విమానాశ్రయాల అభివృద్ధిపై రూ.20,000 కోట్ల పెట్టుబడులు
ABN , First Publish Date - 2021-08-20T05:56:50+05:30 IST
గ్రూపే ఏడీపీ భాగస్వామ్యంతో విమానాశ్రయాల వ్యాపారం మరింత బలోపేతం అవుతుందని జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ భావిస్తోంది.

- గ్రూపే ఏడీపీ భాగస్వామ్యంతో మరింత బలోపేతం
- జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీఎం రావు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): గ్రూపే ఏడీపీ భాగస్వామ్యంతో విమానాశ్రయాల వ్యాపారం మరింత బలోపేతం అవుతుందని జీఎంఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ భావిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా విమానాశ్రయాల డిజైన్, అభివృద్ధి, సేవ లు, నిర్వహణ తదితర రంగాల్లో రెండు కంపెనీలకు ఉన్న అనుభవం విమానాశ్రయాల వ్యాపారాన్ని పటిష్ఠం చేస్తుందని జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లిఖార్జున రావు తెలిపారు. గ్రూపే ఏడీపీ అంతర్జాతీయ స్థాయి ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్. గ్రూపే ఏడీపీతో భాగస్వామ్యం సామర్థ్యాలను పెంచుతుందన్నారు. కాగా జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ (జీఏఎల్)లో గ్రూపే ఏడీపీకి 49 శాతం వాటాను విక్రయిం చే ప్రక్రియ రెండో విడత కూడా పూర్తయిందని చెప్పారు. జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్‌లో జీఎంఆర్ ఇన్‌ప్రాస్ట్రక్చర్‌కు నియంత్రణ వాటా కొనసాగుతుందని, విమానాశ్రయాల నిర్వహణ జీఎంఆర్ చేతిలోనే ఉంటుందన్నారు. దక్షిణ, ఆగ్నేయ ఆసియా ప్రాంతాల్లో విమానాశ్రయాల రంగం బాగా అభివృద్ధి చెందుతోందని, ఈ ప్రాంతాల్లో విమానాశ్రయాల అభివృద్ధిపై జీఎంఆర్ ఆసక్తి చూపటమే కాకుండా అవకాశాలను అందిపుచ్చుకోవాలని భావిస్తోందని తెలిపారు. ఉన్న విమానాశ్రయాల విస్తరణ, కొత్త విమానాశ్రయాల అభివృద్ధికి జీఎంఆర్ ప్రస్తుతం రూ.20,000 కోట్ల పెట్టుబడులు పెడుతోందని రావు వివరించారు.
ఏడాదిలో గోవా విమానాశ్రయం పూర్తి
గోవా విమానాశ్రయ నిర్మాణం పనులు వేగంగా కొనసాగుతున్నాయి. విమానాశ్రయాన్ని చేరుకోవడానికి రాష్ట్ర ప్రభు త్వం నిర్మిస్తున్న కనెక్టింగ్ ఎక్స్‌ప్రె్‌స వే పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. అన్నీ అనుకూలిస్తే.. 2022 ఆగస్టు నాటికి ఈ విమానాశ్రయం పూర్తి కావవచ్చని భావిస్తున్నట్లు జీఎం రావు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం సమీపంలో చేపట్టిన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ పనులు ఊపందుకున్నాయి. భూమి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మొత్తం 2,200 ఎకరాల్లో రూ.1,650 ఎకరాలు చేతికి వచ్చినట్లు వివరించారు. కాగా గ్రీస్‌లోని క్రెట్ ఎయిర్‌పోర్ట్ డిజైన్, అభివృద్ధి, నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయన్నారు.
సవాళ్లు తప్పవు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా వ్యాపార వాతావరణం అనుకూలంగా ఉండకపోవచ్చని.. సవాళ్లు తప్పవని జీఎం రావు అన్నారు. దీర్ఘకాలిక ప్రాతిపదికన విమానాశ్రయాల రంగంలో బలోపేతం కావడానికి పెట్టుబడులు కొనసాగుతాయి. విద్యుత్, రవాణా రంగాల్లో వృద్ధికి అవకాశాలు ఉన్న విభాగాలను గుర్తిస్తాం. వ్యయాలను తగ్గించుకోవడానికి, ప్రాసె్‌సలను మెరుగుపరుచుకోవడానికి డిజిటలీకరణపై దృష్టి పెడతామని రావు అన్నారు.