ఏటీఎం 'గీత' దాటితే... భారం...

ABN , First Publish Date - 2021-06-11T21:38:13+05:30 IST

ఏటీఎం లావాదేవీలు పరిమితి దాటినపక్షంలో... భారం పెరగనుంది.

ఏటీఎం 'గీత' దాటితే... భారం...

ముంబై: ఏటీఎం లావాదేవీలు పరిమితి దాటినపక్షంలో... భారం పెరగనుంది. ఆయా బ్యాంకులకు చెందిన ఏటీఎంల నుండి నగదును ఉపసంహరించుకుంటే పరిమిత సంఖ్యలో లావాదేవీలు ఉచితమేనన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత మాత్రం ఛార్జీ వసూలు ఉంటుంది. ఇప్పుడీ ఛార్జీని పెంచుతున్నారు. అంటే నిర్ణీత ఉచిత లావాదేవీలకు మించి చేసే ప్రతి లావాదేవీపై ఛార్జీ ఉంటుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరిన్ని వివరాలిలా ఉన్నాయి. 


ఉచిత పరిమితికి మించి చేసే ప్రతి లావాదేవీకి రూ. 21 చొప్పున బ్యాంకులు వసూలు చేయనున్నాయి. ఈ మేరకు ఆర్‌బీఐ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఖాతాదారులు... ఖాతా ఉన్న బ్యాంకు ఏటీఎం నుండి ప్రతి నెల ఐదు ఉచిత ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలను నిర్వహించవచ్చు. ఇతర బ్యాంకుల ఏటీఎంల నుండి మెట్రో నగరాల్లో అయితే మూడు, నాన్ మెట్రో నగరాల్లో అయితే ఐదు ఉచిత ట్రాన్సాక్షన్స్ వరకు పరిమితి ఉంది. వీటికి మించితే ప్రస్తుతం ఒక్కో లావాదేవీపై రూ. 20 వసూలు చేస్తున్నారు. ఇప్పుడు దీనిని రూ. 21 కు పెంచారు. 


ఈ కొత్త నిబంధన వచ్చే ఏడాది అంటే 2022 జనవరి ఒకటి  నుండి అమల్లోకి రానుంది.ఇక ఏటీఎం లావాదేవీలకు సంబంధించి హయ్యర్ ఇంటర్‌ఛేంజ్ ఫీజును... ఆర్థిక కార్యకలాపాలకు  సంబంధించి రూ. 15 నుండి రూ. 17 కు, ఆర్థికేతర లావాదేవీలకు సంబంధించి  రూ. 5 నుండి రూ. 6 కు పెంచారు. ఈ ఇతర బ్యాంకు ఖాతాదారుల నుండి వసూలు చేసే ఇంటర్‌చేంజ్ ఫీజు ఆగస్టు నుంచి పెరగనుంది. 

Updated Date - 2021-06-11T21:38:13+05:30 IST