School Uniformలో లింగ సమానత్వం!
ABN , First Publish Date - 2021-11-23T14:16:36+05:30 IST
లింగ సమానత్వం దిశగా..
కేరళలోని ఓ పాఠశాలలో ఒకే రకమైన డ్రెస్ కోడ్
కోచి: లింగ సమానత్వం దిశగా కేరళలోని ఓ పాఠశాల ముందడుగు వేసింది. పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఒకేరకమైన యూనిఫామ్‌ను ప్రవేశపెట్టింది. ఎర్నాకులం జిల్లాలోని వలయన్చిరంగార ప్రభుత్వ ప్రైమరీ స్కూల్‌లో ఒకేరకమైన యూనిఫామ్‌ను విద్యార్థులు ధరిస్తున్నారు. బాలబాలికలు త్రీబైఫోర్త్ షార్ట్స్, చొక్కా వేసుకుని పాఠశాలకు వస్తున్నారు. కొత్త యూనిఫామ్ పట్ల విద్యార్థులు ఉత్సాహంగా ఉన్నారని, బాలికలు చాలా సౌకర్యవంతంగా ఉందని చెబుతున్నారని ప్రధానోపాధ్యాయురాలు కేపీ సుమ పేర్కొన్నారు.
స్కూల్లో 754 మంది విద్యార్థులున్నారు. ఈ కొత్తడ్రెస్ కోడ్‌ను 2018లో లోయర్ ప్రైమరీ సెక్షన్‌లో ప్రవేశపెట్టారు. ఈ అకడమిక్ సంవత్సరంలో మొత్తం విద్యార్థులకు విస్తరించారు. విద్యార్థులందరికీ ఒకేవిధమైన యూనిఫామ్ ఉండాలని కోరుకున్నామని, ఇందుకు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి మద్దతు లభించిందని పీటీఏ ప్రస్తుత ప్రెసిడెంట్ వివేక్ వి తెలిపారు. దీన్ని తొలుత ప్రీ ప్రైమరీ తరగతుల్లోని 200 మంది విద్యార్థులకు ప్రవేశపెట్టామని, అది పెద్ద హిట్ అయి ఇతర తరగతులకు అమలు చేయాలన్న విశ్వాసాన్ని ఇచ్చినట్టు చెప్పారు. పాఠశాల ప్రయత్నాన్ని ట్విటర్ వేదికగా విద్యా మంత్రి వి.శివన్‌కుట్టి అభినందించారు.