తెలుగు నుడి మన శ్వాస కావాలి
ABN , First Publish Date - 2021-08-28T06:00:48+05:30 IST
తెలుగు భాష ఇవాళ సజీవంగా ఉండేందుకు ఎందరో మహానుభావులు కారకులయ్యారు. అనేకమంది తెలుగు భాషాపరిరక్షణకు, సామాజిక మార్పునకు తోడ్పడినందువల్లే ఇవాళ తెలుగు భాష మనుగడ సాధిస్తోంది...
తెలుగు భాష ఇవాళ సజీవంగా ఉండేందుకు ఎందరో మహానుభావులు కారకులయ్యారు. అనేకమంది తెలుగు భాషాపరిరక్షణకు, సామాజిక మార్పునకు తోడ్పడినందువల్లే ఇవాళ తెలుగు భాష మనుగడ సాధిస్తోంది. తెలుగు సమాజంలో, సాహిత్యంలో, భాషలో విప్లవాత్మక మార్పులు రావడానికి ప్రధాన కారకులు త్యాగయ్య, అన్నమయ్య, వేమన, కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, గిడుగు వెంకటరామమూర్తి. త్రిపురనేని రామస్వామి చౌదరి, రాయప్రోలు సుబ్బారావు, చిలకమర్తి లక్ష్మీ నరసింహం, ఉన్నవ లక్ష్మీనారాయణ, విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ, కాళోజీ నారాయణరావు, సురవరం ప్రతాప రెడ్డి, కట్టమంచి రామలింగారెడ్డి, దేవులపల్లి రామానుజరావు ఇలా ఎందరో మహానుభావులు తమదైన రీతిలో మన సాంస్కృతిక పునరుజ్జీవనానికి కారకులయ్యారు.
తెలుగు భాష కోసం ఒడిషాలోని పర్లాకిమిడి రాష్ట్రాన్నే వదులుకుని రాజమహేంద్రవరంలో స్థిరపడ్డ గిడుగు రామమూర్తి శాసనాల లిపిని స్వయంగా నేర్చుకుని తెలుగు ప్రాచీనతను, ప్రాధాన్యతను ప్రపంచానికి తెలిపేందుకు కృషి చేశారు. 1919 ఫిబ్రవరి 28న రాజమహేంద్రవరంలో వీరేశలింగం అధ్యక్షతన ఏర్పడ్డ వర్తమానాంధ్ర భాషా ప్రవర్తక సమాజం అనే సంస్థకు కార్యదర్శిగా వ్యవహరించారు. విద్యావిధానంలో తెలుగుకు అన్యాయం జరుగుతున్నదని తెలుసుకుని గురజాడ అప్పారావుతో కలిసి వ్యవహారిక భాషోద్యమాన్ని ప్రారంభించారు. 1906 నుంచి 1940 వరకు పుస్తకాల్లో వ్యవహారిక భాషను ప్రవేశపెట్టేందుకు విశేష కృషి చేశారు. అనేక సదస్సుల్లో పాల్గొని పండితులను సైతం ఢీకొని, వ్యవహారిక భాష ప్రాధాన్యత గురించి వారిని ఒప్పించారు.
భాష అనేది మానవ సంబంధాల అభివృద్ధిక్రమంలో ఏర్పడిన వ్యక్తీకరణ. ఈ వ్యక్తీకరణను అత్యంత సహజమైన రీతిలో, సుందరంగా, వీనులవిందుగా తెలిపే భాషల్లో తెలుగుకు ప్రథమతాంబూలం లభిస్తుంది. అందుకే అత్యంత ప్రాచీనమయినదైనప్పటికీ తెలుగు భాష వేల సంవత్సరాలుగా సజీవంగా ఉన్నది. మన ఆటలు, మాటలు, పాటలు, సంగీతం, కళలు, పండుగలు, పబ్బాలు, సామూహిక కార్యక్రమాలు. వ్యాపారసంబంధాలు ఇవన్నీ భాష లేకుండా పెంపొందలేవు. ఒకరకంగా భాష సమాజాన్ని సృష్టిస్తుంది. జాతిని బలపరుస్తుంది. అభివృద్ధికి దారి తీస్తుంది. మనిషి నుంచి ప్రాణం తీసి విశ్లేషించడం ఎలా ఉంటుందో, సమాజం నుంచి భాషను విడదీసి చూడడం అలాగే ఉంటుంది. మనం పరిపూర్ణ మానవులుగా తయారయ్యేందుకు తెలుగు భాష ఎంతో దోహదం చేస్తుంది..
ఏ పని అయినా అందరూ కలిసికట్టుగా చేయకపోతే దాన్ని సాధించలేం. గతంలో గిడుగు లాంటి వారు ఒక్కరే సమాజానికి ఎదురీది నిలిచారు. ఇప్పుడు ప్రజలు, ప్రభుత్వం, పత్రికలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నది. చాలా మంది తెలుగువారికి విదేశాలకు వెళ్లిన తర్వాత తెలుగు భాషాసంస్కృతులపై మక్కువ పెరుగుతున్నది. కాని తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారికి తమ భాష సంస్కృతుల విలువ తెలియడం లేదు. తెలుగు భాష పట్ల, మమకారం, అంకిత భావం లేకపోతే, తెలుగు భాషను మనం ప్రాణప్రదంగా భావించకపోతే ఇది సాధ్యం కాదు. తెలుగు సాహితీవేత్తలు, భాషాభిమానులు, కళాకారులు చేసిన త్యాగాలను మనం వృథా కానివ్వరాదు. అందుకే తెలుగు భాషాదినోత్సవం సందర్భంగా నేను పదహారణాల తెలుగు భాష, సంస్కృతుల పరిరక్షణ కోసం 16 సూత్రాలను మనం పాటించాలని ప్రతిపాదిస్తున్నాను.
తెలుగువారి వారసత్వం, సాహిత్యసంప్రదాయాలు, జానపద సంస్కృతిని తక్కువ చూపు చూడవద్దు. తెలుగు మాధ్యమంలో చదివే విద్యార్థులను గౌరవించాలి. మన సంస్కృతి, కళల పట్ల పిల్లల్ని ప్రోత్సహించడం, మన భాషను నేర్పడం నేటి తక్షణావసరం. మాతృభాషను నేర్చుకోకపోతే మన దేశీయ సంస్కృతిని మనం ఆనందించలేము. అర్థం చేసుకోలేము. మన భాష చుట్టూ ఒక సంస్కృతి అల్లుకుని ఉంటుంది. మన పద్యం, మన గేయం, మన కథ, మన చరిత్ర. మన సామెతలు, హాస్యోక్తులు, చతురోక్తులు, నుడులు-నానుడులు, జానపద గీతాలు, మన సాహిత్యసొగసులను మన భాష ద్వారానే మనం తెలుసుకోగలుగుతాం.
ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో విద్యాబోధన మాత్రమే కాదు, తెలుగు భాషలో శాస్త్రగ్రంథాలు తగినన్ని రావాలి. శాస్త్రీయమైన, సాంకేతిక పదాలను అర్థం చేసుకోగల నిఘంటువులు రావాలి. సాంకేతిక విద్యలో క్రమంగా మాతృభాషల వినియోగం పెంచడం జరగాలి.
ప్రతి ఒక్కరూ ఇంట్లో తమ కుటుంబసభ్యులతో తెలుగులో మాట్లాడినప్పుడే తెలుగు భాష సజీవంగా ఉంటుంది. ఇద్దరు తెలుగు వారు ఎదురైనప్పుడు తప్పనిసరిగా తెలుగు భాషలోనే మాట్లాడుకోవాలి. ఆంగ్ల భాషను నేర్చుకోవచ్చు కానీ తెలుగు భాషను నిరాదరించకూడదు. తెలుగులో మాట్లాడడం ఆత్మన్యూనత కింద భావించకూడదు. అదేవిధంగా తెలుగులో మాట్లాడినంత మాత్రాన పరాయిభాషను ద్వేషించకూడదు.
ప్రజల అభిప్రాయాలు ప్రభుత్వానికీ, ప్రభుత్వ అభిప్రాయాలు ప్రజలకు మాతృభాషలోనే వ్యక్తం కావాలి. అంటే ప్రజల భాష, పరిపాలనా భాష ఒక్కటే కావాలి. న్యాయస్థానాల కార్యకలాపాలు, తీర్పులు మాతృభాషలో అందించేందుకు ప్రయత్నాలు జరగాలి. ప్రభుత్వ స్థాయిలో అమలుచేస్తున్న పథకాల పేర్లు తెలుగులో అందరికీ అర్థమయ్యే భాషలో ఉండేలా చూడాలి.
ఇతర భాషాపదాలు తెలుగు భాషలో సహజంగా ఇమిడిపోతే వ్యతిరేకించకూడదు. కొత్త పదాల సృష్టికి ప్రయత్నాలు చేయడంలో తప్పు లేదు కానీ పనిగట్టుకుని గ్రాంథిక భాషను వాడడం సరైంది కాదు. మన భాషకున్న వాక్యనిర్మాణాల్లో ఇతర భాషా పదాలు సహజంగా ఇమిడిపోతే అది మన భాషే అవుతుంది. మనం మాట్లాడే భాష సజీవంగా ఉండేలా, అందరికీ అర్థమయ్యే పదాలు వాడేలా ప్రామాణిక నిఘంటువును తయారు చేసుకోవాలి.
తెలుగు సాహిత్యం ఇతర భాషల్లో అనువాదమయ్యేలా చొరవ తీసుకోవడం, ఇతర భాషా సాహిత్యం తెలుగులో లభ్యమయ్యేలా చూడడం నిరంతరం సాగుతూ ఉన్నప్పుడే దేశంలో ప్రాంతీయ భాషలు మనుగడ సాగిస్తాయి.
సాంకేతికంగా కంప్యూటర్లలో తెలుగు భాష వినియోగాన్ని పెంచడం ద్వారా నేటి యువతకు తెలుగు పట్ల ఆసక్తి పెరుగుతుంది. అదే సమయంలో అందమైన తెలుగు ఖతుల వినియోగం విషయంలో చొరవ తీసుకోవాలి.
వారంలో ఒక రోజును కనీసం మాతృభాష కోసం కేటాయించినా భాష సజీవంగా ఉంటుంది. ఇవాళ తెలుగు రోజు అని కుటుంబంలో ప్రతి ఒక్కరూ అనుకోవాలి. మనం తెలుగు ప్రజలం.... మనకు కావాలి ‘తెలుగు వారం’. ఎలాగైతే వినోదం కోసం ఆదివారం లాంటి రోజును కేటాయించుకున్నామో, అదే విధంగా భాష కోసం ప్రత్యేకమైన రోజును కేటాయించుకోవడం అవసరం.
తెలుగు పదనిఘంటువు ఇంట్లో ఉంచి, పిల్లలకు అర్థాలు తెలుసుకునే అలవాటు చేయాలి. పిల్లలకు అర్థమయ్యేలా నిఘంటువుల రూపకల్పన జరగాలి. రోజూ పిల్లలకు కథలు చెప్పడం, పద్యాలు నేర్పించడం ద్వారా తెలుగులో వారు సందేహాలు వ్యక్తం చేయడాన్ని ప్రోత్సహించాలి. కూచిపూడి, భరతనాట్యం, తెలుగు జానపద నృత్య ప్రత్యేకతల గురించి పిల్లలకు నేర్పాలి. ఇందుకోసం ప్రత్యేకంగా రోజుకు ఓ 30 నిముషాల నుంచి గంటసేపు ‘ఆటవిడుపు’ పేరుతో తెలుగుకు కేటాయించుకునే ప్రయత్నం చేయాలి.
తెలుగు వార్తాపత్రికలు, పిల్లల పత్రికలు, బాలల బొమ్మల రామాయణాలు, భారతాలు పిల్లల చేత చదివించాలి. తెలుగు భాషకు సంబంధించిన మహనీయుల గురించి పిల్లలకు తెలియజేయాలి. ఆటపాటలతో అమ్మ భాషను నేర్పించే సృజనాత్మక పద్ధతులను అన్వేషించాలి.
పెళ్ళిళ్ళలో శుభలేఖల దగ్గర్నుంచి భాషకు ప్రాధాన్యత పెంచాలి. పెళ్ళిళ్ళకు, శుభకార్యాలకు తెలుగు పుస్తకాలను బహుమతులుగా ఇవ్వడం సంప్రదాయంగా మార్చాలి. ముఖ్యంగా పుట్టినరోజుల్ని మన సంప్రదాయ పద్ధతుల్లో చేసుకునేలా పిల్లల్ని ప్రోత్సహించాలి.
గ్రంథాలయ సంస్కృతిని పెంపొందించాలి. ప్రతి ఇంట్లో తెలుగు పుస్తకాలతో చిన్న చిన్న గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలి.
నలుగురు తెలుగువారు చేరే దేవాలయాల్లో తెలుగు భాష వినియోగం మరింత పెరగాలి. మన పండుగలు, పబ్బాలు, వ్రతాలు, పేరంటాలకు ప్రాధాన్యతనిచ్చి నలుగురిని పిలిచినప్పుడు మన సంస్కృతే కాకుండా మన భాష కూడా ప్రాణప్రదంగా మారుతుంది.
తెలుగు వంటకాలు, పచ్చళ్లు, ఆహారపుటలవాట్లు, సజీవంగా ఉంచాలి. మన భోజనం, ఫలహారాల పేర్లు నేటి తరానికి తెలియాలి.
మన కట్టూబొట్టు గురించి నేటితరానికి తెలియాలి. ఇంటా, బయట మన దుస్తులు ధరించేలా ప్రోత్సహించాలి. మన పండుగలు, పబ్బాల్లో మన దుస్తులు, మన ఆభరణాలు ప్రత్యేకంగా ధరించేలా చూడాలి.
చదువంటే ఇంగ్లీషేనన్న అభిప్రాయం పోవాలి. పదహారణాల తెలుగు పరిరక్షణకు ఇది చాలా ప్రధానం. మన నేలమీద మనం పరాయివారిగా జీవించే భావజాలాన్ని ఇముడ్చుకోవద్దు. ఇంగ్లీషు భాష లేకపోతే మన జాతికి మనుగడ లేదనే భావదాస్యం పనికి రాదు.
అమ్మఒడిలో, చదువుల బడిలో, బతుకుమడిలో, సంస్కారపుగుడిలో, పలుకు బడిలో, గుండెతడిలో తెలుగునుడి మన శ్వాస కావాలి. అమ్మభాష ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. తద్వారా ఆత్మనిర్భర భారత్ అవతరిస్తుంది.
(ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం)
ముప్పవరపు వెంకయ్యనాయుడు
భారత ఉపరాష్ట్రపతి