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే... భారత్‌లో సేవలను ప్రారంభించేందుకుగాను 72 విమానాల కోసం అమెరికాకు చెందిన బోయింగ్‌తో 9 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ. 67,500 కోట్లు) విలువైన ఆర్డరుతో ఒప్పందం చేసుకుంది. ఈ ఆర్డరు... 737 మాక్స్‌లోని రెండు వేరియంట్లు  737-8, 737-7-200 విమానాల కోసం పెట్టినట్లు ఆకాశ ఎయిర్‌, బోయింగ్‌లు ఓ సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


ఇప్పటికే డీజీసీఏ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌ను సైతం ఆకాశ ఎయిర్‌లైన్స్ పొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో... మరో నెలన్నర రోజుల్లోనే  సంస్థ విమానాలు టేకాఫ్ కానున్నట్లు వినవస్తోంది. సంస్థకు సహ వ్యవస్థాపకులుగా ఇండిగో మాజీ ప్రెసిడెంట్‌ ఆదిత్య ఘోష్, జెట్‌ ఎయిర్‌వేస్‌ మాజీ సీఈఓ వినయ్‌ దూబే వ్యవహరించనున్న విషయం తెలిసిందే. జెట్‌ ఎయిర్‌వేస్‌ మాజీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రవీణ్‌ అయ్యర్‌ సీఓఓగా బాధ్యతలను నిర్వర్తించనున్నారు. బెంగళూరు కేంద్రంగా ఈ సంస్థ... తన కార్యకలాపాలను నిర్వహించనుంది.  ప్రస్తుతం స్పైస్‌జెట్‌కు మాత్రమే 737 మాక్స్‌ విమానాలున్న విషయం తెలిసిందే. తాజాగా... ఆకాశ ఎయిర్‌ ఈ విమానాలను కలిగి ఉండే రెండో భారత విమానయాన సంస్థగా అవతరించనుంది. దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో మాత్రం ఎయిర్‌బస్‌ విమానాలను మాత్రమే వినియోగిస్తోంది. కాగా... సంస్థలో 35 మిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టనున్న ఏస్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా... 40 శాతం వాటాను కైవసం చేసుకోబోతున్నారు. మిగిలిన వాటాను ఎయిర్‌ బీఎన్‌బీ, పార్‌ క్యాపిటల్‌ యాజమాన్యాలు భరించనున్నాయి. 

Updated Date - 2021-11-18T11:35:15+05:30 IST