నిర్మాణ కార్మికుల జీవితాలు కుదేలు

ABN , First Publish Date - 2021-08-25T06:03:18+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగాలలో భవననిర్మాణ రంగం మూడో స్థానంలో ఉంది. (‘పీరియాడిక్ లేబర్ సర్వే-2018’ ప్రకారం నిర్మాణరంగంపై 11శాతం మంది ఆధారపడి జీవిస్తున్నారు....

నిర్మాణ కార్మికుల జీవితాలు కుదేలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న రంగాలలో భవననిర్మాణ రంగం మూడో స్థానంలో ఉంది. (‘పీరియాడిక్ లేబర్ సర్వే-2018’ ప్రకారం నిర్మాణరంగంపై 11శాతం మంది ఆధారపడి జీవిస్తున్నారు.) రాష్ట్రంలో దాదాపు 54 లక్షల మంది భవననిర్మాణ కార్మికులు ఉన్నట్లు ఒక అంచనా. అందులో నూటికి 95 శాతం పైగా అసంఘటిత రంగ కార్మికులే. కరోనా మొదటి వేవ్ కారణంగా మన దేశంలో పేదల సంఖ్య దాదాపు రెట్టింపు అయ్యిందని ‘ప్యూ పరిశోధన కేంద్రం’ లెక్క కట్టింది. నిర్మాణరంగంలో క్షీణత కూడ ఈ పరిస్థితికి ఒక కారణమని తెలుస్తోంది. అయితే రాష్ట్రంలో ఈ రంగం వృద్ధిలో తిరోగమనం మాత్రం వైఎస్ఆర్‌సిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ప్రారంభమయింది.


ఇసుక తవ్వకాలలో అవినీతి జరుగుతోందని, దానిని అడ్డుకోవడానికి తాము కొత్త విధానాలు రూపొందించబోతున్నామని అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ ఆర్భాటంగా ప్రకటించారు. కానీ కొత్త ఇసుక విధానాన్ని రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి మూడు నెలలు పట్టింది. ఆ సమయంలో ఇసుక సరఫరా దెబ్బతినడంతో నిర్మాణ పనులు మందగించాయి. కొత్త విధానం అమలులోకి వచ్చే వరకూ పాత విధానం అమలయి ఉంటే ఏ సమస్యా ఉండేది కాదు. అలా కాకపోవడం మూలాన భవన నిర్మాణ కార్మికులు ఆ మూడు నెలల్లో దాదాపు మూడవ వంతు ఆదాయం కోల్పోయినట్లు విశాఖ జిల్లాలో మేము చేసిన పరిశోధనలో తేలింది. దానికితోడు ఆన్ లైన్ ఇసుక బుకింగ్ విధానంలో ఆశించిన ఫలితాలు రాకపోవడం వల్ల ధర దాదాపు మూడు రెట్లు పెరగడమే కాక ఇసుక సరఫరాలో సమస్యలు సైతం పరిష్కారం కాలేదు. ఇక ఎంతో కొంత పరిస్థితులు చక్కబడుతున్నాయి అనుకుంటున్న తరుణంలో కరోనా మొదటి వేవ్ ప్రబలడం, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో నిర్మాణరంగం పూర్తిగా కుదేలైంది. 


ఆంధ్రప్రదేశ్‌లో నైపుణ్యం కలిగిన కార్మికులలో మూడోవంతు మంది, నిర్మాణరంగం నుంచి తప్పుకోవలసి వచ్చిందని తమ నైపుణ్యస్థాయి కంటే తక్కువస్థాయి ఉపాధి పనుల్లో ఉన్నారని మేము కనుగొన్నాం. ఉదాహరణకు రోజుకు 700 రూపాయలు సంపాదించే మగమేస్త్రీలు 400 రూపాయలు మాత్రమే వేతనం లభించే వ్యవసాయకూలీలుగా, ఆ పని లేనప్పుడు రోజుకు సగటున కేవలం 180 రూపాయలు వేతనం లభించే ఉపాధి హామీ పనిలో కూలీలుగా పని చేస్తున్నారు. 


కరోనా వ్యాధి మొదటివేవ్ సమయంలో ‘ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం’ కింద భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమబోర్డు నిధుల నుంచి ప్రత్యక్ష నగదు బదిలీ పద్ధతిలో ఆర్థిక సహాయం అందుతుందని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. అందుకోసం కార్మికుల ఆధార్, అకౌంట్ సీడింగ్ మూడునెలల లోపు పూర్తి చేయాలని సూచించింది.ఈ పథకం కింద లభించే 5 వేల రూపాయల నగదు సహాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర కార్మికశాఖ అధికారులు గత సంవత్సరం జూలై నెలలో ప్రకటించారు. దాంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది కార్మికులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఎవరికీ నగదు సహాయం అందలేదు. భవననిర్మాణ సంక్షేమబోర్డులో 1600 కోట్ల రూపాయల నిధులు (జూలై 2020 నాటికి) ఉన్నా కార్మికులకు పైసా కూడ దక్కలేదు. ఆధార్ సీడింగ్ ప్రక్రియ ప్రారంభమై సంవత్సరం గడచినా ఇంకా రిజిస్టర్ అయిన కార్మికులలో 6 లక్షల మందికి సీడింగే పూర్తికాలేదు. 


భవననిర్మాణ కార్మికులకు సామాజిక భద్రత అందించడం కోసం చట్టపరంగా 2007లో ఏర్పడిన సంక్షేమ బోర్డు పనితీరు పరమ అధ్వానంగా ఉంది. కార్మికుల కోసం అమలు చేయాల్సిన వివాహ బహుమతి, మెటర్నిటీ బెనిఫిట్, ప్రాణాంతక యాక్సిడెంట్ రిలీఫ్, వైకల్యం రిలీఫ్, నేచురల్ డెత్ రిలీఫ్, హాస్పిటలైజేషన్ రిలీఫ్, అంత్యక్రియల ఖర్చులు, పెన్షన్ స్కీమ్ (NPS) వంటి పథకాలు జగన్ ప్రభుత్వ హయాంలో పూర్తిగా అటకెక్కాయి. రాష్ట్రవ్యాప్తంగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు న్యాయంగా రావాల్సిన ఒక్క క్లెయిమ్ కూడా పరిష్కారానికి నోచుకోలేదని కార్మికులు తెలిపారు. సంక్షేమబోర్డు నుంచి 18 నెలలుగా 30 వేల రూపాయల నుంచి 5 లక్షల వరకు అందుకోవాల్సిన కార్మికుల కుటుంబాలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారినెవరినీ రెండు సంవత్సరాలుగా సభ్యులుగా చేర్చుకోలేదని అధికారులే ఒప్పుకుంటున్నారు.


రాష్ట్రవ్యాప్తంగా 54 లక్షల మంది భవననిర్మాణ కార్మికులలో కేవలం 20 లక్షల మందికి మాత్రమే సంక్షేమబోర్డులో సభ్యత్వం ఉంది. మిగిలిన వారికి ఎటువంటి సామాజిక భద్రత అందుబాటులో లేదు. సభ్యత్వం ఉన్న కార్మికులకు సైతం బోర్డు మొండిచేయి చూపడంతో మొదటిసారి లాక్‌డౌన్‌లో ఒక్కొక్క కార్మికుడు 30 వేల నుంచి లక్ష రూపాయల వరకు అప్పుల పాలైనట్లు మా పరిశీలనలో తేలింది. యజమాని, ఉద్యోగి మధ్య తాత్కాలిక సంబంధం, అనిశ్చిత పని గంటలు, ప్రాథమిక సౌకర్యాల లేమి, సామాజికభద్రత కరువు తదితర కారణాల వల్ల ఈ కార్మికులు ప్రతికూలమైన పరిస్థితులలో జీవిస్తున్నారు. సంక్షేమబోర్డుకు నిధులు, రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిర్మాణవ్యయంలో ఒక శాతం సెస్‌ ద్వారా సమకూరుతాయి తప్ప ప్రభుత్వం తన ఖజానా నుంచి ఇవ్వదు.


అలాంటి బోర్డు నిధుల్ని దారి మళ్లించడం- చట్టాన్ని నిర్వీర్యం చేసి, కార్మికుల హక్కుల్ని కాలరాయడమే అవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భవననిర్మాణ కార్మికులు అందరికీ వెంటనే సంక్షేమబోర్డులో సభ్యత్వం ఇవ్వాలి. పెండింగ్ క్లెయిములు సత్వరమే పరిష్కరించాలి. చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి, రాష్ట్రప్రభుత్వం వాగ్దానం చేసినట్లుగా 5 వేల రూపాయలు వెంటనే కార్మికుల బ్యాంకుఖాతాల్లో జమ చేయాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేసుకున్న కార్మికులందరినీ ఆటోమేటిక్‌గా సంక్షేమబోర్డులో చేర్చుకోవాలి. గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ కార్మికుల యజమానిగా ఒక శాతం సెస్సు జమ చేయాలి. ఇవన్నీ జరిగితే తప్ప దుర్భరపరిస్థితుల్లో ఉన్న భవననిర్మాణ కార్మికులకు ఉపశమనం లభించదు. జగన్ సర్కార్ ఆ దిశగా వెంటనే చర్యలు తీసుకోవాలి.

చక్రధర్ బుద్ధ 

రాజాన బుజ్జిబాబు 

టేకుపూడి సత్యనారాయణ

Updated Date - 2021-08-25T06:03:18+05:30 IST