వివక్షల భారతంలో సమానత్వ వెలుగు దివ్వె

ABN , First Publish Date - 2021-08-27T06:02:12+05:30 IST

భారతీయులకి విదేశాల్లో స్థిరపడడం అంటే మక్కువ. అక్కడి ఆధునిక సౌకర్యాలూ, డాలర్లలో వచ్చే పెద్ద అంకెల జీతాలూ, పరిశుభ్రమైన పరిసరాలూ, సుందరమైన వనాలూ, పర్యాటక కేంద్రాలూ వారికి ఆహ్లాదంగా కనిపిస్తాయి...

వివక్షల భారతంలో సమానత్వ వెలుగు దివ్వె

భారతీయులకి విదేశాల్లో స్థిరపడడం అంటే మక్కువ. అక్కడి ఆధునిక సౌకర్యాలూ, డాలర్లలో వచ్చే పెద్ద అంకెల జీతాలూ, పరిశుభ్రమైన పరిసరాలూ, సుందరమైన వనాలూ, పర్యాటక కేంద్రాలూ వారికి ఆహ్లాదంగా కనిపిస్తాయి. అమెరికాలో స్థిరపడటాన్ని ఒక జీవితకాలపు స్వప్నంలా చూస్తారు. అనేకమంది గ్రీన్ కార్డు తెచ్చుకుని, దాన్నొక పెద్ద విజయంగా చెప్పుకోవడం చూస్తూనే ఉంటాం. 


ఇప్పుడు మనం చెప్పుకొనే విదేశీయురాలు సకల సౌకర్యాలతో తులతూగే అదే అమెరికా నుంచి, అరవైల్లో పేదల దేశం ఇండియాకి వలస వచ్చింది. అనుకోకుండా ఇక్కడి కుల వైషమ్యాలను కళ్లారా చూసింది. మన దేశాన్ని డాక్టరేట్ కోసం పరిశోధనా ప్రదేశంగా ఎంచుకొంది. స్వదేశీయులే కులవ్యవస్థను యథాశక్తి నిలబెడుతూ, కులాధిపత్యంతో అందలాలు ఎక్కుతూ, కొన్ని కులాలను అంటరానితనంలో ఉంచుతున్న సమయంలో, ఆమె ఆనాటి కుల నిర్మూలన ఉద్యమాన్ని తన రచనలలో నమోదు చేసింది. విదేశీయురాలై ఉండీ, ఈ దేశపు అసమానతలను రూపుమాపే ఎన్నో రచనలు చేసింది. ఇక్కడి వ్యక్తిని పెళ్లాడింది, ఈ దేశంలోనే ఉండిపోయింది. ప్రాథమిక హక్కులైన నీటి హక్కుల కోసమూ నినదించింది. కులమే కాదు, లింగవివక్షనూ లోతుగా పరిశీలించి రచనల ద్వారా ఎన్నో విశ్లేషణలు చేసింది. మహారాష్ట్రలోని కసేగావ్‌ను ఎంతో మక్కువతో స్వగ్రామంగా చేసుకుని అక్కడే నివసించింది, నిన్న ఎనభై ఒకటో ఏట అక్కడే కన్నుమూసింది.


ఆ మానవతామూర్తి పేరు గెయిల్ ఒమ్వెడ్ట్. బుధవారం ఉదయం (ఆగస్ట్ 25) ఈ లోకం నుంచి నిష్క్రమించిన గెయిల్, ఎన్నో రంగాల్లో అసాధారణ ప్రతిభావంతురాలు, మానవత్వ పరిపూర్ణురాలు. మదర్ తెరెసా లాంటి విదేశీయులు ఎందరో ఈమెకు ముందూ తర్వాతా కూడా మన దేశానికి వచ్చారు. ఎందరో మిషనరీలు సేవా దృక్పథంతో ఇక్కడికి వచ్చి, ఇక్కడి వాతావరణాన్ని తట్టుకొని అభాగ్యజీవుల సేవ కోసం ఇక్కడే నివసించి ఇక్కడి మట్టిలోనే కలిసిపోయారు. కానీ గెయిల్ ఇక్కడున్న పేదరికాన్ని చూసి చలించి ఇక్కడికి రాలేదు. అనుకోకుండా భారతదేశం వచ్చినపుడు ఇక్కడున్న కులవివక్షను చూసి ఆమె ఆలోచనలో పడ్డారు. అందులోనే పరిశోధన చేయాలని ఒక బాధ్యతతో వచ్చారు. కల్చరల్ రివోల్ట్ ఇన్ కలోనియల్ సొసైటీ (మహారాష్ట్రలోని బ్రాహ్మణేతర ఉద్యమం) అనే అంశంపై పీహెచ్డీ తీసుకున్నారు. ఆపై దళిత, స్త్రీవాద దృక్కోణంలో ఆమె ‘వి షల్ స్మాష్ దిస్ ప్రిసన్: ఇండియన్ విమెన్ ఇన్ స్ట్రగుల్’, ‘దళిత్స్ అండ్ ది డెమొక్రాటిక్ రెవల్యూషన్’, ‘వయొలెన్స్ అగైనెస్ట్ విమెన్: న్యూ మూవ్మెంట్స్ అండ్ న్యూ థీరీస్ ఇన్ ఇండియా’ తదితర ముప్పై గ్రంథాలను రచించార్య్. ‘అంబేడ్కర్ టువార్డ్స్ యాన్ ఎన్‌లైటెన్డ్ ఇండియా’ పేరుతో షెడ్యూల్డ్ కులాలకే కాదు, యావత్ భారతదేశానికి అంబేడ్కర్ ఎలాంటి జ్ఞాన సమాజాన్ని నిర్మించాడో తెలియజేసే ప్రయత్నం చేశారు. ‘బుద్ధిజం ఇన్ ఇండియా’ అనే గ్రంథంలో కులాన్ని, బ్రాహ్మణ ఆధిపత్యాన్ని సవాల్ చేయడంలో బుద్ధిజం పాత్రను చర్చించారు. కుల నిర్మూలనను నినదిస్తూ ఒక సామాజిక మేధావిగా ‘అండర్‌స్టాండింగ్ క్యాస్ట్’ను రచించారు. ఈ రచనలో బుద్ధునితో మొదలుకొని అంబేడ్కర్, ఆ తర్వాత వరకూ కులవ్యవస్థలో వచ్చిన మార్పును చర్చించారు. 


గెయిల్ ఒమ్వెడ్ట్ మహారాష్ట్రలో రగులుతున్న కులనిర్మూలనా ఉద్యమానికి మొదట ఆకర్షితులయ్యారని చెప్పుకున్నాం కదా, కాబట్టే ఆమె మరాఠీ దళిత కవిత్వాన్ని, ఫూలే, అంబేడ్కర్ భావజాలాన్ని ప్రతిబింబించే ధిక్కార కవిత్వాన్ని ఆంగ్లీకరించారు. విదేశీయురాలై ఉండీ ఒక ప్రాంతీయ భాష మరాఠీ నేర్చుకొని ఇంగ్లీషులోకి అనువదించడం మామూలు విషయం కాదు. అంతేకాక, కుల, వర్గ, లింగ వివక్షను ప్రశ్నిస్తూ అనేక వ్యాసాలు రచించారు. ఎన్నో పరిశోధనా ప్రాజెక్టులకు నాయకత్వం వహించడమే కాకుండా విశ్వవిద్యాలయాల్లో కన్సల్టెంటుగానూ, గెస్ట్ ప్రొఫెసరుగానూ, కోపెన్ హెగాన్‌లోని నోర్డిక్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏషియన్ స్టడీస్‌లో ఏషియన్ గెస్ట్ గానూ అలాగే ఒరిస్సాలోని ‘నిశ్వాస్’లో సోషియాలజీ ప్రొఫెసరుగానూ, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం మరియు లైబ్రరీలో సీనియర్ ఫెలోగానూ.. ఇలా ఆమె బహుముఖ సాహితీ ప్రజ్ఞకు భారతదేశపు విశ్వవిద్యాలయాలు ఎర్ర తివాచీ పరిచి ఆమెను గౌరవించాయి. అలాగని ఆమె కేవలం ఒక ఆర్మ్ చైర్ స్కాలరుగా మాత్రమే ఉండిపోలేదు. కొంకణ్ ప్రాంతంలోని ప్రజల నీటి హక్కులకోసం ఆమె క్షేత్ర స్థాయిలో పోరాడారు. తాగునీరే కాదు, సాగునీరు కూడా ప్రజల హక్కు అంటూ ఉద్యమంలో భాగం పంచుకున్నారు. లింగ వివక్షకు మూలమైన వేదాలపై బహిరంగంగా విమర్శలు చేశారు.


కుల వ్యవస్థ స్త్రీలకు చేస్తున్న అన్యాయం గురించి ఆమె ఒక ఇంటర్వూలో ఇలా విశ్లేషించారు: ‘స్త్రీ లైంగికత్వాన్ని నియంత్రించినంత వరకే కులం జీవించి ఉంటుంది. జాతుల ఐడెంటిటీలని నిలబెట్టడానికే పెళ్ళిళ్ళు జాతికి లోపలే జరిపిస్తారు. మరాఠీలో ‘రోటీ, భేటీ కా వ్యవహార్’ అని ఒక మాట ఉంటుంది. తిండినీ, ఆడపిల్లలనూ కులం లోపలే ఇచ్చుకోవాలి అని. అలా పక్కాగా జరగాలీ అంటే ఆడపిల్లలను కట్టుదిట్టాల్లో పెట్టి, రజస్వల కాకముందే వివాహం జరిపించెయ్యాలి. అప్పుడు కుల నిర్వహణకు ఎలాంటి ఢోకా ఉండదు. పురుషుడు ఎవరితో లైంగిక క్రీడ జరిపినా అతడి వీర్యం బైటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ కుల కాపలాదారులకి ఎలాంటి సమస్యా ఉండదు. కానీ స్త్రీలో ఆ వీర్యం ఉండిపోతుంది. కాబట్టి ఆమె ఎక్కడ కుల సంకరం జరిపి ఇతర కులాల బిడ్డలను కంటుందో అని, ఆమె లైంగికత్వానికి కాపలా పెట్టారు. అదే కదా మనువు ‘పితా రక్షతి కౌమారి, భర్తా రక్షతి యౌవనే, న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి’ అని మనుస్మృతిలో అలనాడు నిర్దేశించింది? అంటే కులాన్ని నిరంతరం నిలిపే వాహకులు స్త్రీలు కనుక స్త్రీ లైంగికత్వానికి ఆంక్షలు పెట్టడం ద్వారా, ఆమె ప్రతీ కదలికనూ వేయి కళ్ళతో కనిపెట్టడం ద్వారా ఆమెను శీలం అనే చట్రంలో బంధించారు.’ రచననే పోరాట పంథాగా చేసుకొని జీవించిన ఆ సామాజికవేత్త ఆశయాలను కొనసాగించడమే అణచివేయబడ్డ వర్గాల ప్రజలూ, పరిశోధకులూ ఆమెకు ఇవ్వగలిగిన ఘన నివాళి.

అరుణ గోగులమండ

Updated Date - 2021-08-27T06:02:12+05:30 IST